వాషింగ్టన్ : ’నిద్ర పోతూ కలలు కనేందుకు ఇది సమయం కాదు.. సందర్భం అంతకన్నా కాదు.. మేల్కొనండి’ అంటూ పర్యావరణ ఉద్యమకారిణి, స్వీడన్ యువ కెరటం గ్రెటా థన్‌బెర్గ్(16) అమెరికా కాంగ్రెస్ సభ్యులకు విఙ్ఞప్తి చేశారు. వాతావరణ మార్పులపై తాను చెప్పే మాటలు వినాల్సిన అవసరం లేదని..కేవలం శాస్త్రవేత్తల హెచ్చరికలపై దృష్టి సారిస్తే సరిపోతుందని సూచించారు. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ పేరిట వాతావరణ మార్పులపై అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన థెన్‌బర్గ్ ఆరు రోజుల పాటు వాషింగ్టన్‌లో పర్యటించారు.
ఈ సందర్భంగా బుధవారం అమెరికా హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో సభ్యులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ‘పర్యావరణ సంక్షోభాన్ని ఎవరూ తీవ్రమైన సమస్యగా పరిగణించడం లేదు. అదే అసలు సమస్య. సైన్స్ చెబుతున్న సత్యాలను వినండి. దాని సాక్షిగా అంతా ఏకం అవండి. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తాయో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి. ఇక ప్రపంచ దేశాల్లో ఉద్దేశపూర్వకంగా ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగాలనుకున్న ఏకైక దేశమైన అమెరికా... కర్భన ఉద్గారాలను వెదజల్లడంలో మాత్రం అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఈ విషయంలో మార్పు రావాలి. మీ ప్రశంసలు నాకు అక్కర్లేదు. వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలను అరికట్టేందుకు నడుం బిగిస్తే చాలు’ అంటూ థెన్‌బెర్గ్ ఉద్వేగంగా ప్రసంగించారు.(చదవండి : థన్‌బెర్గ్‌ను కలవడం ఆనందం కలిగించింది : ఒబామా)
కాగా వాతావరణ మార్పులపై అవగాహన సదస్సులు నిర్వహించే అమెరికా యువ న్యాయవాది బెంజీ బాకర్(21)థెన్‌బెర్గ్‌పై ప్రశంసలు కురిపించాడు. థెన్‌బర్గ్ వంటి వ్యక్తులు తమ పోరాటాన్ని రాజకీయ నాయకుల ముందుకు తీసుకురావడం గొప్ప పరిణామమని పేర్కొన్నాడు. ‘ ఒక అమెరికన్‌గా ఎంతో గర్విస్తున్నా. అదే విధంగా ఓ యువకుడిగా మిమ్మల్ని అర్థిస్తున్నా. వాతావరణ మార్పుల వల్ల భవిష్యత్తులో కలిగే నష్టాలను అంచనా వేయండి. అందుకు తగ్గట్టుగా స్పందించండి. వాటిని రూపుమాపేందుకు చర్యలు తీసుకోండి. మాకు మీ సహాయం కావాలి’ అని కాంగ్రెస్ సభ్యులకు విఙ్ఞప్తి చేశాడు. ఇక పర్యావరణ సంక్షోభాన్ని రూపుమాపేందుకు థెన్‌బర్గ్ సహా యువ శాస్త్రవేత్తలు చేసిన సలహాలు, సూచనలను రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు ప్రశంసించారు. అయితే వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్‌కు అమెరికా ఒక్కటే కారణం కాదని.. వర్ధమాన దేశాలుగా చెప్పుకొంటున్న కొన్ని దేశాలు వెదజల్లే కర్భన ఉద్గారాలతో పోలిస్తే అమెరికా కాస్త బెటర్‌గానే ఉందన్నారు. కర్భన ఉద్గారాలు వెదజల్లుతూ ఆ దేశాలు ఆర్థికంగా ఎదుగుతున్నాయని పేర్కొన్నారు. రిపబ్లికన్ ప్రతినిధి గ్యారెట్ గ్రేవ్స్ మాట్లాడుతూ..కాలుష్యాన్ని వెదజల్లడంలో చైనా ముందుందని.. అటువంటి దేశాల గురించి ఎవరూ మాట్లాడటం లేదని విమర్శించారు. ఇందుకు స్పందనగా..‘ మీరు ఇతర దేశాల గురించి ఎలా మాట్లాడతారో వాళ్లు కూడా... తక్కువ జనాభా కలిగి ఉండి అత్యధిక కర్భన రసాయనాలు వెదజల్లుతున్న దేశం మీదేనని అంటున్నారు’ అని చురకలంటించారు.
వ్యాధితో సతమవుతున్నా..
అస్‌పెర్జర్ సిండ్రోమ్‌తో బాధ పడుతున్న 16 ఏళ్ల గ్రెటా.. గతేడాది డిసెంబరులో పోలాండ్‌లో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన కాప్24 సదస్సులో ప్రసంగించారు. ఈ సందర్భంగా.. రాజకీయ నాయకులను ఉద్దేశించి.. ‘మా గురించి పట్టించుకోమని అడుక్కోవడానికి ఇక్కడకు రాలేదు. చాలా ఏళ్లుగా మమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. అయినా ఎన్నోసార్లు క్షమించాం. కానీ ఇప్పుడు సమయం మించిపోయింది. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలు భవిష్యత్తును అంధకారం చేస్తాయి. ప్రజల చేతుల్లోనే నిజమైన అధికారం ఉంటుంది అంటూ వ్యాఖ్యానించి ప్రపంచ దేశాధినేతల దృష్టిని ఆకర్షించారు. ఇక కర్భన ఉద్గారాలను నియంత్రించాల్సిన అవసరం ఉందంటూ... భారత ప్రధాని మోదీకి సైతం ఓ పవర్‌ఫుల్ వీడియో మెసేజ్ పంపారు.(చదవండి : ‘మోదీ.. మీరొక చెత్త విలన్‌లా మిగిలిపోతారు’)
Comments
Please login to add a commentAdd a comment