Environment department
-
‘జగనన్న భూహక్కు –భూరక్ష’కు సర్వే రాళ్లు సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 305 గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్లకే జగనన్న భూహక్కు–భూరక్ష పథకం కోసం వినియోగించే సర్వే రాళ్ల ఆర్డర్లిస్తున్నామని రాష్ట్ర గనులు, ఇంధన, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. మూడో దశలో అక్టోబర్ 15 నాటికి 25.42 లక్షల సర్వే రాళ్లు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్వాహకులతో సర్వే రాళ్ల సరఫరాపై శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గ్రానైట్ ఫ్యాక్టరీలకు అండగా నిలిచేందుకు సీఎం జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని, సంక్షోభంలో కూరుకుపోయిన గ్రానైట్ ఫ్యాక్టరీలకు చేయూతనిస్తూ స్లాబ్ సిస్టమ్ తెచ్చారని, విద్యుత్ రాయితీలు కల్పించారని తెలిపారు. సర్వే రాళ్ల తయారీ ఆర్డర్లను గ్రానైట్ ఫ్యాక్టరీలకే ఇవ్వడం వల్ల ఆయా కర్మాగారాల్లో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, వీటిపై ఆధారపడ్డ వారికి ఉపాధి లభిస్తోందన్నారు. ఇప్పటి వరకు 44.03 లక్షల సర్వే రాళ్లు సరఫరా చేశామని, ఇందుకు రూ.1,153.2 కోట్లను సరఫరాదారులకు, రాళ్ల రవాణా కోసం రూ.63.8 కోట్లు చెల్లించామన్నారు. రీసర్వే కోసం గతంలో గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్ల నిర్వాహకులతో జరిగిన సమావేశంలో రోజుకు లక్ష సర్వే రాళ్లు కావాలని కోరామన్నారు. యూనిట్లకు రా మెటీరియల్‌ను కూడా గనుల శాఖ అధికారులు సమకూర్చారని, మొదట రూ.270 ఉన్న రేటును రూ.300కి పెంచామన్నారు. ఇంత చేస్తున్నా ఫ్యాక్టరీలకు బదులు బయటి నుంచి ట్రేడర్లు సర్వే రాళ్లు సరఫరా చేస్తున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనివల్ల ఫ్యాక్టరీలకు నష్టం జరుగుతోందని, దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని స్పష్టం చేశారు. -
స్వచ్ఛ బడి.. సేంద్రియ సిరి
సాక్షి, సిద్దిపేట : సిద్దిపేటలో ఏర్పాటు చేసిన ‘స్వచ్ఛ బడి’ సత్ఫలితాలు ఇస్తోంది. పట్టణంలోని ఒకటి రెండు కాదు, ఏకంగా 3 వేలకు పైగా ఇళ్లలో చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. ఈ ఎరు వును ఇంటిమేడపై సాగు చేస్తున్న మిద్దె తోటలకు వినియోగిస్తున్నారు. స్వచ్ఛ బడి ద్వారా నేర్చుకున్న పాఠాలను ఆచరణలో పెట్టి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. చెత్త ఒక వ్యర్థం కాదని నిరూపిస్తు న్నారు. ఇదే విధానాన్ని అందరూ అవలంబిస్తే పర్యావరణ కాలుష్యానికి కళ్లెం వేయడంతో పాటు చెత్త, డంపింగ్ యార్డుల సమస్యను చాలావరకు అధిగమించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ స్వచ్ఛబడిని సందర్శించిన మంత్రి కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి బడులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. స్వచ్ఛ బడి అంటే.. సిద్దిపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2021 ఏప్రిల్ 10న ఈ స్వచ్ఛ బడిని ప్రారంభించారు. ఎకరానికి పైగా విస్తీర్ణంలో దేశంలోనే రెండోదైన స్వచ్ఛ బడిని మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేశారు. ఇది అ..అంటే అమ్మ, ఆ..అంటే ఆవు లాంటి పదాలు ఇతర పాఠాలు బోధించే బడి కాదు. పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, పునర్వినియోగంపై ఆరేళ్ల నుంచి అరవై ఏళ్ల వయసు గల వారికి పాఠాలు చెప్పే బడి. ఒకేసారి 50 మంది క్లాస్ వినే విధంగా దీనిని ఏర్పాటు చేశారు. వర్మీ కంపోస్టు యార్డు, పక్కనే పార్కు, డిజిటల్ తరగతి గది, హోం కమ్యూనిటీ కంపోస్టింగ్ ఏర్పాటు చేశారు. సేంద్రియ ఎరువుల ద్వారా పండించే కూరగాయల తోట పెట్టారు. ప్లాస్టిక్‌తో కలిగే అనర్థాల గురించి తెలిసేలా చిత్రాలను వేశారు. ఇందులో పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, పునర్వినియోగంపై బోధించడంతో పాటు పనికి రాని వస్తువులతో వివిధ రకాల వస్తువులను తయారు చేయడం, ఖాళీ సీసాలతో స్వాగత తోరణాలు, వెదురు బొంగులతో ప్రహరీ ఏర్పాటు చేయడంపై శిక్షణ ఇస్తున్నారు. ఫోర్ ఆర్ పై శిక్షణ.. తడి, పొడి, హానికరమైన చెత్తను వేరు చేయడం, ఫోర్ ఆర్.. అంటే రీయూజ్ (పునర్వినియోగం), రీసైకిల్ (తిరిగి తయారీ), రెఫ్యూజ్ (నిరాకరించడం), రెడ్యూస్ (తగ్గింపు) చేయడం కూడా నేర్పిస్తున్నారు. జీరో వేస్ట్ మేనేజ్మెంట్, తడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారీపై ప్రత్యక్షంగా వివరిస్తున్నారు. ఇలా ఒక్క క్లాస్ రెండున్నర గంటల పాటు ఉంటుంది. ఈ బడిలో ఇప్పటివరకు 8వేల మందికి పైగా పాఠాలు విన్నారు. రాష్ట్రం నలుమూ లల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల వారు విదేశీ యులు సైతం సందర్శించి స్వచ్ఛ బడి గురించి తెలుసుకుంటున్నారు. 15 మున్సి పాలిటీలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు క్లాస్‌లు విన్నారు. బెంగళూరుకు చెందిన డాక్టర్ శాంతి పర్యవేక్షణలో స్వచ్ఛ బడి కొనసాగు తోంది. తడి చెత్తతో ఎరువు.. ప్రతి రోజూ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెత్త బండ్లు పట్ట ణంలోని గృహాలకు తిరిగి తడి, పొడిచెత్తను వేర్వేరుగా సేకరిస్తుంటాయి. పట్టణంలోని 43 వార్డుల్లో 41,322 గృహాలు, 1,57,026 జనాభా ఉంది. ఇందులో 3 వేలకు పైగా ఇళ్లలో తడి చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. కేవలం పొడి, హానికరమైన చెత్తను మాత్రం చెత్తబండికి అందజేస్తున్నారు. ఇలా ఇంట్లోనే తయారు చేసే సేంద్రియ ఎరువుతో కూరగాయలు బాగా కాస్తుండటంతో పట్టణవాసులు క్రమంగా దీని తయారీకి మొగ్గు చూపుతున్నారు. సేంద్రియ ఎరువుతో కూరగాయల సాగు స్వచ్ఛ బడిలో పర్యావరణ పరిరక్షణ కోసం క్లాస్‌లు విన్నాను. అప్పటి నుంచి మా ఇంటి నుంచి తడి చెత్తను మున్సిపాలిటీ బండికి ఇవ్వడం మానేశా. దాన్ని ఉపయోగించి ఇంట్లోనే సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నా. దీనిని మిద్దెతోటలోని మొక్కలకు వేయడంతో కూరగాయలు, పూలు బాగా కాస్తున్నాయి. – గుడాల జ్యోతి, ప్రైవేట్ స్కూల్ టీచర్, సిద్దిపేట భవిష్యత్ తరాల కోసం.. బెంగళూరులో జీరో వేస్ట్ మేనేజ్ మెంట్ గురించి తెలుసుకు న్నాం. డాక్టర్ శాంతి చెప్పిన మాటలు మాకు స్ఫూర్తిని ఇచ్చాయి. మంత్రి హరీశ్‌రావు చొరవతో సిద్దిపేటలోస్వచ్ఛ బడిని ఏర్పాటు చేసి పట్టణవాసులకు అవగాహన కల్పిస్తు న్నాం. భవిష్యత్ తరాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని దీనికి శ్రీకారం చుట్టాం. – దీప్తి నాగరాజు, కౌన్సిలర్, స్వచ్ఛ బడి నిర్వాహకురాలు -
'అమర్‌రాజాను ప్రత్యేకంగా టార్గెట్ చేశామన్నది అవాస్తవం'
సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణ కోసం అన్ని చర్యలు చేపట్టామని పర్యావరణ శాఖ అధికారి, ఎక్స్ ఆఫీసీయో కార్యదర్శి విజయ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రత్యేకంగా అమర్‌రాజాను టార్గెట్ చేశామన్నది అవాస్తవమని తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమర్‌రాజాకు నోటీసులు ఇచ్చి 2 నెలల సమయం ఇచ్చాం. ఆ తర్వాత మళ్లీ తనిఖీ చేసి కాలుష్యాన్ని నియంత్రించాలని చెప్పాం. పర్యావరణ చర్యలు చేపట్టకముందే రెండోసారి నోటీసులు ఇచ్చాం. హానికరమైన అంశాలు గుర్తించి అమర్‌రాజాకు క్లోజర్ ఆర్డర్ ఇచ్చాం. పరిశ్రమల ద్వారా ఎవరికి ఇబ్బంది కలిగినా పీసీబీ నియంత్రిస్తుంది. రెడ్ కేటగిరీ పరిశ్రమల్లో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. ఈ కేటగిరీ పరిశ్రమల్లో ప్రతి నెలా తనిఖీలు చేస్తాం. జనవరిలో 54 పరిశ్రమలు తనిఖీ చేశాం. కొన్ని పరిశ్రమల్లో కాలుష్యం ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించాం.అందులో భాగంగానే అమర్‌రాజాతో పాటు చాలా ఫ్యాక్టరీల్లో తనిఖీలు చేపట్టి 54 పరిశ్రమలకు షోకాజ్ నోటీసులు ఇచ్చాం. 64 పరిశ్రమలకు ఉత్పత్తి ఆపాలని ఆదేశాలు ఇచ్చాం. 50 పరిశ్రమలకు క్లోజర్ ఆర్డర్ ఇచ్చాం అని తెలిపారు. -
చెట్టే కదా.. అని నరికితే!
కోల్‌సిటీ (రామగుండం): చెట్టే కదా.. అని ఓ వ్యక్తి నరికాడు. కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో షార్ట్‌సర్క్యూట్ జరిగింది. వీధి మొత్తం అంధకారమైంది. ఫలితంగా అతడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపాలిటీలోని సంతోష్‌నగర్‌లో పిడుగు సతీశ్ అనే వ్యక్తి తన ఇంటి ముందున్న చెట్టును అనుమతి లేకుండా మూడు రోజుల కిందట నేలకూల్చాడు. కొమ్మలు తెగి విద్యుత్ తీగలపై పడటంతో షార్ట్‌సర్క్యూట్ ఏర్పడి నగరపాలక సంస్థకు చెందిన 25 వీధిదీపాలు కాలిపోయాయి. దీంతో మున్సిపల్ చట్టం–2019 ప్రకారం రూ.49,500 జరిమానా చెల్లించాలని కమిషనర్ పి.ఉదయ్‌కుమార్ మంగళవారం సతీశ్‌కు నోటీసు జారీ చేశారు. సతీశ్ జరిమానా చెల్లించి మరోసారి పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తానని హామీనిచ్చాడు. ఈ విధంగా పచ్చదనం పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఒకవైపు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కల పెంపకం విస్తృతంగా చేపడుతూనే ఉన్న చెట్లను కాపాడుకునేందుకు అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఆ చెట్టు తొలగించిన వ్యక్తికి భారీ జరిమానా విధించారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో చాలా చోట్ల జరిగాయి. -
కొత్త సచివాలయ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించదలచిన కొత్త సచివాలయానికి లైన్‌క్లియర్ అయ్యింది. నూతన సచివాలయానికి గురువారం కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు మంజూరుచేసింది. రూ.400 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులను ఇటీవల జారీచేసిన విషయం తెలిసిందే. చెన్నైకు చెందిన ఆస్కార్ పొన్ని ఆర్కిటెక్స్ సంస్థ ఈ భవన సముదాయానికి రూపకల్పన చేసింది. కాగా సచివాలయం పాత భవనాల కూల్చివేత ప్రక్రియ ఇప్పటికే పూర్తి అవ్వగా దాని స్థానంలో కొత్త భవనాలను నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీని కొరకు ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. -
ఢిల్లీలో కేవలం ‘గ్రీన్’ దీపావళి
న్యూఢిల్లీ: దీపావళి పండుగని పురస్కరించుకొని దేశ రాజధాని ఢిల్లీలో కేవలం గ్రీన్ దీపావళి మాత్రమే జరుపుకోవాలని ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు 2018లో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రజలు పర్యావరణహితమైన టపాసులు మాత్రమే ఢిల్లీలో తయారు చేసి, అమ్మాలని మంత్రి బుధవారం చెప్పారు. మరోవైపు ఈ ఏడాది టపాసులకి వ్యతిరేకంగా భారీగా ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. నవంబర్ 3 నుంచి ఈ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్టుగా గోపాల్ రాయ్ వెల్లడించారు. కోవిడ్–19 నేపథ్యంలో ప్రజలెవరూ టపాసులు కాల్చవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఏడాది దీపావళి టపాసులు పేల్చడం, పంట వ్యర్థాల దహనం కారణంగా ఢిల్లీ కాలుష్యం బారిన పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ ఈ సారి టపాసులకి దూరంగా ఉండాలన్నారు. -
1.09 కోట్ల వృక్షాలు నరికారు!
