Draft law
-
పెళ్లి వేడుకకూ పరిమితులు
‘నా పెళ్లి.. నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను’అంటే కుదరదంటోంది ఢిల్లీ ప్రభుత్వం. పెళ్లి ఎక్కడ చేసుకోవాలో, ఎంత మందిని పిలవాలో, అతిథులకు ఏం పెట్టాలో.. .మిగిలిన ఆహారాన్ని ఏం చెయ్యాలో... అన్ని తామే చెబుతామంటోంది. తమ మాట పాటించకపోతే భారీగా జరిమానా కూడా వసూలు చేస్తామని స్పష్టం చేస్తోంది. ఇందుకోసం ఢిల్లీ ప్రభుత్వం ఒక ముసాయిదా విధానాన్ని కూడా తయారు చేసింది. కోట్లు ఖర్చు పెట్టి అట్టహాసంగా, ఆడంబరంగా పెళ్లి తదితర వేడుకలు జరుపుకోవడం ఈ మధ్య మామూలైంది. వీటివల్ల యజమానులకు కలిగే సంతోషాన్ని పక్కన పెడితే బోలెడు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లిళ్లలో బోలెడు ఆహారం వృథా అవుతోందని, వేడుకల్లో వాడే వస్తువులు, పదార్థాల వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని, ఇరుగుపొరుగులకు ఇబ్బందులు కలుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. దాంతో సుప్రీంకోర్టు రాజధానిలో వేడుకల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు రూపొందిం చాలని ఆదేశించింది. ఆ మేరకు ఢిల్లీ సర్కారు ఈ ముసాయిదాను తయారు చేసింది. ‘పాలసీ ఫర్ హోల్డింగ్ సోషల్ ఫంక్షన్స్ ఇన్ హోటల్స్, మోటల్స్ అండ్ లో డెన్సిటీ రెసిడెన్షియల్ ఏరియా (ఎల్డీఆర్ఏ) ఇన్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ’పేరుతో రూపొందించిన ఈ ముసాయిదాను సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆమోదించింది కూడా. దాని ప్రకారం.. ► పెళ్లిళ్లు, వేడుకల్లో మిగిలిపోయే, వృథా అయ్యే ఆహారాన్ని ఏదైనా స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో)ద్వారా అన్నార్థులకు పంచిపెట్టాలి. ఇందుకోసం కేటరర్లు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్ల యాజమాన్యాలు ఎన్జీవోల దగ్గర తమ పేర్లు నమోదు చేసుకోవాలి. ఆహారాన్ని ఎలాపడితే అలా కాకుండా చక్కగా, పార్సిళ్లలోనో, డబ్బాల్లోనో ఎన్జీవోలకు అందజేయాలి. ► హోటళ్లు, ఫంక్షన్ హాళ్ల యాజమాన్యాలు, కేటరర్లు,నిర్వాహకులు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఆహార భద్రత విభాగం నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి.అలాంటి వారే వేడుకలకు భోజనాలు తయారు చేయడం, సరఫరా చేయడం వంటివి చేయాలి. ► వేడుక నిర్వహించే ప్రాంతం విస్తీర్ణాన్ని బట్టి అతిథులను పిలవాలి. ఎక్కడ ఎంత మందిని పిలవాలన్నది సంబంధిత పట్టణ స్థానిక సంస్థ నిర్ణయిస్తుంది. ఆ పరిమితికి మించి అతిథులను పిలవడానికి వీల్లేదు. ► ఎంత మంది అతిథులను పిలుస్తామో వారికి సరిపడేంత ఆహారం మాత్రమే సిద్ధం చేయాలి. పిలిచిన వాళ్లంతా రాకపోవడం లేదా ఇతరేతర కారణాల వల్ల ఆహారం మిగిలితే వేడుక పూర్తయిన వెంటనే మిగులు ఆహారాన్ని వెంటనే ఫంక్షన్ హాలు నుంచి తొలగించాలి. ఆ బాధ్యత హాలు యాజమాన్యానిదే. ► ఫంక్షన్ హాలులో పార్కింగ్ ప్రదేశంలో ఎన్ని కార్లు నిలపవచ్చో ఆ సంఖ్యను నాలుగుతో గుణిస్తే ఎంత వస్తుందో అంత మంది అతిథులను మాత్రమే ఆహ్వానించాలి. అంటే 20 కార్లు పట్టేంత స్థలం ఉంటే 80 మందినే పిలవాలన్నమాట. లేదా హాలు విస్తీర్ణాన్ని 1.5 చదరపు మీటర్లతో భాగిస్తే ఎంత వస్తుందో అంత మందినే పిలవాలి. ఈ రెండింటిలో ఏది తక్కువయితే దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ► రెండున్నర అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో కట్టిన హాళ్లలోనే ఇలాంటి వేడుకలు నిర్వహించుకోవాలి. ఈ హాళ్లు రోడ్డు చివర(డెడ్ ఎండ్) ఉండకూడదు. ఈ భవనాలకు ప్రధాన రహదారితో కలుపుతూ 60 అడుగుల రోడ్డు సదుపాయం ఉండాలి. ► పర్యావరణానికి ఏ విధంగానూ ముప్పు వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వేడుకల కోసం పాక్షిక శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. హాలు బయట వాహనాలు నిలపకూడదు. నీటిని పొదుపుగా వాడాలి.చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారేయొద్దు. పెద్ద శబ్దాలు చేయకూడదు. ► ఈ నిబంధనలను పాటించాలి. లేనిపక్షంలో 15 లక్షల వరకు జరిమానా కట్టాలి. మొత్తం జరిమానాను కేవలం హాళ్ల యాజమాన్యం కట్టాలి. వేడుకలు జరుపుకునే వారికి సంబంధం లేదు. -
చట్టాన్ని ఉల్లంఘిస్తే ఇంటికే..
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ చట్టానికి ప్రభుత్వం పదునుపెడుతోంది. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏకంగా పాలకవర్గాలనే రద్దు చేసేలా తెలంగాణ మున్సిపల్ యాక్ట్–2019లో నిబంధనలను పొందుపరుస్తోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడినా, నిధులు పక్కదారి పట్టినా ఇకపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ముసాయిదా పురపాలక చట్టంలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ నెలాఖరులో ఈ చట్టాన్ని శాసనసభలో ప్రవేశపెట్టాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ముసాయిదా ప్రతులను న్యాయశాఖ పరిశీలనకు పంపింది. న్యాయశాఖ సూచనలు, సలహాల అనంతరం ముసాయిదా చట్టం కేబినెట్ ఆమోదానికి వెళ్లనుంది. సమర్థంగా పనిచేయకపోతే... పట్టణాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే మున్సిపాలిటీల్లో అవినీతికి ముకుతాడు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే అక్రమాలకు పాల్పడే ప్రజాప్రతినిధులపై కొరడా ఝళిపించాలని, అవినీతికి పాల్పడ్డట్లు తేలితే పాలకవర్గాలను రద్దు చేయాలని నిర్దేశించారు. ఈ మేరకు కొత్త చట్టం రూపకల్పనపై కసరత్తు చేసిన నిపుణుల కమిటీ... సమర్థ పాలన అందించలేకపోయినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా, ఆర్థిక స్థిరత్వానికి ముప్పు వాటిల్లినా సదరు మున్సిపాలిటీని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి కట్టబెడుతూ నూతన చట్టాన్ని రూపొందించింది. దీంతో పాలకవర్గం రద్దు కాగానే.. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లు (వార్డు సభ్యులు), కో ఆప్షన్ సభ్యుల పదవి కూడా ఊడనుంది. ఈ మేరకు నోటిఫికేషన్ను కూడా చట్టసభల్లో ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా ఒకవేళ పాలకవర్గానికి ఆరు నెలల కంటే ఎక్కువ కాలపరిమితి ఉంటే రద్దయిన తేదీ నుంచి ఆరు నెలల్లో నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తారు. పాలకవర్గం స్థానంలో ప్రత్యేక అధికారిని నియమించి పాలన కొనసాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్, ఆర్డీవోలను దూరంగా ఉంచనుంది. పురపాలకశాఖ విచక్షణ మేరకు స్థానిక కమిషనర్ లేదా ఇతర అధికారులను స్పెషల్ ఆఫీసర్గా నియమించేలా చట్టంలో పేర్కొంటున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆరేళ్లపాటు అనర్హత వేటు... నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించలేదని తేలితే చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లను తొలగించే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంది. చట్టంలోని నిబంధనలను పాటించకపోయినా, ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించినా, నిధుల దుర్వినియోగానికి పాల్పడినా చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లను తొలగించే విధంగా చట్టం ఉండనుంది. అదేవిధంగా ఒకసారి ఉద్వాసనకు గురైన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లు ఆ తేదీ నుంచి ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు కానున్నారు. వార్డుల హేతుబద్ధీకరణ! సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్న సర్కారు.. వార్డుల ఏర్పాటులో హేతుబద్ధత పాటించాలని నిర్ణయించింది. ప్రస్తుతం 1,500 నుంచి 15 వేల వరకు వార్డులు ఉన్నాయి. అయితే నిర్దేశిత జనాభా ప్రాతిపదికన కాకుండా అడ్డగోలుగా విభజించడంతో అభివృద్ధిలో అసమానతలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త చట్టంలో వార్డుల వర్గీకరణపైనా స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జనాభాకు అనుగుణంగా కౌన్సిలర్ల సంఖ్యను ముసాయిదా చట్టంలో ప్రతిపాదించింది. -
మూడు నెలలకోసారి రాష్ట్రాలకు ‘జీఎస్టీ’ పరిహారం
న్యూఢిల్లీ: జీఎస్టీ అమలుతో రాష్ట్రాలు కోల్పోయే ఆదాయానికి ప్రతిగా ప్రతి మూడు నెలలకోసారి పరిహారం చెల్లించాలని ముసాయిదా చట్టంలో కేంద్రం పేర్కొంది. ఈ మేరకు శనివారం పరిహార నమూనా చట్టాన్ని విడుదల చేసింది. కాగ్ ఆడిట్ లెక్కల అనంతరం మాత్రమే వార్షిక రెవెన్యూ నష్టాన్ని నిర్ణరుుస్తారు. విలాస వస్తువులు, పొగాకు వంటి హాని చేసే ఉత్పత్తులపై ‘జీఎస్టీ పరిహార పన్ను’ రూపంలో రాష్ట్రాలకు పరిహారం కోసం ఈ మొత్తాన్ని వసూలు చేస్తారు. ఐదేళ్ల అనంతరం జీఎస్టీ పరిహార నిధిలో ఏమైనా మొత్తం ఉంటే దానిని కేంద్రం, రాష్ట్రాల మధ్య పంచుతారు. మిగులులో సగాన్ని కేంద్ర పన్ను ఆదాయానికి కలుపుతారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దేశిత నిష్పత్తిలో పంచుతారు. మిగతా 50 %... అంతకుముందు సంవత్సరం ఎస్జీఎస్టీ లెక్కల ప్రకారం రాష్ట్రాలకు పంచుతారు. పరిహారం కింద రాష్ట్రాలకు ఎక్కువ మొత్తం చెల్లించినట్లు గుర్తిస్తే తర్వాతి సంవత్సర పరిహారంలో సర్దుబాటు చేస్తారు. కేంద్రం శనివారం మోడల్ జీఎస్టీ, ఐజీఎస్టీ, పరిహార నమూనా చట్టాల్ని విడుదల చేసింది. అలాగే జీఎస్టీ అమలుతో వస్తువుల ధరలు పెరగకుండా చూసేందుకు పన్ను రేట్లు తగ్గించినప్పుడు వచ్చే లాభాల్ని వినియోగదారులకు వర్తక, వ్యాపార వర్గాలు చెల్లించేలా జీఎస్టీ చట్టంలో కేంద్రం కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది.