Real Crime Story
-
థ్రిల్ కోసం అతి కిరాతకంగా హత్యలు చేస్తున్న సీరియల్ కిల్లర్! నేటికీ మిస్టరీనే..
సెన్సేషన్ కోరుకునే సీరియల్ కిల్లర్స్‌లో ఒకడు జోడియాక్. ఏళ్లు గడిచినా ఆ పేరు తప్ప.. ప్రపంచానికి అతడి గురించి ఎలాంటి సమాచారం లేదు. అది కూడా అతడి అసలు పేరు కాదు. ‘నేను చంపినవారంతా స్వర్గంలో నా బానిసలే.. దమ్ముంటే నన్ను పట్టుకోండి, లేదంటే నా బానిసల్ని నన్ను పోగుచేసుకోనివ్వండి (చంపుకోనివ్వండి)’ అంటూ పోలీసులకే లేఖ రాసిన ఈ క్రూరుడు.. ఎలా ఉంటాడో? ఎందుకు అన్ని హత్యలకు తెగబడ్డాడో? నేటికీ మిస్టరీనే. 1968–69 సంవత్సరాల్లో అమెరికా, కాలిఫోర్నియాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరాన్ని వణికించాడు జోడియాక్. చంపే ముందు హతులకు తన మారు పేరు ‘జోడియాక్’ అని చెప్పి మరీ చంపేవాడు. అలా చెప్పుకోవడంలో అమితమైన ఆనందం పొందేవాడట. జోడియాక్ అంటే అంతా అని అర్థం. వరుస హత్యలతో పోలీసులకే చుక్కలు చూపించిన జోడియాక్.. హత్యలు చేసిన చోట కోడ్ లాంగ్వేజీలో క్లూలు కూడా ఇచ్చేవాడు. చంపేస్తానని బెదిరించి న్యూస్ పేపర్లలో అతడి కోడ్ లెటర్స్ ప్రింట్ చేయించేవాడు. అయితే పోలీసులు, డిటెక్టివ్లు కలసి తలలు పట్టుకున్నా.. ఆ లెటర్లను డీ–కోడ్ చెయ్యలేకపోయేవారు. నిజానికి జోడియాక్ ఐదుగుర్ని హత్య చేసినట్లు పూర్తి ఆధారాలు ఉన్నాయి. కానీ ‘నేను 37 మందిని చంపాను’ అని స్వయంగా ప్రకటించుకున్నాడతను. ఓసారి రక్తపు మరకలున్న షర్టును పంపించి మరీ విర్రవీగాడు. జోడియాక్ ఊహాచిత్రం – కోడ్ లెటర్ హత్య చేసిన ఏడాదికి వివరాలు.. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో కొన్ని బుల్లెట్ల శబ్దాలు, రెండు ఆర్తనాదాలు వినిపించాయి. అటుగా పరుగు తీసిన స్థానికులకు.. అక్కడ ఓ కారు ముందు ఒక యువజంట రక్తపు మడుగులో పడి కనిపించింది. వాళ్ల పేర్లు బెట్టీ లావ్ జెన్సెన్(16), డేవిడ్ అర్థర్ ఫారడే(17). వారిలో బెట్టీ అప్పటికే ప్రాణాలతో లేదు. కొన ఊపిరితో ఉన్న ఫారడేను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే చనిపోయాడు. అతడి తలలో, ఆమె వీపులో బుల్లెట్లు ఉన్నాయని తేలింది. అదే రోజు అర్థరాత్రి తర్వాత పోలీస్ స్టేషన్లో ఫోన్ మోగింది. ‘నా పేరు జోడియాక్.. నాకు డబుల్ మర్డర్ వివరాలు తెలుసు’ అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. ‘ఈ రోజు ఆ రెండు హత్యలు నేనే చేశాను. మరో సమాచారం ఇవ్వడానికే కాల్ చేశాను. కొలంబస్ పార్క్వేకి తూర్పున 1.6 కిలోమీటర్ల దూరంలో పాడుబడిన ప్రభుత్వపార్క్లో ఉన్న బ్రౌన్ కలర్ కారులో ఇద్దరు పిల్లల శవాలున్నాయి. ఈ రోజు ఈ ఇద్దరినీ చంపినట్లే గత ఏడాది 9 మిల్లీమీటర్ల లర్జెర్ గన్ తో వాళ్లని కాల్చి చంపాను’ అంటూ షాకిచ్చాడు. నిజంగానే పార్క్‌లోని బ్రౌన్ కలర్ కారులో ఇద్దరు పిల్లల అస్థిపంజరాలు లభించాయి. చదవండి: నదిలో తేలుతున్న వందల అస్థిపంజరాలు.. మిస్టరీ డెత్ వెనుక అసలు కారణం ఏమిటీ? దాంతో మీడియా దృష్టి జోడియాక్ పైన, జోడియాక్ దృష్టి మీడియాపైన పడ్డాయి. పోలీసులూ ఆవేశంగా జోడియాక్ వేటలో పడ్డారు. నెలలు గడుస్తున్నాయి. ఆధారాలు లేక కేసు నీరుగారింది. ఉన్నట్టుండి నగరంలో మళ్లీ కాల్పుల శబ్దం. మరో ఘోరం జరిగింది. కారులో వెళ్తున్న ఓ జంటపై జోడియాక్ ఎటాక్ చేశాడు. ఆ ఘటనలో మహిళ అక్కడికి అక్కడే చనిపోగా.. మైకేల్ మ్యాగ్ అనే వ్యక్తి గాయాలతో బతికి బయటపడ్డాడు. హంతకుడి పేరు ‘జోడియాక్’ అనడంతో పోలీసులకు ఆశలు చిగురించాయి. మొదటిసారి జోడియాక్ని చూసిన ప్రత్యక్షసాక్షిగా మైకేల్ ఇచ్చే వాగ్మూలం కీలకంగా మారింది. ‘జోడియాక్ తెల్లజాతీయుడని, సుమారు 5 అడుగుల 8 అంగుళాల పొడవు ఉంటాడని’ ప్రపంచానికి తెలిసింది. మైకేల్ చెప్పిన రూపురేఖల ఆధారంగా ఊహచిత్రాన్ని గీయించారు. ఆ చుట్టుపక్కల అనుమానిత తెల్లజాతీయులను అదుపులోకి తీసుకుని విచారించారు. నెల రోజులు గడిచాయి. జోడియాక్ ఓ ప్రముఖ న్యూస్ పేపర్‌కు హెచ్చరికలతో కూడిన ఓ కోడ్ లాంగ్వేజ్ లేఖను పంపించాడు. ‘దీన్ని మొదటి పేజీలో ప్రచురించకుంటే శాల్తీలు లేచిపోతాయి’ అని. దాంతో భయపడిన సదరు పేపర్ యాజమాన్యం.. మొదటి పేజీలో దాన్ని ప్రచురించింది. అయితే అందులో ఏముంది అనేది ఎవరికీ అర్థం కాలేదు. డీ–కోడ్ చెయడానికి చాలా మంది మేధావులే ప్రయత్నించారు. వీలుకాలేదు. చివరికి ఓ హైస్కూల్ టీచర్.. ఆ లెటర్ని డీ–కోడ్ చేసి అందులో ఉన్నది తెలియజేయడంతో పోలీసులు బిత్తరపోయారు. ‘నాకు మనుషులని చంపడం భలే ఇష్టం. అడవిలో మృగాలను చంపితే వచ్చే ఆనందం కంటే మనుషుల్ని చంపడం వల్ల వచ్చే ఆనందమే ఎక్కువ అనిపిస్తోంది. ఇందులో ఫన్ ఉంది. ఎందుకంటే మనిషే అన్నిటికంటే ప్రమాదకరమైన జంతువు. కళ్లముందు ఎవరైనా నా కారణంగా చస్తుంటే థ్రిల్లింగ్‌గా ఉంటుంది. నేను మరణించాక తిరిగి స్వర్గంలో జన్మిస్తాను. ఇప్పుడు నేను చంపిన వాళ్లంతా అక్కడ నా బానిసలుగా మారతారు. నా అసలు పేరు చెప్పను. చెబితే మీరు కనిపెట్టేస్తారు. వీలైతే నన్ను పట్టుకోండి. లేదంటే నా పని నన్ను చేసుకోనివ్వండి. స్వర్గంలో కాబోయే నా బానిసల్ని కలెక్ట్ చేసుకోనివ్వండి’ అని రాశాడు జోడియాక్. అతడు రాసిన కోడ్ వీడింది కానీ అతడు ఎవరన్నది నేటికి తెలియలేదు. తెలియబోదు కూడా. ఎందుకంటే ఇప్పటికే సుమారు 53 ఏళ్లు దాటింది. జోడియాక్ ప్రాణాలతో ఉన్నాడో లేదో కూడా ఎవరికీ తెలియదు. - సంహిత నిమ్మన చదవండి: అచ్చం భేతాళ కథల్లో మాదిరి.. ఈ నీటిలో పడితే వెంటనే రాయిలా అయిపోతారు..! -
హృదయవిదారక మిస్టరీ..! కన్న బిడ్డలు బతికున్నారోలేదో తెలియక..
