
న్యూఢిల్లీ: దీపావళి పండుగని పురస్కరించుకొని దేశ రాజధాని ఢిల్లీలో కేవలం గ్రీన్ దీపావళి మాత్రమే జరుపుకోవాలని ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు 2018లో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రజలు పర్యావరణహితమైన టపాసులు మాత్రమే ఢిల్లీలో తయారు చేసి, అమ్మాలని మంత్రి బుధవారం చెప్పారు. మరోవైపు ఈ ఏడాది టపాసులకి వ్యతిరేకంగా భారీగా ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. నవంబర్ 3 నుంచి ఈ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్టుగా గోపాల్ రాయ్ వెల్లడించారు. కోవిడ్–19 నేపథ్యంలో ప్రజలెవరూ టపాసులు కాల్చవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఏడాది దీపావళి టపాసులు పేల్చడం, పంట వ్యర్థాల దహనం కారణంగా ఢిల్లీ కాలుష్యం బారిన పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ ఈ సారి టపాసులకి దూరంగా ఉండాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment