మధ్యాహ్నం హత్య
మాజీ డీజీపీ పేర్వారం రాములు చెప్పిన రియల్ క్రైమ్ స్టోరీ
‘‘ఉదయం పదకొండు గంటలకు కమిషనరేట్‌లో నా ఫోన్ మోగింది. హలో అనకుండానే అవతలివైపున పాతబస్తీ ఎస్‌ఐ హత్యవివరాలను హడావుడిగా చెప్పడం మొదలుపెట్టాడు.
బెస్ట్ కేస్
పట్టపగలు... నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ వస్త్రవ్యాపారిని కత్తులతో పొడిచి హత్య చేశారు. పాతబస్తీలో నాలుగు రాళ్లు రువ్వుకుంటేనే గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అలాంటిది హత్య. వస్త్రవ్యాపారి హత్య అంటే ఆశ్చర్యపోవాల్సిన విషయమే. వాళ్లకి పెద్దగా శత్రువులుండే అవకాశం ఉండదు. ఉన్నా... ఇలా రోడ్డుపై తెగబడాల్సిన పనిలేదు. ఎవరో మతతత్వశక్తులు ఇలాంటిపనికి పూనుకున్నారేమోనని నా కింది ఆఫీసర్లు వారి ఊహల్ని వినిపిస్తున్నారు.
సెన్సిటివ్ కేసు. ఎలాంటి అల్లర్లకు అవకాశం లేకుండా దర్యాప్తు జరగాలి. మరు నిమిషమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారి దగ్గర నుంచి ఫోన్. ‘ఏమయ్యా... మన నగరంలో అసలు పోలీసులున్నారా? పట్టపగలు రోడ్డుపైన హత్య చేస్తుంటే ఏంచేస్తున్నట్టు? రేపు సాయంత్రంలోగా హంతకుడ్ని పట్టుకోవాలి’ అంటూ ఆర్డరు. వెంటనే నేను నాలుగు టీమ్‌లను సిద్దం చేసుకుని ముందుగా సంఘటనా స్థలానికి వెళ్లాం. అప్పటికే వ్యాపారి చనిపోయాడు.
ఉదయం 10:30 గంటలకు...
ఆ రోజు పాతబస్తీ యథావిధిగా తెల్లవారింది. ఓ వస్త్రవ్యాపారి బేగంపేటలోని తన దుకాణానికి స్కూటర్‌పై బయలుదేరాడు. పురానాపూల్ బ్రిడ్జ్ ఎక్కాడు. బ్రిడ్జ్ కదా... బండి స్లోగా వెళుతోంది. ఇంతలో ఇద్దరు కుర్రాళ్లు ఓ బండిపై వచ్చి వ్యాపారి బండిని ఢీకొట్టారు. ఉన్నపళంగా కిందపడ్డ వ్యాపారి ‘కళ్లు కనపడడం లేదా...’ అంటూ అరవబోతుండగానే అందులో బాగా బలీయంగా ఉన్న వ్యక్తి చొక్కాలోనుంచి చాకు తీసి వ్యాపారి పొట్టలో నాలుగైదు పోట్లు పొడిచాడు.
వాహనదారులంతా ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు. ఒక్కరు కూడా ముందుకొచ్చి హంతకుల్ని పట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఎవరో పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. మావాళ్లు వెళ్లేసరికి కొన ఊపిరితో ఉన్నాడు వ్యాపారి. దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. మార్గమధ్యంలోనే చనిపోయాడు. మృతుడి చొక్కాజేబులో ఉన్న వివరాల సాయంతో పాతబస్తీలో అతనున్న ఇంటికి చేరుకుంది మా టీమ్.
11:30 గంటలకు...
చనిపోయిన వ్యాపారి మధ్యవయస్కుడు. భార్య, ఇద్దరు ప్లిలలు, తల్లి, తమ్ముడు ఉన్నారు. మధ్యతరగతి కుటుంబం. అందరూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. హతుడికి ఎవరైనా శత్రువులున్నారేమోనని ఆరా తీస్తే... అలాంటివారెవరూ లేరని తెలిసింది. ఆస్తితగాదాలు కూడా లేవు. దుకాణం చుట్టుపక్కల ఎంక్వైరీ చేశాం. తోటి వ్యాపారులతో, కస్టమర్లతో కలుపుగోలుగా ఉండేవాడని చెప్పారు.
