సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధానికి సీఎం జగన్‌ ఆదేశాలు | YS Jagan Review Meeting With Forest Environment Departments | Sakshi
Sakshi News home page

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధానికి సీఎం జగన్‌ ఆదేశాలు

Published Thu, Sep 26 2019 3:09 PM | Last Updated on Thu, Sep 26 2019 5:38 PM

YS Jagan Review Meeting With Forest Environment Departments - Sakshi

సాక్షి, అమరావతి : కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణకై... సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధం విషయమై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అటవీ, పర్యావరణ శాఖలపై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో రాష్ట్రంలో అడవుల పెంపకం, కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణలపై సీఎం జగన్‌ సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ..‘‘పరిశ్రమల కాలుష్యాన్ని తొలగించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. లక్ష టన్నుల వ్యర్థాలు ఫార్మా కంపెనీ నుంచి వస్తే అందులో సుమారు 30 శాతం మాత్రమే శుద్దిచేస్తున్నారు. మిగతా 70 శాతం వాతావరణంలోకి వదిలేస్తున్నారన్న సమాచారం అందింది. హేచరీ జోన్‌గా ప్రకటించిన ప్రాంతాల్లో గతంలో ఫార్మా కంపెనీలకు అనుమతి ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హేచరీ జోన్‌గా ప్రకటించిన తర్వాత ఆ ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలకు ఎలా అనుమతి ఇచ్చారో అర్థంకావడం లేదు. ఫార్మా కంపెనీల కోసం ఇప్పటికే మనం ఫార్మాసిటీలను ఏర్పాటు చేశాం. అక్కడే వాటిని పెట్టుకునేలా వారికి అనుతులు ఇవ్వాలి’’ అని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

Forest Environment Departments Review Meeting

‘‘ఏపీ నుంచి పెద్ద ఎత్తున సముద్రపు ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. పరిశ్రమలు ఏమైనా వస్తున్నాయంటే రెడ్‌ కార్పెట్‌ వేస్తాం కాని, వాటినుంచి ఎలాంటి కాలుష్యం వస్తుందనే దానిపై మనం ఆలోచించం. వాతావరణానికి, పర్యావరణానికి ఎలాంటి భంగం కలుగుతుందనే దానిపై దృష్టిపెట్టడం లేదు. ఎన్నివేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని మాత్రమే ఆలోచిస్తాం. ప్రస్తుతం ఉన్న కాలుష్య నియంత్రణ బోర్డు, సంబంధిత వ్యవస్థల్లో ప్రక్షాళన జరగాలి’ అని అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.  

అదే విధంగా కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ పట్ల సమగ్ర అవగాహన, పరిజ్ఞానం, అంకిత భావం ఉన్నవారు ఈ వ్యవస్థల్లో ఉండాలని,ఈ అంశాలన్నింటినీ సమగ్రంగా ఆలోచించి. ఉత్తమ విధానాలను అనుసరించాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు. పరిశ్రమల కాలుష్యాన్ని తొలగించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని, ఈ మేరకు ప్రభుత్వం గ్రీన్‌ ట్యాక్స్‌ వేస్తుందని స్పష్టం చేశారు. పర్యావరణాన్ని, ప్రకృతిని సంరక్షించుకోకపోతే మన తర్వాత తరాలు బతకడం కష్టమవుతుందని, ఈ ఆలోచనలు చేయకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుందని ఆగ్రహించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణలో దేశానికి తాము మార్గదర్శకంగా నిలవాలని, వివిధ దేశాల్లో అత్యుత్తమ విధానాలను అనుసరిస్తున్నపద్ధతులను అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశించారు. నెలరోజుల్లోగా పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై అత్యుత్తమ విధానాలను సూచిస్తూ ప్రతిపాదనలు తయారు చేయాలని, దీనికిబిల్లులు రూపొందించండని  సీఎం జగన్‌ సూచించారు.  

Forest Environment Departments Review Meeting 1

అంతేగాక విశాఖపట్నం కాలుష్యంతో అల్లాడుతోందని, కాలుష్యనియంత్రణ చేయకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవని అధికారులను సీఎం జగన్‌ హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణకు, విశాఖ నగరంలో కాలుష్య నియంత్రణకు పెద్దపీట వేయాలని ఆదేశించారు. వేస్ట్‌ మేనేజ్‌మెంట్, మురుగునీటి పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. మురుగునీటిని శుద్దిచేసిన తర్వాతే విడిచిపెట్టాలని, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌ మెంట్‌పై ఫ్రెంచి ప్రతినిధి బృందంతో తాను చర్చించినట్లు సీఎం తెలిపారు. పంట కాల్వలను కాపాడుకోవాలని, అవి కాలుష్యం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉభయగోదావరి జిల్లాల్లో పూర్తిస్థాయిలో కాల్వలను పరిరక్షించాలన్నారు. మిషన్‌ గోదావరి తరహాలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం చేపట్టాలని, దీనిపై సరైన ప్రతిపాదనలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆక్వా పరిశ్రమలనుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేయాలని, ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇ– వేస్ట్‌కోసం కాల్‌ సెంటర్‌ను ఏర్పాట చేయాలని, దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. 

గ్రామ వాలంటీర్లందరికీ మొక్కలు పంపిణీ చేయాలని, చెట్లను పెంచడంలో అధికారులు వారి సహకారం తీసుకోవాలని సీఎం జగన్‌ సూచించారు. ప్రతి ఇంటికీ నాలుగు మొక్కలు ఇవ్వాలని, కాల్వ గట్లమీద మొక్కలను వీలైనంత పెంచాలని వివరించారు. అనంతపురం, కడప ప్రాంతాల్లో అడవులను పెంచడానికి దృష్టిపెట్టాలని, ఆ ప్రాంత ప్రస్తుత నైసర్గిక స్వరూపాన్ని మార్చాలని ఆదేశించారు. అటవీశాఖ వద్ద ఉన్న ఎర్రచందనాన్ని ఏక మొత్తంగా అమ్మే పద్దతులు కాకుండా విడతల వారీగా అమ్మితే ప్రభుత్వానికి మేలు జరుగుతుందని అన్నారు. ఈ విషయంలో అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకుంటే మంచిదని, చైనా, జపాన్‌ సంస్థలతో చర్చలు జరపాలని అధికారులకు సీఎం జగన్‌ సూచించారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, పర్యావరణశాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, అటవీ, పర్యావరణ శాఖ అధికారులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement