కాలుష్యం కాదు.. కాంతులు కావాలి | - | Sakshi
Sakshi News home page

కాలుష్యం కాదు.. కాంతులు కావాలి

Published Mon, Nov 6 2023 12:52 AM | Last Updated on Mon, Nov 6 2023 11:00 AM

- - Sakshi

కడప కల్చరర్‌ : దీపావళి పండుగ అన్ని వయస్సులు, అన్ని వర్గాల వారికి ఆనందాన్ని ఇస్తుంది. ఈ సంతోషాల పండుగ నిర్వహణ వెనుక ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అలాగాక పండుగ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించేందుకు పర్యావరణ హితంగా నిర్వహించుకోవాలన్నది పెద్దల ఆలోచన. పండుగ కాలుష్య కారకం కాకూడదని దీపావళి కాంతులు మాత్రమే చాలునని పేర్కొంటున్నారు. ఈ మేరకు పర్యావరణ నిపుణులు సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. గ్రీన్‌ దీపావళిని నిర్వహించాలని కోర్టు సూచించింది. పండుగ రోజున కాల్చే టపాసుల ద్వారా వచ్చే కాలుష్యం ప్రమాదకరమైందని.. ఇకపై కాలుష్యాన్ని కలిగించే టపాసులను వినియోగించకూడదని.. భారీ శబ్దాలు చేసే వాటిని కూడా దూరంగా ఉంచాలని కోర్టు సూచించింది.

ప్రత్యేకించి ఈ పండుగ రోజులలో రాత్రి 8 గంటలనుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా కాల్చాలని కూడా తీర్పులో ఆదేశించింది. అయితే దక్షిణాది రాష్ట్రాల ప్రత్యేక పరిస్థితులు గమనించి కోర్టు రోజులో ఏవైనా రెండు గంటలపాటు కాల్చుకోవచ్చని సడలింపు ఇచ్చింది. ఈ దీపావళికి పర్యావరణ హితమైన టపాసులు మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. ది కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఏకో ఫ్రెండ్లీ గ్రీన్‌ టపాసులను అందుబాటులోకి తెచ్చింది. భారీ శబ్దాల స్థానంలో ఫ్లవర్‌ పార్ట్స్‌, పెన్సిల్స్‌, భూ చక్రాలు, స్పార్కులర్‌ల స్థానాలలో కాకరొత్తులు, చిచ్చుబుడ్లు మాత్రమే కాల్చుకోవాలని సూచించింది. వీటిని వాడటంతో శబ్ద కాలుష్యాన్ని చాలా మేరకు తగ్గించవచ్చని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.

ప్రమాదాలకు అవకాశం
పండుగ సంప్రదాయంలో భాగంగా టపాసులు కాల్చుకుంటాం. కానీ ఆదమరిస్తే ఆ సరదా మనకే శాపంగా మారే ప్రమాదం ఉంది. టపాసులలో కొన్ని రకాలు ప్రమాదకరమైనవి. పూర్తిగా విషపూరితమైనవి ఉన్నాయి. ఇలాంటి వాటిని కాల్చితే మన ప్రమాదాన్ని మనమే సృష్టించుకున్నట్లు అవుతుంది. ఇలాంటి టపాసుల తయారీలో వాడే రసాయనాలు, లోహాలు విషపూరితమైనవి. పలు రసాయనాల సమ్మేళనంతో చేసిన వీటిని కాల్చితే గాలి, శబ్దం కాలుష్యమవుతుంది. కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు ఈ ఏడాది పెద్ద నగరాలలో శబ్ద కాలుష్యంతోపాటు వాయు కాలుష్యాన్ని కూడా లెక్కకట్టనున్నారు. పండుగకు ముందు, తర్వాత కాలుష్యాన్ని నమోదు చేయనున్నారు. పర్యావరణ హిత దీపావళిని జరుపుకోవాలంటూ అవగాహన కల్పిస్తున్నారు. ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు.

