Green Diwali
-
కాలుష్యం కాదు.. కాంతులు కావాలి
కడప కల్చరర్ : దీపావళి పండుగ అన్ని వయస్సులు, అన్ని వర్గాల వారికి ఆనందాన్ని ఇస్తుంది. ఈ సంతోషాల పండుగ నిర్వహణ వెనుక ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అలాగాక పండుగ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించేందుకు పర్యావరణ హితంగా నిర్వహించుకోవాలన్నది పెద్దల ఆలోచన. పండుగ కాలుష్య కారకం కాకూడదని దీపావళి కాంతులు మాత్రమే చాలునని పేర్కొంటున్నారు. ఈ మేరకు పర్యావరణ నిపుణులు సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. గ్రీన్ దీపావళిని నిర్వహించాలని కోర్టు సూచించింది. పండుగ రోజున కాల్చే టపాసుల ద్వారా వచ్చే కాలుష్యం ప్రమాదకరమైందని.. ఇకపై కాలుష్యాన్ని కలిగించే టపాసులను వినియోగించకూడదని.. భారీ శబ్దాలు చేసే వాటిని కూడా దూరంగా ఉంచాలని కోర్టు సూచించింది. ప్రత్యేకించి ఈ పండుగ రోజులలో రాత్రి 8 గంటలనుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా కాల్చాలని కూడా తీర్పులో ఆదేశించింది. అయితే దక్షిణాది రాష్ట్రాల ప్రత్యేక పరిస్థితులు గమనించి కోర్టు రోజులో ఏవైనా రెండు గంటలపాటు కాల్చుకోవచ్చని సడలింపు ఇచ్చింది. ఈ దీపావళికి పర్యావరణ హితమైన టపాసులు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. ది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఆఫ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంటర్ ఏకో ఫ్రెండ్లీ గ్రీన్ టపాసులను అందుబాటులోకి తెచ్చింది. భారీ శబ్దాల స్థానంలో ఫ్లవర్ పార్ట్స్, పెన్సిల్స్, భూ చక్రాలు, స్పార్కులర్ల స్థానాలలో కాకరొత్తులు, చిచ్చుబుడ్లు మాత్రమే కాల్చుకోవాలని సూచించింది. వీటిని వాడటంతో శబ్ద కాలుష్యాన్ని చాలా మేరకు తగ్గించవచ్చని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ప్రమాదాలకు అవకాశం పండుగ సంప్రదాయంలో భాగంగా టపాసులు కాల్చుకుంటాం. కానీ ఆదమరిస్తే ఆ సరదా మనకే శాపంగా మారే ప్రమాదం ఉంది. టపాసులలో కొన్ని రకాలు ప్రమాదకరమైనవి. పూర్తిగా విషపూరితమైనవి ఉన్నాయి. ఇలాంటి వాటిని కాల్చితే మన ప్రమాదాన్ని మనమే సృష్టించుకున్నట్లు అవుతుంది. ఇలాంటి టపాసుల తయారీలో వాడే రసాయనాలు, లోహాలు విషపూరితమైనవి. పలు రసాయనాల సమ్మేళనంతో చేసిన వీటిని కాల్చితే గాలి, శబ్దం కాలుష్యమవుతుంది. కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు ఈ ఏడాది పెద్ద నగరాలలో శబ్ద కాలుష్యంతోపాటు వాయు కాలుష్యాన్ని కూడా లెక్కకట్టనున్నారు. పండుగకు ముందు, తర్వాత కాలుష్యాన్ని నమోదు చేయనున్నారు. పర్యావరణ హిత దీపావళిని జరుపుకోవాలంటూ అవగాహన కల్పిస్తున్నారు. ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. రసాయన సమ్మేళనాలు బొగ్గు, పొటాషియం, నైట్రేట్, సల్ఫర్ ఇలాంటి రసాయనాల సమ్మేళనంతో జరిగే చర్యలవల్ల గాలి, విషపూరితమై క్యాన్సర్‌ను కలిగిస్తుంది. అల్యూమినియం ద్వారా స్పార్కులర్స్ వస్తాయి కనుక వాటిని ఎక్కువగా వాడతారు. అవి చర్మానికి తాకితే దద్దుర్లు వచ్చి నొప్పిని కలిగిస్తాయి. అనారోగ్యం కలుగుతుంది. స్ట్రోమియం శరీరంలోని కాల్షియం స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఇది కూడా విషపూరితమైనది.. ఇథీయం ఎరుపు రంగు వచ్చేందుకు వాడుతారు. ఇది మండినప్పుడు విష వాయువులు వెలువడతాయి. బేరియంను ఆకుపచ్చ రంగు కనిపించడానికి వాడతారు. ఇది శ్వాసకోశ వ్యాధులను కలిగిస్తుంది. సల్ఫర్ ద్వారా సల్ఫిరిక్ ఆమ్లం దానివల్ల వాతావరణ కాలుష్యం, జలవనరుల కాలుష్యం కలుగుతాయి. జిగురు, పేపర్లతో చేసిన టపాసులను కాల్చితే కళ్లు, ముక్కులలో మంట, గొంతు, తలనొప్పి, వికారం కలుగుతాయి. కాలేయం, మూత్ర పిండాలు, నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. సీసంతో చేసిన టపాసులతో చిన్నారులు మానసిక వికలాంగులయ్యే ప్రమాదం ఉంది. మెగ్నీషియం టపాసులు పొగ వెదజల్లడంవల్ల శ్వాస సమస్యలు ఎదురవుతాయి. జ్వరం వచ్చే ప్రమాదం ఉంది. జింక్ ద్వారా వచ్చే కాంతి కళ్లకు ప్రమాదం, మాంగనీస్ కలిపిన టపాసుల పొగ నేరుగా శరీరంలోకి చేరి నరాల బలహీనత, నిద్రలేమి, భావోద్వేగం, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. కాడ్మియం మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. రక్తహీనత, రక్తపోటు పెరుగుతాయి. ఎముకలు గట్టిదనం తగ్గుతాయి. భాస్వరం వాడిన టపాసులతో కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. కాలేయం పనితీరు కుంటుపడుతుంది. కంటికి నష్టం కలుగుతుంది. సల్ఫర్ ద్వారా ఊపిరితిత్తుల వ్యాధులు కలుగుతాయి. నైట్రేట్ ద్వారా మత్తు కలగడం, తిమ్మిర్లు రావడం, వాంతులు, విరేచనాలు, మూర్ఛ సమస్యలు తలెత్తుతాయి. నోటి ద్వారా గాలి ఊపిరితిత్తులకు వెళ్లి అనారోగ్యం పాలు చేస్తుంది. రక్తపోటు పెరుగుతుంది. తలనొప్పి కూడా వస్తుంది. ఇవేకాక పొగలు రావడానికి వాడే రూబిడియం, సల్ఫర్, యాంటీమిని, స్ట్రాంటియం, టైటానియం, మెటల్, జింక్‌ల వినియోగం కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలాగైతే సురక్షితం మట్టి దీపాలు, కొవ్వొత్తులు, విద్యుత్ దీపాలను వెలిగించడం మంచిదని.. నెయ్యి దీపాలు వెలిగిస్తే ఆక్సిజన్ కూడా ఎక్కువగా వెలువడుతుందని.. కనుక ఇలాంటి దీపాలు వెలిగించడమే మంచిదని పెద్దలు సూచిస్తున్నారు. టపాసులు ఇళ్ల లోపల కాల్చకూడదని.. దీంతో విష వాయువులు ఇళ్ల మూలల్లో నిలిచిపోయి చాలా రోజులు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. సరిగా కాలనివి, సగం కాలిన టపాసులను వదిలేయాలి. మరోసారి కాల్చుదామని దగ్గరికి వెళితే అకస్మాత్తుగా పేలే ప్రమాదం ఉందంటున్నారు. కాటన్ దుస్తులు, కళ్లజోడులు, బూట్లు వేసుకోవడం మంచిదని చెబుతున్నారు. -
బాణాసంచా బ్యాన్పై కర్ణాటక యూటర్న్
సాక్షి, బెంగళూరు : బాణాసంచా నిషేధంపై కర్ణాటక ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. దీపావళి సందర్భంగా బాణాసంచాను కొనొద్దు, కాల్చొద్దు అంటూ ముఖ్యమంత్రి యడియూరప్ప పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బాణాసంచా కాల్చకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిషేధం విధిస్తామని ఆయన నిన్న పేర్కొన్నారు. టపాసులు అధికంగా కాల్చడం వల్ల కాలుష్య ప్రమాణం పెరిగి కరోనా వైరస్ మరింతగా విజృంభించే ప్రమాదం ఉందన్న నేపథ్యంలో టపాసులను ఈ ఏడాది దీపావళికి నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. ప్రభుత్వ తీర్మానం వల్ల ప్రజలెవరూ టపాసులు కొనడం కానీ, అమ్మడం కానీ చేసి నష్టపోవద్దని సూచించారు. ఈ ఏడాది బాణాసంచా లేకుండానే దీపావళి పండుగ జరుపుకుందామని పిలుపునిచ్చారు. (కర్ణాటకలోనూ బాణాసంచాపై నిషేధం) అయితే తాజాగా బాణాసంచా నిషేధం నిర్ణయంపై యడియూరప్ప సర్కార్ పునరాలోచన చేసింది. వాయు కాలుష్యం లేని గ్రీన్ క్రాకర్స్‌ను అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల అభిప్రాయాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి శనివారం తెలిపారు. దీపావళి పండుగని పురస్కరించుకొని కర్ణాటకలో కేవలం గ్రీన్ దీపావళి మాత్రమే జరుపుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు పర్యావరణహితమైన టపాసులు మాత్రమే తయారు చేసి, అమ్మాలని అన్నారు. ప్రజలు నిబంధనలకు లోబడి, పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని దీపావళి జరుపుకోవాలని ఆయన సూచించారు. ఇక కోవిడ్-19 నియంత్రణకు ప్రభుత్వం అవసరం అయిన అన్ని చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. కాగా ఢిల్లీ, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాలు బాణాసంచాపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. (‘టపాసులు కాల్చం, లక్ష్మీ పూజ చేసుకుంటాం’) -
ఢిల్లీలో కేవలం ‘గ్రీన్’ దీపావళి
న్యూఢిల్లీ: దీపావళి పండుగని పురస్కరించుకొని దేశ రాజధాని ఢిల్లీలో కేవలం గ్రీన్ దీపావళి మాత్రమే జరుపుకోవాలని ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు 2018లో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రజలు పర్యావరణహితమైన టపాసులు మాత్రమే ఢిల్లీలో తయారు చేసి, అమ్మాలని మంత్రి బుధవారం చెప్పారు. మరోవైపు ఈ ఏడాది టపాసులకి వ్యతిరేకంగా భారీగా ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. నవంబర్ 3 నుంచి ఈ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్టుగా గోపాల్ రాయ్ వెల్లడించారు. కోవిడ్–19 నేపథ్యంలో ప్రజలెవరూ టపాసులు కాల్చవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఏడాది దీపావళి టపాసులు పేల్చడం, పంట వ్యర్థాల దహనం కారణంగా ఢిల్లీ కాలుష్యం బారిన పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ ఈ సారి టపాసులకి దూరంగా ఉండాలన్నారు. -
పచ్చటి దీపాన్ని వెలిగిస్తున్నారు!
‘దీపావళి’ రోజు దీపాలు వెలుగు దారులై కనిపిస్తాయి. ఆ వెలుగులో... ఎప్పుడూ చూడనివి, ఎప్పుడూ చూసేవి కనిపించవచ్చు. కొందరికి... ఎప్పుడూ చూడనివి కనిపించవచ్చు. అవి వస్తువులే కానక్కర్లేదు... ఆలోచనలు కావచ్చు!ఆ ఆలోచనలే వారిని కొత్త దారిలో పయనింపచేస్తాయి. పండగతో పాటు పర్యావరణాన్ని ప్రేమించేలా చేస్తాయి. సరికొత్త మార్గంలో నడిచేలా చేస్తాయి. ‘గ్రీన్ దీపావళి’ని ప్రచారం చేస్తున్న పర్యావరణ ప్రేమికుల గురించి తెలుసుకుందాం... చండీగఢ్ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ, యువసత్తా కలిసి సిటీ స్కూళ్లలో ‘గ్రీన్ దీపావళి’ క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రతి స్కూలుకు వెళ్లి ‘గ్రీన్ దీపావళి’ ప్రాముఖ్యత గురించి వివరంగా చెబుతున్నారు. మితిమీరి బాణసంచా కాల్చడం వల్ల ఏర్పడే వాయు, శబ్ద కాలుష్యాల గురించి వివరిస్తున్నారు. సాధారణ రోజులతో పోల్చితే...పండగ రోజుల్లో కాలుష్య స్థాయి ఎంత ఎక్కువగా ఉంటుందో చెబుతున్నారు. స్కూళ్ళలో ‘ఎకో-క్లబ్’లను ఏర్పాటు చేస్తున్నారు. ‘మీరు బాణసంచా కోసం ఉపయోగించాలనుకుంటున్న డబ్బును ఏదైనా మంచిపని కోసం వినియోగించి చూడండి. ఆ తృప్తి ఎంత గొప్పగా ఉంటుందో’ అని చెబుతున్నారు.ఇంట్లో తయారు చేసిన స్వీట్లనే తినడం, పచ్చటి మొక్కలను బహుమతిగా ఇచ్చుకోవడం... మొదలైన పనుల ద్వారా పండగ సంతోషాన్ని సొంతం చేసుకోవాలని చెబుతున్నారు. ‘‘సంప్రదాయ పద్ధతుల్లో శబ్దకాలుష్యం, వృథా ఖర్చు ఉండదు. ఇండ్లను దీపాలతో అలంకరించుకోవడం ద్వారా పండగ జరుపుకునే సంప్రదాయ పద్ధతిని ప్రోత్సహిస్తున్నాం’’ అని చెబుతున్నారు చండీగఢ్‌లోని ‘యువసత్తా’ కో ఆర్డినేటర్ ప్రమోద్‌శర్మ ఇక పంజాబ్‌లోని అమర్పురలాంటి గ్రామాల్లో ‘గ్రీన్ దీపావళి’ ప్రచారానికి పిల్లలే స్వయంగా నడుం కట్టారు. ‘దిస్ దివాలీ ఓన్లీ దివాస్ నో ఫైర్ క్రాకర్స్’ ఇలా రకరకాల నినాదాలతో వీధుల గుండా ఊరేగింపుగా వెళుతూ ప్రజలలో అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ పరిధిలోని 13 గ్రామాల ప్రజలు ‘గ్రీన్ దీపావళి’ని జరుపుకుంటున్నారు. బాణసంచాకు దూరంగా ఉంటున్నారు. నిహలువాల్, చక్చెల, షేర్పూర్-డోన, తల్వానీ మదో.... మొదలైన గ్రామాలు పర్యావరణవేత్త బాబా బల్బీర్‌సింగ్ ఉపన్యాసాలతో ప్రభావితమై శబ్ద, వాయు కాలుష్యాలకు దూరంగా ‘గ్రీన్ దీపావళి’ని జరుపుకొంటున్నారు. గుర్గావ్కు చెందిన సాజన్ అబ్రోల్ ‘బరస్ట్ హంగర్ చాలెంజ్’ నినాదంతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. సాజన్ ప్రచారం అందరినీ ఆకట్టుకుంటోంది. కేవలం బాణసంచా కాల్చడం ద్వారా మాత్రమే ఆనందం సొంతం అయినట్లు కాదంటూ... సాజన్లాంటి వాళ్లు కొత్త ప్రతిపాదనలు చేస్తున్నారు. ముంబాయిలోని ‘గ్రీన్ టీమ్’ స్వచ్ఛంద సంస్థకు చెందిన యువ సభ్యులు అడవిలో ఆదివాసీ పిల్లలతో కలిసి ప్రతి ఏటా దీపావళి జరుపుకొంటారు.‘‘పండగరోజు బొమ్మలు, స్వీట్లతో ఆదివాసీ పిల్లల దగ్గరికి వెళతాం. శాంతియుత దీపావళి గురించి అవగాహన కలిగిస్తాం. వారితో ఆడుతూ పాడుతూ గడుపుతాం’’ అంటున్నారు ఎల్సీ గాబ్రియేల్. తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లా కిట్టంపాలయం గ్రామం ఎన్నో సంవత్సరాలుగా ‘శబ్దరహిత దీపావళి’ని జరుపుకుంటోంది. దీనికి వెనుక ఒక కారణం ఉంది... ఊళ్లో ఒక చెట్టుపై వేలాది గబ్బిలాలు ఉంటాయి. అవి రాత్రంతా ఆహారం కోసం ఎక్కడెక్కడికో వెళ్లి... పగలు చెట్టు మీద ఉంటాయి. బాణసంచా కాలిస్తే... అవి ఎక్కడ భయపడి పారిపోతాయోనని ఎన్నో సంవత్సరాల నుంచి కాల్చడం మానుకున్నారు ఆ ఊరి ప్రజలు. ‘పర్యావరణానికి హాని కలిగించవద్దు’ నుంచి మొదలు ‘పక్షులను బాధ పెట్టవద్దు’ వరకు... ఇలా రకరకాల కారణాలతో వ్యక్తులు, గ్రామాలు, సంస్థలు ‘గ్రీన్ దీపావళి’ని జరుపుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.