
వాషింగ్టన్ : స్వీడన్‌కు చెందిన 16 ఏళ్ల గ్రేటా థన్‌బర్గ్ పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తనను కలసిన థన్‌బెర్గ్‌ను ట్విటర్ వేదికగా అభినందించారు. అంత చిన్న వయసులో పర్యావరణ పరిరక్షణ గురించి థన్‌బెర్గ్ పోరాడడం గొప్ప విషయమని, ఆమెను కలవడం ఆనందం కలిగించిందని ఒబామా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒబామా థన్‌బర్గ్‌ను కలిసిన వీడియోనూ ఒబామా ఫౌండేషన్ విడుదల చేసింది. '' మీరు, నేను ఒక టీంగా ఏర్పడి పర్యావరణ పరిరక్షణకు పిడికిళ్లు బిగిద్దామని'' ఒబామా పేర్కొన్నారు.
దీనికి థన్‌బెర్గ్ అనుకూలంగా స్పందిస్తూ ... ప్రపంచాన్ని ఎవరు ప్రభావితం చేయలేరని, వాతావరణం పట్ల సృజనాత్మకంగా వ్యవహరిస్తూ మీకు నచ్చినది చేయొచ్చని, అందుకు నా సహకారం తప్పక ఉంటుందని పేర్కొన్నారు . వాతావరణ మార్పుల తీవ్రతను ఇప్పటి యువతరం భరిస్తుందని, అందులోనూ పర్యావరణం కోసం పరితపిస్తున్న థన్‌బెర్గ్ లాంటివారు అసలే భయపడరని ఒబామా పేర్కొన్నారు. గత శుక్రవారం వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్ ముందు నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో థన్‌బెర్గ్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం వాషింగ్టన్‌లో ఉన్న బరాక్ ఒబామాను తన్‌బెర్గ్ కలుసుకున్నారు. కాగా, సెప్టెంబర్ 20 న న్యూయార్క్‌లో జరగనున్న '' గ్లోబల్ క్లైమెట్ స్ట్రైక్'' లో ఇతర నిరసనకారులతో కలిసి ఆమె పాల్గొననున్నారు.