ఒక అగ్నిప్రమాదం.. రాత్రికి రాత్రే వారి సంతోషాల్లో నిప్పులు పోసింది. బతుకంతా నిరీక్షించేలా చేసింది. అది శత్రువు పగతో చేసిన ఘోరమో? లేక విధి వికృతంగా పన్నిన పన్నాగమో? తెలియకుండానే జీవితాలకు జీవితాలు ముగిసిపోయాయి. కడుపు కోతకు మించిన దుఃఖం ఉండదు. కన్నబిడ్డలు బతికి ఉన్నారా.. లేదా తెలియని స్థితికి మించిన నరకం ఉండదు. అదే పరిస్థితిని ఎదుర్కొన్నారు జార్జ్, జెన్నీ సోడర్ దంపతులు. 1945 డిసెంబర్ 24న అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో అర్ధరాత్రి ఒంటిగంటకు జార్జ్ నివసిస్తున్న రెండంతస్తుల భవనానికి ఉన్నట్టుండి నిప్పు అంటుకుంది. జెన్నీ, జార్జ్‌లు.. తమతో నిద్రిస్తున్న నలుగురు పిల్లల్ని తీసుకుని బయటికి పరుగుతీశారు. కానీ పై అంతస్తులో నిద్రపోతున్న మరో ఐదుగురు పిల్లల్ని కాపాడటానికి వీలుకాలేదు. కనీసం ఫైర్ స్టేషన్ కి కాల్ చేద్దామంటే.. టెలిఫోన్ వైర్లు తెగిపడున్నాయి. దగ్గర్లో ఉన్న బొగ్గు ట్రక్కుల సాయంతో పై అంతస్తుకి ఎక్కుదామంటే.. వాటి ఇంజిన్లు స్టార్ట్ కాలేదు. మారిస్(14), లూయీ(9) అనే ఇద్దరు మగపిల్లలు.. మార్తా(12), ఐరీన్ (8), బెట్టీ (5) అనే ముగ్గురు ఆడపిల్లలు పైనే ఇరుక్కుపోయారు. మారిస్, లూయీ, మార్తా, ఐరీన్, బెట్టీ చూస్తుండగానే ఇల్లు కాలి బూడిదైంది. షార్ట్ సర్క్యూట్ జరిగి, ఐదుగురు పిల్లలు సజీవదహనం అయ్యార ని కేసు క్లోజ్ చేశారు పోలీసులు. కానీ జార్జ్ దంపతులు తమ పిల్లలు చనిపోలేదని, కిడ్నాప్ అయ్యారని నమ్మారు. పక్కదారి పట్టించేందుకే అగ్నిప్రమాదాన్ని సృష్టించారనే వాదన వినిపించారు. అందుకు చాలా సాక్ష్యాలను సిద్ధం చేశారు. వాటిలో ముఖ్యమైనది అంతపెద్ద ప్రమాదం జరుగుతుంటే పిల్లల నుంచి ఎటువంటి అరుపులు వినిపించలేదు. లెక్కప్రకారం గంటలోనే కాలి బూడిదైన ఇంటిలో.. ఐదు అస్థిపంజరాలు దొరకాలి. కానీ ఒకే ఒక్క మాంసం ముద్ద, కొన్ని ఎముకలు మాత్రమే దొరికాయి. వాళ్ల పనేనా? జార్జ్ సోడర్ ఇటలీలోని సార్డినియాలో 1895లో జన్మించాడు. తన 13వ ఏట కుటుంబంతో కలసి అమెరికాకు వలస వచ్చాడు. ఇక జెన్నీ కూడా వలస వచ్చిన ఇటలీ వాసే. పెళ్లి తర్వాత ఈ జంట ఇటాలియన్ కమ్యునిటీకి చెందిన ఫాయెట్విల్లే సమీపంలో స్థిరపడ్డారు. అయితే ఆ ఏరియాలో ఉన్న ఇతర ఇటాలియన్లు నియంత అయిన బెనిటో ముస్సోలినీని సపోర్ట్ చేసేవాళ్లు. బలమైన రాజకీయాభిప్రాయాలు కలిగిన జార్జ్.. వారితో వాగ్వాదాలకు దిగేవాడు. జెన్నీ, జార్జ్ సోడర్ దంపతులు అదే పగతో వాళ్లెవరైనా పిల్లల్ని ఎత్తుకెళ్లారా? అనేది చిక్కుముడిగా మారింది. అగ్నిప్రమాదం జరిగే కొన్ని నెలల ముందు ఒక అపరిచితుడు జార్జ్ వాళ్లింటికి వచ్చి కుటుంబ బీమా తీసుకోవాలని పట్టుబట్టాడు. నిరాకరించడంతో ‘త్వరలోనే ఈ ఇల్లు కాలి బూడిదవుతుంది. పిల్లలు నాశనమయిపోతారు. ముస్సోలినీని విమర్శించి నందుకు మూల్యం చెల్లించక తప్పదు’ అని హెచ్చరించి వెళ్లిపోయాడు. అప్పుడు జార్జ్ పట్టించుకోలేదు. ఘటన తర్వాత అతడు దొరకలేదు. ఫోన్ కావాలనే చేశారా? అగ్ని ప్రమాదం జరిగిన రోజు రాత్రి.. పన్నెండున్నరకు గాఢనిద్రలో ఉన్న జెన్నీ ఓ ఫోన్ కాల్కి నిద్రలేచింది. అవతల ఒక ఆడ గొంతు.. జెన్నీ ఎప్పుడూ వినని పేరు. ‘రాంగ్ నంబర్’ అని జెన్నీ అనగానే అవతల నుంచి ఓ నవ్వు వినిపించింది. అర్థం కాని జెన్నీ.. ఫోన్ పెట్టేసి.. వెళ్లి పడుకుంది. అప్పుడే ఇంటి పైకప్పు మీద ఏదో పడిన శబ్దం జెన్నీకి వినిపించింది. గంటలోపే రూమంతా పొగకమ్మింది. మరిన్ని షాకింగ్ నిజాలు.. ఘటన తర్వాత టెలిఫోన్ రిపేర్‌చేసే వ్యక్తి ఆ ఇంట్లో తగలబడిపోయిన వైర్లను చూసి.. టెలిఫోన్ వైర్లు మంటల్లో కాలిపోకముందే.. ఎవరో కావాలనే లైన్‌కట్ చేశారని తెలిపాడు. మరోవైపు ఓ స్థానికుడు.. ఆ ఇంటి దగ్గర్లో వాహనాల ఇంజిన్లను తొలగించే పరికరాన్ని చూశానని చెప్పడంతో.. కావాలనే బొగ్గు ట్రక్కుల ఇంజిన్లు పనిచేయకుండా చేశారనే అనుమానం బలపడింది. బూడిదైన ఇంట్లో.. జార్జ్‌కు సగం కాలిన ఒక గట్టి రబ్బరు వస్తువు కనిపించింది. అది పైనాపిల్ బాంబు తయారు చేయడానికి ఉపయోగించే వస్తువు. అంటే జెన్నీకి ఆ రాత్రి వినిపించిన శబ్దం బాంబేనా? అనే కొత్త సందేహం మొదలైంది. అసలైన నిర్ధారణ ఇదే పిల్లల ఫొటోలను పేపర్లో వేయడంతో పాటు ఆ చుట్టుపక్కల గోడలపై అతికించి.. జాడ చెబితే 5 వేల డాలర్లు ఇస్తానని రివార్డ్ ప్రకటించాడు జార్జ్. అప్పుడే ఒకామె ఆ ఐదుగురు పిల్లల్ని చూశానంటూ వచ్చింది. ఆ ఇంటికి 50 మైళ్ల దూరంలో టూరిస్ట్ బూత్ నడుపుతున్నానని, అగ్ని ప్రమాదం జరిగిన రోజు ఉదయమే తనకు ఆ పిల్లలు కనిపించారని, వాళ్లు ఫ్లోరిడా లైసెన్స్ ప్లేట్‌తో ఉన్న ఒక టూరిస్ట్ కారులో ఉన్నారని, వాళ్లకు తానే టిఫిన్ పెట్టానని చెప్పింది. జార్జ్ దంపతుల ఆశలు బలపడ్డాయి. మరోవైపు సౌత్ కరోలినా అనే హోటల్లో పనిచేసే మరొకామె ఐదుగురిలో నలుగురు పిల్లల్ని చూశానని పిల్లలతో పాటు ఎవరో నలుగురు పెద్దవాళ్లూ ఉన్నారని, వాళ్లు పిల్లల్ని నాతో మాట్లాడనివ్వలేదని చెప్పింది. ఇలాంటి పలు ఆధారాలతో 1947లో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు ఆ దంపతులు రిక్వెస్ట్ చెయ్యడంతో కేసు రీఓపెన్ అయ్యింది. అందులో భాగంగా ఇంటి బూడిదల్లో దొరికిన మాంసం ముద్దను, ఎముకలను మరోసారి టెస్ట్ చేశారు. అయితే అవి పిల్లలవి కావని, మాంసం ఒక జంతువుదని, ఎముకలు 17 ఏళ్లు పైబడిన గుర్తు తెలియని యువకుడివని తేలాయి. దాంతో రివార్డ్‌ను 10 వేలకు పెంచాడు జార్జ్. 23 ఏళ్ల తర్వాత 1968లో జార్జ్‌కు ఫ్రమ్ అడ్రెస్ లేని ఒక పోస్ట్ వచ్చింది. అందులో ఒక యువకుడి ఫొటో ఉంది. ఫొటో వెనుక లూయీ సోడర్, ఐ లవ్ బ్రదర్ ఫ్రాంకీ అని రాసి ఉంది. అదే జార్జ్ కుటుంబానికి చివరిగా దొరికిన ఆధారం. అదే విషయాన్ని పోలీసుల ముందు పెడితే నవ్వారు. కానీ ఆ యువకుడు తప్పిపోయిన పిల్లల్లో ఒకడైన లూయీలానే ఉన్నాడని జార్జ్ నమ్మాడు. ఆ పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టేందుకు ఒక డిటెక్టివ్‌ని కూడా నియమించాడు. కానీ డిటెక్టివ్ డబ్బులు తీసుకున్నంత వేగంగా ఇన్వెస్టిగేషన్ చెయ్యలేపోయాడు. ఆ పోస్ట్ అందుకున్న ఏడాదికే అనారోగ్యంతో జార్జ్ కన్నుమూశాడు. సుమారు 21 ఏళ్లు జెన్నీ కూడా తన పిల్లలకోసం నిర్విరామంగా ప్రయత్నాలు చేస్తూనే బతికింది. బతికి ఉన్నన్నాళ్లూ నిరసనగా నల్లటి దుస్తులనే ధరించింది. ఆమె మరణం తర్వాత.. అంటే 1989 నుంచి 2021 వరకూ.. జార్జ్–జెన్నీల చిన్న కూతురు సిల్వియా సోడర్.. తన మనవళ్లతో కలసి.. లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో కూడా తన తోబుట్టువులను వెతికే ప్రయత్నం చేసింది. ఇంట్లో అగ్నిప్రమాదం జరిగేనాటికి సిల్వియా వయసు రెండేళ్లు. 2021 ఏప్రిల్ 21న తన 79వ ఏట.. తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసింది సిల్వియా. నాటి ఘటనలో ఏకైక సాక్ష్యంగా మిగిలిన జార్జ్ ఏకైక వారసురాలు సిల్వియా కూడా ఇప్పుడు ప్రాణాలతో లేదు. బహుశా సిల్వియా కంటే పెద్దవాళ్లైన ఆ ఐదుగురు కూడా ప్రాణాలతో ఉండి ఉండరు. కానీ పేగుబంధం కోసం కన్నప్రేమ చేసే పోరాటాలకు ఈ మిస్టరీ ఓ హృదయవిదారకమైన ఉదాహరణగా మిగిలింది. - సంహిత నిమ్మన చదవండి: 88 యేళ్లనాటి కేకు.. ఇప్పటికీ తాజాగానే ఉంది!! -
అడవిలో అర్ధరాత్రి...
బెస్ట్ కేస్ మాజీ డీజీపీ ఎ.కె.ఖాన్ చెప్పిన రియల్ క్రైమ్ స్టోరీ కరీంనగర్ జిల్లాలో ఏఎస్పీగా పనిచేస్తున్నప్పుడు నేను ఛేదించిన ఒక కేసు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కరీంనగర్‌కి, వరంగల్‌కి సరిహద్దు ప్రాంతం తాడిచర్ల మండలం దగ్గర జరిగిన ఘటన అది. ఆ రోజు రాత్రి పదకొండు గంటలకు కబురు వచ్చింది. దగ్గర్లోని అటవీ అధికారులపై జంతువులు దాడి చేసి చంపేశాయని. ఎక్కడో, ఏమిటో వివరాలు సరిగ్గా లేవు. నేను, ముగ్గురు పోలీసులం జీపులో బయలుదేరాం. కొంతదూరం వెళ్లాక కాలినడకన ప్రయాణం మొదలుపెట్టాం. అమావాస్య రోజులు కావడంతో చిమ్మచీకటి. టార్చిలైట్ల వెలుతురులో అడుగులు వేసుకుంటూ వెళుతుంటే దారికడ్డంగా కొండచిలువ. దాని తలెక్కడుందో తెలీలేదు. మెల్లగా తప్పించుకుని ముందుకు వెళ్లాం. విషయం ఏంటంటే ఆ అడవి క్రూరమృగాలకు నెలవు. చిరుతపులులు, ఎలుగుబంట్లు ఎక్కువగా ఉండేవి. పైగా వాటి ‘చేతిలో’ చనిపోయిన అధికారుల దేహాలను వెతకడానికి వెళుతున్నాం. భయం ఖాకీ చొక్కాకి ఉండదేమోగానీ ఆ చొక్కా లోపల ఉన్న మాకుంటుంది కదా! రాత్రి రెండు గంటలకు... ఓ రెండుగంటల కాలినడక ప్రయాణం తర్వాత అటవీ అధికారుల మృతదేహాలు కనిపించాయి. ఒళ్లంతా రక్కినట్టు ఉంది. పులి దాడిచేసిందనుకున్నాం. మృతదేహాలను అడవిని ఆనుకుని ఉన్న తండాకు తీసుకెళ్లాం. తెల్లారాక తిరిగి ఆ మృతదేహాలు దొరికిన సంఘటనా స్థలానికి వెళ్లాం. అంతకు ముందురోజు మేం నడిచిన ఆనవాళ్లతో సహా సంఘటనా స్థలంలో కూడా కొన్ని గుర్తులు కనిపించాయి. ముఖ్యంగా మృతదేహాలు దొరికిన చోటుకు నాలుగు అడుగుల దూరంలో ఎండ్లబండి చక్రాల గుర్తులు కనిపించాయి. ‘‘సార్, పులులు దాడి చేసి చంపి వుంటే ఇక్కడ ఈ ఎండ్లబండి చక్రాల ఆనవాళ్లేంటి? ఎవరో వీరిని చంపి ఇక్కడ పడేయలేదు కదా’’ అన్న మా కానిస్టేబుల్ మాటలు నన్ను ఆలోచనలో పడేశాయి. ఆ చక్రాల గుర్తులు ఎండ్లబండివే కానీ చక్రానికీ, చక్రానికీ మధ్య దూరం చాలా ఎక్కువగా ఉంది. అంటే ఆ ఎండ్లబండి అందరి దగ్గర ఉండే ఎండ్లబండి లాంటిది కాదు! వెంటనే ఆ చక్రాల మధ్య ఉన్న దూరాన్ని కొలిచి... చుట్టుపక్కల ఊళ్లలోకి వెళ్లి అలాంటి బండ్లు ఎక్కడున్నాయో తెలుసుకున్నాం. అడవి చుట్టుపక్కల పది ఊళ్లలో అలాంటి బండ్లు మూడు ఉన్నట్టు తెలిసింది. రక్తపు చుక్కలు... మూడు బండ్ల యజమానులను రప్పించి మాట్లాడాం. అధికారులు చనిపోయిన రాత్రి ఆ మూడు బండ్లు ఎక్కడున్నాయో సాక్ష్యాలతో చెప్పమన్నాం. రెండు బండ్ల సమాచారం బాగానే వచ్చింది కానీ మూడో బండి యజమాని చెప్పిన విషయాలు కాస్త తేడాగా అనిపించాయి. ‘‘అంతకు ముందురోజు మా పక్కూరి నుంచి బండి కావాలని వచ్చారు సార్. పైసలిస్తామన్నారు కదా అని ఇచ్చాను. మరి వాళ్లు దేనికి వాడుకున్నారో నాకు తెలీదు’’ అన్నాడు. వెంటనే ఎండ్లబండిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఎడ్లను కట్టే కాడెపై నాలుగైదు రక్తపు మరకలు కనిపించాయి. ఇవేమిటని అడిగితే బండిని వాడుకున్నవాళ్లు చెప్పిన సమాధానం నమ్మాలనిపించలేదు. ‘‘వేసవికాలం కదా సార్... ఎడ్ల ముక్కుల్లోంచి రక్తం కారుతుంది. వాటి మరకలేమో!’’ అన్నారు. వెంటనే ఆ కాడెపై ఎండిన రక్తం శాంపిల్స్‌ని సేకరించి హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించాం. వివరాలు వెంటనే పంపమని ప్రత్యేకంగా ఒక ఆఫీసర్ని పంపించాను. సవాల్‌గా తీసుకున్నాను... అడవిని రక్షించడం కోసం పనిచేస్తున్న అధికారులను హత్య చేయడం అనేది చిన్న విషయం కాదు. ఈ హత్యను మేం తేలిగ్గా తీసుకుంటే ఏకంగా అటవీశాఖా యంత్రాంగాన్నే చులకనగా చూస్తారు. అటవీ సంపదను దోచుకోవడానికి వచ్చే స్మగ్లర్ల నుంచి ప్రతి నిమిషం ప్రమాదం ఉంటుందని తెలిసి కూడా ధైర్యంగా పనిచేసే అధికారులపై చెయ్యివేసే ధైర్యం ఎవరికొచ్చిందని నా గుండె రగిలిపోతోంది. దాంతో ఈ కేసుని డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్టల విషయంగా తీసుకున్నాను. ఏ గ్రామం వాళ్లయితే ఆ బండిని అద్దెకు తీసుకున్నారో అక్కడే ఒక వారంరోజులు తిష్టవేశాం. ఎవరిని అడిగినా మాకేం తెలుసంటారు! ఒక్క బండిపై ఉన్న రక్తపు మరకలు తప్ప ఇంకే ఆధారాలూ దొరకలేదు. సంఘటనా స్థలంలో దొరికిన చిన్న చిన్న ఆధారాలు చేతిలో ఉన్నా అవి హంతకుల చిరునామాని చెప్పలేకపోయాయి. ఇంతలో హైదరాబాద్ నుంచి సమాచారం వచ్చింది. ఆ రక్తం ఎద్దుది కాదు మనిషిదని! అంతే విచారణ వేగం పెంచాం. ఆ నలుగురు... అటవీ అధికారుల్ని చంపింది పులులు, సింహాలు కాదనీ, మనుషులనీ స్పష్టమైన విషయాన్ని అన్ని గ్రామాల్లోని వారికి తెలియజేశాం. అయినా మేం తిష్టవేసిన గ్రామవాసుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఎవరూ కూడా అయ్యోపాపం అనలేదు. నాకు సందేహం వచ్చి ఓ నలుగురు కుర్రాళ్లను విచారిస్తే విషయం బయటపడింది. ఆ గ్రామస్తులే అధికారుల్ని హత్య చేశారని. వారిపై అనుమానం రాకుండా ఉండేందుకు అధికారుల శరీరంపై గోళ్లతో రక్కినట్టు చేశారు. కళ్ల గుడ్లని బయటికి తీసేశారు. అలా జంతువులే చేస్తాయనీ, వారిపై మాకు అస్సలు అనుమానం రాదనీ వారి నమ్మకం. కాని మాకు విషయం తెలిసిపోయాక గ్రామస్తులంతా ఒకచోట కూడి మాకు జరిగిన విషయం చెప్పారు. అధికారులు వారి గ్రామస్థుల్ని బాగా ఇబ్బందిపెట్టేవారట. డబ్బులకోసం, అవసరమైన వస్తువుల కోసం వారిని వేధించేవారట. చాలా రకాలుగా అధికారులతో విసిగిపోయి, వారి పీడని వదిలించుకోవడం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అడవిలోకి ఆవుల్ని తోలుకెళ్లినా, గొర్రెల్ని కొట్టుకెళ్లినా ఫైన్ కట్టమంటూ ఇబ్బంది పెట్టేవారనీ, వారితో ఇంకా ఏవో ఇబ్బందుల్ని కూడా ఎదుర్కొన్నామనీ చెప్పుకొచ్చారు. ఏదైతేనేం... అధికారులు నిజంగా గ్రామస్థుల్ని ఇబ్బంది పెట్టారనుకోండి. దానికి పరిష్కారం ఇంత ఘోరంగా హత్యచేయడం కాదు కదా! పైగా ఎప్పుడూ మేం అందుబాటులో ఉంటాం. డిపార్ట్మెంటు ఉద్యోగులపై దాడి చేయడం అటవీశాఖలోనే కాదు, మా పోలీసుశాఖలో కూడా తీవ్ర కలకలం రేపింది. ఏ దుండగులో అంటే కాదు... గ్రామం మొత్తం ఏకమై చేసిన పని. హత్యలో ఎంతమంది పాల్గొన్నారని ఆరాతీస్తే మేమందరం అంటూ ఊరి ప్రజలంతా చేతులెత్తుతున్నారు. రెండుమూడు వందలమంది ఉంటారు. ఎవరినని అరెస్టు చేస్తాం. అయినా మా పద్ధతి ప్రకారం విచారణలో ఒక్కక్కరిని వదిలి అసలు హంతకుల పేర్లను రాబట్టాం. అధికారులను వెంటాడినవారు, హత్య చేసినవారు, అనుమానం రాకుండా వారిపై గోళ్లగాట్లను పెట్టినవారు, ఎండ్లబండిపై తీసుకెళ్లి అక్కడ పడేసినవారు, చూసి కూడా తెలియనట్టు నటించినవారు... ఇలా హత్యలో పాల్గొన్న పాత్రధారులందరిని వేరు చేసి, వారిపై వేర్వేరు కేసులు పెట్టి సాక్ష్యాలను కోర్టుకి అప్పగించాం. కేసు విచారణ తర్వాత అందరికీ శిక్షలు పడ్డాయి. వారి వారి నేరాల్ని బట్టి అందరికీ పెద్ద శిక్షలే పడ్డాయి. ఇది జరిగిన నేటికి ముప్పైరెండేళ్లవుతోంది. కానీ ఇప్పటికీ క్రైమ్ అనగానే నా కళ్లముందు ఉండే కేస్ ఇది! రిపోర్టింగ్: భువనేశ్వరి ఫొటోలు: రాజేశ్ రెడ్డి ఆ చక్రాల గుర్తులు ఎండ్ల బండివే కానీ చక్రానికీ, చక్రానికీ మధ్య దూరం చాలా ఎక్కువగా ఉంది. అంటే ఆ ఎండ్లబండి అందరి దగ్గర ఉండే ఎండ్లబండి లాంటిది కాదని అర్థమైంది. అడవిని రక్షించడం కోసం పనిచేస్తున్న అధికారులను హత్య చేయడం అనేది చిన్న విషయం కాదు. ఈ హత్యను మేం తేలిగ్గా తీసుకుంటే ఏకంగా అటవీశాఖా యంత్రాంగాన్నే చులకనగా చూస్తారు. -
'అప్పన్న' పచ్చలపతకం చోరీ స్టోరీ
మాజీ డీజీపీ ఎం.వి.భాస్కరరావు చెప్పిన రియల్ క్రైమ్ స్టోరీ పొద్దున్నే ఐదున్నరకు సింహాచలం ఆలయ పూజారుల నుంచి ఫోన్... ‘‘గర్భగుడిలో దొంగలు చొరబడి స్వామివారి ఆభరణాలన్నీ దోచుకుపోయా’’రని. తిరుపతి తర్వాత ఆ స్థాయి ఆదరణ ఉన్న ఆలయం సింహాచలం. తెలుగువారు, ఒడిశా భక్తులతో ఎప్పుడూ కిటకిటలాడే దేవాలయంలోకి దొంగలు రావడమేంటి? వెళ్లి చూస్తే దొంగలు గుడి వెనకద్వారం గొళ్లెం పగులగొట్టి లోపలికి వచ్చారు. స్వామివారి ఒంటిపై ఉన్న బంగారం మొత్తం తీసుకెళ్లిపోయారు. ఇంకా నయం... బోషాణం పెట్టె దగ్గరికి పోలేదని మనసులో అనుకుంటుండగా... ఆలయ పూజారి కంగారుగా ‘సార్... స్వామివారి మెడలోని పచ్చలపతకంతో ఉన్న హారం కూడా పోయింది సార్’ అన్నాడు. ఆ జిల్లా ఎంపీ హడావుడి చేయడం మొదలుపెట్టాడు. దొంగలెత్తుకుపోయిన పచ్చలపతకం ఐదు వందల ఏళ్లక్రితపుదనీ, అంతర్జాతీయ మార్కెట్లో దాని వెల ఎనిమిది వందల నుంచి వెయ్యికోట్లవరకూ పలుకుతుందనీ ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. 1978లో జరిగిన ఈ దొంగతనం కేసు చాలా పాపులర్ అయ్యింది. అప్పుడు నేను విశాఖపట్నం ఎస్పీగా పనిచేస్తున్నాను. ఎప్పటిలాగే ఉదయం నాలుగున్నరకు గుడి పూజారులు తమ పనులకు దిగారు. ఐదింటికి గర్భగుడి దగ్గరికి వెళ్లేసరికి దొంగతనం జరిగిన విషయం తెలిసింది. వెంటనే మాకు కబురు పంపారు. వాచ్‌మేన్‌ని అడిగితే రాత్రి ఒంటిగంటవరకూ మెలకువగా ఉన్నట్లు చెప్పాడు. తాను నిద్రలో ఉండగా ఈ ఘోరం జరిగినట్టు చెప్పాడు. దొంగతనం జరిగిన తీరును చూస్తే గుడిలో దొంగలు రెండుగంటలపాటు ఉన్నట్లు అర్థమవుతోంది. ఆరు కిలోమీటర్ల ఎత్తున ఉన్న దేవాలయం కొండ దిగి మెయిన్‌రోడ్డుపైకి వెళ్లాలంటే కనీసంరెండు మూడు గంటలు పడుతుంది. గుడికి వెళ్లే రోడ్డుగుండా దొంగలు వెళ్లే ఆస్కారం లేదు. ఎందుకంటే నాలుగింటినుంచే పాలవాళ్లు, పూలవాళ్లు, పండ్ల వ్యాపారులు ఆ మార్గం నుంచి వస్తుంటారు. ఇక మరో మార్గం అంటే గుడి వెనకవైపున్న అడవిలోనుంచి కాలినడకన పారిపోవాలి. ఆలస్యం చేయకుండా పోలీసులు అడవంతా గాలిస్తే దొంగలు దొరికే అవకాశం ఉంది. ఒకర్ని ఇద్దరినీ కాదు... డీఎస్పీతో సహా వందమందికిపైగా పోలీసుల్ని ఐదారు జట్లుగా చేసి అడవిలోకి పంపించాను. ఒత్తిడి కారణంగా... జరిగింది చిన్నచోరీ కాదు. బంగారం రెండు కిలోలకుపైగా ఉంటుందని చెబుతున్నారు. పచ్చలపతకమున్న హారం వల్ల నాపై ప్రెజర్ పెరిగిపోయింది. ఇప్పట్లోలా డాగ్స్టీం వంటివి లేవు. ఒకవేళ హైదరాబాద్ నుంచి కుక్కల్ని రప్పిద్దామన్నా రోజు పడుతుంది. హైదరాబాద్ నుంచి ఐజీ, డీఐజీ, ముఖ్యమంత్రిల నుంచి ఫోన్లు వస్తున్నాయి. అడవిలోకి వెళ్లిన పోలీసులేమో వెనక్కి వచ్చేసి ఎవరూ కనిపించలేదని చెప్పడం మొదలెట్టారు. నా అంచనా ప్రకారం వారు అడవిదాటిపోయే అవకాశమే లేదు. బాస్ దగ్గర లేకపోతే ఎవరికైనా అలుసేకదా! ఏం చేస్తాను... సంఘటనా స్థలానికి వెళ్లి జాగ్రత్తగా పరిశీలించాను. తాళం పగలగొట్టిన గడ్డపారకు బట్టచుట్టడం, దేవుడి దగ్గర ప్రసాదం మొత్తం తినడం, సగం కాల్చిన సిగరెట్ పీకలు... ఇది కచ్చితంగా బిట్రగుంట గ్యాంగ్ పనే అనుకున్నాను. వాళ్లే అనడానికి ఆలయ ప్రాంగణంలో దొరికిన సిజర్స్ బ్రాండ్ సిగరెట్ పెట్టె ఒక ఆధారమైంది. అప్పట్లో అంత ఖరీదైన సిగరెట్ కాల్చేవారు విశాఖపట్నం ప్రాంతంలోనే లేరు. గర్ల్‌ఫ్రెండ్‌ని అడిగితే... నేను ఉద్యోగంలోకి చేరిన కొత్తల్లో కొన్నాళ్లు గుంటూరులో పనిచేశాను. అక్కడే ఉండే బిట్రగుంట దొంగల గురించి తెలుసుకున్నాను. వాళ్లు దొంగతనం చేసే విధానం గురించి నాకు అవగాహన ఉంది. నాకు ఎప్పుడయితే అనుమానం వచ్చిందో ఆ గ్యాంగ్ లీడర్ చవటా ప్రసాద్ గురించి ఎంక్వైరీ మొదలుపెట్టాను. అతని స్పెషాలిటీ ఏంటంటే... దాదాపు నలభై ప్రాంతాల్లో గర్ల్‌ఫ్రెండ్స్ ఉండేవారు. మా సింహాచలం ప్రాంతంలో కూడా ఒకామె ఉంది. ఆమెని స్టేషన్‌కి తీసుకొచ్చి నాలుగు కేకలు వేయగానే జరిగిందంతా చెప్పింది. చవటా ప్రసాద్, అతని గ్యాంగ్ మూడురోజుల క్రితమే తన ఇంటికి వచ్చి గుడికి సంబంధించి రెక్కీలు వేసుకుని పనిపూర్తిచేసుకుని పారిపోయారని చెప్పింది. బిట్రగుంట దొంగలముఠాకి అప్పట్లో పెద్ద పేరు. వాళ్లు క్రిమినల్ ట్రైబ్స్ అన్నమాట. దృఢంగా, తెలివిగా ఉండేవారు. చవటా ప్రసాద్‌పై అప్పటికే నలభై కేసులున్నాయి. ఆరుసార్లు పోలీసుల చేతుల్లోనుంచి తప్పించుకున్నాడు. మద్రాసు సెంట్రల్‌జైలు నుంచి కూడా తప్పించుకున్న చరిత్ర ఉంది. పదిహేను రోజుల్లో... దొంగలెవరో తెలిసిపోయింది కాబట్టి ప్రెజర్ తగ్గింది. కానీ ప్రతిపక్షంవారు, ఢిల్లీ అధికారులు పచ్చలపతకం దేశం దాటిపోతోందంటూ చేస్తున్న ఊహగానాలు ప్రశాంతత లేకుండా చేశాయి. ఆ పతకం శ్రీకృష్ణదేవరాయలు ఎంతో ప్రేమతో స్వామివారికి బహుమానంగా ఇచ్చారనీ, ఇలాంటి పతకం ఎలిజిబెత్‌రాణి దగ్గర కూడా లేదనీ, ఆ పతకంగానీ దొరక్కపోతే డిపార్టుమెంట్ పరువుపోతుందనీ నానాయాగీ చేశారు. దొంగలు ఎక్కడివారో తెలియగానే నేను వెంటనే గుంటూరు ఫోన్ చేసి బిట్రగుంట దొంగలుండే ప్రాంతంపై నిఘా పెట్టమన్నాను. నేను చెప్పిన పద్ధతిలోనే మెరుపుదాడి చేసి వారిని పట్టుకున్నారు. అందరూ దొరికారు కానీ చవటా ప్రసాద్ దొరకలేదు. దొరికినవారు బంగారాన్ని పంచేసుకుని ఎవరికివారు దాచేసుకున్నారు. అందరినీ ఇంటరాగేషన్ చేసి సొమ్ము మొత్తాన్ని రాబట్టాం. అరవైశాతం బంగారం దొరికింది. పెద్దవాటా తీసుకోవడం వల్ల ప్రసాద్ దగ్గర 40 శాతం సొమ్ము ఉండిపోయింది. పచ్చలపతకం ఉందో లేదో చూస్తే...దాన్ని ఐదు ముక్కలు చేశారు. మూడు ముక్కలు మాత్రమే దొరికాయి. 15వేలు మాత్రమే... దొరికిన బంగారం మొత్తం తీసుకెళ్లి మార్వాడి ముందుపెడితే పదిహేనువేల రూపాయలు కూడా ఉండదన్నాడు. పచ్చలపతకం గురించి అడిగితే... అవి జైపూర్ పచ్చలని చెప్పాడు. పెద్ద ఖరీదు కావన్నాడు. పూర్వంనాటి హారం కావడంతో నలుగురు నాలుగు రకాలుగా ఊహించుకుని మమ్మల్ని పరుగులు పెట్టించారు. అఫ్కోర్స్... ఖరీదైంది కాకపోయినా మా డ్యూటీ మేం చేసేవాళ్లం. దొంగలు దొరికినా, బంగారం దొరికినా... అసలైనవాడు దొరకలేదు. మా గాలింపు ఆగలేదు. ఐదేళ్ల తర్వాత... చవటా ప్రసాద్‌ని అరెస్ట్ చేస్తేగానీ సింహాచలం ఆలయం కేసు ఫైలు మూతపడదు. వెంటనే దొరకడానికి వాడు సామాన్యమైన దొంగా? వాడెంత డెడికేటెడ్ ఫెలో అంటే దొంగకి బలహీనత ఉండకూడదని మద్యం కూడా తీసుకోడు. ఎక్కడికక్కడ బలమైన నెట్వర్క్ ఉంటుంది. ప్రాంతాలవారీగా పోలీసుల బలహీనతలు కూడా తెలుసు వాడికి. సింహాచలం కేసు పెద్దదవడంతో జిల్లా జిల్లా జల్లెడ పట్టడం మొదలుపెట్టాను. ఇక లాభం లేదనుకుని వాడు దగ్గరున్న బంగారాన్ని అమ్మేసి వరంగల్ దగ్గర ములుగు ప్రాంతానికెళ్లి లారీల వ్యాపారం పెట్టాడు. చాలా బుద్ధిమంతుడిగా రంగేసుకుని బతకడం మొదలుపెట్టాడు. ఏదో ఒక సందర్భంలో మా కంట్లో పడ్డాడు. వెంటనే అరెస్ట్ చేశాం. మళ్లీ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. చివరికి ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఆ రోజు సింహాచలం ఆలయం కేసు ఫైలు మూతపడింది. బిట్రగుంట దొంగలు దొంగతనం వృత్తిలో బాగా రిచ్ క్యాడరన్నమాట. వారు కేవలం అమావాస్య చీకట్లోనే దొంగతనానికి బయలుదేరేవారు. దానికి కూడా ఒక సెంటిమెంటు ఉండేది. అర్ధరాత్రి కోడిని కోసి దాని తలను నేలమీదకు విసిరేవారు. దాని ముక్కు ఏ దిశను చూపిస్తే ఆ దిశగా దొంగతనానికి బయలుదేరేవారు. దొంగతానికి వెళ్లినచోట ఏదైనా తినివస్తే... పాపం తగలదని వారి నమ్మకం! రిపోర్టింగ్: భువనేశ్వరి ఫొటో: ఎస్. ఎస్ ఠాకూర్ -