రసాయన సమ్మేళనాలు

బొగ్గు, పొటాషియం, నైట్రేట్‌, సల్ఫర్‌ ఇలాంటి రసాయనాల సమ్మేళనంతో జరిగే చర్యలవల్ల గాలి, విషపూరితమై క్యాన్సర్‌ను కలిగిస్తుంది. అల్యూమినియం ద్వారా స్పార్కులర్స్‌ వస్తాయి కనుక వాటిని ఎక్కువగా వాడతారు. అవి చర్మానికి తాకితే దద్దుర్లు వచ్చి నొప్పిని కలిగిస్తాయి. అనారోగ్యం కలుగుతుంది. స్ట్రోమియం శరీరంలోని కాల్షియం స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఇది కూడా విషపూరితమైనది.. ఇథీయం ఎరుపు రంగు వచ్చేందుకు వాడుతారు. ఇది మండినప్పుడు విష వాయువులు వెలువడతాయి. బేరియంను ఆకుపచ్చ రంగు కనిపించడానికి వాడతారు. ఇది శ్వాసకోశ వ్యాధులను కలిగిస్తుంది. సల్ఫర్‌ ద్వారా సల్ఫిరిక్‌ ఆమ్లం దానివల్ల వాతావరణ కాలుష్యం, జలవనరుల కాలుష్యం కలుగుతాయి.

జిగురు, పేపర్‌లతో చేసిన టపాసులను కాల్చితే కళ్లు, ముక్కులలో మంట, గొంతు, తలనొప్పి, వికారం కలుగుతాయి. కాలేయం, మూత్ర పిండాలు, నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. సీసంతో చేసిన టపాసులతో చిన్నారులు మానసిక వికలాంగులయ్యే ప్రమాదం ఉంది. మెగ్నీషియం టపాసులు పొగ వెదజల్లడంవల్ల శ్వాస సమస్యలు ఎదురవుతాయి. జ్వరం వచ్చే ప్రమాదం ఉంది. జింక్‌ ద్వారా వచ్చే కాంతి కళ్లకు ప్రమాదం, మాంగనీస్‌ కలిపిన టపాసుల పొగ నేరుగా శరీరంలోకి చేరి నరాల బలహీనత, నిద్రలేమి, భావోద్వేగం, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది.

కాడ్మియం మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. రక్తహీనత, రక్తపోటు పెరుగుతాయి. ఎముకలు గట్టిదనం తగ్గుతాయి. భాస్వరం వాడిన టపాసులతో కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. కాలేయం పనితీరు కుంటుపడుతుంది. కంటికి నష్టం కలుగుతుంది. సల్ఫర్‌ ద్వారా ఊపిరితిత్తుల వ్యాధులు కలుగుతాయి. నైట్రేట్‌ ద్వారా మత్తు కలగడం, తిమ్మిర్లు రావడం, వాంతులు, విరేచనాలు, మూర్ఛ సమస్యలు తలెత్తుతాయి. నోటి ద్వారా గాలి ఊపిరితిత్తులకు వెళ్లి అనారోగ్యం పాలు చేస్తుంది. రక్తపోటు పెరుగుతుంది. తలనొప్పి కూడా వస్తుంది. ఇవేకాక పొగలు రావడానికి వాడే రూబిడియం, సల్ఫర్‌, యాంటీమిని, స్ట్రాంటియం, టైటానియం, మెటల్‌, జింక్‌ల వినియోగం కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఇలాగైతే సురక్షితం
మట్టి దీపాలు, కొవ్వొత్తులు, విద్యుత్‌ దీపాలను వెలిగించడం మంచిదని.. నెయ్యి దీపాలు వెలిగిస్తే ఆక్సిజన్‌ కూడా ఎక్కువగా వెలువడుతుందని.. కనుక ఇలాంటి దీపాలు వెలిగించడమే మంచిదని పెద్దలు సూచిస్తున్నారు. టపాసులు ఇళ్ల లోపల కాల్చకూడదని.. దీంతో విష వాయువులు ఇళ్ల మూలల్లో నిలిచిపోయి చాలా రోజులు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. సరిగా కాలనివి, సగం కాలిన టపాసులను వదిలేయాలి. మరోసారి కాల్చుదామని దగ్గరికి వెళితే అకస్మాత్తుగా పేలే ప్రమాదం ఉందంటున్నారు. కాటన్‌ దుస్తులు, కళ్లజోడులు, బూట్లు వేసుకోవడం మంచిదని చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement