సూపర్ కాప్.. లక్ష్మీమాధవి
శాంతిదూత: ఆరేళ్ల కిందట అనుకోని రోడ్డు ప్రమాదం. ‘ఎక్కువ సేపు నిలబడడం కూడా కుదరదు’అన్నారు డాక్టర్లు. ఇక ఉద్యోగానికేమెళ్తుంది అనుకున్నారు. ఆమె సంకల్పం, పట్టుదల ముందు అడ్డంకులన్నీ మోకరిల్లాయి. ఆమె మళ్లీ నిలబడటమే కాదు పరుగులు తీసింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మళ్లీ డిపార్ట్‌మెంట్‌లో అడుగు పెట్టింది. ఇప్పుడు ‘శాంతిదళం’కి ఎంపికయ్యింది. ఆ ఆత్మవిశ్వాసం పేరు లక్ష్మీమాధవి. ఇన్‌స్పెక్టర్ ఇన్ స్పెషల్ బ్రాంచ్. వచ్చేనెల ప్రపంచశాంతికోసం పనిచేసేందుకు వెళ్తున్న ఆ పోలీస్ స్టోరీ...
ఐక్యరాజ్యసమితి ‘శాంతి దళం’ పేరిట ఏటా అన్నిదేశాల నుంచి పోలీసులను ఎంపిక చేస్తుంటుంది. ఈసారి మన దేశం నుంచి 157 మంది ఎంపికయ్యారు. అందులో తొమ్మిది మంది మహిళలు. దక్షిణ భారతదేశంనుంచి ఒకే ఒక్క మహిళ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీమాధవి. ‘డిపార్టుమెంట్‌లోకి వచ్చిన కొత్తలో ఎ.ఆర్ శ్రీనివాస్ అనే పోలీసుఅధికారి బోస్నియా దేశం వెళ్లారు. మన దగ్గర చిన్నస్థాయిలో పనిచేసే పోలీసుకు విదేశాల్లో అవకాశమెలా వస్తుంది? అనిపించింది. వెంటనే వివరాలు కనుక్కుంటే తెలిసింది ‘శాంతి దళం’ గురించి. ఎనిమిదేళ్లు పనిచేసిన ఏ పోలీసు అధికారి అయినా అప్లై చేసుకోవచ్చు. పరీక్షలన్నింటిలో నెగ్గితే ఏదో ఒక దేశానికి పంపించి ఏడాదిపాటు సేవలందించే అవకాశం కల్పిస్తారు’ అని శాంతిదళం గురించి వివరించారామె.
సైప్రస్ దేశానికి...
వచ్చేనెల 16న తల్లిదండ్రులతో సైప్రస్ దేశానికి బయలుదేరనున్నారు లక్ష్మీమాధవి. ‘పోలీసు వృత్తిలో ఆడా మగా ఏముంటుంది. ఒంటరిగా ఉండడం ఇష్టం లేక అమ్మానాన్నలను కూడా తీసుకెళుతున్నాను. నాన్న సీతారామయ్య విద్యాశాఖలో పనిచేసి పదవీ విరమణ పొందారు. అమ్మ ఆదిలక్ష్మి గృహిణి. నేను, తమ్ముడు. చిన్నప్పటి నుంచి పోలీసు ఉద్యోగమంటే చాలా ఇష్టం. 2002లో ఎస్‌ఐగా ఉద్యోగ జీవితం మొదలుపెట్టి సీఐ దాకా ఎదిగాను. ఈ మధ్యనే సేవా మెడల్ కూడా వచ్చింది. ఎన్ని ప్రోత్సాహకాలు వచ్చినా.. నాకు ప్రమాదం జరిగినపుడు డిపార్ట్‌మెంట్ నా వెన్నుతట్టిన తీరు ముందు అన్నీ బలాదూరే’ అని ఆ విషాద ఘటనను గుర్తు చేసుకున్నారు లక్ష్మీ మాధవి.
పునర్జన్మ...
ఆరేళ్ల కిందట శ్రీనగర్ కాలనీలో ఉదయం వెహికల్ చెకింగ్ నిర్వర్తిస్తుండగా రాంగ్‌రూట్‌లో వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు లక్ష్మీమాధవిని గుద్దింది. తలకు, వెన్నెముకకు బలమైన గాయాలయ్యాయి. వారం రోజులు కోమా. ఏడాదిపాటు మంచంమీద నుంచి కదలలేకపోయింది. తర్వాత ఓపికంతా కూడదీసుకుని పట్టుదలగా అడుగు తీసి అడుగు వేస్తున్న సమయంలో ‘ఇప్పుడే కాదు.. భవిష్యత్‌లో ఎప్పుడూ పరిగెత్తకూడదు, ఎక్కువసేపు నిలబడకూడదు, బరువులు ఎత్తకూడదు, డ్రైవింగ్ చేయకూడదు’ అన్నారు డాక్టర్లు. అది విన్న తల్లిదండ్రులు భోరుమన్నారు. కానీ మాధవి అధైర్య పడలేదు. ‘అందరూ పునర్జన్మ అన్నారు. నేను మరోసారి పోలీసు ఉద్యోగానికి ట్రైనింగ్ తీసుకున్నట్టు భావించాను. అంతే శ్రమించాను. మళ్లీ ఉద్యోగంలోకి చేరతానని డీజీపీగారిని కలిస్తే ‘వెల్‌కమ్’ అన్నారు. నూతనోత్సాహంతో పనిచేశాను. జరిగిన ప్రమాదాన్ని నన్ను నేను నిరూపించుకోవడానికో అవకాశంగా భావించా. 2012లో శాంతిదళానికి అప్లై చేశా. వారు నిర్వహించిన పరీక్షల్లో అన్నిటికన్నా కఠినమైనది డ్రైవింగ్ టెస్ట్. ఇరుకు సందులో జీపులను పార్కు చేయడం, ఎలాంటి ఇబ్బంది లేకుండా రివర్స్ డ్రైవ్ చేయ డం, ఆ టెస్ట్‌లో నాకు నూటి కి నూరు మార్కులు పడ్డాయి’ అని సంతోషంగా చెప్పారు.
నచ్చితే...అక్కడే
శాంతిదళంలో సేవలు నచ్చితే మరికొన్నేళ్లపాటు అక్కడే విధుల్లో కొనసాగిస్తారు అధికారులు. ‘ఇప్పటివరకు దేశం దాటింది లేదు. సైప్రస్ గురించి కొన్ని వివరాలు నెట్‌లో తెలుసుకున్నా. ఎందుకైనా మంచిదని తినే వస్తువుల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నా. అక్కడ విధుల్లో మన ఆయుధాలనే వినియోగించాలి. ఆ దేశ పోలీసువ్యవస్థతో మమేకమై ప్రపంచశాంతికి మా వంతు సేవ చేయడమే ‘శాంతి దళం’ లక్ష్యం. మా లక్ష్యం కూడాను’ అని ముగించారు లక్ష్మీమాధవి. చిన్నవయసులోనే పొరుగుదేశాలకు సేవలందించడానికి వెళుతున్న మన ఇంటి లక్ష్మికి మనం కూడా ఆల్‌దిబెస్ట్ చెబుదాం.
- భువనేశ్వరి..
ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి