Central Urban Development Department
-
సీ4సీ చాలెంజ్‌కు 2 నగరాలు ఎంపిక
సాక్షి, హైదరాబాద్: సైకిల్ ఫర్ ఛేంజ్(సీ4సీ) చాలెంజ్ కార్యక్రమం స్టేజీ–1 కింద హైదరాబాద్, వరంగల్ నగరాలు సహా దేశంలోని 25 నగరాలు, పట్టణాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. నగరాలు, పట్టణాల్లో సైక్లింగ్‌ను ప్రోత్సహించడానికి కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని స్మార్ట్ సిటీస్ మిషన్ సీ4సీ చాలెంజ్‌కు శ్రీకారం చుట్టింది. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో ప్రజారోగ్యానికి మేలు చేయడానికి సైక్లింగ్‌ను ప్రోత్సహించాలని, దీని వల్ల నగరాల్లో కాలుష్యం సైతం తగ్గుతుందని ఈ నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న 107 నగరాలు ‘సీ4సీ’చాలెంజ్‌కు రిజిస్ట్రర్ కాగా, తొలి విడత కింద ఎంపిక చేసిన 25 నగరాల పేర్లను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. రాష్ట్ర పురపాలక శాఖ ఈ చాలెంజ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రత్యేకంగా సైక్లింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేయ డంతో హైదరాబాద్, వరంగల్ నగరాల ఎంపికకు దోహదపడింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో ఈ కార్యక్ర మానికి హెచ్ఎండీఏ, హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (హుమ్టా)లు సాంకేతిక సహాయం అందిస్తున్నాయి. పోలీసు శాఖ సహకారంతో ఇప్పటికే కేబీఆర్పార్క్, నెక్లెస్ రోడ్డులో సైక్లింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ లేని విధులు, సైకిల్ అద్దె సదుపాయాలు, సైక్లింగ్ ట్రైనింగ్ వంటి కార్యక్రమాలను సీ4సీ కింద ఎంపికైన నగరాల్లో అమలు చేయనున్నారు. ఈ 25 నగరాల్లో ఏడు నగరాలను స్టేజీ–2 కింద ఎంపిక చేసి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ త్వరలో ప్రకటించనుంది. స్టేజీ–2 కింద ఎంపికైన ఏడు నగరాల్లో సైక్లింగ్ మౌలిక సదుపాయాల కల్పనకు రూ.కోటి చొప్పున మంజూరు చేయనుంది. నర్చరింగ్ నెబర్హుడ్ చాలెంజ్‌కు హైదరాబాద్, వరంగల్ ఎంపిక పట్టణ ప్రాంతంలో 0–5 ఏళ్ల బాలబాలికలకు సురక్షితమైన, మెరుగైన సదుపాయాలు కలిగిన పరిసరాలను అందించడమే లక్ష్యంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ‘నర్చరింగ్ నెబర్ హుడ్’ చాలెంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీని కింద హైదరాబాద్, వరంగల్ నగరాలుసహా దేశంలోని మొత్తం 25 నగరాలు, పట్టణాలు ఎంపికయ్యాయి. 63 నగరాలు ఈ చాలెంజ్‌లో పోటీపడ్డాయి. తొలి విడత కింద ఎంపికైన 25 నగరాలకు 6 నెలలపాటు చాలెంజ్ అమలుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించనున్నారు. ఈ నగరాల్లోని టాప్ 10 నగరాలకు 2 ఏళ్లపాటు సాంకేతిక సహకారాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అందించనుంది. -
'స్వచ్ఛ' తిరుపతి
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా పట్టణాల్లో ‘స్వచ్ఛ భారత్’ అమలు తీరును తెలియజేసే స్వచ్ఛ సర్వేక్షణ్–2019 సర్వేలో ఆంధ్రప్రదేశ్ స్థానం దక్కించుకుంది. మొదటి 10 స్థానాల జాబితాలో తిరుపతి పట్టణానికి చోటు దక్కింది. 2019 జనవరిలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ స్వచ్చ సర్వేక్షణ్–2019 పేరిట ఈ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా 4,237 పట్టణాల్లో 6.53 లక్షల మంది ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంది. పరిశుభ్రతపై నిర్వహించిన అతిపెద్ద సర్వేగా ఇది ప్రపంచ రికార్డు సృష్టించింది. సర్వే వివరాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తాజాగా ప్రకటించింది. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో నిలిచింది. 2017లో పనితీరు ఆధారంగా 2018లో ప్రకటించిన సర్వేలో మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ 2018లో పనితీరు ఆధారంగా ప్రకటించిన 2019 అవార్డుల్లో 6వ స్థానానికి పడిపోయింది. ఫీడ్‌బ్యాక్‌లో తిరుపతికి మొదటి స్థానం జాతీయ స్థాయిలో ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్‌లో మంచి మార్కులు పొందిన చిన్న పట్టణాల విభాగంలో తిరుపతి మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం 44,639 మంది నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడమే కాకుండా మొత్తం 5,000 మార్కులకు గాను 4,025 మార్కులు సాధించి తిరుపతి మొదటి స్థానంలో నిలిచింది. తిరుపతిలో చాలామంది స్వచ్ఛ భారత్‌పై అవగాహన ఉందని చెప్పడమే కాకుండా పట్టణంలో పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాదితో పోలిస్తే ఇక్కడ పరిశుభ్రత పెరిగిందని పేర్కొన్నారు. కానీ, దీనికి భిన్నంగా మొత్తం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే గతేడాదితో పోలిస్తే తిరుపతి రెండు ర్యాంకులు దిగజారి 8 స్థానంలో నిలవడం గమనార్హం. టాప్–100లో ఐదు పట్టణాలు 2018 సర్వేలో 6వ స్థానంలో ఉన్న తిరుపతి 2019లో 8వ స్థానానికి పడిపోయింది. ఈ ఏడాది సర్వేలో టాప్–100లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదు పట్టణాలకు చోటు లభించగా, టాప్–200లో 17 పట్టణాలకు చోటు దక్కింది. -
చెత్త‘శుద్ధి’లో భేష్
సాక్షి, హైదరాబాద్: ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్)లో తెలంగాణ మంచి పురోగతి కనబరుస్తోంది. దేశంలోనే రెండో స్థానంలో నిలిచి రికార్డు సాధించింది. 2018, నవంబర్ నాటికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు శుద్ధి చేసిన ఘన వ్యర్థాల గణాంకాలను ఇటీవల కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ విడుదల చేసింది. ఈ జాబితాలో ఛత్తీస్‌గఢ్ ముందు వరుసలో ఉంది. ఇక్కడ ఏటా 6,01,885 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటే, అందులో 84 శాతం ఘన వ్యర్థాలను ప్రాసెసింగ్ చేస్తున్నారు. మన రాష్ట్రంలో 26,90,415 మెట్రిక్ టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా.. ఇందులో 73% వ్యర్థాలు శుద్ధికి నోచుకుంటున్నాయి. ఇతర పెద్ద రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. అడ్డగోలుగా ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నా.. వాటి శుద్ధిలో చతికిలపడ్డాయి. పశ్చిమబెంగాల్ అత్యంత తక్కువగా 5 శాతం, జమ్మూకశ్మీర్ 8 శాతం ప్రాసెసింగ్ చేస్తున్నాయి. మహారాష్ట్రలో అత్యంత ఎక్కువగా ఏటా 8,22,38,050 మెట్రిక్ టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. 20 శాతమే ప్రాసెసింగ్.. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ 2016–17 లెక్కల ప్రకారం.. దేశంలో రోజుకు లక్షన్నర మెట్రిక్ టన్నుల ఘనవ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటే వీటిలో 90 శాతం చెత్తను సేకరిస్తోంది. అయితే అందులో 20 శాతమే.. అంటే రోజుకు 27 వేల మెట్రిక్ టన్నుల ఘన వ్యర్థాలే శుద్ధి అవుతున్నాయి. 2016–17లో 71లక్షల టన్నుల అత్యంత ప్రమాదకర వ్యర్థాలను గుర్తించగా, అందులో కేవలం 36.8 లక్షల టన్నుల వ్యర్థాలు రీసైక్లింగ్ చేశారు. -
స్వచ్ఛత కొనసాగేనా?
కరీంనగర్ కార్పొరేషన్: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, స్వచ్ఛభారత్ మిషన్ సంయుక్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్–2019 పేరిట దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛత పోటీ పరీక్ష గురువారంతో ముగుస్తోంది. కేంద్ర బృందం చేపట్టిన స్వచ్ఛత సర్వే, నగరపాలక సంస్థ చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ, యాప్‌తో ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలన్నీ పరిగణలోకి తీసుకొని స్వచ్ఛత ర్యాంకును కేటాయించనున్నారు. ఈ పోటీలో మెరుగైన ర్యాంకు సాధించడానికి నాలుగు నెలలుగా కరీంనగర్ నగరపాలక సంస్థ అధికారులు, పాలకవర్గ సభ్యులు కుస్తీ పట్టారు. రోడ్ల వెంట చెత్త వేయకుండా, బహిరంగ మలమూత్ర విసర్జన జరగకుండా, తడి, పొడి చెత్తను వేరు చేయడం, డంప్‌యార్డుకు చెత్తను తగ్గించడం, డ్రెయినేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, నగరంలో సామూహిక టాయిలెట్ల ఏర్పాటు వంటి కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతోపాటు కమ్యూనిటీ టాయిలెట్లను ఏర్పాటు చేసి పోటీ పరీక్షలో నిలబడ్డారు. ఈనెల 4 నుంచి శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టితో పనులు చేపట్టారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ పనుల్లో నిర్లక్ష్యంగా లేకుండా స్వచ్ఛతకు పెద్దపీట వేసి చెత్తను కనబడకుండా కార్యాచరణతో ముందుకెళ్లారు. మెరుగైన ర్యాంకు లక్ష్యంగా.. 2015లో క్లీన్‌సిటీగా గుర్తించబడ్డ కరీంనగర్ నగరపాలక సంస్థ 2016లో 259వ ర్యాంకు, 2017లో 201 ర్యాంకు, 2018లో 73వ ర్యాంకు సాధించి ఏటేటా తన ర్యాంకు మెరుగుపర్చుకుంది. యేటేటా సాధిస్తున్న ర్యాంకులతో ఉత్సాహంగా ఈయేడాది దేశ వ్యాప్తంగా 10లోపు ర్యాంకు సాధించడమే లక్ష్యంగా పనిచేశారు. వాడవాడలా ఇంటింటికీ స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. మహిళా సంఘాలు, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, హోటళ్లు, బేకరీలు, ఇతర వ్యాపారులకు స్వచ్ఛత ఆవశ్యకతను తెలుపుతూ సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు. ప్రత్యేకంగా యాప్‌ను తయారు చేసి ప్రజల నుంచి సమస్యలను ఆహ్వానించారు. సర్వేక్షణ్ పరీక్ష ముగియనుండడంతో ఇక సర్వే నివేదిక, పదిలోపు ర్యాంకు పైనే ఆశలు పెంచుకున్నారు. నిరంతరం కొనసాగేనా..? స్వచ్ఛ సర్వేక్షణ్–2019 కోసం నగరపాలక సంస్థ పారిశుధ్యంలో ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లింది. అయితే స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీ ఉన్నప్పుడు మాత్రమే అధికారులు ఈ విధంగా పనులు చేపట్టడం, ఆ తర్వాత మళ్లీ యధావిధిగా శానిటేషన్ పనులు వదిలేస్తుండడంతో నగరంలో చెత్త సమస్య ఎప్పటికీ తీరడం లేదు. స్వచ్ఛ సర్వేక్షణ్ పుణ్యమా అని నాలుగ ునెలలుగా నగరంలో చెత్త కనబడడం లేదు. అధికారుల నిరంతర పర్యవేక్షణతో శానిటేషన్ పనులు సక్రమంగా జరిగాయి. నైట్ స్వీపింగ్, డే స్వీపింగ్ల్లో ఎక్కడా చెత్త కనబడకుండా చర్యలు చేపట్టారు. ప్రజల్లో కూడా చైతన్యం వచ్చే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చెత్తను రోడ్లపై వేయకుండా నియంత్రించారు. అయితే స్వచ్ఛత పరీక్ష గురువారంతో ముగియనుండడంతో శానిటేషన్ పనులు పోటీలో ఉన్నప్పటిలాగే నిర్వహిస్తారా? లేదా ఎప్పటిలాగే పరీక్ష ముగిసింది కదా అని చూసీచూడనట్లు వదిలేస్తారా..? అదే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి. అధికారులు ఏ మేరకు శానిటేషన్‌పై శ్రద్ధ వహిస్తారో వేచి చూడాల్సిందే. -
రాష్ట్రానికి పట్టణ సంస్కరణ ప్రోత్సాహకం
తొలిస్థానంలో ఆంధ్రప్రదేశ్.. తెలంగాణకు ఆరోస్థానం సాక్షి, న్యూఢిల్లీ: 2016–17లో పట్టణ సంస్కరణలు చేపట్టిన 16 రాష్ట్రాలకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రోత్సా హకాలు అందించింది. అమృత్ పథకంలో భాగంగా ఈ–గవర్నెన్స్, ఆడిటింగ్, ఇంధన, నీటి ఆడిట్, తదితర అంశాలను పరిశీలించి రాష్ట్రాలకు మార్కులు ఇవ్వగా తెలంగాణ ఆరో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో నిలిచాయి. 16 రాష్ట్రాలకు మొత్తం రూ.500 కోట్లను పట్టణాభివృద్ధి శాఖ పంపిణీ చేసింది. ఏపీకి రూ.27.14 కోట్లు, తెలంగాణకు రూ.19.93 కోట్లు అందజేసింది. శుక్రవారం ఢిల్లీలో పట్టణ పరివర్తన జాతీయ సదస్సులో భాగంగా ఈ ప్రోత్సాహకాలు అందించారు. సిటీ లివెబులిటీ ఇండెక్స్‌ను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. దేశంలోని 116 ప్రధాన నగరాల్లో జీవన నాణ్యతను ఈ ఇండెక్స్ ద్వారా వెల్లడిస్తారు. -
ఏపీకి హడ్కో అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: హడ్కో 47వ వ్యవస్థా్థపక దినోత్సవం సందర్భంగా జాతీయ స్థాయిలో వినూత్న ఆలోచనలు అమలు చేసినందుకుగానూ రాష్ట్రానికి వివిధ విభాగాల్లో అవార్డులు దక్కాయి. ఇందులో మౌలిక వసతుల ప్రణాళిక, రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూముల సేకరణకు సీఆర్డీఏకి రెండు అవార్డులు దక్కాయి. మంగళవారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడి చేతుల మీదుగా సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ అవార్డులు అందుకున్నారు. అలాగే నెల్లూరులో మురుగు నీటి వ్యవస్థ సమర్థ నిర్వహణకుగానూ కార్పొరేషన్‌కు అవార్డు దక్కింది. ఇంజనీర్ మోహన్ ఈ అవార్డు అందుకున్నారు. అలాగే ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్, విజయవాడ హడ్కో బ్రాంచ్‌కు వివిధ విభాగాల్లో అవార్డులు లభించాయి.