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి పేరిట పచ్చని చెట్లు నేలకూలుతున్నాయి. పట్టణాభివృద్ధి, నగరాల విస్తరణ, ఉత్పత్తి, ఉపాధి, ఇతర అవసరాల కోసం మౌలిక సదుపాయాల కల్పన, ఇతర ప్రాజెక్టుల నిర్మాణం ఇలా పేరు ఏదైనా చివరకు చెట్లే అందుకు ఆహుతవుతున్నాయి. అత్యంత వేగంగా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులు, వాటి వల్ల తలెత్తుతున్న ఉపద్రవాలు, ఇతరత్రా సమస్యలకు ప్రకృతి సమతుల్యత దెబ్బతినడం, పచ్చదనం తగ్గిపోవడం ప్రధాన కారణాలుగా పర్యావరణ నిపుణులు చేస్తున్న హెచ్చరికలు పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. 1.09 కోట్ల చెట్ల కొట్టివేత... 2014–19 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం 1,09,75,000 చెట్ల నరికివేతకు కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అనుమతిచ్చింది. ఇటీవల లోక్‌సభలో కేంద్ర అటవీ, పర్యావరణ వాతావరణ మార్పుæ శాఖ చెప్పిన సమాచారం మేరకు పలు అంశాలు వెల్లడయ్యాయి. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 2016–19 మధ్యకాలంలో 12,12,753 లక్షల చెట్లను కొట్టేసేందుకు అనుమతినిచ్చినట్లు స్పష్టమైంది. దాదాపు 11 లక్షల చెట్లతో మహారాష్ట్ర రెండో స్థానంలో, 10 లక్షల చెట్లతో మధ్యప్రదేశ్ మూడోస్థానంలో నిలిచాయి. లోక్‌సభలో ఒకప్రశ్నకు కేంద్ర సహాయమంత్రి బాబుల్ సుప్రియో సమాధానమిస్తూ వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో మొత్తం 1.09 కోట్ల చెట్లను కూల్చేందుకు అనుమతినిచ్చినట్లు తెలియజేశారు. ముఖ్యంగా 2018–19లో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో అత్యధిక సంఖ్యలో 5,22,242 చెట్లు కూల్చేందుకు అనుమతినిచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలను బట్టి వెల్లడైంది. చెట్లకు మొక్కలు ప్రత్యామ్నాయమా ? గత మూడేళ్లలో 76,72,337 చెట్లను తొలగించగా, 7.87 కోట్ల కంటే ఎక్కువగా మొక్కలను కంపల్సరీ ఎఫారెస్టేషన్ కింద నాటినట్లు లోక్‌సభలో కేంద్ర మంత్రి వెల్లడించారు. తప్పని పరిస్థితుల్లో మాత్రమే చెట్లను తొలగిస్తున్నామని, ప్రభుత్వ విధానంలో భాగంగా ప్రత్యామ్నాయంగా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నట్లు తెలియజేశారు. సిటిజన్స్ ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన కాజల్మహేశ్వరీ మాత్రం నరికేసే పాత వృక్షాలు, చెట్లకు మొక్కలు ప్రత్యామ్నాయం కాలేవని, వాటి స్థానంలో మొక్కలను చూడలేమని అభిప్రాయపడ్డారు. ‘40–50 ఏళ్ల పాత చెట్లకు హరితహారంలో నాటే మొక్కలు ప్రత్యామ్నాయం కాలేవు. ఎందుకంటే పెద్ద వృక్షాలు వాతావరణంలోకి విడుదల చేసే ఆక్సిజన్, పీల్చుకునే కార్బన్ డయాక్సైడ్ శాతాన్ని మొక్కలు భర్తీ చేయలేవు. కాబట్టి, చెట్ల నరికివేతతో జీవవైవిధ్యానికి జరుగుతున్న నష్టం అంచనా వేయలేని స్థాయిలో ఉంది’అని పేర్కొన్నారు. చెట్లు (లక్షల్లో) నరికారు ఇలా సంవత్సరం చెట్లు 2014–15 23.3 2015–16 16.9 2016–17 17.01 2017–18 25.5 2018–19 17.38 భారత్‌లో తలసరికి 28 చెట్లే 2018లో ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వివిధ దేశాల్లో ఒక్కొక్కరికి ఉన్న చెట్ల నిష్పత్తి కంటే భారత్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కెనడాలో అత్యధికంగా ఒక్కో వ్యక్తికి 8,953, రష్యాలో 4,461, బ్రెజిల్లో 1,494, అమెరికాలో 716, చైనాలో 102 చెట్లు ఉండగా, మన దేశంలో మాత్రం ఒక్కొక్కరికి 28 చెట్లే ఉన్నాయి. ఒకవైపు చెట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుండటంతో పాటు, అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట ఉన్న చెట్లను కొట్టేస్తుండటంతో ఈ పరిస్థితి తలెత్తిందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనిని బట్టి మన దేశంలో చెట్ల సంఖ్య ఏ మేరకు గణనీయంగా తగ్గిపోతోందో స్పష్టమవుతోంది. -
గ్రామీణ యువతకు ‘గ్రీన్ స్కిల్స్’పై ఉచిత శిక్షణ
డిగ్రీ చదివిన, ఇంటర్ (పాసైన లేదా మధ్యలో మానేసిన) గ్రామీణప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు పర్యావరణ సంబంధమైన ఉపాధి నైపుణ్యాలను అందించేందుకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఇ.పి.టి.ఆర్.ఐ.) ఉచితంగా రెసిడెన్షియల్ శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నది. కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ, భూతాపోన్నతి శాఖకు అనుబంధ సంస్థ ఇది. 2 నుంచి 4 వారాల కాల పరిమితి గల ఈ కోర్సుల్లో శిక్షణకు ఎంపికయ్యే అభ్యర్థులకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని సంస్థ ఆవరణలోనే ఉచితంగా భోజనం, వసతి కల్పించి, ఉచిత శిక్షణ ఇస్తామని శాస్త్రవేత్త, సమన్వయకర్త డాక్టర్ ఎం.సునీల ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ ఇవ్వనున్న కోర్సుల వివరాలు.. వాటర్ బడ్జెటింగ్ అండ్ ఆడిటింగ్ : అర్హత – ఏదైనా డిగ్రీ, కోర్సు కాలం– 2020 ఫిబ్రవరి 3 నుంచి 24 వరకు. 2020 జనవరి 18 లోగా దరఖాస్తు పెట్టుకోవాలి. పర్యావరణ సేవలు, గ్రీన్ జీడీపీ గణన: అర్హత – ఏదైనా డిగ్రీ, కోర్సు కాలం– 2020 ఫిబ్రవరి 10 నుంచి మార్చి 24 వరకు. 2020 జనవరి 25 లోగా దరఖాస్తు పెట్టుకోవాలి. సౌర విద్యుత్తు వ్యవస్థల్లో సాంకేతిక నైపుణ్యం: ఇంటర్ మధ్యలో మానేసిన వారు లేదా పాసైన వారు అర్హులు. కోర్సు కాలం– 2020 ఫిబ్రవరి 20 నుంచి మార్చి 24 వరకు. 2020 జనవరి 30 లోగా దరఖాస్తు పెట్టుకోవాలి. వేస్ట్ మేనేజ్మెంట్(అన్నిరకాల వ్యర్థాల నిర్వహణ) : అర్హత – సైన్స్ డిగ్రీ. కోర్సు కాలం– 2020 జనవరి 29 నుంచి మార్చి 13 వరకు. 2020 జనవరి 13 లోగా దరఖాస్తు పెట్టుకోవాలి. ఇ.టి.పి/ ఎస్.టి.పి. / సి.ఇ.టి.పి. ఆపరేషన్, మెయింట్‌నెన్స్: అర్హత – సైన్స్ డిగ్రీ. కోర్సు కాలం– 2020 ఫిబ్రవరి 3 నుంచి మార్చి 17 వరకు. 2020 జనవరి 18 లోగా దరఖాస్తు పెట్టుకోవాలి. ► దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి శిక్షణకు ఎంపిక చేస్తారు. ఈ క్రింది వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు: లేదంటే మీ దరఖాస్తును ఈ కింది అడ్రస్‌కు మెయిల్ పంపవచ్చు: eptri.gsdp@gmail.com వివరాలకు...040--67567511, 67567553, 67567521 www.eptri.com -
