‘నా పెళ్లి.. నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను’అంటే కుదరదంటోంది ఢిల్లీ ప్రభుత్వం. పెళ్లి ఎక్కడ చేసుకోవాలో, ఎంత మందిని పిలవాలో, అతిథులకు ఏం పెట్టాలో.. .మిగిలిన ఆహారాన్ని ఏం చెయ్యాలో... అన్ని తామే చెబుతామంటోంది. తమ మాట పాటించకపోతే భారీగా జరిమానా కూడా వసూలు చేస్తామని స్పష్టం చేస్తోంది. ఇందుకోసం ఢిల్లీ ప్రభుత్వం ఒక ముసాయిదా విధానాన్ని కూడా తయారు చేసింది.
కోట్లు ఖర్చు పెట్టి అట్టహాసంగా, ఆడంబరంగా పెళ్లి తదితర వేడుకలు జరుపుకోవడం ఈ మధ్య మామూలైంది. వీటివల్ల యజమానులకు కలిగే సంతోషాన్ని పక్కన పెడితే బోలెడు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెళ్లిళ్లలో బోలెడు ఆహారం వృథా అవుతోందని, వేడుకల్లో వాడే వస్తువులు, పదార్థాల వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని, ఇరుగుపొరుగులకు ఇబ్బందులు కలుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. దాంతో సుప్రీంకోర్టు రాజధానిలో వేడుకల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు రూపొందిం చాలని ఆదేశించింది. ఆ మేరకు ఢిల్లీ సర్కారు ఈ ముసాయిదాను తయారు చేసింది. ‘పాలసీ ఫర్ హోల్డింగ్ సోషల్ ఫంక్షన్స్ ఇన్ హోటల్స్, మోటల్స్ అండ్ లో డెన్సిటీ రెసిడెన్షియల్ ఏరియా (ఎల్‌డీఆర్‌ఏ) ఇన్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ’పేరుతో రూపొందించిన ఈ ముసాయిదాను సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆమోదించింది కూడా. దాని ప్రకారం..
► పెళ్లిళ్లు, వేడుకల్లో మిగిలిపోయే, వృథా అయ్యే ఆహారాన్ని ఏదైనా స్వచ్ఛంద సంస్థ (ఎన్‌జీవో)ద్వారా అన్నార్థులకు పంచిపెట్టాలి. ఇందుకోసం కేటరర్లు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్ల యాజమాన్యాలు ఎన్‌జీవోల దగ్గర తమ పేర్లు నమోదు చేసుకోవాలి. ఆహారాన్ని ఎలాపడితే అలా కాకుండా చక్కగా, పార్సిళ్లలోనో, డబ్బాల్లోనో ఎన్‌జీవోలకు అందజేయాలి.
► హోటళ్లు, ఫంక్షన్ హాళ్ల యాజమాన్యాలు, కేటరర్లు,నిర్వాహకులు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఆహార భద్రత విభాగం నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి.అలాంటి వారే వేడుకలకు భోజనాలు తయారు చేయడం, సరఫరా చేయడం వంటివి చేయాలి.
► వేడుక నిర్వహించే ప్రాంతం విస్తీర్ణాన్ని బట్టి అతిథులను పిలవాలి. ఎక్కడ ఎంత మందిని పిలవాలన్నది సంబంధిత పట్టణ స్థానిక సంస్థ నిర్ణయిస్తుంది. ఆ పరిమితికి మించి అతిథులను పిలవడానికి వీల్లేదు.
► ఎంత మంది అతిథులను పిలుస్తామో వారికి సరిపడేంత ఆహారం మాత్రమే సిద్ధం చేయాలి. పిలిచిన వాళ్లంతా రాకపోవడం లేదా ఇతరేతర కారణాల వల్ల ఆహారం మిగిలితే వేడుక పూర్తయిన వెంటనే మిగులు ఆహారాన్ని వెంటనే ఫంక్షన్ హాలు నుంచి తొలగించాలి. ఆ బాధ్యత హాలు యాజమాన్యానిదే.
► ఫంక్షన్ హాలులో పార్కింగ్ ప్రదేశంలో ఎన్ని కార్లు నిలపవచ్చో ఆ సంఖ్యను నాలుగుతో గుణిస్తే ఎంత వస్తుందో అంత మంది అతిథులను మాత్రమే ఆహ్వానించాలి. అంటే 20 కార్లు పట్టేంత స్థలం ఉంటే 80 మందినే పిలవాలన్నమాట. లేదా హాలు విస్తీర్ణాన్ని 1.5 చదరపు మీటర్లతో భాగిస్తే ఎంత వస్తుందో అంత మందినే పిలవాలి. ఈ రెండింటిలో ఏది తక్కువయితే దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
► రెండున్నర అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో కట్టిన హాళ్లలోనే ఇలాంటి వేడుకలు నిర్వహించుకోవాలి. ఈ హాళ్లు రోడ్డు చివర(డెడ్ ఎండ్) ఉండకూడదు. ఈ భవనాలకు ప్రధాన రహదారితో కలుపుతూ 60 అడుగుల రోడ్డు సదుపాయం ఉండాలి.
► పర్యావరణానికి ఏ విధంగానూ ముప్పు వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వేడుకల కోసం పాక్షిక శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. హాలు బయట వాహనాలు నిలపకూడదు. నీటిని పొదుపుగా వాడాలి.చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారేయొద్దు. పెద్ద శబ్దాలు చేయకూడదు.
► ఈ నిబంధనలను పాటించాలి. లేనిపక్షంలో 15 లక్షల వరకు జరిమానా కట్టాలి. మొత్తం జరిమానాను కేవలం హాళ్ల యాజమాన్యం కట్టాలి. వేడుకలు జరుపుకునే వారికి సంబంధం లేదు.
పెళ్లి వేడుకకూ పరిమితులు
Published Tue, Jul 16 2019 4:37 AM | Last Updated on Tue, Jul 16 2019 6:28 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment