మంజుల ఎలా చనిపోయింది?
న్యూఢిల్లీ: పీహెచ్‌డీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి ఢిల్లీ ఐఐటీ క్యాంపస్‌లో కలకలం రేపింది. జల వనరులపై పీహెచ్‌డీ చేస్తోన్న మంజులా దేవక్(27) అనే విద్యార్థిని తన గదిలో మంగళవారం రాత్రి కన్నుమూసింది.
మంజులా.. క్యాంపస్‌లోని నలంద అపార్ట్‌మెంట్‌లోని గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లు పోలీసు అధికారులు చెప్పారు. అయితే ఇది ఆత్మహత్యా, హత్యా అన్న విషయం ఇప్పుడే చెప్పలేమన్నారు.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన మంజులకు కొన్నేళ్లకిందటే రితేశ్ విర్హా అనే వ్యక్తితో వివాహం అయింది. గదిలో సూసైడ్‌నోట్ లాంటివేవీ లభించకపోవడంతో దీనిని అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదుచేశారు. విద్యార్థిని మరణవార్తను ఆమె భర్త, తల్లిదండ్రులకు చేరవేశామని పోలీసులు చెప్పారు. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.