60 ఏళ్ల శోభనా కామినేని 600 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేశారు. హైదరాబాద్ నుంచి చెన్నై వరకు తన భర్త, కుమార్తెతో కలిసి సైకిల్ మీద ప్రయాణించారు. స్త్రీలు ఏ వయసులోనైనా ఏదైనా సాధించగలరు... ఆరోగ్యాన్ని కాపాడుకుంటే విజయాన్ని అందుకోగలరు అనే సందేశం ఇవ్వడానికే ఈ యాత్ర చేశానని శోభన అన్నారు. శోభనా కామినేని నటుడు చిరంజీవికి వియ్యపురాలు. ఉపాసన తల్లి. రోజుకు వంద కిలోమీటర్ల చొప్పున సైకిల్ తొక్కుతూ ఆరు రోజుల్లో పూర్తయిన ఈ స్ఫూర్తివంతమైన యాత్రా విశేషాలు...
జీవితాన్ని ఎప్పటికప్పుడు కొత్తగా ప్రారంభించాలి. ఉత్సాహపరుచుకోవాలి. ఉరకలెత్తించాలి. జీవితాన్ని ప్రతి క్షణం పరిపూర్ణంగా అనుభవించాలి. మన దేశంలో ఒకటి రెండు దశాబ్దాల కింద వరకూ 60 ఏళ్లు అనేది చాలా పెద్ద వయసుగా భావన ఉండేది. 60 రాగానే వయసైపోయింది కదా అనే మాట వినిపించేది. కాని ఇప్పుడు 60 అనేది దాదాపుగా ఒక మధ్యవయసు అనే పునరుత్సాహం చాలామందిలో కనిపిస్తోంది. ముఖ్యంగా స్త్రీలు 60 అనే అంకెను ఒక భారంగా ఎంచి తద్వారా శారీరకంగా మానసికంగా అలసటను దరి చేరనివ్వరాదని, నిర్లిప్తతను కలిగి ఉండరాదని స్ఫూర్తి నింపేవారు చాలామంది ఉన్నారు. అలాంటివారిలో అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్‌పర్సన్ శోభనా కామినేని ఒకరు.
ఛాలెంజ్‌ను స్వీకరించు...
ఆరోగ్యరంగ దిగ్గజం ప్రతాప్ రెడ్డి కుమార్తె శోభనా కామినేని అపోలో హాస్పిటల్స్ విజయానికి కారణకర్తగా మాత్రమే కాక నటుడు చిరంజీవికి వియ్యపురాలుగా కూడా అందరికీ తెలుసు. ఉపాసన తల్లిగా రామ్ చరణ్ అత్తగారిగా అమె తరచూ వార్తల్లో ఉంటారు. ఇటీవల ఆమె తన 60వ పుట్టినరోజును భిన్నంగా... సందేశాత్మకంగా చేసుకోదలిచారు. ‘ఛాలెంజ్‌ను స్వీకరించు.. నెరవేర్చు’ నినాదం తో ఆమె హైదరాబాద్ నుంచి చెన్నై వరకూ ఏకంగా 642 కిలోమీటర్ల సైకిల్ యాత్ర పెట్టుకున్నారు. 60 ఏళ్ల వయసులో చాలా ఎనర్జీని డిమాండ్ చేసే ఈ పనిని చేసి చూపించాలనుకున్నారు. ఇంకేముంది.. రంగంలో దిగారు.
భర్త, కుమార్తెతో కలిసి...
శోభనా కామినేని సైకిల్ యాత్ర సంకల్పాన్ని విని ఆమె భర్త అనిల్ కామినేని, కుమార్తె అనుష్పలా కామినేని తాము కూడా పాల్గొంటాం అని ఉత్సాహ పడ్డారు. ముగ్గురు హైదరాబాద్ మసాబ్ ట్యాంక్ నుంచి యాత్రను మొదలుపెట్టారు. ‘దారిలో చాలామంది నన్ను ఈ యాత్ర ఎందుకు చేస్తున్నారని అడిగారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఏ పనైనా చేయొచ్చని వయసును కేవలం ఒక అంకెగా మాత్రమే చూడాలని చెప్పడానికే చేశాను అని జవాబిచ్చాను.’ అని చెప్పారు శోభనా కామినేని. ఆమె సైకిల్ యాత్ర 6 రోజుల పాటు సాగింది. రోజుకు వంద కిలోమీటర్ల లెక్కన సైకిల్ తొక్కారు. ఇది చిన్న విషయం కాదు. ‘తెల్లవారుజామున మూడున్నరకంతా నిద్ర లేవడం కొంచెం కష్టమనిపించినా లేచి ప్రయాణం కట్టాను. ఒకటి రెండుసార్లు డీహైడ్రేషన్‌గా అనిపించింది. తగిన ఆహారం తీసుకుంటూ యాత్ర సాగించాను. దారిలో పంట పొలాలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించాయి. మా తాతగారు రైతు. మా నాన్నను మెడిసిన్ చదివించారు. ఆ జ్ఞాపకాలు చుట్టుముట్టాయి’ అన్నారామె.
మాత్రోత్సాహం
కూతురు ఏదైనా మంచి పని చేస్తే పుత్రికోత్సాహం అనొచ్చు. తల్లి ఏదైనా మంచి పని చేస్తే ఆ కూతురికి కలిగేది మాత్రోత్సాహం అనాలేమో. తన తల్లి శోభన చేసిన యాత్రను చూసి కుమార్తె ఉపాసన చాలా సంతోష పడ్డారు. ‘మా అమ్మను చూసి నేనెప్పుడూ గర్వపడుతుంటాను’ అని ట్వీట్ చేశారామె. తల్లి తన తాతను కలవడానికి చేసిన ప్రయాణంగా, పిల్లలకు ఒక తార్కాణంగా నిలవడానికి చేసిన ప్రయత్నంగా కూడా ఉపాసన ఈ సైకిల్ యాత్రను చూశారు. కొత్త సంవత్సరం ఇలాంటి ఉత్సాహకరమైన పనులను వినడం బాగుంది కదూ.
– సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment