ఒళ్లు విల్లు మది హరివిల్లు!
యోగా
అదృష్టవశాత్తూ భారతభూమి యోగాకు పుట్టినిల్లు. కాలం అత్యాధునికమైనకొద్దీ సంభవిస్తున్న జీవనశైలి రుగ్మతలకు విరుగుడు ఆ అతి ప్రాచీన విధానంలో దొరకడం ఒక విచిత్రం! ఆనందం కూడా! యోగా మనదగ్గరే ఉంది కాబట్టి.
జగ్గీ వాసుదేవ్ వాణి, మంచు లక్ష్మీప్రసన్న బాణి.... ఇవీ ఇకముందు ఈ పేజీల్లో మిమ్మల్ని పలకరించబోతున్నాయి. ఈ అరుదైన కాంబినేషన్లో యోగా తరగతులు ఫన్‌డే పాఠకులకు ప్రత్యేకం...
యోగా అనేది మన దేశం మనకిచ్చిన వరం. గత పదేళ్లుగా నేను యోగా చేస్తున్నాను. యోగా అనేది కేవలం శరీరానికి సంబంధించిన ప్రక్రియ మాత్రమే కాదు. మనసుకి చెందింది. ముందుగా యోగా ప్రభావం మన మానసిక స్థితిపై ఉంటుంది. మనసుకి, శరీరానికి మధ్య ఒక వంతెన వేసేదే యోగా. నన్ను చూసి మరో పదిమంది యోగా నేర్చుకోడానికి ముందుకి వస్తారని ఆశిస్తున్నాను.
- మంచు లక్ష్మి
అసలు యోగా అంటే ఏమిటి?
యోగా అన్నప్పుడు చాలా మంది శరీరాన్ని అసాధ్యమైన భంగిమల్లో తిప్పడం అని అర్థం చేసుకుంటారు. యోగా అంటే శరీరాన్ని మెలికలు తిప్పటం లేక తల్లకిందులుగా ఉంచడం కాదు. యోగా అనేది ఒక వ్యాయామ పద్ధతి కాదు. అది మనిషిని తను చేరుకోగల అత్యున్నత స్థితికి చేరేవేసే ఒక సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానం. అసలు ‘యోగా’ అంటే ‘ఐక్యం’ అని అర్థం. మీరు అన్నింటితో ఐక్యం అయితే అదే యోగా! అయితే అన్నీ ఒకటి ఎలా కాగలవు?
ఈరోజు ఆధునిక విజ్ఞాన శాస్త్రం మొత్తం అస్థిత్వం కూడా ఒక్కటే శక్తి అనీ, అదే లక్షల కొద్ది మార్గాలలో వ్యక్తమవుతుంది అనీ చెబుతోంది. ప్రపంచ మతాలు కూడా ‘దేవుడు అంతటా ఉన్నాడు’ అని చెబుతున్నాయి. ఒకటే సత్యాన్ని వేరే విధంగా వ్యక్తపరిచారు. ఒక శాస్త్రవేత్త దాన్ని గణితపరంగా తెలుసుకున్నాడు. ఒక ఆధ్యాత్మిక వ్యక్తి దాన్ని నమ్ముతాడు. కానీ ఈ ఇద్దరు దాన్ని అనుభవించలేదు. ఒక యోగి ఇలా గణితపరంగా తెలుసుకోవడంతో గానీ లేదా నమ్మడంతో గానీ సంతృప్తి చెందడు. అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అనుకుంటాడు.
ఇప్పుడు ఈ ప్రపంచంలో హఠయోగా అభ్యసిస్తున్న పద్ధతిని చూస్తే చాలా బాధ కలుగుతుంది. కేవలం భౌతిక అంశానికి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తున్నారు. మీరు కేవలం ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటే ‘టెన్నిస్ ఆడండి లేదా నడవండి’ అని నేనంటాను. యోగా అనేది ఒక వ్యాయామం కాదు. దానిలో ఇతర పార్శ్వాలు ఉన్నాయి. దీనిని చాలా సున్నితంగా చేయాలి. చాలామంది సరైన యోగాని చేయకపోవడం వల్ల మానసిక సమతుల్యతను కోల్పోయారు. యోగా ప్రమాదకరమైనది కావటం వల్ల అలా జరగలేదు. కేవలం మూర్ఖత్వం వల్ల అలా జరిగింది. మూర్ఖత్వం ఎప్పుడూ ప్రమాదకరమే. మీరు దేనినైనా మూర్ఖంగా చేస్తే దాని వల్ల మీకు హాని కలుగుతుంది.
హఠ యోగాని సరైన వాతావరణంలో, నమ్రతతో, మనమందరం ఒక్కటే అనే భావనతో నేర్పితే, అది మీ శరీరమనే పాత్రని దివ్యత్వాన్ని అందుకోవటానికి సిద్ధపరిచే ఒక అద్భుతమైన ప్రక్రియ అవుతుంది. హఠయోగా లోని కొన్ని పార్శ్వాలు ఇప్పుడు ప్రపంచంలో పూర్తిగా కనుమరుగైపోయాయి. నేను ఆ పార్శ్వాలను తిరిగి అందించాలనుకుంటున్నాను. ఇది చాలా శక్తివంతమైన జీవన మార్గం. ఇది ఎవరి మీదో అధికారం చలాయించే శక్తి కాదు. ఇది జీవితాన్ని తెలుసుకునే శక్తి.
ప్రేమాశీస్సులతో
సద్గురు
రిపోర్టింగ్: భువనేశ్వరి