ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ‘ఏరోస్పేస్ & ఏవియేషన్ ఇన్ 2047’ అంతర్జాతీయ సదస్సు న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం ప్రారంభమైంది. నవంబర్ 18, 19 తేదీల్లో రెండు రోజులపాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ దేశంలో ఏరోస్పేస్ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తూ 75 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియాను ఏఈఎస్‌ఐని అభినందించారు. అనంతరం ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి, వివిధ పరిశ్రమల ఉత్పత్తులను సందర్శించి స్టార్టప్‌లతో సంభాషించారు.
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ దూసుకుపోతోందని, సైన్స్‌లో భారతీయ మహిళల పాత్ర పెరుగుతోందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. రక్షణ, టూరిజం శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ మాట్లాడుతూ రక్షణ రంగంలో దేశం సాధించిన విజయాలు, భారత ప్రభుత్వం విధాన సంస్కరణలు, రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా డీఆర్‌డీవో చేస్తున్న కృషిని అభినందించారు.
ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, డీఆర్‌డీవో చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి అతిథులను స్వాగతిస్తూ అధునాతన సామర్థ్యాల సాధనతో దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడానికి అన్ని పరిశోధన, విద్యాసంస్థలు, పరిశ్రమల కృషిని సమన్వయం చేయడంలో ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా పాత్ర గురించి వివరించారు.
అలాగే ఇస్రో చైర్మన్ సోమనాథ్, సీఎస్‌ఐఆర్ డీజీ డాక్టర్ కరైసెల్వి, డైరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ డాక్టర్ కామత్, ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్, వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్, హాల్ చైర్మన్ అనంతకృష్ణన్, పౌర విమానయాన శాఖ సీనియర్ ఆర్థిక సలహాదారు పీయూష్, టాటా సన్స్ ప్రెసిడెంట్ బన్మాలి అగర్వాల్, యూఎస్‌ఏ జనరల్ అటామిక్స్ సీఈవో డాక్టర్ వివేక్ లాల్ తదితరులు ప్రసంగించారు.
సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖులు, నీతి ఆయోగ్ సభ్యులు, భారత ప్రభుత్వ కార్యదర్శులు, వివిధ సంస్థల అధిపతులు, అంతర్జాతీయ నిపుణులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, విద్యార్థులతో సహా 1,500 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. దాదాపు 200 పరిశ్రమలు, ఎస్‌ఎంఈలు, 75 పైగా స్టార్టప్‌లు ఎగ్జిబిషన్‌లో తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment