
మద్యం స్కాం అంటూ మాయామశ్చీంద్ర కథలు
కడప కార్పొరేషన్ : రాష్ట్రంలో మద్యం కుంభకోణం అంటూ కూటమి ప్రభుత్వం మాయా మశ్చీంద్ర కథలు చెబుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహిహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైజాగ్‌లో ఉర్సా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కూటమి ప్రభుత్వం 60 ఎకరాలు కట్టబెట్టిందన్నారు. ఐటీ పార్కులో డేటా సెంటర్ పేరుతో 3.50 ఎకరాలు కట్టబెట్టారన్నారు. రూ.3200 కోట్లు విలువ జేసే భూమిని అడ్రస్ లేని టీడీపీ బినామీ షెల్ కంపెనీకి ధారాదత్తం చేయడం దారుణమన్నారు. దీన్నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మద్యం స్కాంను తెరపైకి తెచ్చారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మద్యం పాలసీ పారదర్శకంగా జరిగిందన్నారు. దశల వారీగా మద్య నిషేధం చేయాలని, రాష్ట్రంలో 50 వేల బెల్టు షాపులు, 4వేల పర్మిట్ రూములను రద్దు చేశారన్నారు. మద్యం ధరలు ఎక్కువగా ఉంటే దాన్ని కొనేవారు తగ్గుముఖం పడతారని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భావించారన్నారు. ప్రైవేటు పరిధిలో ఉన్న మద్యం దుకాణాలను ప్రభుత్వ పరిధిలోకి తెచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం లేనిది ఉన్నట్లు సృష్టించి ఏవేవో కేసులు పెట్టి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డిని, వారి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టి తప్పుడు వాంగ్మూలం ద్వారా రాజ్‌కసిరెడ్డిని అరెస్ట్ చేయించారన్నారు. సంబంధం లేని సెక్షన్లు ఉన్న ఈ కేసు చూసి న్యాయమూర్తి కూడా నివ్వెరపోయారన్నారు. 2014–19లో టీడీపీ ప్రభుత్వంలో ఎంఆర్‌పీ ధరల కంటే 20 శాతానికి ఎక్కువ వసూలు చేసేలా ఉత్తర్వులిచ్చి రూ.1255 కోట్లు దోచుకున్నారన్నారు. ఆ వ మద్యం స్కాం పై సీఐడీ కేసు కూడా నమోదు చేసిందని, అప్పటి మంత్రి కొల్లు రవీంద్రతో పాటు చంద్రబాబు పై కూడా కేసు నమోదైందని గుర్తు చేశారు. కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే వైఎస్ జగన్ చుట్టూ ఉన్నవారందరిపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. తప్పుడు ఆరోపణలతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, రాబోయే రోజుల్లో తప్పనిసరిగా తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, పులి సునీల్ కుమార్, సీహెచ్ వినోద్, మునిశేఖర్ రెడ్డి, షఫీ, దానమయ్య పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అఽధ్యక్షుడు
పి. రవీంద్రనాథ్‌రెడ్డి