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి సీఎం జగన్ ఆదేశాలు
సాక్షి, అమరావతి : కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణకై... సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అటవీ, పర్యావరణ శాఖలపై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో రాష్ట్రంలో అడవుల పెంపకం, కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణలపై సీఎం జగన్ సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..‘‘పరిశ్రమల కాలుష్యాన్ని తొలగించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. లక్ష టన్నుల వ్యర్థాలు ఫార్మా కంపెనీ నుంచి వస్తే అందులో సుమారు 30 శాతం మాత్రమే శుద్దిచేస్తున్నారు. మిగతా 70 శాతం వాతావరణంలోకి వదిలేస్తున్నారన్న సమాచారం అందింది. హేచరీ జోన్‌గా ప్రకటించిన ప్రాంతాల్లో గతంలో ఫార్మా కంపెనీలకు అనుమతి ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హేచరీ జోన్‌గా ప్రకటించిన తర్వాత ఆ ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలకు ఎలా అనుమతి ఇచ్చారో అర్థంకావడం లేదు. ఫార్మా కంపెనీల కోసం ఇప్పటికే మనం ఫార్మాసిటీలను ఏర్పాటు చేశాం. అక్కడే వాటిని పెట్టుకునేలా వారికి అనుతులు ఇవ్వాలి’’ అని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ‘‘ఏపీ నుంచి పెద్ద ఎత్తున సముద్రపు ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. పరిశ్రమలు ఏమైనా వస్తున్నాయంటే రెడ్ కార్పెట్ వేస్తాం కాని, వాటినుంచి ఎలాంటి కాలుష్యం వస్తుందనే దానిపై మనం ఆలోచించం. వాతావరణానికి, పర్యావరణానికి ఎలాంటి భంగం కలుగుతుందనే దానిపై దృష్టిపెట్టడం లేదు. ఎన్నివేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని మాత్రమే ఆలోచిస్తాం. ప్రస్తుతం ఉన్న కాలుష్య నియంత్రణ బోర్డు, సంబంధిత వ్యవస్థల్లో ప్రక్షాళన జరగాలి’ అని అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ పట్ల సమగ్ర అవగాహన, పరిజ్ఞానం, అంకిత భావం ఉన్నవారు ఈ వ్యవస్థల్లో ఉండాలని,ఈ అంశాలన్నింటినీ సమగ్రంగా ఆలోచించి. ఉత్తమ విధానాలను అనుసరించాలని సీఎం జగన్ పేర్కొన్నారు. పరిశ్రమల కాలుష్యాన్ని తొలగించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని, ఈ మేరకు ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ వేస్తుందని స్పష్టం చేశారు. పర్యావరణాన్ని, ప్రకృతిని సంరక్షించుకోకపోతే మన తర్వాత తరాలు బతకడం కష్టమవుతుందని, ఈ ఆలోచనలు చేయకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుందని ఆగ్రహించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణలో దేశానికి తాము మార్గదర్శకంగా నిలవాలని, వివిధ దేశాల్లో అత్యుత్తమ విధానాలను అనుసరిస్తున్నపద్ధతులను అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశించారు. నెలరోజుల్లోగా పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై అత్యుత్తమ విధానాలను సూచిస్తూ ప్రతిపాదనలు తయారు చేయాలని, దీనికిబిల్లులు రూపొందించండని సీఎం జగన్ సూచించారు. అంతేగాక విశాఖపట్నం కాలుష్యంతో అల్లాడుతోందని, కాలుష్యనియంత్రణ చేయకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవని అధికారులను సీఎం జగన్ హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణకు, విశాఖ నగరంలో కాలుష్య నియంత్రణకు పెద్దపీట వేయాలని ఆదేశించారు. వేస్ట్ మేనేజ్మెంట్, మురుగునీటి పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. మురుగునీటిని శుద్దిచేసిన తర్వాతే విడిచిపెట్టాలని, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్‌పై ఫ్రెంచి ప్రతినిధి బృందంతో తాను చర్చించినట్లు సీఎం తెలిపారు. పంట కాల్వలను కాపాడుకోవాలని, అవి కాలుష్యం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉభయగోదావరి జిల్లాల్లో పూర్తిస్థాయిలో కాల్వలను పరిరక్షించాలన్నారు. మిషన్ గోదావరి తరహాలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం చేపట్టాలని, దీనిపై సరైన ప్రతిపాదనలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆక్వా పరిశ్రమలనుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేయాలని, ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వేస్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థ ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇ– వేస్ట్‌కోసం కాల్ సెంటర్‌ను ఏర్పాట చేయాలని, దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్రామ వాలంటీర్లందరికీ మొక్కలు పంపిణీ చేయాలని, చెట్లను పెంచడంలో అధికారులు వారి సహకారం తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. ప్రతి ఇంటికీ నాలుగు మొక్కలు ఇవ్వాలని, కాల్వ గట్లమీద మొక్కలను వీలైనంత పెంచాలని వివరించారు. అనంతపురం, కడప ప్రాంతాల్లో అడవులను పెంచడానికి దృష్టిపెట్టాలని, ఆ ప్రాంత ప్రస్తుత నైసర్గిక స్వరూపాన్ని మార్చాలని ఆదేశించారు. అటవీశాఖ వద్ద ఉన్న ఎర్రచందనాన్ని ఏక మొత్తంగా అమ్మే పద్దతులు కాకుండా విడతల వారీగా అమ్మితే ప్రభుత్వానికి మేలు జరుగుతుందని అన్నారు. ఈ విషయంలో అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకుంటే మంచిదని, చైనా, జపాన్ సంస్థలతో చర్చలు జరపాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పర్యావరణశాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, అటవీ, పర్యావరణ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
చెత్త‘శుద్ధి’లో భేష్
సాక్షి, హైదరాబాద్: ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్)లో తెలంగాణ మంచి పురోగతి కనబరుస్తోంది. దేశంలోనే రెండో స్థానంలో నిలిచి రికార్డు సాధించింది. 2018, నవంబర్ నాటికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు శుద్ధి చేసిన ఘన వ్యర్థాల గణాంకాలను ఇటీవల కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ విడుదల చేసింది. ఈ జాబితాలో ఛత్తీస్‌గఢ్ ముందు వరుసలో ఉంది. ఇక్కడ ఏటా 6,01,885 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటే, అందులో 84 శాతం ఘన వ్యర్థాలను ప్రాసెసింగ్ చేస్తున్నారు. మన రాష్ట్రంలో 26,90,415 మెట్రిక్ టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా.. ఇందులో 73% వ్యర్థాలు శుద్ధికి నోచుకుంటున్నాయి. ఇతర పెద్ద రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. అడ్డగోలుగా ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నా.. వాటి శుద్ధిలో చతికిలపడ్డాయి. పశ్చిమబెంగాల్ అత్యంత తక్కువగా 5 శాతం, జమ్మూకశ్మీర్ 8 శాతం ప్రాసెసింగ్ చేస్తున్నాయి. మహారాష్ట్రలో అత్యంత ఎక్కువగా ఏటా 8,22,38,050 మెట్రిక్ టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. 20 శాతమే ప్రాసెసింగ్.. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ 2016–17 లెక్కల ప్రకారం.. దేశంలో రోజుకు లక్షన్నర మెట్రిక్ టన్నుల ఘనవ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటే వీటిలో 90 శాతం చెత్తను సేకరిస్తోంది. అయితే అందులో 20 శాతమే.. అంటే రోజుకు 27 వేల మెట్రిక్ టన్నుల ఘన వ్యర్థాలే శుద్ధి అవుతున్నాయి. 2016–17లో 71లక్షల టన్నుల అత్యంత ప్రమాదకర వ్యర్థాలను గుర్తించగా, అందులో కేవలం 36.8 లక్షల టన్నుల వ్యర్థాలు రీసైక్లింగ్ చేశారు. -
బోథ్: హామీల దారి..అలాగే మిగిలింది
సాక్షి, బోథ్: హామీల దారి..అలాగే మిగిలింది. బోథ్ మండలకేంద్రం నుంచి రఘునాథ్‌పూర్ మీదుగా అడెల్లి దేవస్థానానికి రోడ్డు నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇచ్చిన హామీలు కలలుగానే మిగిలాయి. నాలుగున్నరేళ్లు గడిచిపోయాయి. పూర్తవుతుందనుకున్న రోడ్డు పూర్తి కాలేదు. దీంతో రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అడెల్లి రోడ్డు నిర్మాణ పనులు చేయిస్తామని నాయకులు మళ్లీ ఎన్నికల్లో హామీలు గుప్పించాయి. గతంలో అటవీ అనుమతులు లభించినా ఆర్అండ్బీ అధికారులు, అప్పటి ప్రజాప్రతినిధుల అలసత్వం తో రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి అటవీ శాఖకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడంలో విఫలయ్యారు. దీంతో రోడ్డు పనుల అనుమతులు ఆగి పోయాయి. కేంద్ర ప్రభుత్వం షరతులతో కూడిన స్టేజ్ వన్ అటవీ అనుమతులు జారీ చేసింది. దీంతో రోడ్డు పనులకు అడ్డంకులు తొలగిపోయాయని అంతా భావించారు. కానీ ప్రభుత్వం ఆర్ అండ్‌బీశాఖ నుంచి నిధులు ఇవ్వడంలో విఫలమవడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. మొదటిదశ అనుమతులు మంజూరు. అడెల్లి రోడ్డు నిర్మాణానికి ఇక్కడి ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ఏర్పడక ముం దు ప్రజాప్రతినిధులు రోడ్డు విషయమై పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడిన తరువాత బోథ్ అటవీ రేంజ్ అధికారులు రోడ్డు నిర్మాణానికి ఎటువంటి అభ్యంతరం లేదని నో అబ్జెక్షన్ పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతి కోసం జూన్ ఒకటో తేదీ, 2017న కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. కేంద్ర ప్రభుత్వం పర్యావరణ, అటవీ, వాతావరణశాఖ సాధ్యాసాధ్యాలను పరిశీలించి 2017, ఆగస్టు 4వ తేదీన రోడ్డు నిర్మాణానికి పలు షరతులతో కూ డిన అనుమతులు మొదటి దశలో జారీ చేసింది. రోడ్డు నిర్మాణం కోసం రోడ్డు భవనాలశాఖకు దాదాపు 4.67 హెక్టార్ల అటవీ భూమి అవసరమవుతోంది. అటవీశాఖ కోల్పోతున్న భూమి, చెట్లు ఆశాఖ వారు మరోచోట అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. వీటి అభివద్ధికి కావాల్సిన నిధులను రోడ్డు భవనాల శాఖ ఇవ్వాల్సి ఉంది. ఈ షరతులతో కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెండోదశలో రోడ్డు భవనాలశాఖ అటవీ శాఖకు అవసరమగు నిధులు కేటాయిస్తే రెండోదశలో పూర్తి స్థాయి అనుమతులు లభిస్తాయి. కాగా రోడ్డు పనులకోసం ఇప్పటికే రూ.4 కోట్ల యాభై ఐదు లక్షలు మంజూరై ఉన్నాయి. దీంతో రోడ్డు పనులు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉన్నా అవసరమగు నిధులు మంజూరు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించింది. రోడ్డు నిర్మాణం పూర్తయితే తగ్గనున్న భారం... రోడ్డు నిర్మాణం పూర్తయితే రెండు మండలాల మధ్య దూరం తగ్గనుంది. గతంలో అడెల్లి, సారంగాపూర్‌కు వెళ్లాలంటే దాదాపు 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చేది. రోడ్డు పూర్తయితే బోథ్ సారంగాపూర్‌కు వెళ్లాలంటే కేవలం 20 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దాదాపు 40 కిలోమీటర్ల దూరభారం తగ్గనుంది. గత ఇరవై ఏళ్లుగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఇక్కడి ప్రజలే డిమాండ్ చేశారు. మూడేళ్లక్రితం బోథ్ మండలంలోని కుచులాపూర్ వేంకటేశ్వర ఆలయం నుంచి రఘునాథ్‌పూర్ వరకు బీటీ రోడ్డు నిర్మించారు. అటవీ అనుమతులు లేకపోవడంతో పనులు నిలిపివేశారు. -
యజమాని అంగీకరిస్తేనే భూ సేకరణ!
సాక్షి, హైదరాబాద్: యజమానుల అంగీకారంతోనే భూ సేకరణ జరపాలన్న కీలక షరతుతో ఫార్మా సిటీ నిర్మాణానికి కేంద్ర పర్యావరణ, అటవీ, పర్యావరణ మార్పుల శాఖ పర్యావరణ అనుమతులు జారీ చేసింది. నిర్వాసితులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని స్పష్టం చేసింది. దీంతో హైదరాబాద్ నగరంలో ఫార్మాసిటీ నిర్మాణంతో నూతన అధ్యాయానికి తెరలేవనుంది. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల పరిధిలోని 19,333.20 ఎకరాల భారీ విస్తీర్ణంలో నిర్మించతలపెట్టిన ఈ పారిశ్రామికవాడ నిర్మాణంతో 5.6 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం పేర్కొంటోంది. ప్రభుత్వ అంచనా ప్రకారం.. ఫార్మా సిటీ ఔషధ ఉత్పత్తుల ద్వారా ఏటా రూ.1.4 లక్షల కోట్ల టర్నోవర్ సాధించడంతోపాటు రూ.58 వేల కోట్ల విలువైన ఔషధాలను విదేశాలకు ఎగుమతి చేయనుంది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో నిర్మించనున్న ఫార్మాసిటీ కోసం భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ప్రచారం నిర్వహిస్తోంది. రూ.16,784 కోట్ల అంచనా వ్యయంతో నిర్మి స్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా రూ.64 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని అంచనా వేసింది. హైదరాబాద్ నుంచి 298 కాలుష్య కారక ఔషధ పరిశ్రమలను ఫార్మా సిటీకి తరలిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి నివేదించింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నేతృత్వంలోని నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) ఈ నెల 7న ఢిల్లీలో సమావేశమై.. ఫార్మా సిటీ ప్రాజెక్టుకు 18 షరతులతో కూడిన పర్యావరణ అనుమతులు జారీ చేయాలని సిఫారసులు చేసింది. 18 షరతులివీ.. ♦ పర్యావరణ పరిరక్షణ నిబంధనల అమలు బాధ్యత టీఎస్‌ఐఐసీదే. ♦ పరిహారం చెల్లించి భూయజమానుల అంగీకారంతోనే మిగులు భూ సేకరణ జరపాలి. ♦ భూ నిర్వాసితులకు సరైన శిక్షణ అందించి వారి నైపుణ్యాన్ని పెంపొందించి, ఫార్మా సిటీలో వారికి టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో ఉద్యోగావకాశాలు కల్పించాలి. ♦ ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతంలో ఇప్పటికే ఉన్న పరిశ్రమలు, ఆవాసాలను మరో ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నించాలి. సాధ్యం కాకుంటే ప్రస్తుతమున్న జనా వాసాలు, పరిశ్రమల మధ్య కనీసం ఒక కిలోమీటర్ బఫర్ జోన్ ఏర్పాటు చేయాలి. ♦ ఫార్మాసిటీ నిర్మిత స్థలం, అడవుల మధ్య 100 మీటర్ల బఫర్ జోన్ ఏర్పాటు చేయాలి. ♦ జల వనరులు కలుషితం కాకుండా 100 మీటర్ల బఫర్ జోన్‌తో రక్షణ కల్పించాలి. ♦ ఫార్మా సిటీ ప్రతిపాదిత ప్రాంతానికి 5 కి.మీల పరిధిలో ఉన్న గ్రామాల్లో వార్షిక ఆరోగ్య సర్వే నిర్వహించాలి. గ్రామస్తులకు వ్యాధుల నివారణ చర్యలు తీసుకోవాలి. ♦ బాయిలర్ల కోసం సహజ వాయువులనే వినియోగించాలి. మీథేన్ వాయువుల ఉద్గారాన్ని నిరంతరంగా సమీక్షిస్తుండాలి. ♦ భూ ఉపరితల జలాలు, భూగర్భ జలాల నాణ్యతలపై క్రమం తప్పకుండా సమీక్షలు జరిపి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రాంతీయ కార్యాలయం, పీసీబీలకు త్రైమాసిక నివేదికలు సమర్పించాలి. ♦ ఫార్మా సిటీ అవసరాలకు భూగర్భ జలాలను వినియోగించరాదు. ♦ కేంద్ర/రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో ఎప్పటికప్పుడు గాలి, నీటి నాణ్యతల సమాచారాన్ని తెలిపే ఆన్లైన్ సమీక్షల విధానాన్ని ఏర్పాటు చేయాలి. ♦ అటవీ శాఖతో సంప్రదింపులు జరిపి రిజర్వు ఫారెస్టు సంరక్షణ ప్రణాళిక అమలు చేయాలి. మూడేళ్లలో రూ.28.22 కోట్లు ఖర్చు చేసేలా చూడాలి. పర్యావరణ నిర్వహణ ప్రణాళిక (ఈఎంపీ)లో భాగంగా ప్రతిపాదించిన ఖర్చులకు ఇది అదనం. అటవీ, వన్యప్రాణుల సంరక్షణ కోసం టీఎస్ఐఐసీ, అటవీ శాఖతోపాటు ఈ అంశంలో అవగాహన కలిగిన 2 జాతీయ గుర్తింపున్న స్వచ్ఛంద సంస్థలతో కమిటీ ఏర్పాటు చేయాలి. పర్యావరణం, కాలుష్యంపై సమీక్షల కోసం మరో కమిటీ ఏర్పాటు చేయాలి. ఈ రెండు కమిటీలు ఏడాదికి కనీసం రెండుసార్లు సమావేశమై పర్యావరణ మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించాలి. ♦ రాష్ట్ర భూగర్భ జల శాఖ సహకారంతో ప్రాజెక్టు ప్రాంతంలో పీజోమీటర్లు ఏర్పాటు చేయాలి. భూగర్భ జలాల నాణ్యతలను త్రైమాసికంగా పరీక్షించి పర్యావరణ శాఖకు నివేదిక సమర్పించాలి. ♦ ఫార్మా సిటీకి 5 కి.మీల పరిధిలో ఉన్న పంట పొలాల స్థితిగతులు, దిగుబడులపై వార్షిక అధ్యయనం జరిపి పర్యావరణ శాఖకు నివేదిక సమర్పించాలి. ♦ సిటీ మూడో విడతలో ఆరెంజ్, గ్రీన్, వైట్ కేటగిరీల పరిశ్రమలనే ఏర్పాటు చేయాలి. ♦ ఫార్మా సిటీలోని ప్రతి పరిశ్రమ సొంత వ్యర్థాల శుద్ధి కర్మాగారం (ఈటీపీ) ఏర్పాటు చేసుకునే విధంగా సంబంధిత నియంత్రణ సంస్థ చర్యలు తీసుకోవాలి. ఫార్మా సిటీలోని కేంద్ర వ్యర్థాల శుద్ధి ప్లాంట్‌పై ఒత్తిడి పెరగకుండా బల్క్ ఔషధాలు, రసాయన మిశ్రమాల ఉత్పత్తి పరిశ్రమలు ఈటీపీలు ఏర్పాటు చేయాలి. ♦ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలి. సరైన విరుగుడు మందులతోనే రసాయనాల రవాణా జరపాలి. రసాయ నాలు రవాణా చేసే వాహనాలకు ట్రాకింగ్ సిస్టం ఏర్పాటు చేయాలి. పర్యావరణ పరిరక్షణ నివేదికలో పేర్కొన్నట్టు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి -
‘కాళేశ్వరం’ కట్టాల్సిందే!
కాళేశ్వరం(మంథని): ‘కాళేశ్వరం’ మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణా నికి మహారాష్ట్రలోని సిరొంచ తాలూకా ప్రజలు మద్దతు తెలిపారు. కానీ, ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న అపోహలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. సిరొంచ తాలూకా పోచంపల్లిలో బుధవారం మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా పర్యావరణ శాఖ సబ్ రీజనల్ అధికారి హేమ మయూరేశ్ దేశ్‌పాండే, గడ్చిరోలి అడిషనల్ మేజిస్ట్రేట్ దర్వేశ్ సోనువానే, కాళేశ్వరం బ్యారేజీ చీఫ్ ఇంజనీర్ నల్లా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. సిరొంచ తాలూకాలోని పోచంపల్లి, పెంటిపాక, అరుడ, వడిదం, ఆయిపేట, మూగపూర్, మద్దికుంట, తుమునూర్, నగరం, జానంపల్లి, చింతలపల్లి గ్రామాల భూనిర్వాసితులు, ప్రజలు హాజరయ్యారు. ప్రాజెక్టు లాభాలను ఈ సందర్భంగా చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు వివరించారు. భూనిర్వాసితులు మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకం కాదని, ఎంత భూమి ముంపునకు గురవుతుందో స్పష్టత ఇవ్వాలని, కచ్చి తమైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం డీపీఆర్ ప్రకటించి, మహారాష్ట్రకు సంబంధించిన ఎన్ని భూములు పోతున్నాయో ప్రతి గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో పెట్టాలని కోరారు. అయితే, ప్రజాభిప్రాయ సేకరణ సభకు 200 నిర్వాసితులు మాత్రమే వచ్చారు. దీంతో సభా ప్రాంగణంలో ప్రజలు లేక వెలవెల బోయింది. మాజీ ఎమ్మెల్యే వర్గీయులతో పోలీసుల వాగ్వాదం అహేరి మాజీ ఎమ్మెల్యే దీపక్ దాదా ఆత్రం ప్రజాభిప్రాయ సేకరణకు తన అనుచరగణంతో తరలి వచ్చారు. అయితే, అప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం పూర్తి కాగా, తూతూమంత్రంగా ప్రజాభిప్రాయసేకరణ చేశారని పర్యావరణశాఖ అధికారి హేమను ఆయన నిలదీశారు. ఈ క్రమంలో ఆమె పోలీసుల సహాయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. సిరొంచ డీఎస్పీ గజానన్ రాథోడ్, సీఐ సూపేలు దీపక్ ఆత్రం తదితరులు మాజీ ఎమ్మెల్యే అనుచర గణాన్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, దీపక్ ఆత్రం వర్గానికి స్వల్ప వాగ్వాదం జరిగింది. అంతకు మందు మంథని నియోజకవర్గం నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న కాంగ్రెస్ శ్రేణులను కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన వద్ద తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. -
జిల్లాల్లో మినరల్ ఫౌండేషన్లు
ఇన్చార్జి మంత్రి చైర్మన్‌గా పాలకమండలి కలెక్టర్ చైర్మన్‌గా మేనేజింగ్ కమిటీ ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: గనులు, ఖనిజాలు(అభివృద్ధి, నియంత్రణ) సవరణ చట్టం-2015 నిబంధనలకు అనుగుణంగా జిల్లాస్థాయిలో డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్(ట్రస్టు) (డీఎంఎఫ్)ల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఇటీవలే ఈ చట్టాన్ని సవరించింది. డీఎంఎఫ్‌టీల మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. రాష్ట్రంలోని 10 జిల్లాల్లోనూ ఏర్పాటయ్యే డీఎంఎఫ్‌కు పాలకమండలి(గవర్నింగ్ కౌన్సిల్), మేనేజింగ్ కమిటీ వేర్వేరుగా ఉంటాయి. జిల్లా పంచాయతీ కార్యాలయం కేంద్రంగా డీఎంఎఫ్ పనిచేస్తుంది. మైనింగ్ ద్వారా ప్రభావితమయ్యే వ్యక్తులు, ప్రాంతాల ప్రయోజనాలు కాపాడటం, లబ్ధి చేకూర్చడం ఈ ఫౌండేషన్ లక్ష్యం. జిల్లా ఇన్చార్జి మంత్రి చైర్మన్‌గా, కలెక్టర్ సభ్య కార్యదర్శిగా వ్యవహరించే పాలకమండలిలో సంబంధిత జిల్లా మంత్రి, మైనింగ్ ప్రభావిత ప్రాంత వ్యక్తి, మైనింగ్ కంపెనీ ప్రతినిధి, సాంఘిక, స్త్రీ, శిశు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, గనులు, భూగర్భ వనరులు, అటవీ, పర్యావరణ శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. పాలకమండలి ట్రస్టు విధివిధానాలను రూపొందించడంతోపాటు, ట్రస్టు కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. పాలక మండలితోపాటు జిల్లా కలెక్టర్ చైర్మన్, జాయింట్ కలెక్టర్ వైస్ చైర్మన్, గ్రూప్ 1 హోదా కలిగిన జిల్లాస్థాయి అధికారి సభ్య కార్యదర్శిగా మేనేజింగ్ కమిటీ ఏర్పాటు చేస్తారు. గవర్నింగ్ కౌన్సిల్ సిఫారసు మేరకు మైనింగ్ ప్రభావిత ప్రాంతాల నుంచి ఐదుగురు స్థానికులు, డీఆర్డీఏ పీడీ, గనులు, భూగర్భ వనరుల శాఖ ఏడీ, లీడ్ బ్యాంక్ అధికారి మేనేజింగ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. మైనింగ్ లీజుదారుల నుంచి సకాలంలో కంట్రిబ్యూషన్ ఫండ్ వసూలు, ట్రస్టు విజన్ డాక్యుమెంటు తయారీ, వార్షిక ప్రణాళిక అమలు పర్యవేక్షణ, ట్రస్టు నిధి వివిధ ప్రాజెక్టులకు మంజూరు, నిధుల వినియోగాన్ని ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. -
‘దామరచర్ల’పై నేడు కీలక నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో యాదాద్రి సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుపై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 4000 (5x800) మెగావాట్ల సామర్థ్యమున్న యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణంతో పాటు దేశవ్యాప్తంగా పలు థర్మల్ విద్యుత్ కేంద్రాలకు పర్యావరణ అనుమతులు జారీ చేసే అంశంపై ఢిల్లీలో పర్యావరణ శాఖ నిపుణుల మదింపు కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. యాదాద్రి విద్యుత్ కేంద్రాన్ని ప్రతిపాదిత స్థలంలోనే నిర్మించేందుకు అనుమతిస్తే తక్షణమే ప్రాథమిక అనుమతులు జారీ కానున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో పాటించాల్సిన నియమ నిబంధనల (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌ను-టీఓఆర్)నే ప్రాథమిక అనుమతులుగా పరిగణిస్తారు. గత అక్టోబర్ 29న చివరిసారిగా దామరచర్ల ప్లాంట్‌పై సమావేశమైన నిపుణుల కమిటీ అనుమతుల జారీ అంశాన్ని తదుపరి సమావేశానికి వాయిదా వేసింది. ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలం నుంచి అన్నమేరువాగు వెళ్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. పర్యావరణ శాఖ ఆదేశాల మేరకు నిపుణులతో కూడిన సబ్ కమిటీ ఇటీవల దామరచర్లలో ప్రాజెక్టు స్థలాన్ని పరిశీలించింది. ఈ సబ్ కమిటీ సమర్పించిన అధ్యయన నివేదికలోని సిఫారసులే శుక్రవారం నాటి సమావేశంలో కీలకంగా మారనున్నాయి. ప్రతిపాదిత స్థలంలో ప్రస్తుత డిజైన్ లే అవుట్‌కు అనుగుణంగా ప్రాజెక్టును నిర్మించాలా? లేక లే అవుట్లో మార్పులతో అదే స్థలంలో నిర్మించాలా? లేక స్థలాన్ని మార్చాలా? అన్న అంశాలపై నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలున్నాయి. కాగా, ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల విషయంలో ఎలాంటి ఆటంకాలు లేవని తెలంగాణ జెన్కో వర్గాలు పేర్కొంటున్నాయి. అనుమతులపై అన్నమేరువాగు ప్రభావం ఏమాత్రం ఉండదని స్పష్టం చేస్తున్నాయి. -
‘పర్యావరణ మిత్ర’ పాఠశాలలకు అవార్డు ప్రదానం
భానుగుడి(కాకినాడ), న్యూస్‌లైన్ : కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర సర్వశిక్షా అభియాన్, రాష్ట్ర పర్యావరణ విద్యాశాఖ సహకారంతో జరిగిన రాష్ట్రస్థాయి పర్యావరణ మిత్ర అవార్డుల పోటీలలో 2012-13కు కాజులూరు మండలం శీలలంక పాఠశాల, 2013-14 విద్యాసంవత్సరానికి తుని మండలం ఎన్.సూరవరం జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలను అవార్డులను వరించాయి. ఈ పథకంలో ఏటా ప్రతి జిల్లా నుంచి ఒక పాఠశాలను ఎంపిక చేసి ఆర్సిలర్ మిట్టల్ (లక్ష్మీ శ్రీనివాస్మిట్టల్) సహకారంతో అవార్డును ప్రదానం చేస్తున్నారు. నీటి సంరక్షణ, వ్యర్థాలను రీసైక్లింగ్ ప్రాసెస్ చేసి వాడడం, శక్తి వనరులను సంరక్షించడం, తక్కువ స్థాయిలో వాడడం, మొక్కలు పెంచడం, పండగలను విద్యార్థులకు పరిచయం చేసి సంస్కృతి, సంప్రదాయాల మీద అవగాహన కల్పిం చడం వంటి ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఏడాదికి జిల్లాకు ఒక పాఠశాలను ఎంపిక చేసి, పాఠశాలలో ఉత్సాహంగా పనిచేసిన ఉపాధ్యాయులను సత్కరిస్తారు. ఆమేరకు శనివారం హైదరాబాద్‌లో సర్వశిక్షాఅభియాన్ రాష్ట్రకార్యాలయంలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సర్వశిక్షాఅభియాన్ రాష్ట్రప్రాజెక్టు అధికారి వి. ఉషారాణి, రాష్ట్ర పర్యావరణ విద్యాకేంద్రం నిర్వహణాధికారి ఇందిరాప్రకాష్ అవార్డుల ను ప్రదానం చేశారు. గ్రామస్తులను చైతన్యపరచిన కాజులూరు మండలం శీలలంక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పర్వతిన వెంకటనారాయణ, తుని మండలం ఎన్.సూరవరం జెడ్పీ హైస్కూల్ విద్యార్థులను పర్యావరణం వైపు నడిపించిన హెచ్ఎం కోటిపర్తి దాలినాయుడు ‘ పర్యావరణ మిత్ర’ అవార్డును, రూ. పదివేల నగదును అందుకున్నారు. వారిని డీఈఓ కేవీ శ్రీనివాసులురెడ్డి, ఎస్ఎస్ఎ పీఓ వెన్నపు చక్రధరరావు, నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా కన్వీనర్ సత్తి వెంకటరెడ్డి అభినందించారు.