Best Case
-
చేజ్ చేసి పట్టుకున్నాం...
బెస్ట్‌కేస్ అపాయంలో ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడినప్పుడు తన కళ్లలోని ఆనందం కంటే అతని తల్లి తెలిపే కృతజ్ఞత ఎలాంటివారి హృదయాన్నైనా కదిలిస్తుంది. 2004 లో విజయనగరం ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటను నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఆ కేసు దర్యాప్తు సంగతి అలా ఉంచితే కన్నకొడుకుని ప్రాణాలతో ఆమెకు అప్పగించినపుడు ఆ తల్లికార్చిన ఆనందబాష్పాలు నా కళ్లను కూడా తడిపాయి. ఒకరోజు పొద్దున పదకొండు గంటలకు ఒరిస్సా పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. విజయనగరం -ఒరిస్సా సరిహద్దులో ఓ కిడ్నాప్ జరిగింది. కిడ్నాప్‌కి గురైంది ఒరిస్సాకి చెందిన ఓ నగలవ్యాపారి కుమారుడు. వయసు 22 ఉంటుంది. కిడ్నాపర్లు విజయనగరానికి చెందినవాళ్లు. బ్లాక్మెయిల్... ఒకపక్క వ్యాపారి కొడుకుని క్షేమంగా అప్పగించాలంటే మాకు పెద్దమొత్తంలో డబ్బు కావాలంటూ బ్లాక్మెయిల్ కాల్స్ వస్తున్నాయి. మరో పక్క మీ పరిధిలో జరిగిన సంఘటన దర్యాప్తు ముమ్మరం చేయండంటూ ఒరిస్సా పోలీసుల ఒత్తిడి. వ్యాపారి ఫొటో పంపించారు. అన్ని చెక్‌పోస్టులకు అనుమానితులను చెక్ చేయమంటూ మెసేజ్ పంపించాను. రోజు గడిచింది గానీ పాజిటివ్ మెసేజ్ రాలేదు. పసిబిడ్డ తండ్రి... కిడ్నాప్‌కి గురైన వ్యాపారికి ఏడాదిన్నరక్రితం పెళ్లయింది. మూడు నెలల పసి బిడ్డ ఉన్నాడు. బాధితుడు తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. తల్లిదండ్రులు, భార్యా ఆవేదన గురించి చెబుతూ ఒరిస్సా పోలీసులు మమ్మల్ని చాలా టెన్షన్ పెడుతున్నారు. ఓ గుడిసెలో... మా గాలింపుల విషయం తెలుసుకున్న దుండగులు తప్పించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒరిస్సా - విజయనగరం సరిహద్దులో హైవేకి ఆనుకుని ఉన్న వ్యవసాయ పొలంలోని గుడిసెలో దాక్కున్నట్టు సమాచారం అందింది. వెంటనే మా వాళ్లు మారువేషాల్లో దుండగులు ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. ఆ విషయాన్ని కూడా పసిగట్టిన దుండగులు అక్కడి నుంచి సుమోలో పారిపోయారు. ఎటువైపు వెళ్లారో తెలుసుకుని ఆ వైపు ఉన్న అన్ని చెక్‌పోస్టులకు వెహికల్స్‌ని స్ట్రిక్ట్‌గా చెక్ చేయమని చెప్పాను. హైవేలలో నిఘా పెట్టాం. 80 కిలోమీటర్లు.... దుండగుల వాహనాన్ని వెంబడిస్తూ దాదాపు ఎనైభై కిలోమీటర్ల దూరం మా టీమ్ వేట సాగింది. ‘రెండు రోజుల్లో మేం చెప్పిన చోటుకు అడిగిన సొమ్ము పంపించకపోతే అక్కడ మీ అబ్బాయి శవం దొరుకుతుంది’ అంటూ దుండగులు వ్యాపారి తండ్రికి చెప్పిన మాట నాకు పదే పదే గుర్తొస్తోంది. ఎట్టకేలకు వంద అడుగుల దూరంలో దుండగుల బండి ఉందనగా సుమోలో నుంచి ఒక దుండగుడు గన్ చూపించాడు. వెంటనే మా వాళ్లు బండి స్పీడు తగ్గించి నాకు ఫోన్ చేశారు. అంటే దానర్థం వెనక్కి వెళ్లిపొమ్మనా, వ్యాపారిని చంపేస్తారనా? అర్థంకాలేదు. వెంబడించాలా...వెనక్కి రావాలా? అంటూ మావాళ్లు నన్ను అడిగిన ప్రశ్నకు తడుముకోకుండా నేను చెప్పిన సమాధానం... వెంబడించి దుండగుల్ని పట్టుకోమని. మావాళ్లు స్పీడు పెంచి దుండగుల బండిని ఓవర్టేక్ చేశారు. ఎలాంటి ఫైరింగ్ చేయకుండా వాళ్లను పట్టుకున్నారు. ఆ తల్లి కళ్లలో... సుమో వెనకసీట్లో ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కూర్చున్న వ్యాపారి సురక్షితంగా కనిపించడంతో మావాళ్ల ఆనందానికి అవధుల్లేవు. నేను వెళ్లి అతనికి షేక్‌హ్యాండ్ ఇచ్చినపుడు ‘బతుకుతాననుకోలేదు మేడమ్’ అంటూ చేతులు జోడించాడు. ఇంతలో అతని తల్లిదండ్రులు, భార్యాబిడ్డా అందరూ మా పోలీస్‌స్టేషన్‌కి చేరుకున్నారు. అప్పటికి అతను కిడ్నాప్‌కి గురయ్యి రెండురోజులైంది. ఆ రెండు రోజులూ కూడా తల్లిదండ్రులు, భార్య పచ్చి మంచినీళ్లు ముట్టలేదట. అందరూ ఏడ్చి ఏడ్చి ఎర్రబడ్డ మొహాలతో ఉన్నారు. వ్యాపారి తల్లి నా చేతులు పట్టుకుని ‘నీ రుణం తీర్చుకోలేను తల్లీ....’ అంటూ ఒరిస్సా భాషలో తన పరిస్థితిని, సంతోషాన్ని పంచుకుంది. వ్యాపారి తన మూడు నెలల బిడ్డని చేతుల్లోకి తీసుకుని ముద్దాడాడు. ఏ భార్య అయినా ఏం చేస్తుంది? రెప్పార్పకుండా భర్తని కంటినిండా చూసుకుంది. ఇంతలో వెంట తెచ్చుకున్న ఆహారమేదో బిడ్డకు తినిపించిందా తల్లి. ప్రెజెంటేషన్: భువనేశ్వరి -
నానమ్మ మిస్సింగ్ కాస్తా...
బెస్ట్ కేస్ నేను కరీంనగర్ జగిత్యాల ఎఎస్పిగా పనిచేస్తున్న సమయంలో ఛేదించిన ఒక కేసు నాకు బాగా గుర్తుండిపోయే కేసుల్లో ఒకటి. ధర్మపురి పోలీస్‌స్టేషన్‌కి ఓ ఇరవైఏళ్ల కుర్రాడొచ్చి వాళ్ల నానమ్మ కనిపించడంలేదని చెప్పాడు. వెంటనే మావాళ్లు ఆ అబ్బాయి గ్రామానికి వెళ్లి వెతకడం మొదలుపెట్టారు. ‘పొద్దునే పెన్షన్ తీసుకుంటానంటే మండలాఫీస్ దగ్గర దించి ఇంటికొచ్చాను. గంట తర్వాత వెళ్లి చూస్తే అక్కడ మా నానమ్మలేదు’ అని ఆ అబ్బాయి చెప్పిన మాటల్ని బట్టి... ఆ ముసలావిడ దారి తప్పి ఏటో వెళ్లిపోయి ఉంటుందనుకున్నాం. ధర్మపురి మండల పరిధిలో చాలా గ్రామాలున్నాయి. అన్ని గ్రామాల్లో వెదికాం. ఆమె ఒంటిపై సొమ్ములు బాగానే ఉన్నాయని చెప్పారు. ఒకవేళ దొంగలెవరైనా ఆమెను కిడ్నాప్ చేసి సొమ్ము దోచుకున్నారేమోనని అనుమానించాం. ఆ దిశగా కూడా పరిశోధన చేశాం. ఎక్కడా వివరాలు దొరకలేదు. రెండు రోజుల తర్వాత... నానమ్మ కనిపించడం లేదని ఈ కుర్రాడు, అతని తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. వారికేం సమాధానం చెప్పాలో అర్థం కావడంలేదు. మరో పక్క ‘ఈ పోలీసులు పెద్దావిడ జాడ కనిపెట్టలేరా?’ అంటూ ఊరివాళ్ల గోల. ఇంతలో ఊరికి నాలుగు కిలోమీటర్ల దూరంలో తుప్పల్లో ఒక ముసలావిడ శవం ఉందని కబురొచ్చింది. మావాళ్లు హుటాహుటిన వెళ్లి చూస్తే బాడీ బాగా పాడైపోయింది. తలకు బలమైన గాయం అయిన ఆనవాళ్లు ఉన్నాయి. ఒక కాలికి చెప్పు ఉంది, మరో చెప్పు నాలుగు అడుగుల దూరంలో పడి ఉంది. అంతకు మించిన వివరాలు గానీ, ఆధారాలు గానీ దొరకలేదు. విషయం పెద్దావిడ ఇంట్లో తెలియగానే కుటుంబం మొత్తం ఘొల్లుమంది. సొమ్ముల కోసమే... హత్య జరిగిన స్థలంలో ఆ పెద్దావిడ శవాన్ని చూడగానే అర్థమైంది అది ‘మర్డర్ ఫర్ గెయిన్’ కేస్ అని. చెవి కమ్మ తీయడం రాలేదేమో హంతకుడు క్రూరంగా చెవిని కూడా కోసేశాడు. సొమ్ములకోసం అంత పెద్ద వయసున్న మహిళ అని కూడా చూడకుండా క్రూరంగా పొట్టన పెట్టుకున్నారని ఆ ఊరివాళ్లంతా బాధపడ్డారు. నాక్కూడ చాలా బాధేసింది. అప్పటివరకూ మిస్సింగ్ కేసుగా ఉన్నదల్లా మర్డర్ కేసైపోయింది. వెంటనే మా క్రైమ్‌టీమ్ రంగంలోకి దిగింది. అన్ని రకాలుగా పరిశోధన మొదలుపెట్టాం. ముందుగా ఆ చుట్టుపక్కల డబ్బులకోసం దాడులు చేసే దొంగలపైనా నిఘా పెట్టాం. అప్పటికే అలాంటి కేసులున్నవారిని స్టేషన్‌కి తీసుకొచ్చి విచారించాం. ఎక్కడా వివరాలు దొరకలేదు. దొంగలపని కాదు... రెగ్యులర్ దొంగలు చేసిన పని కాదని తెలిసాక మా దృష్టిని ఊళ్లో వారిపై పెట్టాం. రోజులు గడుస్తున్నాయి కానీ ఎక్కడా ఎలాంటి సమాచారం దొరకడం లేదు. ‘బంగారం కోసం ముసలావిడను హత్యచేశారంట’ అనే వార్త చుట్టుపక్కల మండలాల్లో సంచలనంలా మారింది. ఒంటిమీద సొమ్ములుండగా ఒంటరిగా ప్రయాణం చేయడం ప్రమాదమంటూ మహిళలంతా ఆందోళన పడసాగారు. మరోపక్క వార్తాపత్రికల్లో పల్లెల్లో భద్రత లేదంటూ కథనాలు. ఇంతలో ఆ పెద్దావిడ మనవడు బండి కొన్నాడన్న విషయం తెలిసింది. మాకు తెలిసిన వివరాల మేరకు ఆ అబ్బాయికి ఉద్యోగం లేదు. తల్లిదండ్రులు కూడా అతనికి డబ్బులివ్వరు. అలాంటిది ఉన్నట్టుండి బండెక్కడి నుంచి వచ్చిందని ఆరా తీస్తే నా స్నేహితుడి దగ్గర అప్పు తీసుకున్నానంటూ ఏవో కబుర్లు చెప్పాడు. మాకు మొదటి నుంచి ఆ అబ్బాయి చెప్పే మాటలు వాస్తవం కావనిపించేవి. స్నేహితుల సాయంతో... ఎందుకైనా మంచిదని స్నేహితుల్ని తీసుకొచ్చి విచారించాం. ఒకబ్బాయి ‘ఎప్పుడూ వంద రూపాయలు కూడా ఎరుగనివాడు ఈ మధ్య బాగానే ఖర్చుపెడుతున్నాడు’ అని చెప్పాడు. ఇక లాభం లేదని ఆ మనవడిపై నిఘా పెట్టాను. అలాగే ఊళ్లో ఉన్న మా ఇన్ఫార్మర్ల సాయం కూడా తీసుకున్నాం. మా అనుమానం నిజమైంది. ‘ఈ మధ్యనే అతను మంచిర్యాలలో ఉన్న బంగారం దుకాణానికి వెళ్లి డబ్బు తెచ్చుకున్నాడు. ఆ సమయంలో నన్ను కూడా తీసుకెళ్లాడు’ అని అతని మరో స్నేహితుడు చెప్పిన వివరాల ఆధారంగా ఎంక్వైరీ చేయిస్తే అక్కడ ఇతను ఏవో బంగారు వస్తువుల్ని అమ్మినట్టు తెలిసింది. అలాగే పెద్దావిడను మండల కార్యాలయం దగ్గర వదిలిపెట్టిన విషయం కూడా వాస్తం కాదని తేలింది. పక్కా ఆధారాలతో... పెద్దావిడ మనవడు చెప్పిన విషయాలన్ని నమ్మినట్టే నమ్మి అతనిపై చేసిన పరిశోధన ఫలితాలు మాకు పక్కా ఆధారాలను చూపించాయి. వాటన్నింటిని చేతిలో పెట్టుకుని ఆ అబ్బాయిని స్టేషన్‌కి పిలిపించకుని విచారణ చేశాను. ముందు కాదన్నా... తర్వాత నిజం ఒప్పుకున్నాడు. నానమ్మ ఒంటిపై ఉన్న బంగారం కోసమే ఆమెను హత్యచేసినట్టు అంగీకరించాడు. నోటిమాట సరిపోదు కదా! ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో కారణాల దగ్గర నుంచి సంఘటనా స్థలంలో హత్యకు ఉపయోగించిన వస్తువుల వరకూ అన్నింటినీ రికార్డు చేశాం. హత్య చేసింది మనవడేనన్నందుకు మా దగ్గర ముఖ్య ఆధారం అతని సెల్‌ఫోన్ డేటా. ‘నేను ఫలానా సమయంలో మా నానమ్మను మండల కార్యాలయం దగ్గర దించాను’ అని అతను చెప్పిన సమయంలో అతను ఊరి పొలిమేరల్లోనే ఉన్నట్టు అతని సెల్‌ఫోన్ ఏరియా సిగ్నల్స్ చెప్పాయి. దాంతోపాటు చివరిసారిగా ముసలావిడను మనవడి బండిపై చూసిన సాక్షుల వివరాల ప్రకారం అతను చెప్పిన విషయాలన్ని నిజం కాదని అర్థమైంది. అప్పుడు అతడు వాడింది స్నేహితుడి బైక్. 25రోజులు... మిస్సింగ్ కేసుతో మొదలై మర్డర్ కేసుగా బయటపడ్డ ఈ కేసులో హంతకుడు ఇంటి మనిషే అని తేల్చడానికి మాకు 25 రోజుల సమయం పట్టింది. మర్డర్ కేసుల్లో నిందితుడు బయటివాడైతే కేసు త్వరగా కొలిక్కి వస్తుంది. అదే ఇంటివారైతే చాలా సమయం వృథా అయిపోతుంది. ఎందుకంటే అనుమానించడానికి ఆధారాలు త్వరగా దొరకవు. ఈ కేసులో చూశారుగా... హంతకుడే స్టేషన్‌కి వచ్చి ఫిర్యాదు ఇచ్చాడు. అంతేనా... నాయనమ్మపై ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తూ మాపైన ఒత్తిడి తెస్తూ వారి పేర్లు వీరి పేర్లు చెబుతూ మమ్మల్ని అయోమయానికి గురిచేసే ప్రయత్నం కూడా చేశాడు. జల్సాలకు అలవాటు పడి సొంత నాయనమ్మనే అత్యంత కూర్రంగా హత్య చేసిన వ్యక్తి మా కళ్లెదురుగా ఉన్నా అతనే హంతకుడిని నిర్ధారణకు రావడానికి మాకు ఇంత సమయం పట్టింది. కొన్ని కేసుల్లో అయితే నెలలు, సంవత్సరాలు కూడా గడిచిపోతుంటాయి. ఏడేళ్ల శిక్ష... అన్ని ఆధారాలతో కేసు ఫైల్ చేసి కోర్టుకి అప్పగించాం. ఇంత జరిగినా ఆ పెద్దావిడ ఇంట్లోవాళ్లు మాత్రం మనవడికి ఏ పాపం తెలియదంటారు. ఎవరో దుండగులు చేసిన పని అంటారు. కోర్టులో హంతకుడికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ప్రెజెంటేషన్: భువనేశ్వరి ఫొటో: రాజేశ్‌రెడ్డి -
ఉతికిన ఆ తెల్లచొక్కా...
బెస్ట్ కేస్ విజయవాడలో ఏఎస్పీగా చేరిన కొత్తలో నాకు అంతా కొత్తగానే ఉండేది. ముఖ్యంగా గ్రామాల్లో వాతావరణం! మనుషులు అలవాటు పడటానికి సమయం పడుతుంది కదా! విజయవాడలోని నందిగామ గ్రామంలో 1975లో జరిగిన ఆ సంఘటన... నెల కూడా గుర్తుంది... సెప్టెంబర్. ఒకరోజు సాయంత్రం ఆరుగంటలకు ఓ ఇద్దరు కుర్రాళ్లు పోలీస్ స్టేషన్‌కి వచ్చారు. అందులో ఒకతను ‘మా అమ్మను ఎవరో చంపేశారు’ అంటూ ఆయాసపడుతూ చెప్పాడు. సంఘటనా స్థలానికి వెళ్లి చూస్తే గుడిసెలో 45 ఏళ్ల మహిళ మృతదేహం రక్తపుమడుగులో పడివుంది. భర్త లేడు. ఒక్కడే కొడుకు. అతనికి పెళ్లయింది. ఎవరో ఆ మహిళని చెంబుతో తలమీద మోది చంపేశారు. వెంటనే జాగిలాలను రప్పించాను. అవి గుడిసెలో నుంచి బయటకి వచ్చి ఊళ్లోకి వెళ్లాయి. అక్కడ కొంతదూరం వెళ్లాక ఆగిపోయాయి. ఆ పరిసరాల్లోనే మృతురాలి కొడుకు స్నేహితుడి ఇల్లు ఉన్నట్టు అక్కడివారు చెప్పారు. జోస్యం కోసం... ‘‘నేను, నా భార్య, నా స్నేహితుడు, అతని భార్య... అందరం కలిసి సినిమాకి వెళ్లాం సార్. తిరిగొచ్చిచూస్తే అమ్మ ఇలా శవమై కనిపించింది’’ అంటూ బోరుమన్న పాతికేళ్ల కొడుకుని ఓదార్చి విచారణ మొదలుపెట్టాం. ముందుగా మృతురాలి వివరాలు సేకరించాం. ఆమె మంత్రతంత్రాలు తెలిసిన మహిళ. ఆ గ్రామం వాళ్లే కాదు, చుట్టుపక్కల ఊళ్లవాళ్లు కూడా ఏ చిన్న సమస్య ఉన్నా ఆమె దగ్గరికి వచ్చేవారు. కడుపులో నొప్పి నుంచి మొదలుపెట్టి, తప్పిపోయిన పశువుల ఆచూకీ వరకు అన్నింటికీ ఆమెను సంప్రదించేవారు. ఆమె