చంద్రబాబు మాట ఎలా ఉన్నా.. తమ వదిన భువనేశ్వరి మాత్రం టీఆర్ఎస్‌కే ఓటు వేయడం ఖాయమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం సాయంత్రం నిర్వహించిన భారీ బహిరంగ సభలో పలు చెణుకులు విసిరారు. హైదరాబాద్‌ను వదల బొమ్మాళీ వదల అని చంద్రబాబు అంటున్నారని, ఆయన్ను తాము పొమ్మనలేదని చెప్పారు. ఆయన వ్యాపారమంతా.. తమ వదిన భువనేశ్వరి చూస్తుందని, ఈయన కంటే ఆమే బాగా చూస్తోందని అన్నారు. కావాలంటే 15 రోజులకు ఓసారి వచ్చి లెక్కలు చూసుకుని పోవాలని తెలిపారు. భువనేశ్వరి కూడా ఇక్కడే ఉంటున్నారు కాబట్టి, ఆమెకు నిజాయితీ ఉందని, ఆమె మాత్రం గ్యారంటీగా తమకే ఓటు వేస్తారని అన్నారు.
చంద్రబాబుకు వాస్తవాలు తెలియవు కాబట్టి ఇక్కడే ఉంటానంటున్నారని విమర్శించారు. నేను అమరావతికి, ముంబైకి వెళ్లి ఇక్కడే ఉంటానంటే కుదురుతుందా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో తనకు ఉండబుద్ధి వేయట్లేదని, హైదరాబాద్ నుంచి పాలించాలంటే విదేశాల్లో ఉన్నట్లు ఉంటుందని విజయవాడలో చెబుతారన్నారు. గోదావరి నీళ్లు, కరెంటు అన్ని విషయాల్లో పంచాయతీ పెడుతున్నారని మండిపడ్డారు. నీ పని నువ్వు చేసుకో, మా పని మేం చేసుకుంటామని స్పష్టం చేశారు.