వ్యర్థానికి సరికొత్త అర్థం!
♦ ఘన, జీవ వ్యర్థాల శుద్ధిపై అధ్యయనం
♦ అత్యున్నత ప్రమాణాలతో ఔషధనగరి
♦ నెదర్లాండ్, బ్రెజిల్, ఇంగ్లాండ్‌లో
♦ కలెక్టర్ రఘునందన్‌రావు పర్యటన
♦ ‘సాక్షి’కి పర్యటన విశేషాలు వెల్లడి
జీవవాళికి ప్రమాదకరంగా మారిన కాలుష్య ఉద్గారాలను శుద్ధి చేసేందుకు ఆయా దేశాలు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నాయి. ఐర్లాండ్‌కు చెందిన ‘పీఎమ్’ కన్సల్టెన్సీ సంస్థ ఫార్మా సిటీల డిజైన్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమమైనది. ఔషధనగరిలో కంపెనీల స్థాపనపై సమగ్ర అవగాహన ఈ కన్సల్టెన్సీ సొంతం. వ్యర్థాల నిర్వహణను పరిశ్రమ గుర్తించడం ఆయా దేశాల్లో సత్ఫలితాలనిస్తోంది - రఘునందన్‌రావు, కలెక్టర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఘన, జీవ వ్యర్థాలను వినూత్న విధానంతో అర్థవంతమైన ఉత్పత్తులుగా మార్చే దిశగా అధికార యంత్రాంగం ప్రణాళిక రూపొందించింది. పలు అభివృద్ధి చెందిన దేశాల్లో అమలు చేస్తున్న విధానాలపై జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమగ్రంగా అధ్యయనం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని ముచ్చర్లలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఔషధనగరి (ఫార్మాసిటీ) పరిధిలో వెలువడనున్న జీవ, రసాయన కారకాలను పర్యావరణానికి హాని కలగనిరీతిలో శుద్ధి చేసి ఇం‘ధనం’గా మార్చాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా ఇంగ్లాండ్, నెదర్లాండ్, ఐర్లాండ్, బ్రెజిల్ దేశాల్లో పర్యటించి అందుబాటులో ఉన్న శుద్ధి యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం, విధానాలను తెలుసుకుంది. సుమారు 13వేల ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఫార్మాసిటీ దేశానికే తలమానికంగా మారుతుందని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. ఔషధ కంపెనీలంటే ఉద్గారాలను వెదజల్లే పరిశ్రమలనే అపవాదును రూపుమాపేలా జీవ, రసాయన వ్యర్థాలను శుద్ధికి విదేశీ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని నిర్ణయించింది. కాలుష్య నియంత్రణకు ఆయా దేశాల్లో అమలవుతున్న విధానాలతో అత్యున్నత స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఔషధనగరిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
వ్యర్థాల నిర్వహణ కూడా ఒక పరిశ్రమే!
‘అక్కడ వ్యర్థ పదార్థాల నిర్వహణ కూడా ఒక పరిశ్రమే’ అనే అంశం ప్రతినిధి బృందం తెలుసుకుంది. మురుగు, చెత్త, రసాయన, బయో వేస్ట్, ఈ-వేస్ట్ శుద్ధి అంతా కూడా ఆ పరిశ్రమ కనుసన్నల్లోనే కొనసాగుతుంది. ప్రమాదకర విషవాయువుల వాసన.. కాలుష్య ఉద్గారాల జాడ తమ పర్యటనలో కనిపించకపోవడం అధికారుల ఆశ్చర్యపరిచింది. పరిశ్రమ స్థాపించిన సమయంలో వె లువడే రసాయనాల శాతం, ఘన వ్యర్థాలు, ఇతరత్రా కాలుష్య కారకాలపై స్పష్టమైన సమాచారాన్ని యాజమాన్యం ఇవ్వాల్సివుంటుంది. ఈ మేరకు నిర్ధిష్ట ప్రమాణాలు పాటిస్తున్నారా? లేదా అనే విషయాలను ప్రభుత్వ ఆధీనంలోని విభాగం పరిశీలిస్తుంది. బ్రస్సెల్స్ నగరంలోని ఇండోవర్ కంపెనీ ఏడాదిలో 50 లక్షల టన్నుల వ్యర్థాలను శుద్ధి చేయడం..
ఈ సంస్థ ఇతర దేశాల్లో కూడా సేవలందిస్తుండడం అబ్బురపరిచిందని కలెక్టర్ రఘునందన్‌రావు అన్నారు. 10 రోజుల విదేశాల సందర్శన ముగించుకొని సోమవారం విధుల్లో చేరిన ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో పర్యటన విశేషాలను పంచుకున్నారు. జర్మనీలో ‘బాస్ఫ్’ అనే సంస్థ కాలుష్య జలాల శుద్థిలో ఆధునిక సాంకేతికను వినియోగిస్తోందని, ప్రతిరోజూ 350 క్యుబిక్ లీటర్ల నీటిని శుద్ధి చేస్తోందని అన్నారు. 10 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ఫ్యాక్టరీలో రసాయనాల వాసన, గాలి కూడా బయటకు రాకుండా జాగ్ర త్తలు తీసుకుంటోందని అన్నారు.
మన దగ్గర ‘టీ-హబ్’లో సాఫ్ట్‌వేర్ స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించినట్లే ఇంగ్లాండ్‌లో ఫార్మా కంపెనీల ప్రోత్సాహానికి ఫార్మా హాబ్ ఏర్పాటు చేశారని వివరించారు. ఇక్కడ ఓనమాలు నేర్చుకునే కంపెనీలకు అన్నిరకాలుగా ప్రభుత్వం చేయూతనందిస్తున్నట్లు తమ అధ్యయనంలో తెలిసిందని చెప్పారు. ‘బయోసిటీ, మెడిసిటీ ఉత్పత్తులకు వేర్వేరుగా ఇక్కడ అవకాశం కల్పించారు. ఫార్మా రంగంలోనూ స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం కలిగించే అంశాన్ని పరిశీలించమని ప్రభుత్వానికి నివేదిస్తాం’ అని రఘునందన్‌రావు తెలిపారు.