డీసీపీ చైతన్య కుమార్‌ను పరామర్శిస్తున్న డీజీపీ శివధర్‌రెడ్డి, సీపీ సజ్జనార్ తదితరులు
డీసీపీ చైతన్య, గన్‌మెన్ మూర్తిలకు డీజీపీ పరామర్శ
లక్డీకాపూల్/పంజగుట్ట: చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనలో డీసీపీ చైతన్య, గన్‌మెన్ మూర్తి ధైర్య సాహసాలను ప్రదర్శించారని డీజీపీ శివధర్‌రెడ్డి అభినందించారు. సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ ఇద్దరిని ఆదివారం డీజీపీ పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో శివధర్‌రెడ్డి మాట్లాడుతూ చైతన్య, మూర్తిల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఇద్దరూ సోమవారం డిశ్చార్జ్ అయ్యే అవకాశముందన్నారు. నిందితుడు అన్సారీకి బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగిందని, అతని ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని చెప్పారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయన్నారు.
కొన్ని క్లూస్ లభించాయి: సీపీ సజ్జనార్
చాదర్‌ఘాట్ ఘటనలో కొన్ని క్లూస్ లభించాయని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఆటోడ్రైవర్, ఇంకో వ్యక్తిని పట్టుకునేందుకు సౌత్‌జోన్ డీసీపీ నేతృత్వంలో ఐదు పోలీసు బృందాలు పనిచేస్తున్నాయన్నారు. ఇటీవల ఒమర్ కదలికలు, అతనికి ఉన్న పరిచయాలపై ఆరా తీస్తున్నామని చెప్పారు. విజబుల్ పోలీసింగ్ కూడా పెంచామని పేర్కొంటూ..ఎవరూ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. డీసీపీ చైతన్యకి మెడ భాగంలో, గన్‌మెన్ మూర్తికి కాలుకు గాయమైందని చెప్పారు. డ్రైవర్ సందీప్ అలర్ట్‌గా ఉండి కీలక పాత్ర పోషించారన్నారు.


