సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ చట్టానికి ప్రభుత్వం పదునుపెడుతోంది. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏకంగా పాలకవర్గాలనే రద్దు చేసేలా తెలంగాణ మున్సిపల్ యాక్ట్–2019లో నిబంధనలను పొందుపరుస్తోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడినా, నిధులు పక్కదారి పట్టినా ఇకపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ముసాయిదా పురపాలక చట్టంలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ నెలాఖరులో ఈ చట్టాన్ని శాసనసభలో ప్రవేశపెట్టాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ముసాయిదా ప్రతులను న్యాయశాఖ పరిశీలనకు పంపింది. న్యాయశాఖ సూచనలు, సలహాల అనంతరం ముసాయిదా చట్టం కేబినెట్ ఆమోదానికి వెళ్లనుంది.
సమర్థంగా పనిచేయకపోతే...
పట్టణాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే మున్సిపాలిటీల్లో అవినీతికి ముకుతాడు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే అక్రమాలకు పాల్పడే ప్రజాప్రతినిధులపై కొరడా ఝళిపించాలని, అవినీతికి పాల్పడ్డట్లు తేలితే పాలకవర్గాలను రద్దు చేయాలని నిర్దేశించారు. ఈ మేరకు కొత్త చట్టం రూపకల్పనపై కసరత్తు చేసిన నిపుణుల కమిటీ... సమర్థ పాలన అందించలేకపోయినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా, ఆర్థిక స్థిరత్వానికి ముప్పు వాటిల్లినా సదరు మున్సిపాలిటీని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి కట్టబెడుతూ నూతన చట్టాన్ని రూపొందించింది.
దీంతో పాలకవర్గం రద్దు కాగానే.. చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు (వార్డు సభ్యులు), కో ఆప్షన్ సభ్యుల పదవి కూడా ఊడనుంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను కూడా చట్టసభల్లో ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా ఒకవేళ పాలకవర్గానికి ఆరు నెలల కంటే ఎక్కువ కాలపరిమితి ఉంటే రద్దయిన తేదీ నుంచి ఆరు నెలల్లో నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తారు. పాలకవర్గం స్థానంలో ప్రత్యేక అధికారిని నియమించి పాలన కొనసాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్, ఆర్డీవోలను దూరంగా ఉంచనుంది. పురపాలకశాఖ విచక్షణ మేరకు స్థానిక కమిషనర్ లేదా ఇతర అధికారులను స్పెషల్ ఆఫీసర్‌గా నియమించేలా చట్టంలో పేర్కొంటున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ఆరేళ్లపాటు అనర్హత వేటు...
నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించలేదని తేలితే చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌లను తొలగించే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంది. చట్టంలోని నిబంధనలను పాటించకపోయినా, ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించినా, నిధుల దుర్వినియోగానికి పాల్పడినా చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌లను తొలగించే విధంగా చట్టం ఉండనుంది. అదేవిధంగా ఒకసారి ఉద్వాసనకు గురైన చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌లు ఆ తేదీ నుంచి ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు కానున్నారు.
వార్డుల హేతుబద్ధీకరణ!
సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్న సర్కారు.. వార్డుల ఏర్పాటులో హేతుబద్ధత పాటించాలని నిర్ణయించింది. ప్రస్తుతం 1,500 నుంచి 15 వేల వరకు వార్డులు ఉన్నాయి. అయితే నిర్దేశిత జనాభా ప్రాతిపదికన కాకుండా అడ్డగోలుగా విభజించడంతో అభివృద్ధిలో అసమానతలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త చట్టంలో వార్డుల వర్గీకరణపైనా స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జనాభాకు అనుగుణంగా కౌన్సిలర్ల సంఖ్యను ముసాయిదా చట్టంలో ప్రతిపాదించింది.
Comments
Please login to add a commentAdd a comment