కంపెనీ పెట్టి.. 25వేల కోట్లకు అమ్మేశాడు!
అతడు ఢిల్లీ ఐఐటీలో చదివాడు. తర్వాత అమెరికాలో యాప్ డైనమిక్స్ అనే సాఫ్ఘ్వేర్ కంపెనీ పెట్టాడు. దాని పనితీరు బాగుందని సిస్కో కంపెనీ దానిమీద కన్నేసింది. మంచి డీల్ ఆఫర్ చేసింది. ఇంకేముంది, బ్రహ్మాండంగా తన కంపెనీని అమ్మేశాడా యువకుడు. అతడిపేరు జ్యోతి బన్సల్. యాప్ డైనమిక్స్ వ్యవస్థాకుడు, చైర్మన్. అతడి కంపెనీని కొనేందుకు సిస్కో సిస్టమ్స్ ఆఫర్ చేసిన ధర.. అక్షరాలా రూ. 25 వేల కోట్లు!! ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద మొత్తంలో డీల్ జరిగిన దాఖలాలు లేవు. ఇన్నాళ్లూ కేవలం టెక్నాలజీ డెవలప్మెంట్కు మాత్రమే పరిమితమవుతూ వచ్చిన సిస్కో లాంటి కంపెనీలు ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ వైపు కూడా విస్తరిస్తున్నాయి. ఇంతకుముందు సరిగ్గా వారం క్రితం హ్యూలెట్ పాకార్డ్ (హెచ్పీ) కంపెనీ కూడా సింప్లివిటీ అనే మరో సాఫ్ట్వేర్ కంపెనీని రూ. 4418 కోట్లకు కొనుగోలు చేసింది.
విదేశాల్లో ఉన్న డబ్బును తెప్పించుకునేలా అమెరికన్ కంపెనీలను ప్రోత్సహించాలన్న ట్రంప్ ఆలోచనలకు అనుగుణంగానే ఈ కంపెనీలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే సిస్కో లాంటి పెద్దస్థాయి టెక్నాలజీ కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాయి. తమ కంపెనీ దీర్ఘకాలిక వ్యూహాల కోసం ఈ టేకోవర్ బాగా ఉపయోగపడుతుందని సిస్కో కార్పొరేట్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ రాబ్ సాల్వాంగో చెప్పారు.
యాప్ డైనమిక్స్ సంస్థ అప్లికేషన్లను మేనేజ్ చేయడంతో పాటు వాటిని విశ్లేషిస్తుంది. దానికి 2వేల మందికి పైగా కస్టమర్లున్నారు. నాస్డాక్, నైక్, ఇప్పటివరకు సిస్కో కూడా ఈ కంపెనీ కస్టమర్లే. వాస్తవానికి ఎప్పటినుంచో యాప్ డైనమిక్స్ సంస్థ ఐపీఓకు వెళ్లాలని చూస్తోంది. సరిగ్గా ఇలాంటి తరుణంలోనే సిస్కో రంగంలోకి దిగింది. దాంతో ఒక్కసారిగా కంపెనీ ప్రాధాన్యాలు మారిపోయాయి. వాస్తవానికి యాప్ డైనమిక్స్ సంస‍్థకు 2015 నవంబర్ నెలలో వాల్యుయేషన్ చేయిస్తే, దాని విలువ సుమారు 12915 కోట్ల రూపాయలని తేలింది. కానీ, దాదాపు దానికి రెట్టింపు ధరను సిస్కో ఆఫర్ చేయడంతో ఇక కాదనలేకపోయారు.