‘వయసు అనేది అంకె మాత్రమే’ అనడం చాలా తేలిక. వయసును సవాలు చేయడం మాత్రం కష్టం! ఆ కష్టాన్ని ఇష్టంగా చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తుంది పుష్ప భట్. 66 సంవత్సరాల వయసులో వరల్డ్స్ హైయెస్ట్ ఆల్ట్రామారథాన్‌లో పాల్గొనబోతుంది...
మరో రెండురోజుల్లో ‘వరల్డ్స్ హైయెస్ట్ ఆల్ట్రా మారథాన్ ఖార్‌దుంగ్ లా ఛాలెంజి’లో పాల్గొనబోతోంది 66 సంవత్సరాల పుష్పభట్. ముంబైకి చెందిన పుష్ప 63 సంవత్సరాల వయసులో తొలిసారిగా ఈ సాహసోపేత మారథాన్‌లో పాల్గొంది. ‘ఇలాంటి మారథాన్‌లో పాల్గొనడానికి ఉత్సాహం మాత్రమే సరిపోదు. సంకల్పబలం కూడా ఉండాలి’ అంటుంది పుష్ప.
తాను పన్నెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. చదువు కొనసాగించడానికి పదిహేడేళ్ల వయసు నుంచి చిన్నాచితకా పనులు చేస్తుండేది. ‘బీఏ పూర్తి చేయగలనా?’ అనుకుంది. చేయడమే కాదు ఆ తరువాత ఎంబీయే కూడా చేసింది.
ఒక కంపెనీలో సెక్రెటరీగా చేరింది. కొన్ని సంవత్సరాల తరువాత ఒక షిప్పింగ్ కంపెనీలో ఎక్కువ జీతంతో చేరింది. ఆ తరువాత... ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనే కోరికతో యాభై ఏళ్ల వయసులో ఉద్యోగానికి రాజీనామా చేసింది.
ఉద్యోగం చేస్తున్న రోజుల్లో...
స్టాండర్డ్ చార్టెడ్ ముంబై మారథాన్‌లో పాల్గొనడానికి సహా ఉద్యోగులు ఉత్సాహం చూపుతున్న సమయంలో తాను కూడా చూపింది. ‘ఒక ప్రయత్నం చేసి చూద్దాం’ అనుకుంటూ నలభైఏడు సంవత్సరాల వయసులో తొలిసారిగా మారథాన్‌లో పాల్గొంది.
‘మనవల్ల ఎక్కడవుతుంది. మహా అంటే పదిహేను నిమిషాలసేపు పరుగెత్తగలనేమో’ అనుకుంది. కష్టం అనిపించినా సరే, పట్టుదలగా పరుగెత్తి మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఆ సమయంలోనే పరుగెత్తడంలో ఉన్న కష్టం ఏమిటో పుష్పభట్‌కు తెలిసింది. అయితే ‘మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేయగలిగాను’ అనే ఉత్సాహం ఆ కష్టాన్ని వెనక్కి నెట్టేసింది.
ఇక అప్పటి నుంచి ఎనిమిది ఆల్ట్రా మారథాన్స్, పదకొండు ఫుల్ మారథాన్‌లలో పాల్గొంది. న్యూయార్క్ మారథాన్‌లో పాల్గొనడం తనకు మరచిపోలేని అనుభవం. బ్రిడ్జీలు, జనసమూహాలను దాటుకుంటూ 4 గంటల 58 నిమిషాలు పరుగెత్తింది.
ప్రయాణాలు చేయడం, ప్రయాణంలో స్ఫూర్తిదాయకమై పుస్తకాలు చదవడం, తన భావాలను కవిత్వంగా రాయడం పుష్పకు ఇష్టం. ఒకానొక సంవత్సరం ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి లడఖ్‌లోని ఖార్‌దుంగ్ లా పాస్‌కు వెళ్లింది. అప్పుడే ‘ఖార్‌దుంగ్ లా ఛాలెంజ్’పై ఆసక్తి కలిగింది. ‘ఇక్కడ శ్వాసించడానికే ఇబ్బందిగా ఉంది. అలాంటిది ఈ రఫ్ అండ్ టఫ్ మార్గంలో పరుగెత్తగలనా’ అనుకుంది. శిక్షణ తీసుకున్న తరువాత బరిలోకి దిగింది. మసక మసకగా కనిపించేదారి, జారుతున్న కాళ్లు... చాలా కష్టపడాల్సి వచ్చింది.
తాను గతంలో పాల్గొన్న మారథాన్‌లకు, సముద్ర మట్టానికి 17,852 అడుగుల ఎత్తున ఉన్న ప్రదేశంలో జరిగే మారథాన్‌కు మధ్య ఉన్న భారీ తేడాను గమనించింది. అమెరికన్ కాలేజి ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ కోర్స్ పూర్తి చేసి 65 సంవత్సరాల వయసులో ‘క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్’ అనిపించుకుంది. మరింత ఉత్సాహంతో రెండోసారి ‘ఆల్ట్రా మారథాన్ ఖార్‌దుంగ్ లా ఛాలెంజ్’లో పాల్గొనబోతుంది. పుష్పభట్ మరోసారి అద్భుత విజయాన్ని సాధించాలని కోరుకుందాం.
సుఖంగా అనిపించే పనుల్లో కంటే, కష్టంగా అనిపించే పనుల ద్వారానే మనకు క్రమశిక్షణ అలవడుతుంది. క్రమశిక్షణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యం ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తుంది. – పుష్ప భట్
Comments
Please login to add a commentAdd a comment