రక్తకన్నీరు ఆడి మాకు అమృతం పంచారు | Bhuvaneshvari Special Interview With Sakshi | Sakshi
Sakshi News home page

రక్తకన్నీరు ఆడి మాకు అమృతం పంచారు

Published Wed, Jan 22 2020 1:21 AM | Last Updated on Wed, Jan 22 2020 4:51 AM

Bhuvaneshvari Special Interview With Sakshi

‘చరిత్ర అడక్కు.. చెప్పేది విను’ అని నాగభూషణం ఫేమస్‌ డైలాగ్‌. కాని– నటుడిగా ఆయన చరిత్ర చెక్కుచెదరక నిలిచి ఉంది. ప్రేక్షకులకు దానిని పదేపదే అడగాలని ఉంటుంది. విలన్‌ నాగభూషణంగా, ‘రక్తకన్నీరు’ నాగభూషణంగా, మంచి పాత్రల నాగభూషణంగా ఆయన తెలుగువారికి ఆత్మీయుడు. నాగభూషణం కుమార్తె భువనేశ్వరి  తండ్రి జ్ఞాపకాలను సాక్షితో పంచుకున్నారు.

మాకు ఊహ తెలిసేటప్పటికే నాన్నగారు బాగా బిజీగా ఉన్నారు. షూటింగ్‌ అయ్యాక సాయంత్రాలు మేకప్‌తో ఇంటికి వస్తూనే అన్నయ్యను పలకరించేవారు. కాస్త ఊహ వచ్చాక నాన్నకు కావలసినవన్నీ నేనే చూసేదాన్ని. ‘మా అమ్మాయి అన్నీ చూసుకుంటోంది’ అని సంతోషించేవారు. నాన్న ప్రతిరోజూ కాకరకాయ రసం తాగేవారు. నేనే స్వయంగా కాకరకాయ రసం చిన్న గ్లాసుతో ఇస్తే తాగేవారు. ఆ తరవాత మేకప్‌ తీసేవారు. నాన్న చాలా పంక్చువల్‌.

మడి కట్టుకుని వండేది...
మాది శాకాహార కుటుంబమే అయినా నాన్నకు నాన్‌వెజ్‌ అంటే ఇష్టమని, మా అమ్మ (‘రక్త కన్నీరు’ సీతాదేవి) మడి కట్టుకుని నాన్‌వెజ్‌ వండేది. అమ్మ చేసిన కంది పచ్చడి అంటే నాన్నకు చాలా ఇష్టం.  నాన్నగారికి కమ్యూనిస్టు భావాలున్నా ప్రతిరోజూ తెల్లవారుజామున గాయత్రీ మంత్రం జపించేవారు. దేవుడి గురించి ప్రశ్నిస్తే ‘ఒక మానవాతీత శక్తి ఉంది,  ఆ శక్తినే గాయత్రీ మంత్రంగా భావించి జపిస్తాను. దానివల్ల పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ వస్తాయి’ అనేవారు. అమ్మ శ్రావణ శుక్రవారం వరలక్ష్మీవ్రతం చేసుకున్న రోజున, పూజ అయ్యే సమయానికి ఎక్కడ షూటింగ్‌లో ఉన్నా, మధ్యాహ్నం ఇంటికి వచ్చి తప్పనిసరిగా భోజనం చేసేవారు.

చెంప పగలగొట్టారు...
ఆయనకు నేనంటే చాలా ఇష్టం. నేను పుట్టాక కలిసి వచ్చింది అంటుండేవారు. కాని నేను లిప్‌స్టిక్‌ వేసుకుంటే ఆయనకు నచ్చలేదు. ‘బాగుండదమ్మా. ముఖం కడుక్కో’ అని సున్నితంగా మందలించారు. ఒకసారి నేను, మా మామయ్య కూతురు కలిసి ‘అందాజ్‌’ (1971) సినిమాకు వెళ్లేసరికి టికెట్లు అయిపోయాయి. సాయంత్రం 6.30 షోకి  వెళ్దామని అక్కడే ఉండిపోయాం. సినిమా అయ్యేసరికి ఆలస్యం అయిపోయింది. నాన్న టెన్షన్‌ పడిపోయి బయటకు వచ్చేసరికి, గేట్‌ దగ్గరే నిలబడి ఉన్నారు. మమ్మల్ని కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకువచ్చారు. భయంతో ఒళ్లంతా వణికిపోతోంది. ఇంట్లోకి రాగానే, చెంప మీద ఒక్కటి లాగి పెట్టి కొట్టారు. చెవి రింగు ఊడిపోయింది. ఎక్కడకు వెళ్లినా, సాయంత్రం ఆరుగంటలకు ఇంటికి వచ్చేయాలన్నది ఆయన స్ట్రిక్ట్‌ పోలసీ. ఆ ఒక్క దెబ్బతో ‘అందాజ్‌’ సినిమా కథంతా మరచిపోయాను.

