
నాలుగు రెట్లు ఇస్తాం.. మీ ఆస్తులు రాసిస్తారా?: ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి
సాక్షి, కాకినాడ: ‘మీరు ప్రకటించిన రూ.41.70 కోట్ల విలువైన ఆస్తులకు నాలుగు రెట్లు మేము అడుక్కొనైనా మీకిస్తాం. మీ ఆస్తులు మాకు రాసిచ్చేస్తారా’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాకినాడ సిటీ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఆయన కాకినాడలో మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. సత్యహరిశ్చంద్రునిలా తన వ్యక్తిగత ఆస్తి రూ.42 లక్షలేనని, తన భార్య భువనేశ్వరికి రూ.33.05కోట్లు, కుమారుడు లోకేష్‌కు రూ. 4.92 కోట్లు, కోడలు బ్రహ్మణికి రూ. 3.30 కోట్లు అంటూ మొత్తం కుటుంబ ఆస్తి కేవలం 41.70 కోట్లు మాత్రమేనంటూ ప్రకటించడం ఎవర్ని మోసగించడానికని ప్రశ్నించారు.
బ్రహ్మణికి రూ.9.90 లక్షల విలువైన బంగారు ఆభరణాలు మాత్రమే ఉన్నాయని ప్రకటించారని, అయితే తన చెల్లెలు వివాహానికి బ్రహ్మణి వేసుకున్న వస్తువులను టీవీ చానల్స్ అన్నీ చూపించాయన్నారు. వాటి విలువ ఎంతో మీకు తెలియకపోతే తమకిస్తే విలువ కట్టిస్తామన్నారు. మీరు చెప్పే కాకిలెక్కలను చూసి ప్రజలు మోసపోరని దుయ్యబట్టారు. చంద్రబాబు ఒక ఉగ్రవాదిలా తయారయ్యారని, అమెరికాలో ట్విన్ టవర్స్‌ను కూల్చివేసి ఉగ్రవాది బిన్‌లాడెన్ అమెరికాను అతలాకుతలం చేస్తే రాష్ర్ట విభజనకు అనుకూలంగా రెండు లేఖలు ఇచ్చి ఆయన ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రక్రియ మొదలవుతుందని కేంద్రం ప్రకటిస్తే రెండు రాష్ట్రాల్లో టీడీపీ ఉంటుందని, ఒక రాష్ర్టంలో లోకేష్, మరో రాష్ర్టంలో తాను సీఎం అవుదామనే ఆశతో బాబు కాంగ్రెస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు.