
మొక్కలకు అక్కచెల్లెళ్లు
కోనేటి వెంకటేశ్వర్లు,
సాక్షి, తిరువళ్లూరు
‘‘నువ్వు గొప్పవ్యక్తివి కాకపోయినా... నువ్వు చేసే పని గొప్పదైతే అదే నిన్ను ప్రపంచంలో గొప్పవ్యక్తిగా నిలబెడుతుంది. నువ్వు చేసే పని అందరికీ నచ్చాలని లేదు. కనీసం ప్రోత్సహించగలిగినా చాలు...’’
పదవ తరగతిలో ‘రీఫారెస్టేషన్ మెథడ్స్’ అనే ఇంగ్లీష్ పాఠంలోని అంశాలను వివరిస్తూ తమ టీచర్ చేసిన బోధన ఆ అక్కాచెల్లెళ్లను ఆలోచింపచేసింది. నానాటికి కనుమరుగవుతున్న పచ్చదనాన్ని కాపాడి భావితరాల వారికి కానుకగా అందించాలన్న తపన వీరిని పర్యావరణ పరిరక్షణ ఉద్యమం వైపు నడిపించింది.
తమిళనాడు, తిరువళ్లూరు జిల్లా కనకమ్మ సత్రం సమీపంలోని కుగ్రామానికి చెందిన కవలలు కోటీశ్వరి, భువనేశ్వరి. ఇద్దరూ అదే ప్రాంతంలోని తెలుగు మీడియం పాఠశాలలో టెన్త్ వరకు చదువుకున్నారు. తండ్రి వ్యవసాయదారుడు. నానాటికి పంటల సాగు తగ్గిపోవడం, దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోవడం వారిని ఆలోచింపజేసింది. సరిగ్గా అప్పుడే (పదేళ్ల క్రితం) ఇంగ్లీషు టీచర్ రామకృష్ణరాజు... అడవులు నరకడం వలన కలిగే నష్టాలను వివరిస్తూ ప్రముఖ పర్యావరణవేత్త బహుగుణ చేసిన ప్రచారం గురించి బోధించారు. ‘‘ఆ బోధనే ప్రేరణగా నిలిచి ఏడాదికి కనీసం పదివేల మొక్కలు నాటాలని ప్రతిన పూనాం’’ అని చెప్పారు కోటీశ్వరి.
వీరిది గ్రామీణ ప్రాంతం కావడంతో పదవ తరగతి ముగిసిన రెండేళ్లకే ఇద్దరికీ పెళ్లి చేసేశారు. దాంతో ప్రతి ఇంటికి చెట్టు అనే తమ కల కలగానే మిగిలిపోతుందేమోనని భయపడ్డారు. మొదట కోటీశ్వరి.. భర్త నటేశన్‌తో తన ఆశయం గురించి చెప్పారు. ‘ఇదేం ఆశయం’ అన్నట్లు ఆయన చూశారట. ఇంటిబాధ్యతలు వదిలేసి చెట్లు, మొక్కలు నాటడం ఏమిటని ఆయన ఉద్దేశం. కానీ కోటీశ్వరి భర్తకు నచ్చజెప్పి అనుమతి సాధించింది. అలా తనకు ప్రోత్సాహం లభించగానే చెల్లి భువనేశ్వరి ఇంటి వారినీ ఒప్పించి ఆరేళ్ల క్రితం ఇద్దరూ మొక్కల నాటే పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు తిరువళ్లూరు, కాంచీపురం, వేలూరు తదితర జిల్లాలో రెండు లక్షల పైగా మొక్కలు నాటారు. వాటి పర్యవేక్షణను లయన్స్‌క్లబ్ వారికి అప్పగించారు. ఒక మొక్కను నాటడం వల్ల లక్షలాది విత్తనాలు, వేల సంవత్సరాలకు సరిపడా ఆక్సిజన్‌ను ఇవ్వగల చెట్టు వృద్ధి చెందుతుంది. అలాంటి చెట్లును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై వుందన్న విషయాన్ని మనలో చాలామంది ఎందుకు గుర్తించలేకపోతున్నారో తెలియడం లేదని కోటీశ్వరి ఆవేదన చెందారు. అయినప్పటికీ తామెన్నడూ ఆశయ సాధనలో వెనుకంజ వేయలేదని ఈ అక్కాచెల్లెళ్లు చెప్పారు.
ఇంటి దగ్గరే నర్సరీ
ఆరంభంలో వారానికి రెండు రోజులు బయట ప్రాంతాలకు వెళ్లి పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాలలో మొక్కలు నాటి వచ్చేవారు కోటీశ్వరి, భువనేశ్వరి. మొక్కల కోసం ప్రతిసారీ అటవీశాఖ అధికారులను ఆశ్రయించాల్సి వచ్చేది. వారానికి కనీసం రెండు వేల మొక్కలను అడిగేవాళ్లు. మొదట్లో ఇచ్చేవారే కానీ, తర్వాత్తర్వాత ఇవ్వడం మానేసారు. దాంతో రెండు మూడు నెలల దాకా మొక్కలు నాటే అవకాశం లేకుండా పోయింది. చివరికి తామే స్వయంగా ఇంటి దగ్గరే నర్సరీ ఏర్పాటు చేసుకున్నారు. ఇలా పెంచిన మొక్కలను స్వచ్ఛందంగా వివిధ ప్రాంతాలకు వెళ్లి నాటి వస్తున్నారు. ‘‘ఏడాదికి లక్ష మొక్కలను నాటుతున్నాం. మరో పది సంవత్సరాల పాటు ఇలా నాటగలిగితే పదిలక్షల చెట్లు అవుతాయి. అప్పుడు పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న కృషిలో మేము సఫలీకృతం అయినట్లే’’అంటున్నార ఈ అక్కచెల్లెళ్లు. ప్రస్తుతం వీరికి వేలాది మంది మద్దతుగా నిలుస్తున్నారు. ఆ ప్రోత్సాహంతో ‘గ్రీన్ సేవర్ చారిటబుల్ ట్రస్టు’ను ఏర్పాటు చేసుకుని మరీ ముందుకు సాగుతున్నారు.