మూగమనసులుతో బ్రేక్‌
నాన్న 1956 నుంచి ‘రక్తకన్నీరు’ నాటకం వేయటం ప్రారంభించారు. అమ్మ సీతాదేవితో అక్కడే పరిచయం ఏర్పడి, కొన్ని రోజులకే వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పట్లో అమ్మ స్పెషల్‌ సాంగ్స్‌ చేసేది. మా నాయనమ్మ లీలాబాయమ్మ సినిమాలలో హీరోయిన్‌గా వేశారు. ఆవిడ మా అమ్మను పెంచుకున్నారు. ఆవిడ అదృష్టం ఏమో కాని, అమ్మను దత్తత తీసుకున్న ఆరు నెలలకు మా మేనమామ పుట్టారు. అమ్మకు 1957లో అన్నయ్య, 1960లో నేను పుట్టాక అమ్మ సినిమాలు మానేసింది. ‘మూగమనసులు’ చిత్రంతో నాన్నకు బ్రేక్‌ వచ్చినా, నాన్న నాటకాలు మానలేదు. నాన్నగారు ఒక్క డైలాగు కూడా మర్చిపోయే వారు కాదు.

భయంతో ఏడ్చేశాను..
రక్తకన్నీరు నాటకంలో ఒక సీన్‌లో స్టేజీ మీద మొత్తం లైట్లన్నీ ఆర్పేసి, రెడ్‌ స్పాట్‌ లైట్‌ వేశారు.   ఒక్కసారిగా నాన్న వెనక్కి తిరుగుతారు. రెడ్‌ లైట్‌ ముఖం మీద పడగానే,  భయంతో ఏడ్చేశాను. ఆ సీన్‌లో కుష్ఠురోగంతో ఒళ్లంతా చీమునెత్తురుతో కుళ్లిపోయి ఉంటుంది నాన్న శరీరం. ఆ తరవాత ఎన్నడూ చూడలేదు.

రక్తకన్నీరు లేకుండానే...
1995లో  నాన్నగారు చేసిన సినిమాలన్నీ అన్నయ్య సేకరించాడు. నిర్మాతలు, దర్శకులతో ఇంటర్వ్యూలు చేసి, మావారికి అందచేశాడు. మావారు  దానిని డాక్యుమెంటరీ చేశారు. అది దూరదర్శన్‌ లో టెలికాస్ట్‌ అయ్యింది. బషీర్‌బాగ్‌లో షో వేసి నాన్నగారికి చూపిస్తే, ‘ఇంత పెద్ద పనిని ఎలా చేయగలిగారు’ అని సంతోషంతో ప్రశంసించారు. అయితే అందులో రక్తకన్నీరు ప్రస్తావన లేకపోవటంతో – తన ఇంటి ముందు రోడ్డు మీద రాబోయే ఆదివారం నాడు కాండిడ్‌ షాట్స్‌తో కుష్ఠు సీన్‌ తీద్దామని, రోడ్డు మీద వాళ్ల రియాక్షన్‌ ఎలా ఉంటుందో చూద్దామనీ అన్నారు నాన్న. ‘సరే’ అన్నాం. ఇది జరిగిన మరుసటి రోజు (ఆ రోజు గురువారం) నాన్నగారిని చూడటానికి వెళ్లాను. ఆయన ‘భువనా! నాకు ఖీమా తినాలని ఉంది’ అన్నారు. ‘రేపు తేనా?’ అన్నాను.

‘ఆదివారం తిందాంలే, అమ్మ చేసినట్లు చెయ్యాలి’ అన్నారు. సరేనని ఇంటికి వచ్చేశాను. శుక్రవారం నాడు ఏదో పని మీద బయటకు వెళ్లి, బాగా అలసిపోయి, ఇంటికి వచ్చాక ఫోన్‌ ప్లగ్‌ తీసేశాను. మరుసటి రోజు ఉదయం నాన్న స్నేహితుడు ప్రతాపరెడ్డి ఫోన్‌ చేసి ‘నాన్న నిన్నే కలవరిస్తున్నారు. రాత్రంతా ప్రయత్నించాను. నీ ఫోన్‌ కలవలేదు’ అన్నారు. నాకేమీ అర్థం కాలేదు. ఏదో సీరియస్‌ అయి ఉంటుంది అనిపించి, వెంటనే బయలుదేరి, వెళ్లేసరికి అంతా అయిపోయింది. అది మే 5, 1995. అలా నాన్న రక్తకన్నీరు నాటకం డాక్యుమెంట్‌ చేయలేకపోయాను, నాన్నకు ఖీమా పెట్టలేకపోయాను అని ఇప్పటికీ బాధ పడుతుంటాను.

టైమ్‌కి అన్నం ఉండాల్సిందే..
ఇంట్లో నేను, నాన్న, అమ్మ కలిసి పేక ఆడుకునేవాళ్లం. అన్నయ్యను ఆడనిచ్చేవారు కాదు. ఆడపిల్ల పేకాడితే చెడిపోదులే, మగపిల్లవాడైతే కష్టం అనేవారు. నాన్నగారు భోజనానికి ఆగలేకపోయేవారు. టైమ్‌కల్లా అన్నం పడాలి. ఒకసారి విజయవాడ వెళుతుంటే దారిలో కారు పంక్చర్‌ అయ్యింది. అక్కడే పక్కన పొలంలో కూలీలు పంట కోస్తున్నారు. మా అవస్థ చూసి ‘ఏమైనా కావాలా?’ అని అడిగారు. అమ్మ మొహమాట పడకుండా, అన్నం కావాలని అడిగి తెచ్చి, నాన్న ఆకలి తీర్చిందని, అమ్మ గురించి నాన్న గొప్పగా చెప్పేవారు.  పుట్టినరోజుకి పట్టు లంగా కొనేవారు. ప్రతి పండక్కి నాన్న తప్పకుండా వచ్చేవారు. దీపావళి నాడు అందరి ఇళ్లకూ తీసుకు వెళ్లి స్వీట్స్‌ ఇచ్చేవారు.

ఆడవేషంలో...
నాన్నకి పీతాంబరం గారు మేకప్‌ చేసేవారు. ‘నేనంటే నేనే’ సినిమాలో లేడీ గెటప్‌ వేసిన రోజున, అదే వేషంతో సందు చివర నుంచి ఇంటి దాకా నడిచారు. అందరూ నాన్నను క్యాజువల్‌గా చూశారు. అంత సహజంగా నడిచారన్నమాట.
– సంభాషణ: వైజయంతి పురాణపండ
ఫొటోలు: కె. రమేశ్‌ బాబు

మాది మతాంతర వివాహం
మా ఇంటి వ్యవహారాలన్నీ మా మేనమామ చూసుకునేవారు. నేను శారదా విద్యాలయలోను, సయ్యద్‌ మీర్‌ (ఎస్‌. డి.లాల్‌ కుమారుడు) రామకృష్ణ మిషన్‌లోను చదువుకున్నాం. మా అన్నయ్య సురేంద్ర, మీర్‌ గారు క్లాస్‌మేట్స్‌. ఆయన ఇంటికి వస్తుండేవారు. మా మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఇద్దరి మతాలు వేరు కావటంతో నాన్నగారు ఏమంటారోనని భయం వేసింది. మా విషయం అమ్మకు చెపితే మామయ్య ద్వారా అమ్మ నాన్నకి చెప్పించింది. ఇరువైపుల వారినీ కష్టపడి ఒప్పించాకే 1982లో మా వివాహం జరిగింది. అదే సంవత్సరం డిగ్రీ కూడా పూర్తి చేశాను. మా కుటుంబంలో ఎటువంటి గొడవలు రాకుండా జాగ్రత్తపడ్డాను. నా విధానం చూసి మా అత్తగారు సంతోషించారు. మాకు ఇద్దరు బాబులు. ఆబిద్‌ భూషణ్, ఆసిఫ్‌ భూషణ్‌.

మా పిల్లలు తాతగారితో బాగా ఆడుకునేవారు. పెద్దబ్బాయి బిటెక్‌ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాడు. వాడికి యాక్టింగ్‌ మీద ఆసక్తి ఉంది. చిన్నవాడు విజువల్‌ ఎఫెక్ట్స్‌ చేస్తున్నాడు. పెద్దబాబుకి బ్రేక్‌ రాలేదు. అందుకని పెళ్లి చేసుకోలేదు. చిన్నబాబుకి పెళ్లి చేశాం. కోడలు సంధ్య ఉద్యోగం చేస్తోంది. వాళ్లు చెన్నైలో ఉంటున్నారు. మా వారు పది సంవత్సరాలుగా ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నారు. ఆయనకు వెంకటేశ్వరస్వామి అంటే భక్తి ఎక్కువ. అన్నయ్య డిప్లొమా ఇన్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేశాడు. ఉద్యోగం చేస్తూ, సినిమాటోగ్రఫర్‌గా పని చేశాడు. నాలుగేళ్లుగా అనారోగ్యం కారణంగా బయటకు రావట్లేదు.
– భువనేశ్వరి, నాగభూషణం కుమార్తె

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement