సాక్షి, సిటీబ్యూరో : దశాబ్దాల కల సాకారమైంది. అనేక పోరాటాలు, వందల మంది త్యాగాలు ఫలించాయి. ఆదివారం అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకు నగరమంతా ‘జై తెలంగాణ’ నినాదాలు, బాణసంచా మోతలతో మార్మోగింది. తారాజువ్వలు చీకట్లను చీల్చుకుని ఆకాశంలో కనువిందు చేశాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబురాలు నగరంలో అంబరాన్నంటాయి.
ట్యాంక్‌బండ్, నెక్లస్‌రోడ్, గన్‌పార్క్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, క్లాక్‌టవర్‌లు జనంతో కిక్కిరిసి పోయాయి. ట్యాంక్‌బండ్ సహా మొత్తం 120 కేంద్రాల్లో కళాకారులు తమ ఆటాపాటలతో ధూం..ధాం చేశారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ కార్యాలయాల్లో నాయకులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు.
సికింద్రాబాద్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, మల్కాజిగిరి, ఉప్పల్, అంబర్‌పేట్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేర్‌లింగంపల్లి, పంజగుట్ట, బేగంపేట్ తదితర కూడళ్లన్నీ తెలంగాణ వాదులతో కిక్కిరిసి పోయాయి. బస్తీలు, కాలనీల్లో యువకులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. కేకులు కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు.
అంబరమంటిన సంబురాలు
ట్యాంక్‌బండ్‌పై రసమయి బాలకిషన్, నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ప్లాజాలో గాయకుడు సాయిచంద్, గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ప్రొఫెసర్ కోదండరామ్, గాయకుడు గద్దర్, విమలక్క, అంద్శైఅమరులకు నివాళులర్పించి, ఆ తర్వాత తమ ఆటా పాటలతో ధూం..ధాం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో తెలంగాణ సంబురాలు నిర్వహించారు. అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి దానం, వీహెచ్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం గాంధీభవన్ నుంచి గన్‌పార్క్ వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించారు.
టీఆర్‌ఎస్ కార్యాలయంలో నాయిని నర్సింహారెడ్డి సహా పలువురు నేతలు వేడుకలు నిర్వహించారు. పెద్దెత్తున బాణసంచా కాల్చారు. ‘జై తెలంగాణ, జై కేసీఆర్’.. నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు.
తెలంగాణ ఉద్యమకారులు గన్‌పార్కు వద్ద ఆటాపాట నిర్వహించారు. కళాకారులు ధూంధాం నిర్వహించి సంబరాలు జరిపారు. గన్‌పార్కు వద్ద హాజరైన వారిలో తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అమర వీరులకు నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. టీఎన్జీవో అధ్యక్షులు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు విఠల్, స్వామిగౌడ్, తెలంగాణ అడ్వకేట్ జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, టీఆర్‌ఎల్‌డీ నాయకులు చెరుకూరి శేషగిరిరావు, ప్రధాన కార్యదర్శి ఎంఎస్ రావు, రాపోలు జ్ఞానేశ్వర్, హెచ్‌ఎం టీవీ సీఈఓ రాంచంద్రమూర్తి, ఎమ్మార్పీఎస్ (దండోరా) రాష్ట్ర అధ్యక్షులు వై. భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టపాకాయలు, బాణసంచాలు పేల్చి కార్యకర్తలు సంబరాలు జరిపారు. డీసీపీ కమలాసన్ రెడ్డి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
చిన్నపెద్దా తేడా లేకుండా కుటుంబ సమేతంగా వేలాదిమంది తెలంగాణ వాదులు ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం, ట్యాంక్‌బండ్, జీహెచ్‌ఎంసీ ఆఫీసు, నెక్లెస్‌రోడ్డు, సంజీవయ్య పార్కు, లోయర్ ట్యాంక్‌బండ్, ఇందిరాపార్కు పరిసరాలు తెలంగాణ వాదులతో కిక్కిరిపోయాయి. సరిగ్గా 12 గంటల తర్వాత ఈలలు, చప్పట్లు, కేరింతలు, జై తెలంగాణ నినాదాలు, భారీ బాణసంచాతో నవ తెలంగాణకు స్వాగతం పలికారు. కేక్‌లు కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు.
రాంనగర్ చౌరస్తాలో ముషీరాబాద్ జేఏసీ ఆధ్వర్యంలో ధూంధాం జరిగింది. ముషీరాబాద్ ఎమ్మెల్యే కె.లక్ష్మణ్, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, టీఆర్‌ఎస్ నాయకుడు నాయిని నర్సింహారెడ్డి, ముఠాగోపాల్, గ్రేటర్ జేఏసీ చైర్మన్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకులు, విద్యార్థులంతా ఆర్ట్స్ కాలేజీ వద్దకు చేరుకున్నారు. కాలేజీపై తెలంగాణ జెండా ఎగరేశారు. బాణసంచా కాల్చారు. కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకున్నారు. శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఇటు ఎన్‌సీసీ నుంచి అటు తార్నాక, మాణికేశ్వరి నగర్, ఇఫ్లూ వర్సిటీ తదితర ప్రాంతాల మీదుగా బైక్‌ర్యాలీలు నిర్వహించారు.
టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఐజేయూ నాయకులు శ్రీనివాసరెడ్డి, దేవులపల్లి అమర్, సోమసుందర్, నరేందర్, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాణసంచా కాల్చి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
నవోత్సాహం
Published Mon, Jun 2 2014 2:03 AM | Last Updated on Mon, Aug 20 2018 4:42 PM
Advertisement