విద్యారణ్యపురి : పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకుంటూనే పౌష్టికాహారం, స్వచ్ఛమైన తాగునీరు ప్రతీ ఒక్కరూ తీసుకోవాల్సిన అవసరముందని కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ విద్యావతి అన్నారు. వీటికి దూరమైతే వైరస్‌లు శరీరంలోకి చేరి వ్యాధులు బారిన పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైక్రో బయాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘మైక్రో బయాలజీ అనాలిసిస్ ద్వారా తాగునీరు, ఆహార పదార్థాల విశ్లేషణ’ అంశంపై మూడు రోజులుగా జరుగుతున్న జాతీయ స్థాయి వర్క్‌షాప్ బుధవారం ముగిసింది. ముగింపు సమావేశంలో విద్యావతి ముఖ్యఅతిథిగా మాట్లాడారు.
సూక్ష్మ జీవశాస్త్రంలోని ముఖ్యభావనలను ఆమె తెలియజేస్తూ తీసుకునే ఆహారం, నీరు కలుషితమైతే వ్యాధులకు కారణమవుతుందన్నారు. అయి తే, అమెరికా వంటి వర్దమాన దేశాల్లో కూడా స్వచ్ఛమైన తాగునీరు అందడం లేదని ఆమె తెలిపారు. కాగా, పట్టణ ప్రాంతాల పిల్లల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లల్లో కలుషిత నీటిని తట్టుకునేలా వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరిశోధకుల కోసం ఎన్నో సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయ ని, ఇందులో కేవలం ఇంటర్నెట్‌నే నమ్మడం వలన మౌలిక అంశాలపై పట్టు రావడం లేదని తెలిపారు. ఈ మేరకు పుస్తక పఠనాన్ని మించిన అధ్యయన పద్ధతి లేదని విద్యావతి దిశానిర్దేశం చేశారు.
అపరిశుభ్రతతోనే వ్యాధులు
వర్క్‌షాప్‌కు హాజరైన వరంగల్ రేంజి డీఐజీ డాక్టర్ ఎం.కాంతారావు మాట్లాడుతూ సూక్ష్మజీవంలోని తాగునీరు, ఆహార పదార్థాల విశ్లేషణలో మౌలికాంశాలను వివరించారు. మన దేశంతో పాటు ఆఫ్రికా దేశాలు వివిధ వ్యాధులకు ఆశ్రయంగా మారుతున్నాయని.. వీటన్నింటికీ ప్రధాన కారణం అపరిశుభ్రతేనని పేర్కొన్నారు. కేయూ మైక్రో బయాలజీ విభాగం అధిపతి డాక్టర్ ముంజం శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ వర్క్‌షాప్ ద్వారా కేడీసీలోని మైక్రో బయాలజీ విభాగం సమాజానికి కావాల్సిన కనీస విజ్ఞానాన్ని చేరవేయడంలో విజయవంతమైందని తెలిపారు.
ఇంకా కేడీసీ ప్రిన్సిపాల్ ఆర్.మార్తమ్మ, వర్క్‌షాప్ ఆర్గనైజింగ్ కన్వీనర్ డాక్టర్ కె.సదాశివరెడ్డి, డాక్టర్ సోమిరెడ్డి, డాక్టర్ ఎన్‌వీఎన్.చారి, డాక్టర్ జీవనచంద్ర, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ లక్ష్మీసత్యవతి, డాక్టర్ జాన్‌వెస్లీ, ఆర్.విజయ్‌భాస్కర్, డాక్టర్ వి.ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. సదస్సు చివరలో ప్రొఫెసర్ విద్యావతిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.
పౌష్టికాహారం, రక్షిత తాగునీరే కీలకం
Published Thu, Aug 14 2014 4:25 AM | Last Updated on Sat, Sep 2 2017 11:50 AM
Advertisement