ఆర్మీపై గూర్ఖా తుపాకి | Gurkha gun On the Army | Sakshi
Sakshi News home page

ఆర్మీపై గూర్ఖా తుపాకి

Published Sun, Jan 18 2015 1:10 AM | Last Updated on Wed, Oct 3 2018 7:20 PM

ఆర్మీపై గూర్ఖా తుపాకి - Sakshi

ఆర్మీపై గూర్ఖా తుపాకి

బెస్ట్ కేస్
మాజీ డీజీపీ హెచ్.జె దొర చెప్పిన రియల్ క్రైమ్ స్టోరీ
కమిషనర్ అబ్దుల్ సలాంఖాన్ ఆదివారం తనతోపాటు సరదాగా రేస్‌కోర్సుకి రమ్మని పిలిచారు. పొద్దున్నే రెడీ అవుతున్నాను. ఇంతలో బయట జీపులో వైర్‌లెస్ మెసేజ్ చెవిలో పడింది. ‘గూర్ఖా ఫైరింగ్... పాయగా పాలెస్’ అని వినపడగానే పరుగున జీపెక్కాను.
 
పాయగా పాలెస్ ఆర్మీ ఉద్యోగుల కార్యాలయం. చాలా పెద్ద భవంతి. ప్రస్తుతం బేగంపేటలో ఉన్న కంట్రీక్లబ్, అమెరికన్ కాన్సులేట్ ఆఫీస్ ఉన్నవి దాని ప్రాంగణంలోనే. అప్పుడు నేను డిప్యూటీ కమిషనర్‌గా ఉన్నాను. సంఘటనా స్థలానికి చేరుకునేటప్పటికే లోకల్ పోలీసులంతా గుమిగూడారు. విషయం కమిషనర్‌గారికీ తెలిసింది. ఆ ప్రాంతం సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఏసీపీ, ఇన్‌స్పెక్టర్, సీఐ ఏం చేయాలో తోచక కంగారు పడుతున్నారు.
 
జీతం కోసం!
పాయగా పాలెస్ నిజాంకాలంనాటి భవంతి. నిజాం ఇంటివారు కేవలం పాయగా పాలెస్‌కి చెందినవారితోనే పెళ్లి సంబంధం అందుకునేవారట. ఆ పాలెస్ తలుపులు ఏడెనిమిది అడుగుల పొడవుండేవి. ఏసీపీ నాకెదురొచ్చి... ‘‘సార్, ఇక్కడ భవంతికి కాపలా ఉంటున్న గూర్ఖా... మేజర్‌పై కాల్పులు జరిపి, పైన మేడపైకి వెళ్లిపోయాడు.

అతన్ని పట్టుకోడానికి వెళదామంటే పై మెట్లపై నుంచి కాలుస్తానని బెదిరిస్తున్నాడు. మేం ఎప్పుడూ ఈ భవంతిలోకి వెళ్లలేదు. అతన్ని ఎలా పట్టుకోవాలో తెలియడం లేదు. పైన అంతస్థులో పదుల సంఖ్యలో ఆర్మీ సిబ్బంది ఉన్నారు. వారంతా తలుపులు మూసుకుని లోపలే ఉన్నారు. ఎవ్వరినీ బయటికి రావొద్దని చెప్పాం...’’ అంటూ వివరించాడు.
 
మేజర్‌ని అప్పటికే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాపాలా ఉండే గూర్ఖా... కాల్పులు జరపడం ఏంటని ఆరా తీస్తే... తెల్లవారితే దసరా పండగ. శాలరీ అడ్వాన్స్ ఇవ్వనందుకు ఆర్మీ సిబ్బందితో గొడవపడ్డాడట. బయట ఉన్న మేజర్ లోపలికి వెళ్లి ఏంటని గట్టిగా గద్దించడంతో తుపాకి గురిపెట్టాడు. వారించినా వినకుండా మేజర్‌పై కాల్పులు జరిపి మెట్లెక్కి మేడపైకి వెళ్లిపోయాడు. ఇదీ విషయం! కొందరేమో జీతంకోసమే కాల్చాడంటున్నారు. ఇంకొందరు అతనికి మతిస్థిమితం లేదంటున్నారు. పొద్దున్నే తాగేసి వచ్చాడంటారు కొందరు. ఏదీ క్లారిటీ లేదు.
 
ఆయుధపూజ కారణంగా...
ఆర్మీ ఆఫీసర్లంటే పోలీసువారికన్నా స్ట్రాంగ్ కదా! వారి దగ్గర బోలెడన్ని ఆయుధాలుంటాయి. మరి ఒక గూర్ఖాకి  బెదిరిపోయే పరిస్థితి ఎందుకొచ్చిందంటే... దసరా ముందురోజు కదా! ఆయుధపూజ కోసం వెపన్లన్నింటినీ శుభ్రం చేసి ఒక గదిలో పెట్టారట. దాంతో పై అంతస్థులో ఉన్న అధికారుల దగ్గర ఒక్క ఆయుధం కూడా లేకుండా పోయింది. కిందున్నవారి దగ్గర ఉన్నా... హంతకుడు పైన ఏ మూలన నక్కివున్నాడో తెలీదు.

విషయాలన్నీ విన్న తర్వాత అయోమయంగా తోచింది. అంత పెద్ద అంతస్థులో పైకి వెళ్లడానికి ఒకే ఒక్క మెట్లమార్గం తప్ప మరే దారీ లేదు. నలుగురు పోలీసుల్ని వెంటేసుకుని గోడపైనుంచి పైకి ఎక్కడానికి  ప్రయత్నించాను. లాభం లేకపోయింది. గూర్ఖా ఉన్న ప్రాంతంలోకి వెళ్లడం కుదరలేదు.

ఇంతలో కమిషనర్‌గారు, ప్రెస్ అందరూ వచ్చేశారు. ప్రమాదంలో చిక్కుకున్నది ఆర్మీ అధికారులు కావడంతో నాక్కూడా ఒకింత భయం వేసింది. నా కింది ఆఫీసర్లకు చెప్పి వెంటనే ఫైర్ ఇంజన్‌ని రప్పించమని చెప్పాను. బాగా పొడవైన లాడర్ ఉన్న ఇంజన్ కావాలన్నాను. నా ఐడియా ఏంటంటే, ఆ నిచ్చెన సాయంతో పై అంతస్థులోకి ఎక్కొచ్చు కదా అని.
 
ఫైర్ ఇంజన్ సాయంతో...
మాయదారి గూర్ఖా మేడపై ఎక్కడ దాక్కున్నాడో తెలియడం లేదు. ఫైర్ ఇంజన్ రాగానే భవంతి ముందువైపు లాడర్ ఓపెన్ చేయించి సిద్ధంగా పెట్టుకున్నాను. వాడు చూస్తే ప్రమాదం... అందుకని లోపల మెట్లదగ్గర మా పోలీసువాళ్లని కొద్దిగా హడావిడి చేయమని చెప్పాను. దాంతో వాడు మెట్లదగ్గరే ఉండి వారిని బెదిరిస్తుంటాడు. ఈలోగా నేను లాడర్ సాయంతో పైకి ఎక్కొచ్చు కదా! వాడు ఇంజన్ వచ్చినట్టు గమనించివుంటే మాత్రం లాడర్‌పైకి ఎక్కినవారిని పిట్టని కాల్చినట్టు కాల్చేస్తాడు.

అందుకని మా కింది సిబ్బంది నన్ను ఎక్కొద్దని వారించారు. నా భయమంతా పై అంతస్థులోని గదుల్లో చిక్కుకున్న ఆర్మీవారిపై హంతకుడు ఎక్కడ అటాక్ చేస్తాడోనని. ఇద్దరు కానిస్టేబుళ్లని ఇంజన్ దగ్గర నిలబెట్టాను. నేను పైకి ఎక్కుతున్నప్పుడు వాడుగాని నాపై ఫైర్ చేసే ప్రయత్నం చేస్తే వీళ్లని కూడా ఫైర్ ఓపెన్ చేయమన్నాను.

నా మాటలు విని లోపలున్న ఆర్మీఅధికారులు తలుపులు తీసారు. ఆయుధం లేకపోతే ఆర్మీవారు మాత్రం ఏం చేయగలరు? వారి ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకుని కూర్చున్నారు.
 
మ్యాప్ వేయించి...
ఎలాగోలా పై అంతస్థు కారిడార్‌లోకి వెళ్లాను. అక్కడి నుంచి వాడున్న మేడపైకి ఎలా వెళ్లాలో దారి తెలియలేదు. ముందు కారిడార్‌లో ఉన్న డోర్ కొట్టాను. నా మాటలు విని లోపలున్న ఆర్మీ అధికారులు తలుపులు తీసారు. ఆయుధం లేకపోతే ఆర్మీవారు మాత్రం ఏం చేయగలరు?  అతనున్న మేడపైకి ఎలా వెళ్లాలని అడిగితే... మ్యాప్ గీసి చూపించారు.

నేను, నాతో ఇద్దరు పోలీసులు అతనున్నవైపుకి కదిలాం. అప్పుడు నోరు తెరిచాడు. తనవైపుకొస్తే కాల్చేస్తానని బెదిరిస్తున్నాడు. ఎల్ ఆకారంలో ఉన్న కారిడార్‌లో ఒకవైపునుండి అతన్ని బుజ్జగించడం మొదలుపెట్టాం. ‘మేం ఆర్మీ సిబ్బంది కాదు... నీ బాధ మాకు తెలుసు. నేపాలివాళ్లకి దసరా చాలా పెద్ద పండగ. ఆ రోజు డబ్బుల్లేకపోతే మిమ్మల్నే నమ్ముకున్న భార్యపిల్లలు చాలా ఇబ్బందిపడతారు.

నీకు సమయానికి శాలరీ అడ్వాన్స్ ఇవ్వకపోవడం నిజంగా తప్పే. నువ్వు పగతోనో, మరో ఉద్దేశ్యంతోనో కాల్పులు జరపలేదు కదా. అయినా మేజర్‌కి పెద్దగా ఏం ప్రమాదం జరగలేదు. నువ్వు గన్ పడేసి లొంగిపో...’’ అంటూ నేనూ, నాతో ఉన్న పోలీసులూ హిందీలో నచ్చచెప్పడం మొదలుపెట్టాం. ఇంతలో మేజర్ చనిపోయినట్టు హాస్పిటల్ నుంచి కబురొచ్చింది. రెండున్నర గంటల తర్వాత, మా బుజ్జగింపు మాటల్ని నమ్మి గూర్ఖా  నోరు తెరిచాడు.

‘మీరు గన్స్ కింద పడేస్తే... నేనూ పడేస్తాను’ అన్నాడు. తీరా మేం వెపన్స్ పడేశాక వాడు ఎదురుగా వచ్చి కాల్పులు జరిపితే పరిస్థితి ఏంటి? అతను చెప్పిన మాట వినడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. వెపన్స్ కింద పడేశాం. వాడూ పడేశాడు. ముందుకెళ్లి వాడ్ని పట్టుకుని కిందికి తెచ్చాం. ఇది జరిగి 42 ఏళ్లు(1972) అవుతోంది.
 
జీవితఖైదు...
నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. ఆ గుర్కా పేరు ధన్‌బహదూర్. ఎక్స్ ఆర్మీ ఆఫీసర్. నిజంగానే నేపాలివాళ్లకి దసరా పెద్ద పండగ. పైగా బతుకుతెరువుకి మన ప్రాంతానికొచ్చినవాళ్లు అప్పులు చేసి అవసరాలు తీర్చుకోరు. ఉన్నంతవరకూ నమ్మకంగా ఉంటారు. వారిని ఇబ్బందిపెడితే  రియాక్షన్ కూడా అదేస్థాయిలో ఉంటుంది. అందరు ఆర్మీ అధికారులతో మాట్లాడాక తెలిసిందేమి టంటే ధన్‌బహదూర్ మంచివాడు.

జీతం విషయంలో విసిగిపోయాడు. అడిగిన వెంటనే ఇవ్వడానికి అధికారులకు పూనే నుంచి ఆర్డర్ రావాలి. ఆ విషయాన్నే పదే పదే చెపుతుంటే వాడికి కోపం వచ్చింది. ఫ్రస్ట్రేషన్‌లో కాల్పులు జరిపాడు. అంతకు మించి కారణం దొరకలేదు. ఉత్త పుణ్యానికి మేజర్ బలైపోయాడు. గూర్ఖాకీ జీవితఖైదు శిక్ష పడింది. పండగ రేపనగా ఓ సైనికుడ్ని కోల్పోయాం. అయితే మరో ప్రమాదం జరక్కుండా గూర్ఖాని చాకచక్యంగా పట్టుకున్నందుకు అందరూ మెచ్చుకున్నారు.
 
గ్యాలంటరీ మెడల్...
అప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్న బ్రిగేడియర్ బాలచందర్ నా సాహసాన్ని చాలా అభినందించారు. మాటలతో ఊరుకోలేదు. నా సాహసం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అప్పటి ఐజి కళ్యాణరావుగారు నన్ను ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. నేను హంతకుడ్ని పట్టుకున్న విధానాన్ని దృష్టిలో పెట్టుకుని  కేంద్ర ప్రభుత్వం నాకు గ్యాలంటరీ మెడల్ ప్రదానం చేసింది. ఆ మెడల్ అందుకున్న మొదటి ఐపీఎస్ నేనే. అంతా హ్యాపీయే కానీ మేజర్ మరణం గుర్తొచ్చినప్పుడు మాత్రం బాధేస్తుంది.
 రిపోర్టింగ్: భువనేశ్వరి
ఫొటో: నోముల రాజేశ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement