
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా పట్టణాల్లో ‘స్వచ్ఛ భారత్’ అమలు తీరును తెలియజేసే స్వచ్ఛ సర్వేక్షణ్–2019 సర్వేలో ఆంధ్రప్రదేశ్ స్థానం దక్కించుకుంది. మొదటి 10 స్థానాల జాబితాలో తిరుపతి పట్టణానికి చోటు దక్కింది. 2019 జనవరిలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ స్వచ్చ సర్వేక్షణ్–2019 పేరిట ఈ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా 4,237 పట్టణాల్లో 6.53 లక్షల మంది ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంది. పరిశుభ్రతపై నిర్వహించిన అతిపెద్ద సర్వేగా ఇది ప్రపంచ రికార్డు సృష్టించింది. సర్వే వివరాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తాజాగా ప్రకటించింది. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో నిలిచింది. 2017లో పనితీరు ఆధారంగా 2018లో ప్రకటించిన సర్వేలో మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ 2018లో పనితీరు ఆధారంగా ప్రకటించిన 2019 అవార్డుల్లో 6వ స్థానానికి పడిపోయింది.
ఫీడ్‌బ్యాక్‌లో తిరుపతికి మొదటి స్థానం
జాతీయ స్థాయిలో ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్‌లో మంచి మార్కులు పొందిన చిన్న పట్టణాల విభాగంలో తిరుపతి మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం 44,639 మంది నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడమే కాకుండా మొత్తం 5,000 మార్కులకు గాను 4,025 మార్కులు సాధించి తిరుపతి మొదటి స్థానంలో నిలిచింది. తిరుపతిలో చాలామంది స్వచ్ఛ భారత్‌పై అవగాహన ఉందని చెప్పడమే కాకుండా పట్టణంలో పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాదితో పోలిస్తే ఇక్కడ పరిశుభ్రత పెరిగిందని పేర్కొన్నారు. కానీ, దీనికి భిన్నంగా మొత్తం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే గతేడాదితో పోలిస్తే తిరుపతి రెండు ర్యాంకులు దిగజారి 8 స్థానంలో నిలవడం గమనార్హం.
టాప్–100లో ఐదు పట్టణాలు
2018 సర్వేలో 6వ స్థానంలో ఉన్న తిరుపతి 2019లో 8వ స్థానానికి పడిపోయింది. ఈ ఏడాది సర్వేలో టాప్–100లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదు పట్టణాలకు చోటు లభించగా, టాప్–200లో 17 పట్టణాలకు చోటు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment