
దేవుడి సొమ్మును దోచుకు తింటున్నారు
ప్రొద్దుటూరు : లోకకల్యాణార్థం పూర్వం నామా ఎరుకలయ్య శ్రీ కృష్ణ గీతాశ్రమాన్ని ఏర్పాటు చేశారు. 1946 సంవత్సరంలో తన స్థిర, చరాస్తులన్నింటిని శ్రీ కృష్ణ గీతాశ్రమానికి చెందేట్లుగా రిజిస్టర్ చేయించారు. సర్వే నంబర్ 383లో మొత్తం 4.30 ఎకరాల విస్తీర్ణంలో భవనాలను నిర్మించడంతోపాటు మైదానాన్ని ఏర్పాటు చేశారు. పలు గ్రామాల్లో ఈ ఆశ్రమానికి సంబంధించిన భూములు ఉండగా అధికారులు కౌలుకు ఇచ్చారు. జీపీఏ ద్వారా గతంలో గంగాధరానంద గిరి స్వామి ఈ ఆశ్రమాన్ని నిర్వహించే వారు. 2020లో కరోనాతో ఆయన మరణించారు.
పట్టించుకోని అధికారులు
ఆశ్రమ నిర్వాహకుడు గంగాధరానంద గిరి స్వామి తర్వాత కాలంలో విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మలయాళ స్వామి బీఈడీ కళాశాలను ఏర్పాటు చేశారు. ఇందులో మాజీ మున్సిపల్ చైర్మన్ నరాల బాలిరెడ్డి, డాక్టర్ చెన్నకేశవరెడ్డి లాంటి ప్రముఖులతోపాటు గంగాధరానంద గిరిస్వామి బంధువు భాస్కర్‌రెడ్డి సభ్యులుగా ఉండేవారు. 2014లో భాస్కర్‌రెడ్డికి, గంగాధరానంద గిరి స్వామికి వివాదం ఏర్పడటంతో కమిటీ నుంచి భాస్కర్‌రెడ్డిని తొలగించారు. గంగాధరానంద గిరి స్వామి మరణానంతరం భాస్కర్‌రెడ్డి తాను కూడా బీఈడీ కళాశాలలో సభ్యుడిగా ఉన్నానని చెప్పడంతోపాటు కళాశాల భవనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అడ్డు చెప్పే అధికారులు లేకపోవడంతో మూడు అంతస్తుల కళాశాల భవనం ఆయన స్వాధీనంలో ఉండేది. రెండేళ్ల క్రితం భాస్కర్‌రెడ్డి దంపతులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. భాస్కర్ రెడ్డి మరణం తర్వాత మరికొందరు వ్యక్తులు తప్పుడు పత్రాలను సృష్టించారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బీఈడీ కళాశాలకు అనుమతి ఇవ్వాలని కోరడంతో హైకోర్టు 2024 ఏప్రిల్ 23న స్టే మంజూరు చేసింది. మూడంతస్తుల భవనానికి ఏడాదికి కేవలం రూ.4వేలు అద్దె చెల్లిస్తున్నట్లు సమాచారం. తక్కువ అద్దెకు భవనాన్ని స్వాధీనం చేసుకున్న వ్యక్తులు కోచింగ్ సెంటర్లు, స్పోకెన్ ఇంగ్లీషు సెంటర్ నిర్వహించేందుకు అద్దెకు ఇచ్చి రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న దేవాదాయశాఖ అధికారులు బహిరంగంగా ఇవన్నీ చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. ప్రత్యేకంగా ప్రభుత్వం విచారణ అధికారులను నియమిస్తే శ్రీకృష్ణ గీతాశ్రమంలోని అక్రమాలన్నీ వెలుగు చూసే అవకాశం ఉంది.