పిల్లలకు భయం తెలీదు. రాక్షసుడి మీసాలు పట్టుకుని కూడా లాగుతారు. ఆ మీసాల రాక్షసుడి కన్నా పెద్ద రాక్షసి.. ఈ భూమండల కాలుష్యం. దాని కోరలు పట్టిలాగింది గ్రెటా థన్‌బర్గ్! అయితే అవి కాలుష్యపు కోరలు కాదు. పాలకుల నిర్లక్ష్యపు కోరలు. ఎంత ధైర్యం.. ఈ చిన్నారి కార్యకర్తకు!!
‘‘ఐ హ్యావ్ ఎ డ్రీమ్’’ అన్నాడు మార్టిన్ లూథర్ కింగ్. వాషింగ్టన్‌లోని లింకన్ మెమోరియల్‌లో గుమికూడిన రెండు లక్షల మంది ఆ మాట విన్నారు. ప్రతిస్పందనగా పెద్ద హోరు!‘‘ఐ హ్యావ్ ఎ డ్రీమ్’’ అన్నాడు మరింత గట్టిగా ఆయన. మళ్లీ అదే హోరు. ఏమిటి ఆయన కల? ‘‘ఓ రోజు వస్తుంది. ఆ రోజు అమెరికాలో నల్లవారందరికీ స్వేచ్ఛ, తెల్లవారందరితో సమానత్వం అనే నా కల నిజమౌతుంది’’ అన్నాడు మార్టిన్. 1963 ఆగస్టు 28 నాటి ప్రసంగం అది. ‘‘హౌ డేర్ యు’’ అంది గ్రెటా థన్‌బర్గ్. పదహారేళ్ల అమ్మాయి! అగ్రరాజ్యాలన్నీ ఒక్కక్షణం ఫ్రీజ్ అయ్యాయి. ఏమిటి ఈ పిల్లకింత ధైర్యం! ‘హౌ డేర్ యు’ అని గ్రెటా అన్నది చిన్నా చితక మనుషుల్ని కాదు. దేశాధినేతల్ని. ఎంత ధైర్యం లేకపోతే, ‘మీ కింత ధైర్యమా?’ అని అడుగుతుంది!! ఏం చేశారు అధినేతలు అంత పెద్ద తప్పు? భూగోళం మసిబారిపోతుంటే చూస్తూ ఊరుకున్నారు! అదే వారిపై ఆమె కంప్లయింట్. సోమవారం ఐక్యరాజ్య సమితిలో గ్రెటా చేసిన ప్రసంగానికి ప్రపంచం ఫ్లాట్ అయిపోయింది.
‘‘అదీ అలా బుద్ధి చెప్పు’’ అని ఒకటే అభినందనలు. మార్టిన్ లూథర్ కింగ్‌ని, గ్రెటా థన్‌బర్గ్‌ని పోల్చడం కరెక్ట్ కాదు. ‘అటెన్షన్’ని పట్టుకోవడంలో మాత్రం.. తప్పదు, పోల్చాల్సిందే. ఇద్దరి ప్రసంగానికీ ఒకే ప్రతిస్పందన. ఒకే హోరు. నల్లజాతి అమెరికన్‌ల హక్కుల నాయకుడు లూథర్ కింగ్. ఈ భూగోళంపై భావితరాలకు ఉన్న ‘స్వచ్ఛమైన గాలిని పీల్చే హక్కు’కు ఒక పరిరక్షక కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్.‘యు.ఎన్. క్లైమేట్ యాక్షన్ సమ్మిట్’కి న్యూయార్క్ వచ్చింది గ్రెటా. ప్రత్యేక ఆహ్వానంపై వచ్చింది. ప్రత్యేక ప్రసంగానికీ ఆమెకు ఆహ్వానం ఉంది. గ్రెటా మైక్ పట్టుకోగానే.. సూట్లు, బూట్లు వేసుకున్న పెద్దలంతా వినేందుకు సిద్ధమైపోయారు. ఆ స్కూల్ విద్యార్థిని ఎలా మాట్లాడుతుందో కొన్నాళ్లుగా ఆ పెద్దల దృష్టికి వస్తూనే ఉంది. క్లాసులు వదిలి స్కూలు బయట, స్కూలు వదిలి దేశం బయట ఆ స్వీడన్ అమ్మాయి నిరసన ప్రదర్శనలు జరపడం కూడా వారు టీవీల్లో చూస్తూనే ఉన్నారు. గ్రెటా మొదట తన దేశ పార్లమెంటును షేక్ చేసింది.
తనూ, తన స్కూలు పిల్లలే.. పక్కన గ్రేట్ లీడర్స్ ఎవరూ లేరు! ‘బయటికి రండి. ఈ దేశం ఎలా ఉందో చూడండి. ఇదా మేం పీల్చవలసిన గాలి. ఇదా మీరు మా ఊపిరి తిత్తులకు ఇచ్చే ప్రాణవాయువు’’ అని సన్నటి గొంతులతో గర్జించారు పిల్లలు. స్వీడన్ ఎంపీలు కిటికీల్లోంచి తలలు బయటికి పెట్టి చూశారు. అమెరికన్ కాంగ్రెస్‌నూ గ్రెటా అండ్ గ్యాంగ్ వదిలిపెట్టలేదు. సముద్రం దాటి వచ్చి, సునామీలా వాషింగ్టన్‌ను చుట్టేశారు. ఇప్పుడు ఐక్యరాజ్యసమితి మీటింగ్ హాల్లో మళ్లొకసారి గ్రెటా ‘క్లైమేట్ ఛేంజ్’ గర్జన.‘‘అమ్మాయ్.. ఏమివ్వబోతున్నావ్ మాకు సందేశం?!’’ మాట్లాడేందుకు గ్రెటా రెడీ అవగానే ముఖానికి వచ్చి తగిలిన ప్రశ్న. పైకి అది ప్రశ్నే గానీ, ‘చాల్లే కూర్చో’ అన్నట్లుగానే ఉంది. గ్రెటా బెదర్లేదు. చురుగ్గా చూసింది. ‘‘మీపై ఒక కన్నేసి ఉంచానని చెప్పడమే నా సందేశం’’ అంది! పిన్ డ్రాప్ సైలెన్స్. ఆ నిశ్శబ్దంలోంచి గ్రెటా ఈటెల్లాంటి మాటలు ధ్వనించాయి. ‘‘ఇది తప్పు. ఈ టైమ్‌కి నేనిక్కడ ఉండకూడదు. స్కూల్లో ఉండాలి. కానీ స్కూలు వదిలిపెట్టి వచ్చాను. మీ బాధ్యతను మీకు గుర్తు చేయడానికి మా వంటి పిల్లల్ని మీ దగ్గరికి రప్పించుకుంటారా? హౌ డేర్ యూ?!’’
సభ అదిరిపడింది
‘‘నా కలల్ని, నా బాల్యాన్నీ మీరు దొంగిలించారు. వట్టి మాటలు మీవి. మీకేం పట్టదా? ప్రజలు జబ్బున పడుతున్నారు. చనిపోతున్నారు. మొత్తం పర్యావరణమే ధ్వంసమైపోయింది. కొద్దిమంది అదృష్టవంతులలో నేనొక దానిని. మేం బతికే ఉన్నాం. అంతరించిపోతున్న జీవజాతుల అంతిమ దినాలలో ఆఖరి శ్వాసను పీలుస్తూ కొన ఊపిరితో ఉన్నాం. మీకు డబ్బు కావాలి. అభివృద్ధి కావాలి. వాటి కోసం కట్టుకథలతో మమ్మల్ని మభ్యపెడుతున్నారు. హౌ డేర్ యూ!!’’
సభలో పిడుగు పడింది
‘‘అంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు మాత్రం ఎటువైపో చూస్తుంటారు. ‘చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నాం’ అని చెబుతుంటారు. కానీ ఏమీ జరగదు. పొంచి ఉన్న ముప్పు నుంచి మమ్మల్ని బయటపడేసే మీ ప్రయత్నమేదీ కనుచూపు మేరలో మాకు కనిపించదు. హౌ డేర్ యూ!!’’
సభ తత్తరపడింది
‘‘మీరు చెప్పింది వింటున్నాం అంటారు. విషమిస్తోన్న పరిస్థితిని అర్థం చేసుకుంటున్నాం అంటారు. కానీ మీవి నమ్మకమైన మాటలు కావు. కోపంలోనో, బాధగానో నేను ఇలా అనడం లేదు. మిమ్మల్ని నమ్మలేను. రానున్న ప్రమాదం ఎంత తీవ్ర స్థాయిలో ఉందో తెలిసి కూడా మీరు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. హౌ డేర్ యూ!!’’
సభ ఉలిక్కిపడింది
‘‘అన్ని సమస్యల్లానే కార్బన్ కాలుష్య సమస్య కూడా పరిష్కారం అవుతుందని మీరు భావిస్తున్నారు. ఏవో కొన్ని సాంకేతిక పరిజ్ఞాన విధానాలతో కర్బన వాయువుల్ని తగ్గించి, భూతాపాన్ని నియంత్రిస్తాం అంటున్నారు. కానీ మీ ప్రయత్నాల్లో మీరు విఫలం అవుతున్నారు. క్లైమేట్ ఛేంజ్ అనే మాట వినగానే ఇక్కడి సభ్యులు కుదురుగా కూర్చోలేకపోతున్నారు. వినేందుకు అవసరమైన పరిణతినీ కనబరచడం లేదు. హౌ డేర్ యూ?!’’
సభ భుజాలు తడుముకుంది
‘‘మీరు మమ్మల్ని గెలవనివ్వడం లేదు. మీ ద్రోహం మా యువతకు అర్థమౌతోంది. భావి తరాల కళ్లన్నీ మీ మీదే ఉన్నాయని గ్రహించండి. మమ్మల్ని ఓడించడమే మీ ఉద్దేశమైతే.. నేను చెబుతున్నా వినండి.. మేము ఎప్పటికీ మిమ్మల్ని క్షమించబోము. ఇక్కడికిక్కడే, ఇప్పటికిప్పుడే ఒక పరిషారం ప్రకటించాలి. ప్రపంచం మేల్కొంటోంది. మార్పు మొదలవుతోంది. అది మీకు ఇష్టమేనా.. లేకున్నా..’’
సభ నివ్వెరపోయింది.
గ్రెటా ప్రసంగం ముగిసింది. ‘థ్యాంక్యూ’ అనే మాటతో ఆమె తన స్పీచ్‌ని ముగించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ మంత్రముగ్ధుడై చూశారు! ‘‘అందమైన భవిష్యత్తు కోసం చూస్తున్న అద్భుతమైన యువతి. ఈ చిన్నారిని చూడ్డం సంతోషంగా ఉంది’’ అని ట్వీట్ చేశారు. ఇండియా నుంచీ గ్రెటాకు ప్రశంసలు వెళ్లాయి. ‘‘బాగా చెప్పావు గ్రెటా. మిమ్మల్ని ఓడించడానికి మాకెంత ధైర్యం! ముఖం పగిలేలా భలే అడిగావు. రానున్న పర్యావరణ విపత్తుపై మా స్పృహలేనితనాన్ని చక్కగా ఎత్తి చూపావు. నీకు కృతజ్ఞతలు’’ అని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ట్వీట్ చేశారు.
ఇంకో నటి ఆలియా భట్.. ‘‘వినండి. ఆలోచించండి. అప్రమత్తం కండి. కార్యాచరణకు దిగండి’’ అని ఏకంగా గ్రెటా స్పీచ్‌నే తన ట్విట్టర్ లో షేర్ చేశారు. చిన్నచిన్న విమర్శలూ వచ్చాయి గ్రెటా మీద. వయసుకు మించిన ఆగ్రహ ప్రదర్శన అసహజంగా ఉందనీ, సాధ్యాసాధ్యాలను తెలుసుకోలేని వయసనీ కొందరు కొట్టిపడేశారు. ఏమైనా గ్రెటా పేరు కన్నా ఆమెలో పేరుకుపోయిన మనోవేదననే పరిగణనలోకి తేసుకోవాలి. తన గురించి ఆమె మాట్లాడ్డం లేదు. తన తరం గురించి మాట్లాడుతోంది. ఈ తరం నేతలు దానిని గ్రహించాలి. రేపటి తరానికి స్వచ్ఛమైన భూమండలాన్ని కానుకగా ఇవ్వాలి.
తిరుగుబాటు కార్యకర్త
ఏడేళ్ల క్రితం బాలికల విద్య కోసం ఉద్యమించిన పాకిస్థానీ యువ తరంగం మలాలా అసాఫ్జాయ్‌లా.. ఇప్పుడు అకస్మాత్తుగా వార్తల్లోకి వచ్చిన టీనేజ్ పర్యావరణ ‘తిరుగుబాటు’ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్. స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్ ఆమె పుట్టినిల్లు. తల్లి మలేనా ఎర్న్‌మేన్ అపేరా గాయని. తండ్రి స్వాంతే థన్‌బర్గ్ రచయిత, నటుడు. ఎనిమిదేళ్ల వయసప్పుడు తొలిసారిగా ఈ చిన్నారి ‘క్లైమేట్ ఛేంజ్’ అనే మాట వింది. ఆ వయసుకు అర్థం కాని విషయం అది. తర్వాత మూడేళ్లకు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది! ఎప్పుడూ నిస్సత్తువగా, అనాసక్తితో అలా పడి ఉండేది. ఎవరితోనూ మాట్లాడేది కాదు. తినేది కాదు. చివరికి ఆమె ‘ఆస్పెర్గర్ సిండ్రోమ్’తో బాధపడుతోందని వైద్యులు తేల్చారు. ‘ఓసీడీ’, ‘సెలక్టివ్ మ్యుటిజం’ వంటివి కూడా బయటపడ్డాయి.
‘ఆటిజం’తో వచ్చిన లక్షణాలు అవి. ‘‘నువ్వు చిన్నప్పుడు అలా ఉండేదానివట కదా’’ అని తెలిసినవాళ్లు ఎవరైనా ఇప్పుడు అడిగితే. ‘‘అవన్నీ కూడా నాకు సూపర్ పవర్‌ని ఇచ్చాయి’’ అని నవ్వుతూ చెబుతుంటుంది గ్రెటా. పద్నాల్గవ యేట తొలిసారిగా ఆమె.. ‘మన ఫ్యామిలీ కార్బన్ ఫుట్‌ప్రింట్ ను తగ్గిద్దాం. మాంసాహారాన్ని, విమాన ప్రయాణాలను మానుకుందాం’’అని అన్నప్పుడు గ్రెటా తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు. తర్వాత ఆమె అభీష్టం ప్రకారమే మానేశారు. కార్బర్ ఫుట్‌ప్రింట్ అంటే ఒక మనిషి అలవాట్ల నుంచి సగటున ఏడాదికి విడుదలయ్యే కార్బన్ డైయాక్సైడ్. వాళ్లిచ్చిన ఆ చిన్నపాటి ప్రోత్సాహమే నేడు గ్రెటాను ఒక ఉద్యమకారిణిగా ఐక్యరాజ్యసమితి వరకు నడిపించింది.
Comments
Please login to add a commentAdd a comment