Laxmi madhavi
-
ఒట్టేసి..బంధంతో కట్టేసి..
ఉప్పల్ : అది ఉప్పల్ నల్ల చెరువు సెంటర్.. ఆదివారం రాత్రి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.. అదే సమయంలో ఓ వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి అటుగా బైక్‌పై వెళ్తున్నాడు.. ఇంకేముంది డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. పక్కనే ఫ్యామిలీ ఉండటంతో పరుపోతుందన్న భయంతో బైక్ పక్కగా ఆపి ఇన్స్పెక్టర్తో కాళ్లబేరానికి వచ్చాడు.. అంత వరకూ బాగానే నడిచినా..ఇందులో వింతేముంది? ఎప్పుడూ జరిగే తంతేగా అనుకోవద్దు.. ఇక్కడే ఉంది అసలైన కిక్కు.. కాస్తా భిన్నంగా ఆలోచించిన ఇన్స్పెక్టర్ లక్ష్మి మాధవి.. కొద్దిసేపు అతడి భార్య, కుమారుడితో మాట్లాడారు. అనంతరం తండ్రికి కొడుకుతో కౌన్సెలింగ్ ఇప్పించారు. ‘నాన్నా నువ్వు నాకు కావాలి.. నువ్వు ఇలా తాగి బైక్ నడపడం ఎంతో ప్రమాదం.. నీకేమైనా అయితే మేమేం కావాలి? అంటూ.. చెప్పడమే కాకుండా.. మరోసారి తాగి డ్రైవింగ్ చేయనని తనపై ఒట్టు వేయమని అడిగించారు..వచ్చీ రాని మాటలతో కొడుకు చెప్పినదానికి భావోద్వేగానికి గురైన తండ్రి కొడుకుకు ప్రామిస్ చేశాడు.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. -
ఆ చిన్నారుల ముఖాల్లో చిరునవ్వుల కోసమే..!
సాక్షి, సిటీబ్యూరో: అవగాహన లేనితో చిన్న చిన్న వివాదాలతో వైవాహిక బంధాలను తెంచుకుంటున్న పాతబస్తీకి చెందిన భార్యభర్తలను కలపడటంలో కీలకపాత్ర పోషించిన ఇన్స్పెక్టర్ గుళ్ళపల్లి లక్ష్మీమాధవికి ప్రతిష్ట్మాతకమైన ఇండో–యూకే (లండన్) కల్చరల్ ఫోరం అవార్డు దక్కిన విషయం విదితమే. దీనిని అందుకోవడం వెనుక నిర్విరామ కృషితో పాటు ఉన్నతాధికారుల ప్రోత్సాహం ఉందన్నారు. అవార్డు గ్రహీత మాధవిని నగర కొత్వాల్ అంజనీ కుమార్, అదనపు సీపీ టి.మురళీకృష్ణ, సంయుక్త సీపీ తరుణ్‌జోషి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆమె మాటల్లోనే... ‘నగర పోలీసు విభాగం నుంచి ఐక్యరాజ్య సమితి భద్రతాదళానికి ఎంపికై విదేశాల్లో విధులు నిర్వర్తించి తిరిగి వచ్చాక ఐటీ సెల్లో పని చేశా. అప్పటి కమిషనర్ మహేందర్‌రెడ్డి సార్ నాకు పాతబస్తీలో ఉన్న మహిళా ఠాణాలో పోస్టింగ్ ఇచ్చారు. ఆ ప్రాంతంలో నిరక్షరాస్యత, పేదరికం తదితర కారణాలతో చిన్న చిన్న వివాదాలకే వైవాహిక బంధం తెంచుకోవడానికి సిద్ధమయ్యేవారు. దీనికోసం వారు పోలీసుస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసేవారు. అలా వారు విడిపోతే వారికి పుట్టిన పిల్లల పరిస్థితి ఏమిటనేది నన్ను కలచివేసింది. తల్లిదండ్రుల సమక్షంలోనే ఆ చిన్నారులు పెరగాలని, వారి ముఖంలో చిరునవ్వులు చిందాలని ఆశించాం. తొలినాళ్లలో నాకు తెలిసిన విధంగా వారికి కౌన్సెలింగ్ ఇవ్వడానికి ప్రయత్నించా. అయితే అది వారికి చేరాల్సిన రీతిలో చేరలేదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించా. చివరకు ఖరాన్, షరాయత్‌ల్లో ఉన్న ప్రకారం చెబితేనే వారికి పూర్తి స్థాయిలో అర్థం అవుతుందని, తమ మనసు మార్చుకుని కలసి ఉంటారని భావించాం. దీంతో కొన్ని రోజులు శ్రమించి ఆ రెంటినీ పూర్తిస్థాయిలో అధ్యయనం చేశా. ఆ తర్వాత నుంచి పోలీసుస్టేషన్లోనే ప్రత్యేక కౌన్సెలింగ్ విభాగం ఏర్పాటు చేసి వారిలో మార్పునకు కృషి చేశా. అక్కడ పని చేసిన 25 నెలల్లో దాదాపు ప్రతి రోజూ ఉదయం 9 నుంచి రాత్రి 11.30 వరకు ఠాణాకే పరిమితమయ్యా. ఉదయం 11 నుంచి కౌన్సెలింగ్ మొదలయ్యేది. ఇలా ఈ కాలంలో దాదాపు రెండు వేల జంటలు విడిపోకుండా చేశా. అలాగే పాతబస్తీలోని స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి యువతులు, మహిళలు, కొందరు యువకులతోనూ నిరంతరం సంప్రదింపులు జరిపా. వారికి పోలీసు విభాగం అందిస్తున్న సౌకర్యాలు, వినియోగించుకోవాల్సిన విధానం తదితరాలు వివరించాం. వీటన్నింటినీ మహిళా ఠాణా అధికారిక ఫేస్బుక్ పేజ్‌లో క్రమంతప్పకుండా పోస్ట్ చేస్తూ వచ్చాం. ఈ అంశాలనే ఇండో–యూకే (లండన్) కల్చరల్ ఫోరం పరిగణలోకి తీసుకుంది. ప్రతిష్టాత్మకమైన ‘హానర్’ మ్యాచ్‌లెస్ కాంట్రిబ్యూషన్ ఇన్ బెటర్మెంట్ ఆఫ్ సొసైటీ అవార్డు ప్రకటించింది. నాకు ప్రతి దశలోనూ సహాయసహకారాలు అందించిన ఉన్నతాధికారులకు కృతజ్ఞురాలినై ఉంటా. ఈ అవార్డు నాలో బాధ్యతల్ని మరింత పెంచి, విధులకు పునరంకితం అయ్యేలా చేసింది’ అన్నారు. -
సూపర్ కాప్.. లక్ష్మీమాధవి
శాంతిదూత: ఆరేళ్ల కిందట అనుకోని రోడ్డు ప్రమాదం. ‘ఎక్కువ సేపు నిలబడడం కూడా కుదరదు’అన్నారు డాక్టర్లు. ఇక ఉద్యోగానికేమెళ్తుంది అనుకున్నారు. ఆమె సంకల్పం, పట్టుదల ముందు అడ్డంకులన్నీ మోకరిల్లాయి. ఆమె మళ్లీ నిలబడటమే కాదు పరుగులు తీసింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మళ్లీ డిపార్ట్మెంట్లో అడుగు పెట్టింది. ఇప్పుడు ‘శాంతిదళం’కి ఎంపికయ్యింది. ఆ ఆత్మవిశ్వాసం పేరు లక్ష్మీమాధవి. ఇన్స్పెక్టర్ ఇన్ స్పెషల్ బ్రాంచ్. వచ్చేనెల ప్రపంచశాంతికోసం పనిచేసేందుకు వెళ్తున్న ఆ పోలీస్ స్టోరీ... ఐక్యరాజ్యసమితి ‘శాంతి దళం’ పేరిట ఏటా అన్నిదేశాల నుంచి పోలీసులను ఎంపిక చేస్తుంటుంది. ఈసారి మన దేశం నుంచి 157 మంది ఎంపికయ్యారు. అందులో తొమ్మిది మంది మహిళలు. దక్షిణ భారతదేశంనుంచి ఒకే ఒక్క మహిళ ఇన్స్పెక్టర్ లక్ష్మీమాధవి. ‘డిపార్టుమెంట్లోకి వచ్చిన కొత్తలో ఎ.ఆర్ శ్రీనివాస్ అనే పోలీసుఅధికారి బోస్నియా దేశం వెళ్లారు. మన దగ్గర చిన్నస్థాయిలో పనిచేసే పోలీసుకు విదేశాల్లో అవకాశమెలా వస్తుంది? అనిపించింది. వెంటనే వివరాలు కనుక్కుంటే తెలిసింది ‘శాంతి దళం’ గురించి. ఎనిమిదేళ్లు పనిచేసిన ఏ పోలీసు అధికారి అయినా అప్లై చేసుకోవచ్చు. పరీక్షలన్నింటిలో నెగ్గితే ఏదో ఒక దేశానికి పంపించి ఏడాదిపాటు సేవలందించే అవకాశం కల్పిస్తారు’ అని శాంతిదళం