ఎవరీ అజయ్‌సింగ్?
ఢిల్లీ ఐఐటీలో చదువుకున్న అజయ్‌సింగ్... స్పైస్ జెన్ తొలి ప్రమోటర్లలో ఒకరు. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌కు డెరైక్టర్‌గా వ్యవహరించిన అజయ్... బీజేపీకి చాలా సన్నిహితుడు. బీజేపీ దివంగత నేత ప్రమోద్ మహాజన్‌కు సలహాదారుగా పనిచేయటంతో పాటు 2014 సార్వత్రిక ఎన్నికల్లో ‘అబ్‌కీ బార్- మోదీ సర్కార్’ అనే నినాదం రూపకర్త కూడా అజయేనని చెబుతారు. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో చదివిన అజయ్.. 2005లో లండన్‌కి చెందిన కన్సాగ్రా కుటుంబంతో కలిసి మోదీలుఫ్త్‌ను 2005లో పునరుద్ధరించి, స్పైస్‌జెట్‌గా మార్చారు. అమెరికన్ ఇన్వెస్టరు విల్బర్ రాస్‌తో 80 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయించటంతో పాటు, 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ సమయంలోనూ స్పైస్‌జెట్‌లోకి పెట్టుబడులు తేగలిగారు.
బాలీవుడ్ సినిమాలంటే తెగ ఇష్టపడే సింగ్.. అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతారు. ‘‘ఆయన స్పైస్‌ను వదిలే సమయానికి సంస్థకు 800 కోట్ల నగదు నిల్వలున్నాయి. ఇపుడు అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గటం వల్ల లాభాలు కూడా పెరగాల్సి ఉన్నా స్పైస్ నష్టాల పాలవుతోంది. అందుకే బొంబార్డియర్ విమానాలను తొలగించి, బోయింగ్-737లకు మాత్రమే పరిమితమవ్వాలన్నది ఆయన ఆలోచన. లాభదాయక రూట్లలో తక్కువ సిబ్బందితో నడిపించి వచ్చే ఏడాదికల్లా సంస్థను లాభాల బాటలోకి తీసుకురావటానికి ఆయన ప్రణాళికలు వేస్తున్నారు’’ అని ఆయన సన్నిహిత వర్గాలు తెలియజేశాయి. తాజా డీల్ నేపథ్యంలో బీఎస్‌ఈలో స్పైస్‌జెట్ షేరు ధర 10 శాతం పెరిగి రూ.20.50(అప్పర్ సర్క్యూట్) వద్ద క్లోజయింది.