సెన్సేషన్ కోరుకునే సీరియల్ కిల్లర్స్‌లో ఒకడు జోడియాక్. ఏళ్లు గడిచినా ఆ పేరు తప్ప.. ప్రపంచానికి అతడి గురించి ఎలాంటి సమాచారం లేదు. అది కూడా అతడి అసలు పేరు కాదు. ‘నేను చంపినవారంతా స్వర్గంలో నా బానిసలే.. దమ్ముంటే నన్ను పట్టుకోండి, లేదంటే నా బానిసల్ని నన్ను పోగుచేసుకోనివ్వండి (చంపుకోనివ్వండి)’ అంటూ పోలీసులకే లేఖ రాసిన ఈ క్రూరుడు.. ఎలా ఉంటాడో? ఎందుకు అన్ని హత్యలకు తెగబడ్డాడో? నేటికీ మిస్టరీనే.
1968–69 సంవత్సరాల్లో అమెరికా, కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరాన్ని వణికించాడు జోడియాక్. చంపే ముందు హతులకు తన మారు పేరు ‘జోడియాక్’ అని చెప్పి మరీ చంపేవాడు. అలా చెప్పుకోవడంలో అమితమైన ఆనందం పొందేవాడట. జోడియాక్ అంటే అంతా అని అర్థం. వరుస హత్యలతో పోలీసులకే చుక్కలు చూపించిన జోడియాక్.. హత్యలు చేసిన చోట కోడ్ లాంగ్వేజీలో క్లూలు కూడా ఇచ్చేవాడు. చంపేస్తానని బెదిరించి న్యూస్ పేపర్లలో అతడి కోడ్ లెటర్స్ ప్రింట్ చేయించేవాడు. అయితే పోలీసులు, డిటెక్టివ్‌లు కలసి తలలు పట్టుకున్నా.. ఆ లెటర్లను డీ–కోడ్ చెయ్యలేకపోయేవారు. నిజానికి జోడియాక్ ఐదుగుర్ని హత్య చేసినట్లు పూర్తి ఆధారాలు ఉన్నాయి. కానీ ‘నేను 37 మందిని చంపాను’ అని స్వయంగా ప్రకటించుకున్నాడతను. ఓసారి రక్తపు మరకలున్న షర్టును పంపించి మరీ విర్రవీగాడు.
జోడియాక్ ఊహాచిత్రం – కోడ్ లెటర్
హత్య చేసిన ఏడాదికి వివరాలు..
శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో కొన్ని బుల్లెట్ల శబ్దాలు, రెండు ఆర్తనాదాలు వినిపించాయి. అటుగా పరుగు తీసిన స్థానికులకు.. అక్కడ ఓ కారు ముందు ఒక యువజంట రక్తపు మడుగులో పడి కనిపించింది. వాళ్ల పేర్లు బెట్టీ లావ్ జెన్సెన్(16), డేవిడ్ అర్థర్ ఫారడే(17). వారిలో బెట్టీ అప్పటికే ప్రాణాలతో లేదు. కొన ఊపిరితో ఉన్న ఫారడేను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే చనిపోయాడు. అతడి తలలో, ఆమె వీపులో బుల్లెట్లు ఉన్నాయని తేలింది. అదే రోజు అర్థరాత్రి తర్వాత పోలీస్ స్టేషన్‌లో ఫోన్ మోగింది.
‘నా పేరు జోడియాక్.. నాకు డబుల్ మర్డర్ వివరాలు తెలుసు’ అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. ‘ఈ రోజు ఆ రెండు హత్యలు నేనే చేశాను. మరో సమాచారం ఇవ్వడానికే కాల్ చేశాను. కొలంబస్ పార్క్‌వేకి తూర్పున 1.6 కిలోమీటర్ల దూరంలో పాడుబడిన ప్రభుత్వపార్క్‌లో ఉన్న బ్రౌన్ కలర్ కారులో ఇద్దరు పిల్లల శవాలున్నాయి. ఈ రోజు ఈ ఇద్దరినీ చంపినట్లే గత ఏడాది 9 మిల్లీమీటర్ల లర్జెర్ గన్ తో వాళ్లని కాల్చి చంపాను’ అంటూ షాకిచ్చాడు. నిజంగానే పార్క్‌లోని బ్రౌన్ కలర్ కారులో ఇద్దరు పిల్లల అస్థిపంజరాలు లభించాయి.
చదవండి: నదిలో తేలుతున్న వందల అస్థిపంజరాలు.. మిస్టరీ డెత్ వెనుక అసలు కారణం ఏమిటీ?
దాంతో మీడియా దృష్టి జోడియాక్ పైన, జోడియాక్ దృష్టి మీడియాపైన పడ్డాయి. పోలీసులూ ఆవేశంగా జోడియాక్ వేటలో పడ్డారు. నెలలు గడుస్తున్నాయి. ఆధారాలు లేక కేసు నీరుగారింది. ఉన్నట్టుండి నగరంలో మళ్లీ కాల్పుల శబ్దం. మరో ఘోరం జరిగింది. కారులో వెళ్తున్న ఓ జంటపై జోడియాక్ ఎటాక్ చేశాడు. ఆ ఘటనలో మహిళ అక్కడికి అక్కడే చనిపోగా.. మైకేల్ మ్యాగ్ అనే వ్యక్తి గాయాలతో బతికి బయటపడ్డాడు. హంతకుడి పేరు ‘జోడియాక్’ అనడంతో పోలీసులకు ఆశలు చిగురించాయి. మొదటిసారి జోడియాక్‌ని చూసిన ప్రత్యక్షసాక్షిగా మైకేల్ ఇచ్చే వాగ్మూలం కీలకంగా మారింది. ‘జోడియాక్ తెల్లజాతీయుడని, సుమారు 5 అడుగుల 8 అంగుళాల పొడవు ఉంటాడని’ ప్రపంచానికి తెలిసింది. మైకేల్ చెప్పిన రూపురేఖల ఆధారంగా ఊహచిత్రాన్ని గీయించారు.
ఆ చుట్టుపక్కల అనుమానిత తెల్లజాతీయులను అదుపులోకి తీసుకుని విచారించారు. నెల రోజులు గడిచాయి. జోడియాక్ ఓ ప్రముఖ న్యూస్ పేపర్‌కు హెచ్చరికలతో కూడిన ఓ కోడ్ లాంగ్వేజ్ లేఖను పంపించాడు. ‘దీన్ని మొదటి పేజీలో ప్రచురించకుంటే శాల్తీలు లేచిపోతాయి’ అని. దాంతో భయపడిన సదరు పేపర్ యాజమాన్యం.. మొదటి పేజీలో దాన్ని ప్రచురించింది. అయితే అందులో ఏముంది అనేది ఎవరికీ అర్థం కాలేదు. డీ–కోడ్ చెయడానికి చాలా మంది మేధావులే ప్రయత్నించారు. వీలుకాలేదు. చివరికి ఓ హైస్కూల్ టీచర్.. ఆ లెటర్‌ని డీ–కోడ్ చేసి అందులో ఉన్నది తెలియజేయడంతో పోలీసులు బిత్తరపోయారు. ‘నాకు మనుషులని చంపడం భలే ఇష్టం.
అడవిలో మృగాలను చంపితే వచ్చే ఆనందం కంటే మనుషుల్ని చంపడం వల్ల వచ్చే ఆనందమే ఎక్కువ అనిపిస్తోంది. ఇందులో ఫన్ ఉంది. ఎందుకంటే మనిషే అన్నిటికంటే ప్రమాదకరమైన జంతువు. కళ్లముందు ఎవరైనా నా కారణంగా చస్తుంటే థ్రిల్లింగ్‌గా ఉంటుంది. నేను మరణించాక తిరిగి స్వర్గంలో జన్మిస్తాను. ఇప్పుడు నేను చంపిన వాళ్లంతా అక్కడ నా బానిసలుగా మారతారు. నా అసలు పేరు చెప్పను. చెబితే మీరు కనిపెట్టేస్తారు. వీలైతే నన్ను పట్టుకోండి. లేదంటే నా పని నన్ను చేసుకోనివ్వండి. స్వర్గంలో కాబోయే నా బానిసల్ని కలెక్ట్ చేసుకోనివ్వండి’ అని రాశాడు జోడియాక్. అతడు రాసిన కోడ్ వీడింది కానీ అతడు ఎవరన్నది నేటికి తెలియలేదు. తెలియబోదు కూడా. ఎందుకంటే ఇప్పటికే సుమారు 53 ఏళ్లు దాటింది. జోడియాక్ ప్రాణాలతో ఉన్నాడో లేదో కూడా ఎవరికీ తెలియదు.
- సంహిత నిమ్మన
చదవండి: అచ్చం భేతాళ కథల్లో మాదిరి.. ఈ నీటిలో పడితే వెంటనే రాయిలా అయిపోతారు..!
Comments
Please login to add a commentAdd a comment