
అసాంఘిక కార్యక్రమాల నిరోధానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్
పులివెందుల రూరల్ : అసాంఘిక కార్యక్రమాలైన క్రికెట్ బెట్టింగ్, మట్కా, జూదం లాంటి వాటిని ఎదుర్కొనేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. గురువారం పులివెందుల పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్‌లో ఉన్న రికార్డులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లను గుర్తించి వారిపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నామన్నారు. పలు నియోజకవర్గాలలో సీసీ టీవీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే డ్రోన్ కెమెరాల ద్వారా బందోబస్తు నిర్వహిస్తామన్నారు. అలాగే సరిహద్దు ప్రాంతాలలో జూదమాడుతున్నట్లు సమాచారం వస్తోందనానరు. దాన్ని అరికట్టేందుకు కూడా ప్రత్యేక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా ఫ్యాక్షన్ గ్రామాల్లో ఆధిపత్య పోరువల్ల గొడవలు జరగకుండా గట్టి నిఘా ఉంచుతామన్నారు. ఎక్కడైనా శాంతి భద్రతలకు విభూతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. మిస్సింగ్ కేసులు, వాహనాల దొంగతనాలు, చైన్ స్నాచింగ్ లాంటి సంఘటనలు జరగకుండా పోలీసులతో గస్తీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం పులివెందుల ప్రాంతంలోని సీఐలు, ఎస్‌ఐలతో ఆయన పలు విషయాలపై చర్చించారు.
పోలీస్ భవనాన్ని
పరిశీలించిన జిల్లా ఎస్పీ
లింగాల : మండల కేంద్రమైన లింగాల పోలీస్ స్టేషన్‌ను బుధవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రికార్డులను పరిశీలించి స్టేషన్‌లోని సిబ్బందిని మండల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండలంలో శాంతిభద్రతలు, అసాంఘిక కార్యకలాపాలపై ఆరా తీశారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ ఆవరణంలో నూతనంగా నిర్మించిన పోలీస్ భవనాన్ని పరిశీలించారు. నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభం కాకపోవడానికి గల కారణాలను ఎస్‌ఐ మధుసూదనరావును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
శాంతిభద్రతలు పరిరక్షించాలి
చక్రాయపేట : మండలంలో శాంతి భద్రతల పరిరక్షణ కు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమా ర్ పోలీసులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆయన చక్రాయపేట పోలీసు స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరి శీలించారు. అనంతరం ఆర్కే వ్యాలీ సీఐ ఉలసయ్య, ఎస్‌ఐ కృష్ణయ్యలకు పలు సూచనలు ఇచ్చారు. ఇదే సందర్భంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రంతుబాషా, అద్యాపకుడు గంగయ్యలు స్టేషన్ వద్ద ఉన్న ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిశారు.
పోలీసు స్టేషన్ల తనిఖీ
వేంపల్లె : ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్, వేంపల్లె పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ పోలీసును ఏర్పాటు చేసి అల్లర్లు, గొడవలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ మురళి నాయక్, సీఐలు నరసింహులు, ఉలసయ్య, ఎస్‌ఐలు రంగారావు, తిరుపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
వేములలో
వేముల : మండల కేంద్రమైన వేముల పోలీస్‌స్టేషన్‌ను బుధవారం సాయంత్రం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్‌లో ఉన్న రికార్డులను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌ను పరిశీలించి ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్‌కు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు.
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్