మంత్రమో, అంజనమో వేసి వాళ్లకు పరిష్కారాలు సూచిస్తుందన్నమాట. పల్లెటూళ్లలో ఇలాంటివారుండటం సహజమే కదా! రోజూ ఆమెను కలవడానికి చాలామంది వచ్చేవారు. ఆమెకు ఎవరితోనైనా తగాదాలున్నాయోమోనని ఆరా తీస్తే అలాంటివేమీ లేవని తేలింది. గుడిసెలో అణువణువూ గాలించడం మొదలుపెట్టాం. ఎక్కడా చిన్న క్లూ కూడా దొరకలేదు. ఆమెపై దాడికి ఉపయోగించిన చెంబుపై వేలిముద్రలు కూడా దొరకలేదు. హంతకుడు చాలా జాగ్రత్తపడ్డాడు. అయితే ఇంట్లో కొన్ని విలువైన వస్తువులు కనిపించడం లేదని చెప్పాడు కొడుకు. ముఖ్యంగా తల్లి మెడలోని బంగారు గొలుసు! ఆ పెట్టె లోపల... గుడిసెలో ఒక మూలన చాలా పాత ఇనప్పెట్టె ఒకటి కనిపించింది. దానికి తాళం వేసి ఉంది. తాళం గురించి అడిగితే మృతురాలి కొడుకు ‘ఏమో తెలియ’దంటూ అమాయకంగా మొహం పెట్టాడు. ఎందుకో అతని సమాధానం కరెక్టు కాదని అనిపించింది నాకు. లాభం లేదని పెట్టెని పగలగొట్టాం. అందులో ఏమీ లేదు. ఒక తెల్లని చొక్కాగుడ్డ ఉంది. చూడ్డానికి చాలా కొత్తగా ఉంది. విప్పి చూస్తే అక్కడక్కడా చిన్న చిన్న రక్తపు మరకలు కనిపించాయి. ‘ఏంటి’వని అడిగితే ఆమె కొడుకు నాకు తెలియదంటాడు. అతని స్నేహితుణ్ణి పిలిచి అడిగినా అదే సమాధానం చెప్పాడు. హంతకుడు మాకోసం వదిలిన క్లూ మాత్రం అదేనని నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. దానిపైనే దృష్టి పెట్టాను. ఒక టీమ్‌ని ఆ ప్రాంతంలోని బట్టల షాపుల వివరాలు కనుక్కురమ్మని పంపాను. ఆ ఫొటో వెనక... ఆ ప్రాంతంలో మొత్తం మూడే మూడు బట్టల షాపులున్నాయి. వాళ్లకి ఈ క్లాత్‌ని చూపించాం. దాన్ని అమ్మిన షాపు దొరికింది. వారికి మృతురాలి కొడుకు ఫొటో చూపించగానే ‘ఇతనే సార్, నెలరోజుల కిందట వచ్చి పెళ్లి కోసమని నాలుగైదు షర్టు పీసులు కొనుక్కెళ్లాడు’ అని చెప్పారు. నా అనుమానం బలపడింది. తిరిగి గుడిసె దగ్గరికి వెళ్లి మరింత పరిశీలనగా చూస్తే దండెంపై ఆరేసి ఉన్న తెల్లచొక్కాకి అక్కడక్కడా ఆరెంజ్ రంగు మరకలున్నట్టు కనిపించింది. దాన్ని వెంటనే ఫొరెన్సిక్ ల్యాబ్‌కి పంపిస్తే చొక్కాపై రక్తపు మరకలు పడ్డట్టూ, దాన్ని శుభ్రం చేయడానికి ప్రయత్నించినట్టూ చెప్పారు. విచారణలో భాగంగా మా జాగిలాలు వెళ్లిన అతని స్నేహితుడి ఇంటికి కూడా వెళ్లి అంతా సోదా చేస్తే ఆ ఇంట్లో గోడకు తగిలించిన దేవుడి పటం వెనక మృతురాలి గొలుసు దొరికింది. ఇక దొరికిన సాక్ష్యాలు చాలని చెప్పి... మృతురాలి కొడుకుని స్టేషన్‌కి తీసుకెళ్లి విచారిస్తే విషయం బయటపడింది. కన్నతల్లిని తానే స్వయంగా హత్య చేసిన వైనం చెప్పుకొచ్చాడు. అక్రమ సంబంధం... ఎప్పుడూ వెంట తిరిగే తన స్నేహితుడికీ, తల్లికీ అక్రమ సంబంధం ఉన్నట్టు అప్పటికి నెలరోజుల క్రితం బయటపడింది. తన పెళ్లయితే తల్లి ప్రవర్తన మారుతుంది కదా అని ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. అయినా ఎలాంటి మార్పూ రాలేదు. స్నేహితుణ్ణి మందలించి అతణ్ణి కూడా పెళ్లిచేసుకోమని చెప్పి దగ్గరుండి పెళ్లి చేశాడు. ఒకరోజు తల్లి ఇతని స్నేహితుడితో గొడవకు దిగింది. ‘నాతో నీకు సంబంధం ఉండగా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? నీకు తెలియదా నాకున్న మంత్రశక్తుల గురించి. నిన్నూ, నీ భార్యనూ బూడిద చేసేస్తాను...’ అంటూ తల్లి... స్నేహితుడిపై విరుచుకు పడుతుండగా కొడుకు ఎదురుపడి తల్లిని నిలదీశాడు. దాంతో కొడుకుని కూడా అదేవిధంగా బెదిరించడం మొదలుపెట్టింది. తల్లి ప్రవర్తనతో విసిగిపోయిన కొడుకు, అతని స్నేహితుడు ఒకరోజు సాయంత్రం ఆమెను హతమార్చారు. ఇదీ విషయం. చనిపోయిన వ్యక్తి మంత్రగత్తె కావడంవల్లనేమో తెల్లవారే సరికి గ్రామస్తులంతా ఆమె గుడిసెముందు, మా పోలీస్టేషన్ ముందు ఉండేవారు. ‘సార్, హంతకుడు దొరికాడా... దొరికాడా...’ అంటూ అడుగుతుండేవారు. అలాగని విచారణకు ఏమైనా సాయం చేస్తారా అంటే ఏమడిగినా తెలియదని చెప్పేవారు. తక్కువ సమయంలో... నాకేమో అక్కడి వాతావరణం కొత్త. పల్లె ప్రజల పద్ధతులు, నమ్మకాల గురించి పెద్దగా అవగాహన లేకపోయినా ఇలాంటి కేసుని నాలుగురోజుల్లో విజయవంతంగా చేధించినందుకు మా పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. రిపోర్టింగ్: భువనేశ్వరి ఫొటో: రాజేశ్ -
ఆర్మీపై గూర్ఖా తుపాకి
బెస్ట్ కేస్ మాజీ డీజీపీ హెచ్.జె దొర చెప్పిన రియల్ క్రైమ్ స్టోరీ కమిషనర్ అబ్దుల్ సలాంఖాన్ ఆదివారం తనతోపాటు సరదాగా రేస్కోర్సుకి రమ్మని పిలిచారు. పొద్దున్నే రెడీ అవుతున్నాను. ఇంతలో బయట జీపులో వైర్లెస్ మెసేజ్ చెవిలో పడింది. ‘గూర్ఖా ఫైరింగ్... పాయగా పాలెస్’ అని వినపడగానే పరుగున జీపెక్కాను. పాయగా పాలెస్ ఆర్మీ ఉద్యోగుల కార్యాలయం. చాలా పెద్ద భవంతి. ప్రస్తుతం బేగంపేటలో ఉన్న కంట్రీక్లబ్, అమెరికన్ కాన్సులేట్ ఆఫీస్ ఉన్నవి దాని ప్రాంగణంలోనే. అప్పుడు నేను డిప్యూటీ కమిషనర్‌గా ఉన్నాను. సంఘటనా స్థలానికి చేరుకునేటప్పటికే లోకల్ పోలీసులంతా గుమిగూడారు. విషయం కమిషనర్గారికీ తెలిసింది. ఆ ప్రాంతం సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఏసీపీ, ఇన్స్పెక్టర్, సీఐ ఏం చేయాలో తోచక కంగారు పడుతున్నారు. జీతం కోసం! పాయగా పాలెస్ నిజాంకాలంనాటి భవంతి. నిజాం ఇంటివారు కేవలం పాయగా పాలెస్‌కి చెందినవారితోనే పెళ్లి సంబంధం అందుకునేవారట. ఆ పాలెస్ తలుపులు ఏడెనిమిది అడుగుల పొడవుండేవి. ఏసీపీ నాకెదురొచ్చి... ‘‘సార్, ఇక్కడ భవంతికి కాపలా ఉంటున్న గూర్ఖా... మేజర్‌పై కాల్పులు జరిపి, పైన మేడపైకి వెళ్లిపోయాడు. అతన్ని పట్టుకోడానికి వెళదామంటే పై మెట్లపై నుంచి కాలుస్తానని బెదిరిస్తున్నాడు. మేం ఎప్పుడూ ఈ భవంతిలోకి వెళ్లలేదు. అతన్ని ఎలా పట్టుకోవాలో తెలియడం లేదు. పైన అంతస్థులో పదుల సంఖ్యలో ఆర్మీ సిబ్బంది ఉన్నారు. వారంతా తలుపులు మూసుకుని లోపలే ఉన్నారు. ఎవ్వరినీ బయటికి రావొద్దని చెప్పాం...’’ అంటూ వివరించాడు. మేజర్ని అప్పటికే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాపాలా ఉండే గూర్ఖా... కాల్పులు జరపడం ఏంటని ఆరా తీస్తే... తెల్లవారితే దసరా పండగ. శాలరీ అడ్వాన్స్ ఇవ్వనందుకు ఆర్మీ సిబ్బందితో గొడవపడ్డాడట. బయట ఉన్న మేజర్ లోపలికి వెళ్లి ఏంటని గట్టిగా గద్దించడంతో తుపాకి గురిపెట్టాడు. వారించినా వినకుండా మేజర్‌పై కాల్పులు జరిపి మెట్లెక్కి మేడపైకి వెళ్లిపోయాడు. ఇదీ విషయం! కొందరేమో జీతంకోసమే కాల్చాడంటున్నారు. ఇంకొందరు అతనికి మతిస్థిమితం లేదంటున్నారు. పొద్దున్నే తాగేసి వచ్చాడంటారు కొందరు. ఏదీ క్లారిటీ లేదు. ఆయుధపూజ కారణంగా... ఆర్మీ ఆఫీసర్లంటే పోలీసువారికన్నా స్ట్రాంగ్ కదా! వారి దగ్గర బోలెడన్ని ఆయుధాలుంటాయి. మరి ఒక గూర్ఖాకి బెదిరిపోయే పరిస్థితి ఎందుకొచ్చిందంటే... దసరా ముందురోజు కదా! ఆయుధపూజ కోసం వెపన్లన్నింటినీ శుభ్రం చేసి ఒక గదిలో పెట్టారట. దాంతో పై అంతస్థులో ఉన్న అధికారుల దగ్గర ఒక్క ఆయుధం కూడా లేకుండా పోయింది. కిందున్నవారి దగ్గర ఉన్నా... హంతకుడు పైన ఏ మూలన నక్కివున్నాడో తెలీదు. విషయాలన్నీ విన్న తర్వాత అయోమయంగా తోచింది. అంత పెద్ద అంతస్థులో పైకి వెళ్లడానికి ఒకే ఒక్క మెట్లమార్గం తప్ప మరే దారీ లేదు. నలుగురు పోలీసుల్ని వెంటేసుకుని గోడపైనుంచి పైకి ఎక్కడానికి ప్రయత్నించాను. లాభం లేకపోయింది. గూర్ఖా ఉన్న ప్రాంతంలోకి వెళ్లడం కుదరలేదు. ఇంతలో కమిషనర్‌గారు, ప్రెస్ అందరూ వచ్చేశారు. ప్రమాదంలో చిక్కుకున్నది ఆర్మీ అధికారులు కావడంతో నాక్కూడా ఒకింత భయం వేసింది. నా కింది ఆఫీసర్లకు చెప్పి వెంటనే ఫైర్ ఇంజన్ని రప్పించమని చెప్పాను. బాగా పొడవైన లాడర్ ఉన్న ఇంజన్ కావాలన్నాను. నా ఐడియా ఏంటంటే, ఆ నిచ్చెన సాయంతో పై అంతస్థులోకి ఎక్కొచ్చు కదా అని. ఫైర్ ఇంజన్ సాయంతో... మాయదారి గూర్ఖా మేడపై ఎక్కడ దాక్కున్నాడో తెలియడం లేదు. ఫైర్ ఇంజన్ రాగానే భవంతి ముందువైపు లాడర్ ఓపెన్ చేయించి సిద్ధంగా పెట్టుకున్నాను. వాడు చూస్తే ప్రమాదం... అందుకని లోపల మెట్లదగ్గర మా పోలీసువాళ్లని కొద్దిగా హడావిడి చేయమని చెప్పాను. దాంతో వాడు మెట్లదగ్గరే ఉండి వారిని బెదిరిస్తుంటాడు. ఈలోగా నేను లాడర్ సాయంతో పైకి ఎక్కొచ్చు కదా! వాడు ఇంజన్ వచ్చినట్టు గమనించివుంటే మాత్రం లాడర్పైకి ఎక్కినవారిని పిట్టని కాల్చినట్టు కాల్చేస్తాడు. అందుకని మా కింది సిబ్బంది నన్ను ఎక్కొద్దని వారించారు. నా భయమంతా పై అంతస్థులోని గదుల్లో చిక్కుకున్న ఆర్మీవారిపై హంతకుడు ఎక్కడ అటాక్ చేస్తాడోనని. ఇద్దరు కానిస్టేబుళ్లని ఇంజన్ దగ్గర నిలబెట్టాను. నేను పైకి ఎక్కుతున్నప్పుడు వాడుగాని నాపై ఫైర్ చేసే ప్రయత్నం చేస్తే వీళ్లని కూడా ఫైర్ ఓపెన్ చేయమన్నాను. నా మాటలు విని లోపలున్న ఆర్మీఅధికారులు తలుపులు తీసారు. ఆయుధం లేకపోతే ఆర్మీవారు మాత్రం ఏం చేయగలరు? వారి ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకుని కూర్చున్నారు. మ్యాప్ వేయించి... ఎలాగోలా పై అంతస్థు కారిడార్లోకి వెళ్లాను. అక్కడి నుంచి వాడున్న మేడపైకి ఎలా వెళ్లాలో దారి తెలియలేదు. ముందు కారిడార్‌లో ఉన్న డోర్ కొట్టాను. నా మాటలు విని లోపలున్న ఆర్మీ అధికారులు తలుపులు తీసారు. ఆయుధం లేకపోతే ఆర్మీవారు మాత్రం ఏం చేయగలరు? అతనున్న మేడపైకి ఎలా వెళ్లాలని అడిగితే... మ్యాప్ గీసి చూపించారు. నేను, నాతో ఇద్దరు పోలీసులు అతనున్నవైపుకి కదిలాం. అప్పుడు నోరు తెరిచాడు. తనవైపుకొస్తే కాల్చేస్తానని బెదిరిస్తున్నాడు. ఎల్ ఆకారంలో ఉన్న కారిడార్‌లో ఒకవైపునుండి అతన్ని బుజ్జగించడం మొదలుపెట్టాం. ‘మేం ఆర్మీ సిబ్బంది కాదు... నీ బాధ మాకు తెలుసు. నేపాలివాళ్లకి దసరా చాలా పెద్ద పండగ. ఆ రోజు డబ్బుల్లేకపోతే మిమ్మల్నే నమ్ముకున్న భార్యపిల్లలు చాలా ఇబ్బందిపడతారు. నీకు సమయానికి శాలరీ అడ్వాన్స్ ఇవ్వకపోవడం నిజంగా తప్పే. నువ్వు పగతోనో, మరో ఉద్దేశ్యంతోనో కాల్పులు జరపలేదు కదా. అయినా మేజర్‌కి పెద్దగా ఏం ప్రమాదం జరగలేదు. నువ్వు గన్ పడేసి లొంగిపో...’’ అంటూ నేనూ, నాతో ఉన్న పోలీసులూ హిందీలో నచ్చచెప్పడం మొదలుపెట్టాం. ఇంతలో మేజర్ చనిపోయినట్టు హాస్పిటల్ నుంచి కబురొచ్చింది. రెండున్నర గంటల తర్వాత, మా బుజ్జగింపు మాటల్ని నమ్మి గూర్ఖా నోరు తెరిచాడు. ‘మీరు గన్స్ కింద పడేస్తే... నేనూ పడేస్తాను’ అన్నాడు. తీరా మేం వెపన్స్ పడేశాక వాడు ఎదురుగా వచ్చి కాల్పులు జరిపితే పరిస్థితి ఏంటి? అతను చెప్పిన మాట వినడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. వెపన్స్ కింద పడేశాం. వాడూ పడేశాడు. ముందుకెళ్లి వాడ్ని పట్టుకుని కిందికి తెచ్చాం. ఇది జరిగి 42 ఏళ్లు(1972) అవుతోంది. జీవితఖైదు... నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. ఆ గుర్కా పేరు ధన్బహదూర్. ఎక్స్ ఆర్మీ ఆఫీసర్. నిజంగానే నేపాలివాళ్లకి దసరా పెద్ద పండగ. పైగా బతుకుతెరువుకి మన ప్రాంతానికొచ్చినవాళ్లు అప్పులు చేసి అవసరాలు తీర్చుకోరు. ఉన్నంతవరకూ నమ్మకంగా ఉంటారు. వారిని ఇబ్బందిపెడితే రియాక్షన్ కూడా అదేస్థాయిలో ఉంటుంది. అందరు ఆర్మీ అధికారులతో మాట్లాడాక తెలిసిందేమి టంటే ధన్బహదూర్ మంచివాడు. జీతం విషయంలో విసిగిపోయాడు. అడిగిన వెంటనే ఇవ్వడానికి అధికారులకు పూనే నుంచి ఆర్డర్ రావాలి. ఆ విషయాన్నే పదే పదే చెపుతుంటే వాడికి కోపం వచ్చింది. ఫ్రస్ట్రేషన్లో కాల్పులు జరిపాడు. అంతకు మించి కారణం దొరకలేదు. ఉత్త పుణ్యానికి మేజర్ బలైపోయాడు. గూర్ఖాకీ జీవితఖైదు శిక్ష పడింది. పండగ రేపనగా ఓ సైనికుడ్ని కోల్పోయాం. అయితే మరో ప్రమాదం జరక్కుండా గూర్ఖాని చాకచక్యంగా పట్టుకున్నందుకు అందరూ మెచ్చుకున్నారు. గ్యాలంటరీ మెడల్... అప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్న బ్రిగేడియర్ బాలచందర్ నా సాహసాన్ని చాలా అభినందించారు. మాటలతో ఊరుకోలేదు. నా సాహసం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అప్పటి ఐజి కళ్యాణరావుగారు నన్ను ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. నేను హంతకుడ్ని పట్టుకున్న విధానాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం నాకు గ్యాలంటరీ మెడల్ ప్రదానం చేసింది. ఆ మెడల్ అందుకున్న మొదటి ఐపీఎస్ నేనే. అంతా హ్యాపీయే కానీ మేజర్ మరణం గుర్తొచ్చినప్పుడు మాత్రం బాధేస్తుంది. రిపోర్టింగ్: భువనేశ్వరి ఫొటో: నోముల రాజేశ్‌రెడ్డి -