ఆర్మీపై గూర్ఖా తుపాకి
బెస్ట్ కేస్ మాజీ డీజీపీ హెచ్.జె దొర చెప్పిన రియల్ క్రైమ్ స్టోరీ కమిషనర్ అబ్దుల్ సలాంఖాన్ ఆదివారం తనతోపాటు సరదాగా రేస్కోర్సుకి రమ్మని పిలిచారు. పొద్దున్నే రెడీ అవుతున్నాను. ఇంతలో బయట జీపులో వైర్లెస్ మెసేజ్ చెవిలో పడింది. ‘గూర్ఖా ఫైరింగ్... పాయగా పాలెస్’ అని వినపడగానే పరుగున జీపెక్కాను. పాయగా పాలెస్ ఆర్మీ ఉద్యోగుల కార్యాలయం. చాలా పెద్ద భవంతి. ప్రస్తుతం బేగంపేటలో ఉన్న కంట్రీక్లబ్, అమెరికన్ కాన్సులేట్ ఆఫీస్ ఉన్నవి దాని ప్రాంగణంలోనే. అప్పుడు నేను డిప్యూటీ కమిషనర్‌గా ఉన్నాను. సంఘటనా స్థలానికి చేరుకునేటప్పటికే లోకల్ పోలీసులంతా గుమిగూడారు. విషయం కమిషనర్గారికీ తెలిసింది. ఆ ప్రాంతం సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఏసీపీ, ఇన్స్పెక్టర్, సీఐ ఏం చేయాలో తోచక కంగారు పడుతున్నారు. జీతం కోసం! పాయగా పాలెస్ నిజాంకాలంనాటి భవంతి. నిజాం ఇంటివారు కేవలం పాయగా పాలెస్‌కి చెందినవారితోనే పెళ్లి సంబంధం అందుకునేవారట. ఆ పాలెస్ తలుపులు ఏడెనిమిది అడుగుల పొడవుండేవి. ఏసీపీ నాకెదురొచ్చి... ‘‘సార్, ఇక్కడ భవంతికి కాపలా ఉంటున్న గూర్ఖా... మేజర్‌పై కాల్పులు జరిపి, పైన మేడపైకి వెళ్లిపోయాడు. అతన్ని పట్టుకోడానికి వెళదామంటే పై మెట్లపై నుంచి కాలుస్తానని బెదిరిస్తున్నాడు. మేం ఎప్పుడూ ఈ భవంతిలోకి వెళ్లలేదు. అతన్ని ఎలా పట్టుకోవాలో తెలియడం లేదు. పైన అంతస్థులో పదుల సంఖ్యలో ఆర్మీ సిబ్బంది ఉన్నారు. వారంతా తలుపులు మూసుకుని లోపలే ఉన్నారు. ఎవ్వరినీ బయటికి రావొద్దని చెప్పాం...’’ అంటూ వివరించాడు. మేజర్ని అప్పటికే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాపాలా ఉండే గూర్ఖా... కాల్పులు జరపడం ఏంటని ఆరా తీస్తే... తెల్లవారితే దసరా పండగ. శాలరీ అడ్వాన్స్ ఇవ్వనందుకు ఆర్మీ సిబ్బందితో గొడవపడ్డాడట. బయట ఉన్న మేజర్ లోపలికి వెళ్లి ఏంటని గట్టిగా గద్దించడంతో తుపాకి గురిపెట్టాడు. వారించినా వినకుండా మేజర్‌పై కాల్పులు జరిపి మెట్లెక్కి మేడపైకి వెళ్లిపోయాడు. ఇదీ విషయం! కొందరేమో జీతంకోసమే కాల్చాడంటున్నారు. ఇంకొందరు అతనికి మతిస్థిమితం లేదంటున్నారు. పొద్దున్నే తాగేసి వచ్చాడంటారు కొందరు. ఏదీ క్లారిటీ లేదు. ఆయుధపూజ కారణంగా... ఆర్మీ ఆఫీసర్లంటే పోలీసువారికన్నా స్ట్రాంగ్ కదా! వారి దగ్గర బోలెడన్ని ఆయుధాలుంటాయి. మరి ఒక గూర్ఖాకి బెదిరిపోయే పరిస్థితి ఎందుకొచ్చిందంటే... దసరా ముందురోజు కదా! ఆయుధపూజ కోసం వెపన్లన్నింటినీ శుభ్రం చేసి ఒక గదిలో పెట్టారట. దాంతో పై అంతస్థులో ఉన్న అధికారుల దగ్గర ఒక్క ఆయుధం కూడా లేకుండా పోయింది. కిందున్నవారి దగ్గర ఉన్నా... హంతకుడు పైన ఏ మూలన నక్కివున్నాడో తెలీదు. విషయాలన్నీ విన్న తర్వాత అయోమయంగా తోచింది. అంత పెద్ద అంతస్థులో పైకి వెళ్లడానికి ఒకే ఒక్క మెట్లమార్గం తప్ప మరే దారీ లేదు. నలుగురు పోలీసుల్ని వెంటేసుకుని గోడపైనుంచి పైకి ఎక్కడానికి ప్రయత్నించాను. లాభం లేకపోయింది. గూర్ఖా ఉన్న ప్రాంతంలోకి వెళ్లడం కుదరలేదు. ఇంతలో కమిషనర్‌గారు, ప్రెస్ అందరూ వచ్చేశారు. ప్రమాదంలో చిక్కుకున్నది ఆర్మీ అధికారులు కావడంతో నాక్కూడా ఒకింత భయం వేసింది. నా కింది ఆఫీసర్లకు చెప్పి వెంటనే ఫైర్ ఇంజన్ని రప్పించమని చెప్పాను. బాగా పొడవైన లాడర్ ఉన్న ఇంజన్ కావాలన్నాను. నా ఐడియా ఏంటంటే, ఆ నిచ్చెన సాయంతో పై అంతస్థులోకి ఎక్కొచ్చు కదా అని. ఫైర్ ఇంజన్ సాయంతో... మాయదారి గూర్ఖా మేడపై ఎక్కడ దాక్కున్నాడో తెలియడం లేదు. ఫైర్ ఇంజన్ రాగానే భవంతి ముందువైపు లాడర్ ఓపెన్ చేయించి సిద్ధంగా పెట్టుకున్నాను. వాడు చూస్తే ప్రమాదం... అందుకని లోపల మెట్లదగ్గర మా పోలీసువాళ్లని కొద్దిగా హడావిడి చేయమని చెప్పాను. దాంతో వాడు మెట్లదగ్గరే ఉండి వారిని బెదిరిస్తుంటాడు. ఈలోగా నేను లాడర్ సాయంతో పైకి ఎక్కొచ్చు కదా! వాడు ఇంజన్ వచ్చినట్టు గమనించివుంటే మాత్రం లాడర్పైకి ఎక్కినవారిని పిట్టని కాల్చినట్టు కాల్చేస్తాడు. అందుకని మా కింది సిబ్బంది నన్ను ఎక్కొద్దని వారించారు. నా భయమంతా పై అంతస్థులోని గదుల్లో చిక్కుకున్న ఆర్మీవారిపై హంతకుడు ఎక్కడ అటాక్ చేస్తాడోనని. ఇద్దరు కానిస్టేబుళ్లని ఇంజన్ దగ్గర నిలబెట్టాను. నేను పైకి ఎక్కుతున్నప్పుడు వాడుగాని నాపై ఫైర్ చేసే ప్రయత్నం చేస్తే వీళ్లని కూడా ఫైర్ ఓపెన్ చేయమన్నాను. నా మాటలు విని లోపలున్న ఆర్మీఅధికారులు తలుపులు తీసారు. ఆయుధం లేకపోతే ఆర్మీవారు మాత్రం ఏం చేయగలరు? వారి ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకుని కూర్చున్నారు. మ్యాప్ వేయించి... ఎలాగోలా పై అంతస్థు కారిడార్లోకి వెళ్లాను. అక్కడి నుంచి వాడున్న మేడపైకి ఎలా వెళ్లాలో దారి తెలియలేదు. ముందు కారిడార్‌లో ఉన్న డోర్ కొట్టాను. నా మాటలు విని లోపలున్న ఆర్మీ అధికారులు తలుపులు తీసారు. ఆయుధం లేకపోతే ఆర్మీవారు మాత్రం ఏం చేయగలరు? అతనున్న మేడపైకి ఎలా వెళ్లాలని అడిగితే... మ్యాప్ గీసి చూపించారు. నేను, నాతో ఇద్దరు పోలీసులు అతనున్నవైపుకి కదిలాం. అప్పుడు నోరు తెరిచాడు. తనవైపుకొస్తే కాల్చేస్తానని బెదిరిస్తున్నాడు. ఎల్ ఆకారంలో ఉన్న కారిడార్‌లో ఒకవైపునుండి అతన్ని బుజ్జగించడం మొదలుపెట్టాం. ‘మేం ఆర్మీ సిబ్బంది కాదు... నీ బాధ మాకు తెలుసు. నేపాలివాళ్లకి దసరా చాలా పెద్ద పండగ. ఆ రోజు డబ్బుల్లేకపోతే మిమ్మల్నే నమ్ముకున్న భార్యపిల్లలు చాలా ఇబ్బందిపడతారు. నీకు సమయానికి శాలరీ అడ్వాన్స్ ఇవ్వకపోవడం నిజంగా తప్పే. నువ్వు పగతోనో, మరో ఉద్దేశ్యంతోనో కాల్పులు జరపలేదు కదా. అయినా మేజర్‌కి పెద్దగా ఏం ప్రమాదం జరగలేదు. నువ్వు గన్ పడేసి లొంగిపో...’’ అంటూ నేనూ, నాతో ఉన్న పోలీసులూ హిందీలో నచ్చచెప్పడం మొదలుపెట్టాం. ఇంతలో మేజర్ చనిపోయినట్టు హాస్పిటల్ నుంచి కబురొచ్చింది. రెండున్నర గంటల తర్వాత, మా బుజ్జగింపు మాటల్ని నమ్మి గూర్ఖా నోరు తెరిచాడు. ‘మీరు గన్స్ కింద పడేస్తే... నేనూ పడేస్తాను’ అన్నాడు. తీరా మేం వెపన్స్ పడేశాక వాడు ఎదురుగా వచ్చి కాల్పులు జరిపితే పరిస్థితి ఏంటి? అతను చెప్పిన మాట వినడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. వెపన్స్ కింద పడేశాం. వాడూ పడేశాడు. ముందుకెళ్లి వాడ్ని పట్టుకుని కిందికి తెచ్చాం. ఇది జరిగి 42 ఏళ్లు(1972) అవుతోంది. జీవితఖైదు... నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. ఆ గుర్కా పేరు ధన్బహదూర్. ఎక్స్ ఆర్మీ ఆఫీసర్. నిజంగానే నేపాలివాళ్లకి దసరా పెద్ద పండగ. పైగా బతుకుతెరువుకి మన ప్రాంతానికొచ్చినవాళ్లు అప్పులు చేసి అవసరాలు తీర్చుకోరు. ఉన్నంతవరకూ నమ్మకంగా ఉంటారు. వారిని ఇబ్బందిపెడితే రియాక్షన్ కూడా అదేస్థాయిలో ఉంటుంది. అందరు ఆర్మీ అధికారులతో మాట్లాడాక తెలిసిందేమి టంటే ధన్బహదూర్ మంచివాడు. జీతం విషయంలో విసిగిపోయాడు. అడిగిన వెంటనే ఇవ్వడానికి అధికారులకు పూనే నుంచి ఆర్డర్ రావాలి. ఆ విషయాన్నే పదే పదే చెపుతుంటే వాడికి కోపం వచ్చింది. ఫ్రస్ట్రేషన్లో కాల్పులు జరిపాడు. అంతకు మించి కారణం దొరకలేదు. ఉత్త పుణ్యానికి మేజర్ బలైపోయాడు. గూర్ఖాకీ జీవితఖైదు శిక్ష పడింది. పండగ రేపనగా ఓ సైనికుడ్ని కోల్పోయాం. అయితే మరో ప్రమాదం జరక్కుండా గూర్ఖాని చాకచక్యంగా పట్టుకున్నందుకు అందరూ మెచ్చుకున్నారు. గ్యాలంటరీ మెడల్... అప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్న బ్రిగేడియర్ బాలచందర్ నా సాహసాన్ని చాలా అభినందించారు. మాటలతో ఊరుకోలేదు. నా సాహసం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అప్పటి ఐజి కళ్యాణరావుగారు నన్ను ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. నేను హంతకుడ్ని పట్టుకున్న విధానాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం నాకు గ్యాలంటరీ మెడల్ ప్రదానం చేసింది. ఆ మెడల్ అందుకున్న మొదటి ఐపీఎస్ నేనే. అంతా హ్యాపీయే కానీ మేజర్ మరణం గుర్తొచ్చినప్పుడు మాత్రం బాధేస్తుంది. రిపోర్టింగ్: భువనేశ్వరి ఫొటో: నోముల రాజేశ్‌రెడ్డి -
మధ్యాహ్నం హత్య
మాజీ డీజీపీ పేర్వారం రాములు చెప్పిన రియల్ క్రైమ్ స్టోరీ ‘‘ఉదయం పదకొండు గంటలకు కమిషనరేట్‌లో నా ఫోన్ మోగింది. హలో అనకుండానే అవతలివైపున పాతబస్తీ ఎస్ఐ హత్యవివరాలను హడావుడిగా చెప్పడం మొదలుపెట్టాడు. బెస్ట్ కేస్ పట్టపగలు... నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ వస్త్రవ్యాపారిని కత్తులతో పొడిచి హత్య చేశారు. పాతబస్తీలో నాలుగు రాళ్లు రువ్వుకుంటేనే గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అలాంటిది హత్య. వస్త్రవ్యాపారి హత్య అంటే ఆశ్చర్యపోవాల్సిన విషయమే. వాళ్లకి పెద్దగా శత్రువులుండే అవకాశం ఉండదు. ఉన్నా... ఇలా రోడ్డుపై తెగబడాల్సిన పనిలేదు. ఎవరో మతతత్వశక్తులు ఇలాంటిపనికి పూనుకున్నారేమోనని నా కింది ఆఫీసర్లు వారి ఊహల్ని వినిపిస్తున్నారు. సెన్సిటివ్ కేసు. ఎలాంటి అల్లర్లకు అవకాశం లేకుండా దర్యాప్తు జరగాలి. మరు నిమిషమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారి దగ్గర నుంచి ఫోన్. ‘ఏమయ్యా... మన నగరంలో అసలు పోలీసులున్నారా? పట్టపగలు రోడ్డుపైన హత్య చేస్తుంటే ఏంచేస్తున్నట్టు? రేపు సాయంత్రంలోగా హంతకుడ్ని పట్టుకోవాలి’ అంటూ ఆర్డరు. వెంటనే నేను నాలుగు టీమ్‌లను సిద్దం చేసుకుని ముందుగా సంఘటనా స్థలానికి వెళ్లాం. అప్పటికే వ్యాపారి చనిపోయాడు. ఉదయం 10:30 గంటలకు... ఆ రోజు పాతబస్తీ యథావిధిగా తెల్లవారింది. ఓ వస్త్రవ్యాపారి బేగంపేటలోని తన దుకాణానికి స్కూటర్‌పై బయలుదేరాడు. పురానాపూల్ బ్రిడ్జ్ ఎక్కాడు. బ్రిడ్జ్ కదా... బండి స్లోగా వెళుతోంది. ఇంతలో ఇద్దరు కుర్రాళ్లు ఓ బండిపై వచ్చి వ్యాపారి బండిని ఢీకొట్టారు. ఉన్నపళంగా కిందపడ్డ వ్యాపారి ‘కళ్లు కనపడడం లేదా...’ అంటూ అరవబోతుండగానే అందులో బాగా బలీయంగా ఉన్న వ్యక్తి చొక్కాలోనుంచి చాకు తీసి వ్యాపారి పొట్టలో నాలుగైదు పోట్లు పొడిచాడు. వాహనదారులంతా ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు. ఒక్కరు కూడా ముందుకొచ్చి హంతకుల్ని పట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఎవరో పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. మావాళ్లు వెళ్లేసరికి కొన ఊపిరితో ఉన్నాడు వ్యాపారి. దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. మార్గమధ్యంలోనే చనిపోయాడు. మృతుడి చొక్కాజేబులో ఉన్న వివరాల సాయంతో పాతబస్తీలో అతనున్న ఇంటికి చేరుకుంది మా టీమ్. 11:30 గంటలకు... చనిపోయిన వ్యాపారి మధ్యవయస్కుడు. భార్య, ఇద్దరు ప్లిలలు, తల్లి, తమ్ముడు ఉన్నారు. మధ్యతరగతి కుటుంబం. అందరూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. హతుడికి ఎవరైనా శత్రువులున్నారేమోనని ఆరా తీస్తే... అలాంటివారెవరూ లేరని తెలిసింది. ఆస్తితగాదాలు కూడా లేవు. దుకాణం చుట్టుపక్కల ఎంక్వైరీ చేశాం. తోటి వ్యాపారులతో, కస్టమర్లతో కలుపుగోలుగా ఉండేవాడని చెప్పారు. ఇంటి దగ్గర పరిస్థితి చూస్తే... ‘చీమకు కూడా హాని తలపెట్టని నా బిడ్డను చంపే అవసరం ఎవరికుంటుంది సార్...’ అంటూ అతని తల్లి పోలీసుల చొక్కాపట్టుకుని రోదించింది. భార్య సంగతీ అంతే. తనతో భర్త ఎలాంటి విషయాలు చెప్పలేదంది. రెండురోజులుగా కొద్దిగా ఆందోళనగా ఉన్నట్టు చెప్పిందంతే. పోనీ ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు అక్కడ ఎవరితోనైనా గొడవపడేవాడా? గత మూడునాలుగేళ్లలో పాతబస్తీ వదిలి ఎక్కడికీ వెళ్లలేదు. నేను మరో రెండు టీమ్‌లను నా దగ్గర పెట్టుకుని ఫోన్‌కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. హతుడి ఇంటి దగ్గరున్న టీమ్ నుంచి కాల్ వచ్చింది. ‘ఎలాంటి క్లూ దొరకడం లేదు సార్... వచ్చేయమంటారా’ అని. ‘మీరు ఇల్లంతా మరోసారి వెదకండి. చిన్న కాగితం ముక్క కూడా వదలకండి. అక్కడగానీ క్లూ దొరకకపోతే... ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం’ అని చెప్పాను. నా దృష్టిలో హత్యజరిగిన ఫస్ట్ అవర్ చాలా కీలకమైంది. ఆ సమయంలోనే చాలావరకూ విషయం తెలిసిపోవాలి. లేదంటే... సమయం చేతిలో మేం కీలుబొమ్మలం కావాల్సిందే. 12:00 గంటలకు... ఓ అరగంట తర్వాత ఫోన్ మోగింది. ‘గోడపైన క్యాలెండర్లో మూడు తేదీలు పెన్నుతో రౌండప్ చేసి ఉన్నాయి సార్... దానికి ముందు నెలలో కూడా అవే తేదీల్లో అలాగే రౌండప్ చేసి ఉంది. తేదీలకింద ఒకే రకమైన బండి నంబర్ నోట్ చేసి ఉంది’ అని చెప్పాడు ఎస్ఐ. నాకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. కేసు కీలక మలుపు తిరిగిందనుకున్నాను. వెంటనే నేను మరో టీమ్‌కి ఆ బండి నంబర్ ఇచ్చి ఆర్టీఏ ఆఫీసుకి పంపించాను. 1:00 గంటకు... ఆ బండికలవాడి అడ్రసు పట్టుకున్నారు మా వాళ్లు. ఆ వస్త్రవ్యాపారి ఉన్న ప్రాంతంలోనే కొద్దిదూరంలో అతని అడ్రసు. ఇంటికెళితే అతను లేడు. తల్లి ఉంది. ‘అబ్బా... ఏం సతాయిస్తరు. మీకు రోజు మామూలు ఇవ్వాలా నా బిడ్డ’ అంటూ పోలీసుల్ని తిట్టడం మొదలుపెట్టింది. ఆ సందులో నలుగురితో మాట్లాడితే ఆ బండికలవాడు కిరాయి హంతకుడని, లోకల్ పోలీసులకు లంచం ఇచ్చుకుంటూ బతికేస్తాడని చెప్పారు. అప్పటికే అతనిపై బోలెడన్ని కేసులున్నాయి. బెయిల్‌పై బయటికి వచ్చినపుడు ఇలాంటి పనులకు పాల్పడుతుంటాడు. పోలీసులు గద్దించి అడగడంతో తన చెల్లెలు ఇంటిదగ్గర ఉన్నట్లు చెప్పింది. 2:00 గంటలకు... బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12 దగ్గర మహ్మదీయలైన్స్ స్లమ్ ఏరియా. అన్నీ చిన్న చిన్న ఇళ్లు. మావాళ్లు సివిల్‌డ్రెస్‌లో హంతకుడి స్నేహితుల్ని వెంటబెట్టుకుని వెళ్లారు. తలుపు తట్టారు. ఎవరూ పలకలేదు. ఒక్కసారిగా లోపలికి చొరబడ్డారు. హంతకుడు బాత్రూమ్లో చేతులూ కాళ్లు కడుక్కుంటున్నాడు. అతని చేతుల రక్తపు మరకలు ఇంకా వదల్లేదు. ‘రెడ్ హ్యాండెడ్’గా పట్టుకోవడం అంటారు కదా! అంటే ఎర్రటిరక్తపు చేతుల్ని పట్టుకోవడం అన్నమాట. అదే జరిగింది ఇక్కడ. వెంటనే అతని చేతికున్న బ్లడ్ శాంపిల్స్‌ని తీసుకున్నారు. వ్యాపారి రక్తంతో మ్యాచ్ అయ్యింది. అతని చేతులకు బేడీలు వేశాక హంతకుడన్న మాటలు మా టీమ్ ఎప్పటికీ మరచిపోలేదు. ‘మీరు పోలీసులా, సైతాన్‌లా... మీకెలా తెలిసింది నేనే చంపానని. పోలీసులకు దొరికిపోతానని తెలుసు. కానీ ఇలా రక్తపు చేతుల్తో పట్టుపడతానని ఊహించలేదు’. ఉదయం పదిన్నరకు హత్య జరిగితే మధ్యాహ్నం రెండున్నరకు హంతుకుడ్ని పట్టుకున్నాం. చనిపోయిన వ్యక్తికి ఎలాంటి శత్రువర్గం కానీ, హంతకుల జాడ కనిపెట్టగలిగే ఆధారం కానీ లేని పరిస్థితుల్లో గంటల్లో కేసుని చేధించినందుకు డిపార్టుమెంటు తరఫు నుంచే కాకుండా ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి కూడా మంచి ప్రశంసలు అందాయి. ఎందుకు చంపినట్టు? ఇంతకీ హత్య వెనక ఎవరున్నారని అడిగిన వెంటనే చెప్పలేదు. మాదైన పద్ధతిలో ఇంటరాగేషన్ చేశాక చెప్పాడు. వ్యాపారి తమ్ముడే హత్య సూత్రధారి. హంతకుడు దొరికిన విషయం చెప్పకుండా వ్యాపారి ఇంటికి వెళ్లారు మావాళ్లు. తల్లిపక్కన కూర్చుని ఏడుస్తున్నాడు ఆ తమ్ముడు. చిన్న పని అని చెప్పి స్టేషన్‌కి తీసుకొచ్చి విచారిస్తే అసలు విషయం బయటపెట్టాడు. ‘‘మా అన్నయ్య పిసినారి సార్... బైక్ కావాలని నాలుగేళ్ల నుంచి బతిమిలాడుతున్నాను. స్నేహితులతో సరదాగా గడిపితే ఇష్టపడడు. డబ్బుల విషయంలో నరకం చూపిస్తున్నాడు. అందుకే మా పక్కవీధి కిరాయి రౌడీతో పదివేలకు డీల్ కుదుర్చుకున్నాను’’. హత్యచేసినవాడికి, చేయించినవాడికి ఇద్దరికీ జీవితఖైదు శిక్ష పడింది. క్యాలెండర్‌పై వ్యాపారి రౌండప్ చేసుకున్న మూడు తేదీలు బాగా ఉపయోగపడ్డాయి. ఆయా రోజుల్లో ఆ బండి తనను వెంబడించిందని అర్థం కావొచ్చు. పాపం అమాయకుడు ఎవరితో చెప్పకుండా క్యాలెండర్‌పై నోట్ చేసుకుని ఊరుకున్నాడు. మొత్తానికి ఒక్కరోజులో హంతకుడి చేతులకు బేడీలు వేసినందుకు నేనూ... మా టీమ్ ఊపిరి పీల్చుకున్నాం. రిపోర్టింగ్: భువనేశ్వరి