పచ్చటి దీపాన్ని వెలిగిస్తున్నారు!
‘దీపావళి’ రోజు దీపాలు వెలుగు దారులై కనిపిస్తాయి. ఆ వెలుగులో... ఎప్పుడూ చూడనివి, ఎప్పుడూ చూసేవి కనిపించవచ్చు. కొందరికి... ఎప్పుడూ చూడనివి కనిపించవచ్చు. అవి వస్తువులే కానక్కర్లేదు... ఆలోచనలు కావచ్చు!ఆ ఆలోచనలే వారిని కొత్త దారిలో పయనింపచేస్తాయి. పండగతో పాటు పర్యావరణాన్ని ప్రేమించేలా చేస్తాయి. సరికొత్త మార్గంలో నడిచేలా చేస్తాయి. ‘గ్రీన్ దీపావళి’ని ప్రచారం చేస్తున్న పర్యావరణ ప్రేమికుల గురించి తెలుసుకుందాం...
చండీగఢ్ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ, యువసత్తా కలిసి సిటీ స్కూళ్లలో ‘గ్రీన్ దీపావళి’ క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రతి స్కూలుకు వెళ్లి ‘గ్రీన్ దీపావళి’ ప్రాముఖ్యత గురించి వివరంగా చెబుతున్నారు. మితిమీరి బాణసంచా కాల్చడం వల్ల ఏర్పడే వాయు, శబ్ద కాలుష్యాల గురించి వివరిస్తున్నారు. సాధారణ రోజులతో పోల్చితే...పండగ రోజుల్లో కాలుష్య స్థాయి ఎంత ఎక్కువగా ఉంటుందో చెబుతున్నారు.
స్కూళ్ళలో ‘ఎకో-క్లబ్’లను ఏర్పాటు చేస్తున్నారు. ‘మీరు బాణసంచా కోసం ఉపయోగించాలనుకుంటున్న డబ్బును ఏదైనా మంచిపని కోసం వినియోగించి చూడండి. ఆ తృప్తి ఎంత గొప్పగా ఉంటుందో’ అని చెబుతున్నారు.ఇంట్లో తయారు చేసిన స్వీట్లనే తినడం, పచ్చటి మొక్కలను బహుమతిగా ఇచ్చుకోవడం... మొదలైన పనుల ద్వారా పండగ సంతోషాన్ని సొంతం చేసుకోవాలని చెబుతున్నారు.
‘‘సంప్రదాయ పద్ధతుల్లో శబ్దకాలుష్యం, వృథా ఖర్చు ఉండదు. ఇండ్లను దీపాలతో అలంకరించుకోవడం ద్వారా పండగ జరుపుకునే సంప్రదాయ పద్ధతిని ప్రోత్సహిస్తున్నాం’’ అని చెబుతున్నారు చండీగఢ్‌లోని ‘యువసత్తా’ కో ఆర్డినేటర్ ప్రమోద్‌శర్మ ఇక పంజాబ్‌లోని అమర్‌పురలాంటి గ్రామాల్లో ‘గ్రీన్ దీపావళి’ ప్రచారానికి పిల్లలే స్వయంగా నడుం కట్టారు.
‘దిస్ దివాలీ ఓన్లీ దివాస్ నో ఫైర్ క్రాకర్స్’ ఇలా రకరకాల నినాదాలతో వీధుల గుండా ఊరేగింపుగా వెళుతూ ప్రజలలో అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ పరిధిలోని 13 గ్రామాల ప్రజలు ‘గ్రీన్ దీపావళి’ని జరుపుకుంటున్నారు. బాణసంచాకు దూరంగా ఉంటున్నారు. నిహలువాల్, చక్‌చెల, షేర్‌పూర్-డోన, తల్వానీ మదో.... మొదలైన గ్రామాలు పర్యావరణవేత్త బాబా బల్బీర్‌సింగ్ ఉపన్యాసాలతో ప్రభావితమై శబ్ద, వాయు కాలుష్యాలకు దూరంగా ‘గ్రీన్ దీపావళి’ని జరుపుకొంటున్నారు.
గుర్గావ్‌కు చెందిన సాజన్ అబ్రోల్ ‘బరస్ట్ హంగర్ చాలెంజ్’ నినాదంతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. సాజన్ ప్రచారం అందరినీ ఆకట్టుకుంటోంది. కేవలం బాణసంచా కాల్చడం ద్వారా మాత్రమే ఆనందం సొంతం అయినట్లు కాదంటూ... సాజన్‌లాంటి వాళ్లు కొత్త ప్రతిపాదనలు చేస్తున్నారు.
ముంబాయిలోని ‘గ్రీన్ టీమ్’ స్వచ్ఛంద సంస్థకు చెందిన యువ సభ్యులు అడవిలో ఆదివాసీ పిల్లలతో కలిసి ప్రతి ఏటా దీపావళి జరుపుకొంటారు.‘‘పండగరోజు బొమ్మలు, స్వీట్లతో ఆదివాసీ పిల్లల దగ్గరికి వెళతాం. శాంతియుత దీపావళి గురించి అవగాహన కలిగిస్తాం. వారితో ఆడుతూ పాడుతూ గడుపుతాం’’ అంటున్నారు ఎల్సీ గాబ్రియేల్. తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లా కిట్టంపాలయం గ్రామం ఎన్నో సంవత్సరాలుగా ‘శబ్దరహిత దీపావళి’ని జరుపుకుంటోంది. దీనికి వెనుక ఒక కారణం ఉంది...
ఊళ్లో ఒక చెట్టుపై వేలాది గబ్బిలాలు ఉంటాయి. అవి రాత్రంతా ఆహారం కోసం ఎక్కడెక్కడికో వెళ్లి... పగలు చెట్టు మీద ఉంటాయి. బాణసంచా కాలిస్తే... అవి ఎక్కడ భయపడి పారిపోతాయోనని ఎన్నో సంవత్సరాల నుంచి కాల్చడం మానుకున్నారు ఆ ఊరి ప్రజలు. ‘పర్యావరణానికి హాని కలిగించవద్దు’ నుంచి మొదలు ‘పక్షులను బాధ పెట్టవద్దు’ వరకు... ఇలా రకరకాల కారణాలతో వ్యక్తులు, గ్రామాలు, సంస్థలు ‘గ్రీన్ దీపావళి’ని జరుపుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.