గురించి వివరించారామె. సైప్రస్ దేశానికి... వచ్చేనెల 16న తల్లిదండ్రులతో సైప్రస్ దేశానికి బయలుదేరనున్నారు లక్ష్మీమాధవి. ‘పోలీసు వృత్తిలో ఆడా మగా ఏముంటుంది. ఒంటరిగా ఉండడం ఇష్టం లేక అమ్మానాన్నలను కూడా తీసుకెళుతున్నాను. నాన్న సీతారామయ్య విద్యాశాఖలో పనిచేసి పదవీ విరమణ పొందారు. అమ్మ ఆదిలక్ష్మి గృహిణి. నేను, తమ్ముడు. చిన్నప్పటి నుంచి పోలీసు ఉద్యోగమంటే చాలా ఇష్టం. 2002లో ఎస్ఐగా ఉద్యోగ జీవితం మొదలుపెట్టి సీఐ దాకా ఎదిగాను. ఈ మధ్యనే సేవా మెడల్ కూడా వచ్చింది. ఎన్ని ప్రోత్సాహకాలు వచ్చినా.. నాకు ప్రమాదం జరిగినపుడు డిపార్ట్మెంట్ నా వెన్నుతట్టిన తీరు ముందు అన్నీ బలాదూరే’ అని ఆ విషాద ఘటనను గుర్తు చేసుకున్నారు లక్ష్మీ మాధవి. పునర్జన్మ... ఆరేళ్ల కిందట శ్రీనగర్ కాలనీలో ఉదయం వెహికల్ చెకింగ్ నిర్వర్తిస్తుండగా రాంగ్రూట్లో వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు లక్ష్మీమాధవిని గుద్దింది. తలకు, వెన్నెముకకు బలమైన గాయాలయ్యాయి. వారం రోజులు కోమా. ఏడాదిపాటు మంచంమీద నుంచి కదలలేకపోయింది. తర్వాత ఓపికంతా కూడదీసుకుని పట్టుదలగా అడుగు తీసి అడుగు వేస్తున్న సమయంలో ‘ఇప్పుడే కాదు.. భవిష్యత్‌లో ఎప్పుడూ పరిగెత్తకూడదు, ఎక్కువసేపు నిలబడకూడదు, బరువులు ఎత్తకూడదు, డ్రైవింగ్ చేయకూడదు’ అన్నారు డాక్టర్లు. అది విన్న తల్లిదండ్రులు భోరుమన్నారు. కానీ మాధవి అధైర్య పడలేదు. ‘అందరూ పునర్జన్మ అన్నారు. నేను మరోసారి పోలీసు ఉద్యోగానికి ట్రైనింగ్ తీసుకున్నట్టు భావించాను. అంతే శ్రమించాను. మళ్లీ ఉద్యోగంలోకి చేరతానని డీజీపీగారిని కలిస్తే ‘వెల్కమ్’ అన్నారు. నూతనోత్సాహంతో పనిచేశాను. జరిగిన ప్రమాదాన్ని నన్ను నేను నిరూపించుకోవడానికో అవకాశంగా భావించా. 2012లో శాంతిదళానికి అప్లై చేశా. వారు నిర్వహించిన పరీక్షల్లో అన్నిటికన్నా కఠినమైనది డ్రైవింగ్ టెస్ట్. ఇరుకు సందులో జీపులను పార్కు చేయడం, ఎలాంటి ఇబ్బంది లేకుండా రివర్స్ డ్రైవ్ చేయ డం, ఆ టెస్ట్‌లో నాకు నూటి కి నూరు మార్కులు పడ్డాయి’ అని సంతోషంగా చెప్పారు. నచ్చితే...అక్కడే శాంతిదళంలో సేవలు నచ్చితే మరికొన్నేళ్లపాటు అక్కడే విధుల్లో కొనసాగిస్తారు అధికారులు. ‘ఇప్పటివరకు దేశం దాటింది లేదు. సైప్రస్ గురించి కొన్ని వివరాలు నెట్లో తెలుసుకున్నా. ఎందుకైనా మంచిదని తినే వస్తువుల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నా. అక్కడ విధుల్లో మన ఆయుధాలనే వినియోగించాలి. ఆ దేశ పోలీసువ్యవస్థతో మమేకమై ప్రపంచశాంతికి మా వంతు సేవ చేయడమే ‘శాంతి దళం’ లక్ష్యం. మా లక్ష్యం కూడాను’ అని ముగించారు లక్ష్మీమాధవి. చిన్నవయసులోనే పొరుగుదేశాలకు సేవలందించడానికి వెళుతున్న మన ఇంటి లక్ష్మికి మనం కూడా ఆల్‌దిబెస్ట్ చెబుదాం. - భువనేశ్వరి.. ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి