మనసంతా సినిమానే...
- వెండితెరపై వెలగాలని యువ ఇంజినీర్ ప్రయత్నం
- ఉద్యోగం వద్దని.. నటన వైపు పయనం
భరత్‌రాజ్. చదివింది ఇంజినీరింగ్. నటనంటే ప్రాణం. చదువు పూర్తయ్యాక ఓ ప్రముఖ సంస్థలో మంచి ఉద్యోగం వచ్చినా.. వదులుకుని తనలోని ప్రతిభకు పదునుపెట్టారు. పలు లఘుచిత్రాల్లో నటించి అవార్డులు సొంతం చేసుకున్నారు. బుల్లితెరలో ప్రధాన పాత్ర పోషిస్తూ.. వెండితెరపై చిన్న వేషాలు వేస్తున్నారు. తన నటనతో అందర్నీ ఆకట్టుకోవాలని కృషి చేస్తున్నారు.
పక్కా హైదరాబాదీ భరత్‌రాజ్. బంజారాహిల్స్‌లో నివాసం. అతనికి చిన్నప్పటి నుంచి నటనంటే ఆసక్తి. స్కూల్, కాలేజీ రోజుల్లో అనేక నాటకాలు వేశారు. తన నటనతో పలువురి మన్ననలు అందుకున్నారు. ఇంజినీరింగ్ పూర్తయ్యాక ఢిల్లీలో ఐఏయస్ కోచింగ్‌కు వెళ్లారు. అయినా మనసంతా సినిమానే. హైదరాబాద్ కి తిరిగి వచ్చారు. ఓ ఉన్నత సంస్థలో ఉద్యోగం వచ్చినా వద్దని నటనపై ఆసక్తితో సినీ రంగం వైపు అడుగులు వేశారు.
దర్శకత్వంలో ఓనమాలు..
భరత్ ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడే అలనాటి మేటి డెరైక్టర్ పీసీ.రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో మూడు సంవత్సరాలు శిక్షణ పొందారు. క్రమశిక్షణ, సృజనాత్మకత, దర్శకత్వ మెలకువలు అలవరుచుకున్నారు. అప్పుడే పీసీ.రెడ్డి భరత్‌లోని ప్రతిభను గుర్తించి నటనవైపు వెళ్లాల్సిందిగా ప్రోత్సహించారు. అలా హాస్టల్ డేస్, దిల్ దివానాలతో పాటు పలు చిత్రాల్లో చిన్న వేషాలు వేశారు. ఆ తర్వాత కిల్లింగ్ చాందిని, ఫైనల్ ఎగ్జిస్ట్, ఎ పోస్ట్‌కార్డ్ టు గాడ్ అనే లఘు చిత్రాల నిర్మాణంలో పాల్పంచుకున్నారు. కిల్లింగ్ చాందిని అనే లఘు చిత్రంలో నటనకుగాను 48 అవర్ ఫిల్మ్ ప్రాజెక్ట్ ద్వారా ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. తర్వాత ఆర్కా మీడియా ‘మేఘమాల’ అనే సీరియల్‌లో ప్రధాన పాత్ర పోషించారు. ప్రస్తుతం బాహుబలి చిత్రంలో ఒక చిన్న పాత్రలో భరత్‌రాజ్ నటిస్తున్నారు.
కళాకారులకు తోడ్పాటు..
తనలాంటి సినీ కళాకారులకు తగిన గుర్తింపు అందించేందుకు భరత్ రాజ్ సహాయ సహకారాలు అందిస్తుంటారు. సినిమా, నటన , దర్శకత్వం మీద తపన ఉన్న వారికి తన వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తోడ్పడుతుంటారు. వారితో చిన్న చిత్రాలు తీయించి యూ ట్యూబ్‌లో ఉంచి.. తగిన గుర్తింపు లభించేలా చేస్తుంటారు. బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో లఘు చిత్ర పోటీలను నిర్వహించి.. న్యాయనిర్ణేతలు ఎంపిక చేసిన ఉత్తమ చిత్రానికి నగదు పురస్కారం భరత్ అందిస్తున్నారు. సినీ రంగంలో ఓ మంచి నటుడిగా గుర్తింపు కోసం కష్టపడతానిని చెబుతున్న భరత్ ఆశ నెరవేరాలని ఆశిద్దాం.