మధ్యాహ్నం హత్య
మాజీ డీజీపీ పేర్వారం రాములు చెప్పిన రియల్ క్రైమ్ స్టోరీ ‘‘ఉదయం పదకొండు గంటలకు కమిషనరేట్‌లో నా ఫోన్ మోగింది. హలో అనకుండానే అవతలివైపున పాతబస్తీ ఎస్ఐ హత్యవివరాలను హడావుడిగా చెప్పడం మొదలుపెట్టాడు. బెస్ట్ కేస్ పట్టపగలు... నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ వస్త్రవ్యాపారిని కత్తులతో పొడిచి హత్య చేశారు. పాతబస్తీలో నాలుగు రాళ్లు రువ్వుకుంటేనే గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అలాంటిది హత్య. వస్త్రవ్యాపారి హత్య అంటే ఆశ్చర్యపోవాల్సిన విషయమే. వాళ్లకి పెద్దగా శత్రువులుండే అవకాశం ఉండదు. ఉన్నా... ఇలా రోడ్డుపై తెగబడాల్సిన పనిలేదు. ఎవరో మతతత్వశక్తులు ఇలాంటిపనికి పూనుకున్నారేమోనని నా కింది ఆఫీసర్లు వారి ఊహల్ని వినిపిస్తున్నారు. సెన్సిటివ్ కేసు. ఎలాంటి అల్లర్లకు అవకాశం లేకుండా దర్యాప్తు జరగాలి. మరు నిమిషమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారి దగ్గర నుంచి ఫోన్. ‘ఏమయ్యా... మన నగరంలో అసలు పోలీసులున్నారా? పట్టపగలు రోడ్డుపైన హత్య చేస్తుంటే ఏంచేస్తున్నట్టు? రేపు సాయంత్రంలోగా హంతకుడ్ని పట్టుకోవాలి’ అంటూ ఆర్డరు. వెంటనే నేను నాలుగు టీమ్‌లను సిద్దం చేసుకుని ముందుగా సంఘటనా స్థలానికి వెళ్లాం. అప్పటికే వ్యాపారి చనిపోయాడు. ఉదయం 10:30 గంటలకు... ఆ రోజు పాతబస్తీ యథావిధిగా తెల్లవారింది. ఓ వస్త్రవ్యాపారి బేగంపేటలోని తన దుకాణానికి స్కూటర్‌పై బయలుదేరాడు. పురానాపూల్ బ్రిడ్జ్ ఎక్కాడు. బ్రిడ్జ్ కదా... బండి స్లోగా వెళుతోంది. ఇంతలో ఇద్దరు కుర్రాళ్లు ఓ బండిపై వచ్చి వ్యాపారి బండిని ఢీకొట్టారు. ఉన్నపళంగా కిందపడ్డ వ్యాపారి ‘కళ్లు కనపడడం లేదా...’ అంటూ అరవబోతుండగానే అందులో బాగా బలీయంగా ఉన్న వ్యక్తి చొక్కాలోనుంచి చాకు తీసి వ్యాపారి పొట్టలో నాలుగైదు పోట్లు పొడిచాడు. వాహనదారులంతా ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు. ఒక్కరు కూడా ముందుకొచ్చి హంతకుల్ని పట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఎవరో పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. మావాళ్లు వెళ్లేసరికి కొన ఊపిరితో ఉన్నాడు వ్యాపారి. దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. మార్గమధ్యంలోనే చనిపోయాడు. మృతుడి చొక్కాజేబులో ఉన్న వివరాల సాయంతో పాతబస్తీలో అతనున్న ఇంటికి చేరుకుంది మా టీమ్. 11:30 గంటలకు... చనిపోయిన వ్యాపారి మధ్యవయస్కుడు. భార్య, ఇద్దరు ప్లిలలు, తల్లి, తమ్ముడు ఉన్నారు. మధ్యతరగతి కుటుంబం. అందరూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. హతుడికి ఎవరైనా శత్రువులున్నారేమోనని ఆరా తీస్తే... అలాంటివారెవరూ లేరని తెలిసింది. ఆస్తితగాదాలు కూడా లేవు. దుకాణం చుట్టుపక్కల ఎంక్వైరీ చేశాం. తోటి వ్యాపారులతో, కస్టమర్లతో కలుపుగోలుగా ఉండేవాడని చెప్పారు. ఇంటి దగ్గర పరిస్థితి చూస్తే... ‘చీమకు కూడా హాని తలపెట్టని నా బిడ్డను చంపే అవసరం ఎవరికుంటుంది సార్...’ అంటూ అతని తల్లి పోలీసుల చొక్కాపట్టుకుని రోదించింది. భార్య సంగతీ అంతే. తనతో భర్త ఎలాంటి విషయాలు చెప్పలేదంది. రెండురోజులుగా కొద్దిగా ఆందోళనగా ఉన్నట్టు చెప్పిందంతే. పోనీ ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు అక్కడ ఎవరితోనైనా గొడవపడేవాడా? గత మూడునాలుగేళ్లలో పాతబస్తీ వదిలి ఎక్కడికీ వెళ్లలేదు. నేను మరో రెండు టీమ్‌లను నా దగ్గర పెట్టుకుని ఫోన్‌కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. హతుడి ఇంటి దగ్గరున్న టీమ్ నుంచి కాల్ వచ్చింది. ‘ఎలాంటి క్లూ దొరకడం లేదు సార్... వచ్చేయమంటారా’ అని. ‘మీరు ఇల్లంతా మరోసారి వెదకండి. చిన్న కాగితం ముక్క కూడా వదలకండి. అక్కడగానీ క్లూ దొరకకపోతే... ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం’ అని చెప్పాను. నా దృష్టిలో హత్యజరిగిన ఫస్ట్ అవర్ చాలా కీలకమైంది. ఆ సమయంలోనే చాలావరకూ విషయం తెలిసిపోవాలి. లేదంటే... సమయం చేతిలో మేం కీలుబొమ్మలం కావాల్సిందే. 12:00 గంటలకు... ఓ అరగంట తర్వాత ఫోన్ మోగింది. ‘గోడపైన క్యాలెండర్లో మూడు తేదీలు పెన్నుతో రౌండప్ చేసి ఉన్నాయి సార్... దానికి ముందు నెలలో కూడా అవే తేదీల్లో అలాగే రౌండప్ చేసి ఉంది. తేదీలకింద ఒకే రకమైన బండి నంబర్ నోట్ చేసి ఉంది’ అని చెప్పాడు ఎస్ఐ. నాకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. కేసు కీలక మలుపు తిరిగిందనుకున్నాను. వెంటనే నేను మరో టీమ్‌కి ఆ బండి నంబర్ ఇచ్చి ఆర్టీఏ ఆఫీసుకి పంపించాను. 1:00 గంటకు... ఆ బండికలవాడి అడ్రసు పట్టుకున్నారు మా వాళ్లు. ఆ వస్త్రవ్యాపారి ఉన్న ప్రాంతంలోనే కొద్దిదూరంలో అతని అడ్రసు. ఇంటికెళితే అతను లేడు. తల్లి ఉంది. ‘అబ్బా... ఏం సతాయిస్తరు. మీకు రోజు మామూలు ఇవ్వాలా నా బిడ్డ’ అంటూ పోలీసుల్ని తిట్టడం మొదలుపెట్టింది. ఆ సందులో నలుగురితో మాట్లాడితే ఆ బండికలవాడు కిరాయి హంతకుడని, లోకల్ పోలీసులకు లంచం ఇచ్చుకుంటూ బతికేస్తాడని చెప్పారు. అప్పటికే అతనిపై బోలెడన్ని కేసులున్నాయి. బెయిల్‌పై బయటికి వచ్చినపుడు ఇలాంటి పనులకు పాల్పడుతుంటాడు. పోలీసులు గద్దించి అడగడంతో తన చెల్లెలు ఇంటిదగ్గర ఉన్నట్లు చెప్పింది. 2:00 గంటలకు... బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12 దగ్గర మహ్మదీయలైన్స్ స్లమ్ ఏరియా. అన్నీ చిన్న చిన్న ఇళ్లు. మావాళ్లు సివిల్‌డ్రెస్‌లో హంతకుడి స్నేహితుల్ని వెంటబెట్టుకుని వెళ్లారు. తలుపు తట్టారు. ఎవరూ పలకలేదు. ఒక్కసారిగా లోపలికి చొరబడ్డారు. హంతకుడు బాత్రూమ్లో చేతులూ కాళ్లు కడుక్కుంటున్నాడు. అతని చేతుల రక్తపు మరకలు ఇంకా వదల్లేదు. ‘రెడ్ హ్యాండెడ్’గా పట్టుకోవడం అంటారు కదా! అంటే ఎర్రటిరక్తపు చేతుల్ని పట్టుకోవడం అన్నమాట. అదే జరిగింది ఇక్కడ. వెంటనే అతని చేతికున్న బ్లడ్ శాంపిల్స్‌ని తీసుకున్నారు. వ్యాపారి రక్తంతో మ్యాచ్ అయ్యింది. అతని చేతులకు బేడీలు వేశాక హంతకుడన్న మాటలు మా టీమ్ ఎప్పటికీ మరచిపోలేదు. ‘మీరు పోలీసులా, సైతాన్‌లా... మీకెలా తెలిసింది నేనే చంపానని. పోలీసులకు దొరికిపోతానని తెలుసు. కానీ ఇలా రక్తపు చేతుల్తో పట్టుపడతానని ఊహించలేదు’. ఉదయం పదిన్నరకు హత్య జరిగితే మధ్యాహ్నం రెండున్నరకు హంతుకుడ్ని పట్టుకున్నాం. చనిపోయిన వ్యక్తికి ఎలాంటి శత్రువర్గం కానీ, హంతకుల జాడ కనిపెట్టగలిగే ఆధారం కానీ లేని పరిస్థితుల్లో గంటల్లో కేసుని చేధించినందుకు డిపార్టుమెంటు తరఫు నుంచే కాకుండా ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి కూడా మంచి ప్రశంసలు అందాయి. ఎందుకు చంపినట్టు? ఇంతకీ హత్య వెనక ఎవరున్నారని అడిగిన వెంటనే చెప్పలేదు. మాదైన పద్ధతిలో ఇంటరాగేషన్ చేశాక చెప్పాడు. వ్యాపారి తమ్ముడే హత్య సూత్రధారి. హంతకుడు దొరికిన విషయం చెప్పకుండా వ్యాపారి ఇంటికి వెళ్లారు మావాళ్లు. తల్లిపక్కన కూర్చుని ఏడుస్తున్నాడు ఆ తమ్ముడు. చిన్న పని అని చెప్పి స్టేషన్‌కి తీసుకొచ్చి విచారిస్తే అసలు విషయం బయటపెట్టాడు. ‘‘మా అన్నయ్య పిసినారి సార్... బైక్ కావాలని నాలుగేళ్ల నుంచి బతిమిలాడుతున్నాను. స్నేహితులతో సరదాగా గడిపితే ఇష్టపడడు. డబ్బుల విషయంలో నరకం చూపిస్తున్నాడు. అందుకే మా పక్కవీధి కిరాయి రౌడీతో పదివేలకు డీల్ కుదుర్చుకున్నాను’’. హత్యచేసినవాడికి, చేయించినవాడికి ఇద్దరికీ జీవితఖైదు శిక్ష పడింది. క్యాలెండర్‌పై వ్యాపారి రౌండప్ చేసుకున్న మూడు తేదీలు బాగా ఉపయోగపడ్డాయి. ఆయా రోజుల్లో ఆ బండి తనను వెంబడించిందని అర్థం కావొచ్చు. పాపం అమాయకుడు ఎవరితో చెప్పకుండా క్యాలెండర్‌పై నోట్ చేసుకుని ఊరుకున్నాడు. మొత్తానికి ఒక్కరోజులో హంతకుడి చేతులకు బేడీలు వేసినందుకు నేనూ... మా టీమ్ ఊపిరి పీల్చుకున్నాం. రిపోర్టింగ్: భువనేశ్వరి