సాక్షి, కుప్పం : పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీ అధినేత చంద్రబాబుకు టెన్షన్ పెరుగుతోంది. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనే టీడీపీ కోట బీటలు వారుతోందా? కుప్పంలో బాబుకు ఎదురుగాలి వీస్తోందా? కుప్పంలో అభివృద్ధి జరగలేదని, ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికలతో టీడీపీ అధినేత గుండెల్లో గుబులు పుట్టిందా? పులివెందులకు వెళ్లి తొడకొట్టిన చంద్రబాబుకు సొంత నియోజకవర్గ పరిస్థితులే దడ పుట్టిస్తున్నాయా? పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. ఈసారి కుప్పంలో గట్టెక్కడమే కష్టమని బాబు కుటుంబానికి ముందే తెలిసిపోయిందా..? అందుకే 40 ఏళ్లలో ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడని ఆయన భార్య భువనేశ్వరి రంగంలోకి దిగి నష్టనివారణ చర్యలు చేపట్టారా...? కుప్పం నాయకులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడిన భువనేశ్వరే తనకు కాన్ఫిడెన్స్ లేదని మాట్లాడటం దేనికి సంకేతం? భువనేశ్వరి ఆడియో టేపులు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..
ఇంతవరకు ఎప్పుడూ చంద్రబాబు భార్య భువనేశ్వరి రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. కుటుంబ నిర్వహణ, వ్యాపార బాధ్యతలు చూసుకుంటున్న ఆమె ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై మానిటరింగ్ చేస్తున్నారు. ఏకంగా వందమంది నాయకులతో ఒకేసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాటల్లో ఎక్కడా కాన్ఫిడెన్స్ లేకపోవడంతో నేతల్లోనూ భయం పట్టుకుంది. మనం ఎన్ని చేసినా ఎక్కడో అనుమానం ఉందంటూ ఆమె అనడంతో నాయకులు, కార్యకర్తల్లో మరింత ఆందోళన పెరుగుతోంది. కుప్పం నియోజకవర్గ నాయకులు కూడా కొన్ని తప్పులు జరిగాయని అంగీకరించడం చూస్తుంటే ఈ సారి అక్కడ టీడీపీ పరిస్థితి కష్టంగా ఉందని అర్థమైపోతోంది. తప్పులు జరిగాయని.. సరిచేసుకుందామంటూ అక్కడ ఇన్‌ఛార్జ్ నాయకులను కోరడం చూస్తుంటే వారిలో విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో.. ఆ విభేదాలు పార్టీ అధినేతను ఏ రేంజ్‌లో కలవరపెడుతున్నాయో స్పష్టమవుతోంది. కుప్పం టీడీపీ నేతలతో భువనేశ్వరి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ ఆడియో టేపులు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment