పదో తరగతి చదివే పిల్లలు... స్కూలు, ట్యూషన్లు అంటూ బిజీబిజీగా ఉంటారు. ఆఖరి పరీక్షలు పూర్తయ్యేవరకు చదువు తప్ప మరో ధ్యాస ఉండదు వీరికి. అలాంటిది లితిషా బగాడియా చదువుతోపాటు చుట్టుపక్కల పేరుకుపోయిన చెత్తను నిర్మూలిస్తూ పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించింది. గత రెండేళ్లుగా వివిధ రకాల కార్యక్రమాలతో ప్రకృతి సంరక్షణకు కృషిచేస్తోన్న లితిషాను ‘ద ప్రిన్సెస్ డయానా క్లైమెట్ యాక్షన్’ అవార్డు వరించింది. ఈ అవార్డుతో పిల్లలకు చదువు, సంస్కారంతోపాటు పర్యావరణ స్పృహ కూడా ఉండాలి అనడానికి ఉదాహరణగా నిలుస్తోంది లితిషా.
ముంబైకు చెందిన లితిషాకు... చెత్తపేరుకుపోయిన నగరాల జాబితాలో ముంబై కూడా ఉండడం నచ్చలేదు. దీంతో నగరాన్ని శుభ్రం చేయాలనుకుంది. అదే విషయాన్ని తన స్నేహితురాలు సియా జోషికి చెప్పింది. ఇద్దరూ కలిసి ఎన్జీవోని ఏర్పాటు చేసి ముంబైని క్లీన్ చేద్దామనుకున్నారు. కానీ ఆ సమయంలో కరోనా ఆంక్షలు ఉండడంతో బయటకు రావడం కుదరలేదు. దీంతో 2021 ఆగస్టు 31న ‘ఐకా’ ఫౌండేషన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రారంభించారు. ఐకా ద్వారా... పర్యావరణ సమస్యలు, వ్యర్థాల నిర్వహణ, టపాసులు కాల్చడం, నీటì వృథా... వంటి అంశాలపై ప్రచారం చేస్తూ అవగాహన కల్పించేవారు. ఇది నచ్చిన కొంతమంది ఔత్సాహికులు ముందుకు రావడంతో వారితో కలిసి చెత్తను శుభ్రం చేయడం మొదలు పెట్టారు. వీరికి మరికొంతమంది తోడవడంతో అంతా సమూహంగా ఏర్పడి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను విస్తరించారు.
► పూల నుంచి పెర్‌ఫ్యూమ్స్
ప్రాజెక్ట్ ‘అవిఘ్న’ పేరుతో... వినాయక చవితి వేడుకల్లో మండపాల దగ్గర చల్లే పూలు, ఇతర పండుగల్లో వాడేసిన పూలను, నిమజ్జనం తరువాత మిగిలిపోయే ఇనుము వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్‌కు తరలిస్తున్నారు. ఈ పూలను పెర్‌ఫ్యూమ్స్‌గా, ఎరువులుగా మార్చడం వల్ల నిరుపేదలకు ఆదాయం కూడా వస్తోంది. గణేష ఉత్సవాల్లో మూడువందల కేజీలకుపైగా పూల వ్యర్థాలను సేకరించి ‘మోబి ట్రాష్’ అనే స్టార్టప్‌కు అందించారు. ఈ స్టార్టప్ పూలను గిరిజన, మురికివాడల్లోని నిరుపేదలకు ఇచ్చి అగరు బత్తీలు, రంగులు తయారు చేయించి వారికి ఉపాధి కల్పిస్తోంది. దీనిద్వారా నగరంలో చెత్త శుభ్రం అవడమేగాక, పరిసరాలు పరిశుభ్రంగా మారుతున్నాయి.
► ఈ వేస్ట్‌తోపాటు బీచ్‌క్లీనింగ్
వాడిపడేసిన ల్యాప్‌టాప్స్, ఫోన్ ఛార్జర్లు, ఇయర్‌ఫోన్స్ వంటి ఎలక్ట్రానిక్ వేస్ట్‌ను కూడా సేకరించి ఈ వేస్ట్ రీ సైక్లింగ్ సెంటర్లకు చేరవేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రత్యేకంగా ‘ఈ వేస్ట్ కలెక్షన్ డ్రైవ్’ నిర్వహించి వేస్ట్ సేకరిస్తున్నారు. ‘బీచ్‌క్లీన్ – అప్’ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. బీచ్‌లో దొరికిన ప్లాస్టిక్ వ్యర్థాలను ‘శక్తి ప్లాస్టిక్స్’ కంపెనీకి ఇస్తున్నారు. ఈ కంపెనీ ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి ఫర్నీచర్, ఇతర వస్తువులను తయారు చేసి విక్రయిస్తోంది. ఇవేగాక ఏడోతరగతి లోపు పిల్లలకు వర్క్‌షాప్స్ ద్వారా పర్యావరణ ప్రాముఖ్యత, కాలుష్యం నుంచి పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పిస్తున్నారు. హోలీ, దీపావళి సమయాల్లో ఇకోఫ్రెండ్లీ సంబరాలు జరుపుతూ.. పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నారు.
► చదువుతూనే...
ఇంకా జీవితంలో స్థిరపడేంతగా చదువుకోలేదు. అయినా ఇన్ని కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈ ఇద్దరూ ప్రస్తుతం తమ కాలేజీ చదువుని నిర్లక్ష్యం చేయకుండా ముంబైని క్లీన్ చేయడం విశేషం. తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉండడంతో.. భవిష్యత్‌లో పర్యావరణ అవగాహన కార్యక్రమాలను దేశంలోని మరిన్ని నగరాలకు విస్తరిస్తామని ఈ చిచ్చరపిడుగులు చెబుతున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు, ఇలాంటి బాలలు మరింతమంది తయారైతే మన దేశ భవిష్యత్ ఉజ్వలంగా వెలిగిపోతుంది.
‘‘ఈ అవార్డు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నా స్నేహితురాలు, ఐకా ఫౌండేషన్ సహవ్యవస్థాపకురాలు సియా జోషి నా వెన్నంటే ఉండి ప్రోత్సహించడం వల్లే ఈ గౌరవం దక్కింది. అందుకే మరిన్ని ప్రాజెక్టుల ద్వారా అందరిలో అవగాహన కల్పిస్తూ.. పర్యావరణాన్ని కాపాడతాము’’ అని లితిషా బగాడియా చెబుతోంది.
లితిషా బగాడియా
Comments
Please login to add a commentAdd a comment