కాళేశ్వరం(మంథని): ‘కాళేశ్వరం’ మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణా నికి మహారాష్ట్రలోని సిరొంచ తాలూకా ప్రజలు మద్దతు తెలిపారు. కానీ, ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న అపోహలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. సిరొంచ తాలూకా పోచంపల్లిలో బుధవారం మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా పర్యావరణ శాఖ సబ్ రీజనల్ అధికారి హేమ మయూరేశ్ దేశ్‌పాండే, గడ్చిరోలి అడిషనల్ మేజిస్ట్రేట్ దర్వేశ్ సోనువానే, కాళేశ్వరం బ్యారేజీ చీఫ్ ఇంజనీర్ నల్లా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. సిరొంచ తాలూకాలోని పోచంపల్లి, పెంటిపాక, అరుడ, వడిదం, ఆయిపేట, మూగపూర్, మద్దికుంట, తుమునూర్, నగరం, జానంపల్లి, చింతలపల్లి గ్రామాల భూనిర్వాసితులు, ప్రజలు హాజరయ్యారు.
ప్రాజెక్టు లాభాలను ఈ సందర్భంగా చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు వివరించారు. భూనిర్వాసితులు మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకం కాదని, ఎంత భూమి ముంపునకు గురవుతుందో స్పష్టత ఇవ్వాలని, కచ్చి తమైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం డీపీఆర్ ప్రకటించి, మహారాష్ట్రకు సంబంధించిన ఎన్ని భూములు పోతున్నాయో ప్రతి గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో పెట్టాలని కోరారు. అయితే, ప్రజాభిప్రాయ సేకరణ సభకు 200 నిర్వాసితులు మాత్రమే వచ్చారు. దీంతో సభా ప్రాంగణంలో ప్రజలు లేక వెలవెల బోయింది.
మాజీ ఎమ్మెల్యే వర్గీయులతో పోలీసుల వాగ్వాదం
అహేరి మాజీ ఎమ్మెల్యే దీపక్ దాదా ఆత్రం ప్రజాభిప్రాయ సేకరణకు తన అనుచరగణంతో తరలి వచ్చారు. అయితే, అప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం పూర్తి కాగా, తూతూమంత్రంగా ప్రజాభిప్రాయసేకరణ చేశారని పర్యావరణశాఖ అధికారి హేమను ఆయన నిలదీశారు. ఈ క్రమంలో ఆమె పోలీసుల సహాయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. సిరొంచ డీఎస్పీ గజానన్ రాథోడ్, సీఐ సూపేలు దీపక్ ఆత్రం తదితరులు మాజీ ఎమ్మెల్యే అనుచర గణాన్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, దీపక్ ఆత్రం వర్గానికి స్వల్ప వాగ్వాదం జరిగింది. అంతకు మందు మంథని నియోజకవర్గం నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న కాంగ్రెస్ శ్రేణులను కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన వద్ద తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు.
Published Thu, Sep 28 2017 2:05 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement