Climate Action Tracker
-
చదువు.. సంస్కారం.. పర్యావరణం
పదో తరగతి చదివే పిల్లలు... స్కూలు, ట్యూషన్లు అంటూ బిజీబిజీగా ఉంటారు. ఆఖరి పరీక్షలు పూర్తయ్యేవరకు చదువు తప్ప మరో ధ్యాస ఉండదు వీరికి. అలాంటిది లితిషా బగాడియా చదువుతోపాటు చుట్టుపక్కల పేరుకుపోయిన చెత్తను నిర్మూలిస్తూ పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించింది. గత రెండేళ్లుగా వివిధ రకాల కార్యక్రమాలతో ప్రకృతి సంరక్షణకు కృషిచేస్తోన్న లితిషాను ‘ద ప్రిన్సెస్ డయానా క్లైమెట్ యాక్షన్’ అవార్డు వరించింది. ఈ అవార్డుతో పిల్లలకు చదువు, సంస్కారంతోపాటు పర్యావరణ స్పృహ కూడా ఉండాలి అనడానికి ఉదాహరణగా నిలుస్తోంది లితిషా. ముంబైకు చెందిన లితిషాకు... చెత్తపేరుకుపోయిన నగరాల జాబితాలో ముంబై కూడా ఉండడం నచ్చలేదు. దీంతో నగరాన్ని శుభ్రం చేయాలనుకుంది. అదే విషయాన్ని తన స్నేహితురాలు సియా జోషికి చెప్పింది. ఇద్దరూ కలిసి ఎన్జీవోని ఏర్పాటు చేసి ముంబైని క్లీన్ చేద్దామనుకున్నారు. కానీ ఆ సమయంలో కరోనా ఆంక్షలు ఉండడంతో బయటకు రావడం కుదరలేదు. దీంతో 2021 ఆగస్టు 31న ‘ఐకా’ ఫౌండేషన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రారంభించారు. ఐకా ద్వారా... పర్యావరణ సమస్యలు, వ్యర్థాల నిర్వహణ, టపాసులు కాల్చడం, నీటì వృథా... వంటి అంశాలపై ప్రచారం చేస్తూ అవగాహన కల్పించేవారు. ఇది నచ్చిన కొంతమంది ఔత్సాహికులు ముందుకు రావడంతో వారితో కలిసి చెత్తను శుభ్రం చేయడం మొదలు పెట్టారు. వీరికి మరికొంతమంది తోడవడంతో అంతా సమూహంగా ఏర్పడి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను విస్తరించారు. ► పూల నుంచి పెర్ఫ్యూమ్స్ ప్రాజెక్ట్ ‘అవిఘ్న’ పేరుతో... వినాయక చవితి వేడుకల్లో మండపాల దగ్గర చల్లే పూలు, ఇతర పండుగల్లో వాడేసిన పూలను, నిమజ్జనం తరువాత మిగిలిపోయే ఇనుము వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్‌కు తరలిస్తున్నారు. ఈ పూలను పెర్ఫ్యూమ్స్గా, ఎరువులుగా మార్చడం వల్ల నిరుపేదలకు ఆదాయం కూడా వస్తోంది. గణేష ఉత్సవాల్లో మూడువందల కేజీలకుపైగా పూల వ్యర్థాలను సేకరించి ‘మోబి ట్రాష్’ అనే స్టార్టప్‌కు అందించారు. ఈ స్టార్టప్ పూలను గిరిజన, మురికివాడల్లోని నిరుపేదలకు ఇచ్చి అగరు బత్తీలు, రంగులు తయారు చేయించి వారికి ఉపాధి కల్పిస్తోంది. దీనిద్వారా నగరంలో చెత్త శుభ్రం అవడమేగాక, పరిసరాలు పరిశుభ్రంగా మారుతున్నాయి. ► ఈ వేస్ట్‌తోపాటు బీచ్‌క్లీనింగ్ వాడిపడేసిన ల్యాప్టాప్స్, ఫోన్ ఛార్జర్లు, ఇయర్‌ఫోన్స్ వంటి ఎలక్ట్రానిక్ వేస్ట్‌ను కూడా సేకరించి ఈ వేస్ట్ రీ సైక్లింగ్ సెంటర్లకు చేరవేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రత్యేకంగా ‘ఈ వేస్ట్ కలెక్షన్ డ్రైవ్’ నిర్వహించి వేస్ట్ సేకరిస్తున్నారు. ‘బీచ్క్లీన్ – అప్’ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. బీచ్‌లో దొరికిన ప్లాస్టిక్ వ్యర్థాలను ‘శక్తి ప్లాస్టిక్స్’ కంపెనీకి ఇస్తున్నారు. ఈ కంపెనీ ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి ఫర్నీచర్, ఇతర వస్తువులను తయారు చేసి విక్రయిస్తోంది. ఇవేగాక ఏడోతరగతి లోపు పిల్లలకు వర్క్‌షాప్స్ ద్వారా పర్యావరణ ప్రాముఖ్యత, కాలుష్యం నుంచి పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పిస్తున్నారు. హోలీ, దీపావళి సమయాల్లో ఇకోఫ్రెండ్లీ సంబరాలు జరుపుతూ.. పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నారు. ► చదువుతూనే... ఇంకా జీవితంలో స్థిరపడేంతగా చదువుకోలేదు. అయినా ఇన్ని కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈ ఇద్దరూ ప్రస్తుతం తమ కాలేజీ చదువుని నిర్లక్ష్యం చేయకుండా ముంబైని క్లీన్ చేయడం విశేషం. తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉండడంతో.. భవిష్యత్‌లో పర్యావరణ అవగాహన కార్యక్రమాలను దేశంలోని మరిన్ని నగరాలకు విస్తరిస్తామని ఈ చిచ్చరపిడుగులు చెబుతున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు, ఇలాంటి బాలలు మరింతమంది తయారైతే మన దేశ భవిష్యత్ ఉజ్వలంగా వెలిగిపోతుంది. ‘‘ఈ అవార్డు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నా స్నేహితురాలు, ఐకా ఫౌండేషన్ సహవ్యవస్థాపకురాలు సియా జోషి నా వెన్నంటే ఉండి ప్రోత్సహించడం వల్లే ఈ గౌరవం దక్కింది. అందుకే మరిన్ని ప్రాజెక్టుల ద్వారా అందరిలో అవగాహన కల్పిస్తూ.. పర్యావరణాన్ని కాపాడతాము’’ అని లితిషా బగాడియా చెబుతోంది. లితిషా బగాడియా -
థన్‌బెర్గ్‌ను కలవడం ఆనందం కలిగించింది : ఒబామా
వాషింగ్టన్ : స్వీడన్‌కు చెందిన 16 ఏళ్ల గ్రేటా థన్‌బర్గ్ పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తనను కలసిన థన్‌బెర్గ్‌ను ట్విటర్ వేదికగా అభినందించారు. అంత చిన్న వయసులో పర్యావరణ పరిరక్షణ గురించి థన్‌బెర్గ్ పోరాడడం గొప్ప విషయమని, ఆమెను కలవడం ఆనందం కలిగించిందని ఒబామా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒబామా థన్‌బర్గ్‌ను కలిసిన వీడియోనూ ఒబామా ఫౌండేషన్ విడుదల చేసింది. '' మీరు, నేను ఒక టీంగా ఏర్పడి పర్యావరణ పరిరక్షణకు పిడికిళ్లు బిగిద్దామని'' ఒబామా పేర్కొన్నారు. దీనికి థన్‌బెర్గ్ అనుకూలంగా స్పందిస్తూ ... ప్రపంచాన్ని ఎవరు ప్రభావితం చేయలేరని, వాతావరణం పట్ల సృజనాత్మకంగా వ్యవహరిస్తూ మీకు నచ్చినది చేయొచ్చని, అందుకు నా సహకారం తప్పక ఉంటుందని పేర్కొన్నారు . వాతావరణ మార్పుల తీవ్రతను ఇప్పటి యువతరం భరిస్తుందని, అందులోనూ పర్యావరణం కోసం పరితపిస్తున్న థన్‌బెర్గ్ లాంటివారు అసలే భయపడరని ఒబామా పేర్కొన్నారు. గత శుక్రవారం వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్ ముందు నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో థన్‌బెర్గ్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం వాషింగ్టన్లో ఉన్న బరాక్ ఒబామాను తన్బెర్గ్ కలుసుకున్నారు. కాగా, సెప్టెంబర్ 20 న న్యూయార్క్‌లో జరగనున్న '' గ్లోబల్ క్లైమెట్ స్ట్రైక్'' లో ఇతర నిరసనకారులతో కలిసి ఆమె పాల్గొననున్నారు. -
భూగోళం మంటల్లో భారత్ భవిష్యత్
సాక్షి, న్యూఢిల్లీ : ‘దేశంలో ఓ పక్క వరదల బీభత్సం... ఇల్లూ కొట్టాలు కొట్టుకుపోయి అపార మనుషులు, పశువుల ప్రాణ నష్టం. కళ్ల ముందు కూలుతున్న ఎత్తైన మేడలు, రోడ్డు వంతెనలు, మరో పక్క కరువు కాటకాల భీకర రూపం... ఎండిపోయిన చేన్లు, చిక్కి శల్యమయ్యే మానవ దేహాలు. అన్నార్తుల ఆకలి కేకలు. ఎటు చూసిన జంతు కళేబరాల సాక్షత్కారం’ ఇది ఏ సినిమా కథకాదు. భోగోళం వేడిక్కుతుండడం వల్ల ముంచుకొస్తున్న ప్రళయం. 2,100 సంవత్సరం నాటి భూగోళం ఉష్ణోగ్రత మూడు డిగ్రీలు పెరుగుతుందని ‘క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ (మూడు పరిశోధన సంస్థల సంయుక్త సంస్థ)’ హెచ్చరించింది. భూగోళం ఉష్ణోగ్రత 2,100 సంవత్సరానికి 1.5 డిగ్రీల పెరుగుదలకే పరిమితం చేయాలంటూ 2015లో ప్రపంచ దేశాలు చేసుకున్న పారిస్ అగ్రిమెంట్ కన్నా రెండింతలు ఎక్కువగా ఉష్ణోగ్రత పెరుగుతోందట. ఇందుకు కారణం ప్రపంచంలో ఎక్కువ కర్బన ఉద్గారాల విడుదలకు కారణమవుతున్న పది దేశాల్లో భారత్, కెనడా మినహా ఏ దేశాలు సరైన నిరోధక చర్యలు తీసుకోకపోవడమేనని క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ వెల్లడించింది. ఇప్పుడు ఎంత కఠిన చర్యలు తీసుకొన్నా పూర్వ పరిస్థితి రాదని, మూడు డిగ్రీల ఉష్ణోగ్రత పెరగక తప్పని పరిస్థితి కనిపిస్తోందని తెలిపింది. అమెరికా, బ్రిటన్ లాంటి అగ్ర రాజ్యాలు సరైన నిరోధక చర్యలను తీసుకోక పోవడం వల్ల 2017లో భూగోళంపై కార్బన్ డైయాక్సైడ్ బాగా పెరిగిందని, మళ్లీ పూర్వ పరిస్థితికి చేరుకునే ఆస్కారమే లేదని ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం ‘ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్’లో వెల్లడించింది. ఫలితంగానే ఆ సంవత్సరం అకాల వరదలు, కరవు కాటకాల వల్ల 2,726 మంది మరణించారని ఢిల్లీలోని వాతావరణ పరిశోధన సంస్థ ‘క్లైమేట్ ట్రెండ్స్’ తెలియజేసింది. హాట్ స్పాట్ ప్రాంతాల్లో పెను ముప్పు భూగోళం ఉష్ణోగ్రత మూడు డిగ్రీల సెల్సియస్ పెరిగితే ప్రపంచంలో ఎక్కువగా నష్టపోయే దేశాల్లో భారత్ 14వ స్థానంలో ఉందని ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ‘సౌత్ ఆసియా హాట్‌స్పాట్స్: ఇంపాక్ట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ పర్సిపటేషన్ చేంజస్ ఆప్ లివింగ్ స్టాండర్డ్స్’ నివేదికలో వివరించింది. భారత్‌లో చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ముఖ్య హాట్స్పాట్లని, ఆ తర్వాత రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రాలు ఉన్నాయని ఆ నివేదిక పేర్కొంది. హాట్ స్పాట్ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు అల్లకల్లోలంగా ఉంటాయని, ఓ ప్రాంతంలో అధిక వర్షాలు పడితే మరోపక్క కరువు పరిస్థిలు తాండవిస్తాయని తెలిపింది. 2050 సంవత్సరం నాటికి భారత్‌లోని 120 కోట్ల జనాభాలో 44.8 శాతం మందిపై వేడెక్కుతున్న భోగోళం ప్రభావం ఉంటుంది అంచనా వేసింది. తగ్గనున్న పంట దిగుబడులు వర్షాధార ప్రాంతాల్లో ఒక సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఖరీఫ్ పంట దిగుబడి 6.2 శాతం, రబీ పంట దిగుబడి ఆరు శాతం తగ్గిపోతుందని ‘క్లైమేట్ ట్రెండ్స్’ వెల్లడించింది. ఇక సాధారణ వర్షాలకన్నా ప్రతి వంద మిల్లీ మీటర్ల వర్షానికి ఖరీఫ్‌లో 15 శాతం, రబీలో ఏడు శాతం తగ్గుతుందని తెలిపింది. భూగోళం ఉష్ణ ప్రభావం ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలపై, మధ్యతరగతి, పేదలు, నిరుపేదలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. ముఖ్యంగా రైతులు ఎక్కువగా దెబ్బతింటారని తెలిపింది. దేశంలోని 40 శాతం ప్రజలపై 2030 నాటికే ఈ ప్రభావం కనిపిస్తుందని చెప్పింది. పంటలు దెబ్బతినడం వల్ల వాటి ధరలు పెరగడం, కొనుగోలు శక్తి పడిపోయి పేదలు వాటిని కొనలేక పస్తులుండే పరిస్థితి తప్పదని హెచ్చరించింది. పేదలపై ప్రభావం 11 శాతం, ధనవంతులపై మూడు శాతం ఉంటుందని, పర్యావసానంగా ధనికులు, పేదవారి మధ్య వ్యత్యాసం మరింత పెరుగుతుందని ›క్లైమేట్ ట్రెండ్స్ హెచ్చరించింది. ఈ పరిస్థితులను నివారించేందుకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యాన పోలండ్‌లోని కాటోవైస్ నగరంలో ఈ డిసెంబర్ 16వ తేదీన ముగిసిన సదస్సుకు ఐరోపా కూటమితోపాటు 196 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. 2020 నాటికి అమలు చేయాల్సిన మార్గదర్శకాలతో కూడిన ఒప్పందం ‘కాటోవైస్ క్లైమేట్ ప్యాకేజ్’పై దాదాపు అన్ని దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు.