మన దేశంలో అభివృద్ధి బాగా జరగాలని అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే సామాన్యుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలంటే అభివృద్ధి జరగాలని మనం అనుకుంటూ ఉంటాం. యువతరం కూడా అభివృద్ధి ఫలాలను పొందేందుకు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటుంది. అయితే, ఆ అభివృద్ధితో పాటు కాలుష్యం అనేక సమస్యలు తెచ్చిపెట్టింది. తెచ్చిపెడుతూనే ఉంది. కాలుష్యం అనేది పెద్ద పెద్ద పరిశ్రమలకు సంబంధించినది.
ఇది ప్రభుత్వాలు పరిష్కరించాల్సిన అవసరం ఉందని మనలో చాలా మంది అనుకుంటూ ఉంటారు.ఈ విషయంలో పర్యావరణ కాలుష్యం, సహజవనరులను కలుషితం చేయడంలో ఎవరికి వారు తమ పాత్రను పోషిస్తున్నారనేది గమనార్హం. కాలుష్యకారకాలతో అభివృద్ధి ఏ విధంగా అనుసంధానించబడిందో.. అది మనం ఇంట్లో ఉపయోగించే వస్తువులతోనే అని తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవచ్చు.
ఇంటి నుంచే హానికారాలు
షాంపూలూ, డిటర్జెంట్లు, సౌందర్యసాధనాలు, ఎయిర్‌ప్రెషనర్లు, విండో క్లీనర్లు, డిష్‌వాష్ ద్రవ్యాలు, హెయిర్ డైలు, మస్కిటో రిఫెల్లెంట్లు (దోమల మందులు), ఫ్లోర్ క్లీనర్లు, టాయిలెట్ క్లీనర్లు.. ఇలా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ విలాసవంతులు, ఆధునికులు విరివిగా ఉపయోగించే వస్తువులు. ఇవి చిన్నగా అనిపించే పెద్ద కాలుష్యకారకాలుగా మన ముందు ఇప్పుడు సమస్యాత్మకంగా నిలిచాయి. ఇవి ఇళ్లల్లో ఉండటం అభివృద్ధి అని మనం అనుకుంటూ ఉంటాం.
అందువల్ల విలాసవంతులు వాడే ఈ వస్తువులు ఒక సాధారణ ఇంటిలో చోటు సంపాదించుకోవడం ప్రారంభించాయి. తద్వారా ఈ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ పెరగడంతో అనేక ఎంఎన్‌సీ కంపెనీలు ఈ వస్తువుల ఉత్పత్తిలో దూసుకుపోయాయి. ఈ వస్తువుల అమ్మకాలలో వచ్చే లాభంతో ఇండియన్ మార్కెట్లో మెరుగైన ఉత్పత్తిని ఇవ్వడానికి ఎమ్‌ఎన్‌సీలు పోటీ పడటం ప్రారంభించాయి.
మురుగు నీటి నుంచి మంచి నీళ్లలోకి
ఈ పోటీ పరుగులో ఎమ్‌ఎన్‌సీలు వస్తువుల ఉత్పత్తిలో సంక్లిష్టమైన రసాయన కలయికల వల్ల కలిగే ఆరోగ్యప్రమాదాల గురించి ఏ మాత్రం బాధపడటం లేదు. ఈ ఉత్పత్తులు సామాన్యుడి రోజువారీ జీవితంలో చాలా సహాయకారిగా ఉన్నప్పటికీ వాటి అవశేష ప్రభావం ప్రజారోగ్యం, పర్యావరణ దృక్ఫథం నుండి ఆందోళన కలిగిస్తోంది. ఈ ఉత్పత్తుల వాడకం తర్వాత ప్రమాదకర రసాయన అవశేషాలను వదిలేస్తాం. తరువాత ఇవి మన స్థానిక మురుగు నీటిలో చేరుతాయి. ప్రమాదకర రసాయనాలతో నిండిన మురుగునీరు తరచూ మంచినీటి ప్రవాహాలలోకి చేరుతుంటుంది. మన నగరాలు, పట్టణాలలో చాలా వరకు సమర్థవంతమైన మురుగునీటి శుద్ధి కర్మాగారాలు లేవు.
కొన్ని సార్లు అసలు మురుగునీటి ప్రమాదకర స్వభావాన్ని పట్టించుకోం.అంతేకాదు, ఈ మురుగు నదీ జలాలు, సహజ వనరుల్లోకి చేరుకుంటున్నాయి. తత్ఫలితంగా ఈ రసాయనాలు నదుల పర్యావరణ వ్యవస్థ, వాటి మీద ఆధారపడే ప్రాణులకు అపాయం కలిగించడమే కాకుండా మానవ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తున్నాయి. ఈ హానికరమైన రసాయనాలు ఆహార గొలుసులోకి ప్రవేశిస్తాయి. ఈ రసాయనాలు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ రసాయనాల ప్రభావాలు కొన్ని సార్లు చాలా ప్రమాదకరమైనవి. అవి తల్లి పాలను కూడా కలుషితం చేస్తాయి.
భావితరాలకు ఏమిస్తున్నాం?
మన వారసులకు ఆస్తులు అందించడంలో చూపించే ఆసక్తి మేలైన పర్యావరణాన్ని అందించడంలో చూపడం లేదనేది వాస్తవం. ప్రపంచంలోని ప్రాచీన నాగరికతలలో ఒకటైన భారతదేశం ప్రకృతికి అనుకూలమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. సాంకేతికత ఒక జీవనశైలికి దారితీసింది. దీనిలో ఒక సామాన్యుడి రోజువారి జీవితంలో ప్రకృతి ఒక భాగంగా మారింది. కానీ, ఇంత గొప్ప మన సాంస్కృతిక పర్యావరణ వారసత్వాన్ని ముందు తరాలకు తీసుకెళ్లడంలో విఫలమయ్యాం.
నాటి నుండి పాలకులు, ప్రభుత్వాలు మన నాగరిక వారసత్వం గొప్పదనాన్ని మెచ్చుకోలేదు సరికదా కాలక్రమంలో ఒక సామాన్యుడి అవసరాలకు తగినట్లుగా మార్పులను చేర్చడానికి చర్యలు కూడా తీసుకొలేదు. మన ప్రభుత్వాలు ప్రపంచంలోని పాశ్చాత్య దేశాల అభివృద్ధి నమూనాలపై మక్కువ చూపించాయి. ఫలితంగా దేశీయ సాంకేతిక పరిజ్ఞానం పెరిగి, ఆ పరిజ్ఞానంలో దిగుమతికి ఇచ్చిన ప్రాధాన్యత పర్యావరణ రక్షణకు ఇవ్వలేదు.
ఇల్లే శిక్షణ
ఉత్పత్తుల వాడకం పెరుగుల అభివృద్ధి ప్రక్రియను సూచిస్తుంది కదా అనవచ్చు. కానీ, ఇది ఏ రకం అభివృద్ధి ప్రక్రియో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఈ ఉత్పత్తులకు ‘నో’ చెప్పడం ఎలా? హానికరమైన రసాయనాల ఉత్పత్తికి ఒక చిన్న ఇంటి సహకారం ఎంత ఉంది? తమ జీవనోపాధి కోసం కష్టపడుతున్న ఒక సామాన్యుడు ప్రకృతి చేతుల్లోకి ఎలా వెళుతున్నాడు?! తెలుసుకోవడంలో ఎప్పుడూ అనాసక్తినే చూపుతున్నాం. ఈ రకమైన అభివృద్ధి మన పిల్లలకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని మాత్రమే ఇవ్వగలదని, కచ్చితంగా మంచి ఆరోగ్యాన్ని కాదని మన అనుభవాల నుంచే స్పష్టమవుతుంది.
అధునాతన ఎయిర్ కండిషనర్లు, వాటర్ ప్యూరిఫైర్లతో కూడిన ఆధునిక ఇళ్లను మన పిల్లలకు బహుమతిగా ఇవ్వగలం. కానీ, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన తాగునీరు కాదు. ఒక ఇంటి నుంచి ఈ రసాయనాలను విడుదల చేయడం తక్కువే కావచ్చు. ఈ ఉత్పత్తులను ఉపయోగించే జనాభా అధికంగా ఉండటం, గృహ కాలుష్యకారకాలను విస్మరించడం అంత అల్పమైన విషయం కాదని గ్రహించవచ్చు. ఆధునిక సమాజంలో జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి తిరిగి ప్రకృతి చేతుల్లోకి వెళ్లడం అంత సులభం కాకపోవచ్చు.
కానీ, మన జీవితంలో ప్రకృతి పాత్రను గుర్తించడంలో మాత్రం ఎప్పుడూ వెనుకబాటులో ఉండకూడదు. ప్రతి ఒక్కరు దీనిని అభ్యాసంగా చేసుకోవాలి. రోజువారీ కార్యకలాపాలలో ప్రకృతికి తగిన గౌరవం ఇచ్చి తీరాలి. భారతదేశంలో గృహ కాలుష్య కారకాలకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలు త్వరితంగా చర్యలు తీసుకోవాల్సిన సరైన సమయం మాత్రం ఇదే!
– ఆరెన్నార్
Comments
Please login to add a commentAdd a comment