ఇంటి దగ్గర పరిస్థితి చూస్తే... ‘చీమకు కూడా హాని తలపెట్టని నా బిడ్డను చంపే అవసరం ఎవరికుంటుంది సార్...’ అంటూ అతని తల్లి పోలీసుల చొక్కాపట్టుకుని రోదించింది. భార్య సంగతీ అంతే. తనతో భర్త ఎలాంటి విషయాలు చెప్పలేదంది. రెండురోజులుగా కొద్దిగా ఆందోళనగా ఉన్నట్టు చెప్పిందంతే. పోనీ ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు అక్కడ ఎవరితోనైనా గొడవపడేవాడా? గత మూడునాలుగేళ్లలో పాతబస్తీ వదిలి ఎక్కడికీ వెళ్లలేదు.
నేను మరో రెండు టీమ్‌లను నా దగ్గర పెట్టుకుని ఫోన్‌కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. హతుడి ఇంటి దగ్గరున్న టీమ్ నుంచి కాల్ వచ్చింది. ‘ఎలాంటి క్లూ దొరకడం లేదు సార్... వచ్చేయమంటారా’ అని. ‘మీరు ఇల్లంతా మరోసారి వెదకండి. చిన్న కాగితం ముక్క కూడా వదలకండి. అక్కడగానీ క్లూ దొరకకపోతే... ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం’ అని చెప్పాను. నా దృష్టిలో హత్యజరిగిన ఫస్ట్ అవర్ చాలా కీలకమైంది. ఆ సమయంలోనే చాలావరకూ విషయం తెలిసిపోవాలి. లేదంటే... సమయం చేతిలో మేం కీలుబొమ్మలం కావాల్సిందే.
12:00 గంటలకు...
ఓ అరగంట తర్వాత ఫోన్ మోగింది. ‘గోడపైన క్యాలెండర్‌లో మూడు తేదీలు పెన్నుతో రౌండప్ చేసి ఉన్నాయి సార్... దానికి ముందు నెలలో కూడా అవే తేదీల్లో అలాగే రౌండప్ చేసి ఉంది. తేదీలకింద ఒకే రకమైన బండి నంబర్ నోట్ చేసి ఉంది’ అని చెప్పాడు ఎస్‌ఐ. నాకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. కేసు కీలక మలుపు తిరిగిందనుకున్నాను. వెంటనే నేను మరో టీమ్‌కి ఆ బండి నంబర్ ఇచ్చి ఆర్టీఏ ఆఫీసుకి పంపించాను.
1:00 గంటకు...
ఆ బండికలవాడి అడ్రసు పట్టుకున్నారు మా వాళ్లు. ఆ వస్త్రవ్యాపారి ఉన్న ప్రాంతంలోనే కొద్దిదూరంలో అతని అడ్రసు. ఇంటికెళితే అతను లేడు. తల్లి ఉంది. ‘అబ్బా... ఏం సతాయిస్తరు. మీకు రోజు మామూలు ఇవ్వాలా నా బిడ్డ’ అంటూ పోలీసుల్ని తిట్టడం మొదలుపెట్టింది. ఆ సందులో నలుగురితో మాట్లాడితే ఆ బండికలవాడు కిరాయి హంతకుడని, లోకల్ పోలీసులకు లంచం ఇచ్చుకుంటూ బతికేస్తాడని చెప్పారు. అప్పటికే అతనిపై బోలెడన్ని కేసులున్నాయి. బెయిల్‌పై బయటికి వచ్చినపుడు ఇలాంటి పనులకు పాల్పడుతుంటాడు. పోలీసులు గద్దించి అడగడంతో తన చెల్లెలు ఇంటిదగ్గర ఉన్నట్లు చెప్పింది.
2:00 గంటలకు...
బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12 దగ్గర మహ్మదీయలైన్స్ స్లమ్ ఏరియా. అన్నీ చిన్న చిన్న ఇళ్లు. మావాళ్లు సివిల్‌డ్రెస్‌లో హంతకుడి స్నేహితుల్ని వెంటబెట్టుకుని వెళ్లారు. తలుపు తట్టారు. ఎవరూ పలకలేదు. ఒక్కసారిగా లోపలికి చొరబడ్డారు. హంతకుడు బాత్‌రూమ్‌లో చేతులూ కాళ్లు కడుక్కుంటున్నాడు. అతని చేతుల రక్తపు మరకలు ఇంకా వదల్లేదు. ‘రెడ్ హ్యాండెడ్’గా పట్టుకోవడం అంటారు కదా! అంటే ఎర్రటిరక్తపు చేతుల్ని పట్టుకోవడం అన్నమాట.
అదే జరిగింది ఇక్కడ. వెంటనే అతని చేతికున్న బ్లడ్ శాంపిల్స్‌ని తీసుకున్నారు. వ్యాపారి రక్తంతో మ్యాచ్ అయ్యింది. అతని చేతులకు బేడీలు వేశాక హంతకుడన్న మాటలు మా టీమ్ ఎప్పటికీ మరచిపోలేదు. ‘మీరు పోలీసులా, సైతాన్లా... మీకెలా తెలిసింది నేనే చంపానని. పోలీసులకు దొరికిపోతానని తెలుసు. కానీ ఇలా రక్తపు చేతుల్తో పట్టుపడతానని ఊహించలేదు’.
ఉదయం పదిన్నరకు హత్య జరిగితే మధ్యాహ్నం రెండున్నరకు హంతుకుడ్ని పట్టుకున్నాం. చనిపోయిన వ్యక్తికి ఎలాంటి శత్రువర్గం కానీ, హంతకుల జాడ కనిపెట్టగలిగే ఆధారం కానీ లేని పరిస్థితుల్లో గంటల్లో కేసుని చేధించినందుకు డిపార్టుమెంటు తరఫు నుంచే కాకుండా ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి కూడా మంచి ప్రశంసలు అందాయి.
ఎందుకు చంపినట్టు?
ఇంతకీ హత్య వెనక ఎవరున్నారని అడిగిన వెంటనే చెప్పలేదు. మాదైన పద్ధతిలో ఇంటరాగేషన్ చేశాక చెప్పాడు. వ్యాపారి తమ్ముడే హత్య సూత్రధారి. హంతకుడు దొరికిన విషయం చెప్పకుండా వ్యాపారి ఇంటికి వెళ్లారు మావాళ్లు. తల్లిపక్కన కూర్చుని ఏడుస్తున్నాడు ఆ తమ్ముడు. చిన్న పని అని చెప్పి స్టేషన్‌కి తీసుకొచ్చి విచారిస్తే అసలు విషయం బయటపెట్టాడు. ‘‘మా అన్నయ్య పిసినారి సార్... బైక్ కావాలని నాలుగేళ్ల నుంచి బతిమిలాడుతున్నాను. స్నేహితులతో సరదాగా గడిపితే ఇష్టపడడు. డబ్బుల విషయంలో నరకం చూపిస్తున్నాడు. అందుకే మా పక్కవీధి కిరాయి రౌడీతో పదివేలకు డీల్ కుదుర్చుకున్నాను’’.
హత్యచేసినవాడికి, చేయించినవాడికి ఇద్దరికీ జీవితఖైదు శిక్ష పడింది. క్యాలెండర్‌పై వ్యాపారి రౌండప్ చేసుకున్న మూడు తేదీలు బాగా ఉపయోగపడ్డాయి. ఆయా రోజుల్లో ఆ బండి తనను వెంబడించిందని అర్థం కావొచ్చు. పాపం అమాయకుడు ఎవరితో చెప్పకుండా క్యాలెండర్‌పై నోట్ చేసుకుని ఊరుకున్నాడు. మొత్తానికి ఒక్కరోజులో హంతకుడి చేతులకు బేడీలు వేసినందుకు నేనూ... మా టీమ్ ఊపిరి పీల్చుకున్నాం.
రిపోర్టింగ్: భువనేశ్వరి