సాక్షి, బెంగళూరు : బాణాసంచా నిషేధంపై కర్ణాటక ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. దీపావళి సందర్భంగా బాణాసంచాను కొనొద్దు, కాల్చొద్దు అంటూ ముఖ్యమంత్రి యడియూరప్ప పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బాణాసంచా కాల్చకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిషేధం విధిస్తామని ఆయన నిన్న పేర్కొన్నారు. టపాసులు అధికంగా కాల్చడం వల్ల కాలుష్య ప్రమాణం పెరిగి కరోనా వైరస్ మరింతగా విజృంభించే ప్రమాదం ఉందన్న నేపథ్యంలో టపాసులను ఈ ఏడాది దీపావళికి నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. ప్రభుత్వ తీర్మానం వల్ల ప్రజలెవరూ టపాసులు కొనడం కానీ, అమ్మడం కానీ చేసి నష్టపోవద్దని సూచించారు. ఈ ఏడాది బాణాసంచా లేకుండానే దీపావళి పండుగ జరుపుకుందామని పిలుపునిచ్చారు. (కర్ణాటకలోనూ బాణాసంచాపై నిషేధం)
అయితే తాజాగా బాణాసంచా నిషేధం నిర్ణయంపై యడియూరప్ప సర్కార్ పునరాలోచన చేసింది. వాయు కాలుష్యం లేని గ్రీన్ క్రాకర్స్‌ను అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల అభిప్రాయాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి శనివారం తెలిపారు. దీపావళి పండుగని పురస్కరించుకొని కర్ణాటకలో కేవలం గ్రీన్ దీపావళి మాత్రమే జరుపుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు పర్యావరణహితమైన టపాసులు మాత్రమే తయారు చేసి, అమ్మాలని అన్నారు. ప్రజలు నిబంధనలకు లోబడి, పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని దీపావళి జరుపుకోవాలని ఆయన సూచించారు. ఇక కోవిడ్-19 నియంత్రణకు ప్రభుత్వం అవసరం అయిన అన్ని చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. కాగా ఢిల్లీ, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాలు బాణాసంచాపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. (‘టపాసులు కాల్చం, లక్ష్మీ పూజ చేసుకుంటాం’)
Comments
Please login to add a commentAdd a comment