సాక్షి, హైదరాబాద్: ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్)లో తెలంగాణ మంచి పురోగతి కనబరుస్తోంది. దేశంలోనే రెండో స్థానంలో నిలిచి రికార్డు సాధించింది. 2018, నవంబర్ నాటికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు శుద్ధి చేసిన ఘన వ్యర్థాల గణాంకాలను ఇటీవల కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ విడుదల చేసింది. ఈ జాబితాలో ఛత్తీస్‌గఢ్ ముందు వరుసలో ఉంది. ఇక్కడ ఏటా 6,01,885 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటే, అందులో 84 శాతం ఘన వ్యర్థాలను ప్రాసెసింగ్ చేస్తున్నారు.
మన రాష్ట్రంలో 26,90,415 మెట్రిక్ టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా.. ఇందులో 73% వ్యర్థాలు శుద్ధికి నోచుకుంటున్నాయి. ఇతర పెద్ద రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. అడ్డగోలుగా ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నా.. వాటి శుద్ధిలో చతికిలపడ్డాయి. పశ్చిమబెంగాల్ అత్యంత తక్కువగా 5 శాతం, జమ్మూకశ్మీర్ 8 శాతం ప్రాసెసింగ్ చేస్తున్నాయి. మహారాష్ట్రలో అత్యంత ఎక్కువగా ఏటా 8,22,38,050 మెట్రిక్ టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి.
20 శాతమే ప్రాసెసింగ్..
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ 2016–17 లెక్కల ప్రకారం.. దేశంలో రోజుకు లక్షన్నర మెట్రిక్ టన్నుల ఘనవ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటే వీటిలో 90 శాతం చెత్తను సేకరిస్తోంది. అయితే అందులో 20 శాతమే.. అంటే రోజుకు 27 వేల మెట్రిక్ టన్నుల ఘన వ్యర్థాలే శుద్ధి అవుతున్నాయి. 2016–17లో 71లక్షల టన్నుల అత్యంత ప్రమాదకర వ్యర్థాలను గుర్తించగా, అందులో కేవలం 36.8 లక్షల టన్నుల వ్యర్థాలు రీసైక్లింగ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment