ganpark
-
కలల బండి..దూరమండీ!
మెట్రో పాజ్రెక్టుపై నీలినీడలు సమావేశాలతో సరిపెడుతున్న పెద్దలు అలైన్మెంట్ మార్పుపై స్పష్టతనివ్వని సర్కార్ కష్టమంటున్ననిర్మాణ సంస్థ సర్కార్‌కు మళ్లీ లేఖ ! గ్రేటర్ వాసుల కలల బండి మెట్రో రైలు పరుగుకు బ్రేకులు పడనున్నాయి.. అట్టహాసంగా ప్రారంభించిన మెట్రో ప్రాజెక్టు పనులు ముందుకు సాగడంలేదు. 2017 నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వ పెద్దలు, హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ అధికారులు చేస్తున్న ప్రకటనలకు భిన్నంగా ఉన్నాయి వాస్తవ పరిస్థితులు. ప్రభుత్వ పెద్దలు సమావేశాలతో సరిపెడుతుండడంతో ప్రాజెక్టు పనులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ప్రాజెక్టు పురోగతి సైతం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. పరిస్థితి ఇలా ఉంటే కష్టమని, ప్రాజెక్టు నిర్మాణంపై పునరాలోచన చేయక తప్పదని నిర్మాణ సంస్థ హెచ్చరిస్తోంది. సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైల్ నిర్మాణపనులు ముందుకు సాగడంలేదు. పనుల్లో ఎదురవుతున్న అడ్డంకులన తక్షణమే తొలగిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, సర్కాన్ పెద్దలు హామీ ఇచ్చారు. ఇటీవల కేంద్ర క్యాబినెట్ అదనపుకార్యదర్శి సమక్షంలో జరిగిన సమావేశంలో వారు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలుకునోచుకోలేదు. ముఖ్యంగా అసెంబ్లీ, గన్‌పార్క్ ప్రాంతాల్లో మెట్రో అలైన్మెంట్ మార్పుపై రెండు నెలలుగా నెలకొన్న సందిగ్ధ త ఇంకా తొలగలేదు. నిర్మాణసంస్థ ఎల్అండ్టీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. ఇక నాగోల్-శిల్పారామం, ఎల్బీనగర్-మియాపూర్, జేబీ ఎస్-ఫలక్‌నుమా రూట్లలో సుమారు 1700 ఆస్తుల సేకరణ ప్రక్రియకు నేటికీ నోటిఫికేషన్ విడుదల కాలేదు. ఈ అంశంలో అధికారుల హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో మెట్రో పనులు జరిగేందుకు ప్రధాన రహదారులపై రైట్‌ఆఫ్‌వే(రోడ్డు మధ్యలో 8 మీటర్లు) లభ్యంకావడంలేదని నిర్మాణసంస్థ ప్రతినిధులు వాపోతున్నారు. నాంపల్లి రైల్వేస్టేషన్, బేగంపేట్ గ్రీన్‌ల్యాండ్స్, సికింద్రాబాద్ ఇస్కాన్ దేవాలయం, పంజాగుట్ట, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో ఆస్తులను కోల్పోయే బాధితులకు పరిహారం చెల్లించి ఆయా ఆస్తులను తొలగిస్తేనే పనులు ముందుకు సాగుతాయని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీస్పష్టం చేస్తోంది. ఆదిశగా కూడా ఎలాంటి ముందడుగు పడకపోవడం గమనార్హం. ఇక ప్రాజెక్టులో భాగంగా ఎర్రమంజిల్, హైటెక్‌సిటీ, రాయదుర్గం, అమీర్‌పేట్ ప్రాంతాల్లో నిర్మాణసంస్థ నిర్మించాలనుకున్న భారీ మెట్రో షాపింగ్ మాల్స్‌కూ జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన నిర్మాణ పరమైన అనుమతులూ ఆలస్యమౌతున్నాయి. ఈ విషయంలో తాజాగా మరోమారు సమావేశం కావాలని జీహెచ్ఎంసీ అధికారులు తాజాగా మెలికపెట్టడంతో పరిస్థితి మొదటికొచ్చింది. ఈ పరిస్థితితో ఏంచేయాలో తెలియక ఎల్అండ్టీ అధికారులు తలలుపట్టుకుంటున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు పనుల కోసం రూ.5 వేల కోట్లకు పైగా పలు జాతీయ బ్యాంకుల నుంచి రుణం సేకరించిన తమ సంస్థ సకాలంలో పనులు పూర్తిచేయని పక్షంలో వడ్డీల భారంతో కుదేలవడం తథ్యమని ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. అలైన్మెంట్ మార్పుపైనా వీడని సస్పెన్స్.. అసెంబ్లీ, గన్‌పార్క్ ప్రాంతాల్లో మెట్రో అలైన్మెంట్ మార్పుపైనా నిర్మాణ సంస్థకు సర్కారు నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదు. ఇక పాతనగరంలో మెట్రో అలైన్మెంట్ మార్చాలని ఎంఐఎం పార్టీ పట్టుబడుతున్న నేపథ్యంలో ఈ విషయంలోనూ సర్కార్ తీసుకునే నిర్ణయం సస్పెన్స్‌గా మారింది. మరో లేఖకు సన్నద్ధం..? పరిస్థితులు రోజురోజుకూ ప్రతికూలంగా మారుతుండడంతో వాస్తవ పరిస్థితులపై నిర్మాణసంస్థ ఎల్అండ్టీ రాష్ట్రసర్కారుకు మరోసారి లేఖ రాసేందుకు సన్నద్ధమౌతున్నట్లు సమాచారం. డిసెంబరులోగా పరిస్థితులు చక్కదిద్దని పక్షంలో పనులు ముందుకు సాగవని, మొత్తం ప్రాజెక్టు నిర్మాణంపై తాము పునరాలోచన చేసుకోక తప్పదని ఈ లేఖలో స్పష్టం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇంకా సమయం పడుతుంది అలైన్మెంట్ మార్పుపై తుదినిర్ణయం తీసుకున్నట్లుగా రాష్ట్ర సర్కారు నుంచి ఇప్పటివరకు ఎలాంటి లేఖ ‘ఎల్టీహెచ్ఎంఆర్ఎల్’ సంస్థకు అందలేదు. ఈ అంశంపై స్పష్టత వచ్చేందుకు మరికొంత సమయం పడుతుంది. - ఎన్వీఎస్రెడ్డి, మేనేజింగ్ డెరైక్టర్, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు -
మెట్రో రైలు రూటు మారింది
రెండు చోట్ల స్వల్ప మార్పులు కొత్త మార్గం అసెంబ్లీ వెనుక నుంచి భూగర్భ మెట్రో లేనట్టే సీఎం తాజా ప్రకటనతో చారిత్రక కట్టడాలు సేఫ్ హర్షం వ్యక్తం చేస్తున్న సుల్తాన్‌బజార్ వ్యాపారులు సాక్షి, సిటీబ్యూరో: చారిత్రక సుల్తాన్‌బజార్, అసెంబ్లీ, గన్‌పార్క్ ప్రాంతాల్లో మెట్రో మార్గం (అలైన్మెంట్) మారుతుందని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రకటించడంతో మెట్రో మార్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జేబీఎస్-ఫలక్‌నుమా (కారిడార్-2) రూట్లో వచ్చే సుల్తాన్‌బజార్ మార్కెట్ మీదుగా కాకుండా.. దాని మీపంలోని కోఠి ఉమెన్స్ కళాశాల వెనకవైపు నుంచి బడిచౌడి, తిలక్‌పార్క్, వీరసావర్కార్ విగ్రహం, నారాయణగూడా ఫ్లైఓవర్ మీదుగా మెట్రో మార్గాన్ని మళ్లించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఎల్బీనగర్-మియాపూర్(కారిడార్-1) రూట్లో అసెంబ్లీ ప్రధాన రహదారి నుంచి కాకుండా నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం, పబ్లిక్‌గార్డెన్, అసెంబ్లీ వెనుక నుంచి లక్డీకాపూల్ వరకు మెట్రో మార్గాన్ని మళ్లించే అవకాశాలున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మొత్తం రెండు చోట్ల సుమారు వంద మీటర్ల మార్గంలో అలైన్‌మెంట్‌ను మార్చాల్సి ఉందని హెచ్ఎంఆర్ అధికారులు అంచనా వేస్తున్నారు. రెండు చోట్ల అలైన్మెంట్ మార్చిన పక్షంలో సుల్తాన్‌బజార్, అసెంబ్లీ, గన్‌పార్క్ అమరవీరుల స్తూపాలకు ఎలాంటి నష్టం జరగదని అధికారులు భావిస్తున్నారు. నగరంలో మూడు కారిడార్ల పరిధిలో సుమారు 72 కిలోమీటర్ల మార్గంలో మెట్రో ప్రాజెక్టును చేపడుతున్న విషయం విదితమే. తాజాగా మారిన అలైన్మెంట్ ప్రకారం అధికారులు ఈ ప్రాంతాల్లో సర్వే చేయాల్సి ఉంది. భూగర్భ మెట్రో నిర్మాణం నగరంలో సాధ్యపడదని నిపుణుల బృందం ప్రభుత్వానికి నివేదించినందున ఎలివేటెడ్ మార్గంలోనే పనులు చేపట్టనున్నట్లు తెలిసింది. సీఎం తాజా ప్రకటనపై సుల్తాన్‌బజార్ ట్రేడర్స్ అసోసియేషన్, హైదరాబాద్ హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. తమ నాలుగేళ్ల పొరాటం ఫలించిందని వారు పేర్కొన్నారు. నేడు మళ్లీ టెస్ట్ రన్.. నాగోల్-మెట్టుగూడా రూట్లో సోమవారం మెట్రో రైలుకు మరోసారి టెస్ట్ రన్ నిర్వహించనున్నట్టు ఎల్అండ్టీ వర్గాలు తెలిపాయి. నాగోల్ మెట్రో డిపోలోని నాలుగు మెట్రో రైళ్లకు 18 రకాల పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే సోమవారం కూడా ఉదయం, సాయంత్రం వేళల్లో సదరు పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. -
నవోత్సాహం
సాక్షి, సిటీబ్యూరో : దశాబ్దాల కల సాకారమైంది. అనేక పోరాటాలు, వందల మంది త్యాగాలు ఫలించాయి. ఆదివారం అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకు నగరమంతా ‘జై తెలంగాణ’ నినాదాలు, బాణసంచా మోతలతో మార్మోగింది. తారాజువ్వలు చీకట్లను చీల్చుకుని ఆకాశంలో కనువిందు చేశాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబురాలు నగరంలో అంబరాన్నంటాయి. ట్యాంక్‌బండ్, నెక్లస్రోడ్, గన్‌పార్క్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, క్లాక్‌టవర్లు జనంతో కిక్కిరిసి పోయాయి. ట్యాంక్‌బండ్ సహా మొత్తం 120 కేంద్రాల్లో కళాకారులు తమ ఆటాపాటలతో ధూం..ధాం చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ కార్యాలయాల్లో నాయకులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. సికింద్రాబాద్, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మల్కాజిగిరి, ఉప్పల్, అంబర్పేట్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేర్లింగంపల్లి, పంజగుట్ట, బేగంపేట్ తదితర కూడళ్లన్నీ తెలంగాణ వాదులతో కిక్కిరిసి పోయాయి. బస్తీలు, కాలనీల్లో యువకులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. కేకులు కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. అంబరమంటిన సంబురాలు ట్యాంక్‌బండ్‌పై రసమయి బాలకిషన్, నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ప్లాజాలో గాయకుడు సాయిచంద్, గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ప్రొఫెసర్ కోదండరామ్, గాయకుడు గద్దర్, విమలక్క, అంద్శైఅమరులకు నివాళులర్పించి, ఆ తర్వాత తమ ఆటా పాటలతో ధూం..ధాం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో తెలంగాణ సంబురాలు నిర్వహించారు. అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి దానం, వీహెచ్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం గాంధీభవన్ నుంచి గన్‌పార్క్ వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. టీఆర్ఎస్ కార్యాలయంలో నాయిని నర్సింహారెడ్డి సహా పలువురు నేతలు వేడుకలు నిర్వహించారు. పెద్దెత్తున బాణసంచా కాల్చారు. ‘జై తెలంగాణ, జై కేసీఆర్’.. నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. తెలంగాణ ఉద్యమకారులు గన్‌పార్కు వద్ద ఆటాపాట నిర్వహించారు. కళాకారులు ధూంధాం నిర్వహించి సంబరాలు జరిపారు. గన్‌పార్కు వద్ద హాజరైన వారిలో తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అమర వీరులకు నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. టీఎన్జీవో అధ్యక్షులు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు విఠల్, స్వామిగౌడ్, తెలంగాణ అడ్వకేట్ జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, టీఆర్ఎల్డీ నాయకులు చెరుకూరి శేషగిరిరావు, ప్రధాన కార్యదర్శి ఎంఎస్ రావు, రాపోలు జ్ఞానేశ్వర్, హెచ్ఎం టీవీ సీఈఓ రాంచంద్రమూర్తి, ఎమ్మార్పీఎస్ (దండోరా) రాష్ట్ర అధ్యక్షులు వై. భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టపాకాయలు, బాణసంచాలు పేల్చి కార్యకర్తలు సంబరాలు జరిపారు. డీసీపీ కమలాసన్ రెడ్డి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. చిన్నపెద్దా తేడా లేకుండా కుటుంబ సమేతంగా వేలాదిమంది తెలంగాణ వాదులు ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం, ట్యాంక్‌బండ్, జీహెచ్ఎంసీ ఆఫీసు, నెక్లెస్‌రోడ్డు, సంజీవయ్య పార్కు, లోయర్ ట్యాంక్‌బండ్, ఇందిరాపార్కు పరిసరాలు తెలంగాణ వాదులతో కిక్కిరిపోయాయి. సరిగ్గా 12 గంటల తర్వాత ఈలలు, చప్పట్లు, కేరింతలు, జై తెలంగాణ నినాదాలు, భారీ బాణసంచాతో నవ తెలంగాణకు స్వాగతం పలికారు. కేక్‌లు కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. రాంనగర్ చౌరస్తాలో ముషీరాబాద్ జేఏసీ ఆధ్వర్యంలో ధూంధాం జరిగింది. ముషీరాబాద్ ఎమ్మెల్యే కె.లక్ష్మణ్, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, టీఆర్ఎస్ నాయకుడు నాయిని నర్సింహారెడ్డి, ముఠాగోపాల్, గ్రేటర్ జేఏసీ చైర్మన్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకులు, విద్యార్థులంతా ఆర్ట్స్ కాలేజీ వద్దకు చేరుకున్నారు. కాలేజీపై తెలంగాణ జెండా ఎగరేశారు. బాణసంచా కాల్చారు. కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకున్నారు. శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఇటు ఎన్సీసీ నుంచి అటు తార్నాక, మాణికేశ్వరి నగర్, ఇఫ్లూ వర్సిటీ తదితర ప్రాంతాల మీదుగా బైక్‌ర్యాలీలు నిర్వహించారు. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఐజేయూ నాయకులు శ్రీనివాసరెడ్డి, దేవులపల్లి అమర్, సోమసుందర్, నరేందర్, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాణసంచా కాల్చి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. -
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి నగరం ముస్తాబు
గ్రేటర్ లో సంబురాలకు సకలజనులు సై.. అంబరమంటేలా ఏర్పాట్లు రేపు అర్ధరాత్రి నుంచే షురూ జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వారోత్సవాలు ఎంపిక చేసిన ప్రాంతాల్లో మూడురోజుల ఉత్సవాలు తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కల సాకారం అయ్యే సమయం సమీపిస్తోంది. అనేక ఉద్యమాలు, త్యాగాలు, పోరాటాల వల్ల సిద్ధించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని అదిరిపోయేలా చేసుకునేందుకు తెలంగాణ సకలజనులు సన్నద్ధమవుతున్నారు. జూన్ 2న ‘అపాయింటెడ్ డే’ కావడంతో ఆదివారం అర్ధరాత్రి నుంచే సంబరాలు హోరెత్తనున్నాయి. ఉద్యమవనం ఉస్మానియా మొదలుకొని ప్రతి శాఖ, జేఏసీలు, ప్రజా, కుల, విద్యార్థి, ఉద్యోగ, కార్మిక, కళాకారుల సంఘాల ఆధ్వర్యంలో సంబురాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భారీఎత్తున బాణసంచా కాల్చడంతోపాటు మిఠాయిలు పంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సాక్షి,సిటీబ్యూరో: జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని భారీ ఏర్పాట్లకు హైదరాబాద్ మహానగరపాలక సంస్థ(జీహెచ్ఎంసీ) సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఆదేశాల కనుగుణంగా వారంరోజులపాటు వివిధ ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలతో వారోత్సవాలకు ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ వారోత్సవాలను జూన్ 7 వరకు నిర్వహించనున్నారు. ఇందులోభాగంగా జీహెచ్ఎంసీ ప్రధానకార్యాలయంతోపాటు ట్యాంక్‌బండ్, గన్పార్క్లను విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా అలంకరించనున్నారు. విద్యుత్ వెలుగులతో ఆ ప్రాంతాలను శోభాయమానం చేయనున్నారు. ఇవికాక గ్రేటర్ పరిధిలోని 33 ప్రాంతాల్లో జూన్ 1 నుంచి 3వ తేదీవరకు మూడు రోజుల పాటు ప్రత్యేక విద్యుత్‌దీపాలంకరణలు చేయనున్నారు. దిగువ ప్రాంతాలను రంగురంగుల విద్యుల్లతలతో తీర్చిదిద్దనున్నారు. 1. తెలుగుతల్లి జంక్షన్ 2. అబిడ్స్ జీపీవో ట్రాఫిక్ ఐలాండ్ 3. జగ్జీవన్‌రాం ట్రాఫిక్ ఐలాండ్ 4. నీలం సంజీవరెడ్డి విగ్రహం-ఇందిరాగాంధీ ఐలాండ్ 5. బంజారాహిల్స్ రోడ్డునెం.1-జీవీకే (నాగార్జున సర్కిల్) ఐలాండ్6. సిటీసెంటర్(రోడ్డునెం.10)ఐలాండ్ 7. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి- ఎన్టీఆర్ ట్రస్ట్భవన్ 8.నాంపల్లి స్టేషన్ ఐలాండ్ 9.విద్యానగర్ జంక్షన్-ఓయూ ద్వారం 10. రాజ్‌భవన్‌రోడ్డు ఐలాండ్ 11. సీఎం క్యాంపు కార్యాలయం-యశోద హాస్పిటల్ ఐలాండ్ 12. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు 13. టీఆర్ఎస్ కార్యాలయం సమీపంలో ఐలాండ్ 14. సంజీవయ్యపార్కు-ట్యాంక్‌బండ్ వరకు అన్ని ఐలాండ్లు 15.హిమాయత్‌నగర్-నారాయణగూడ ఫ్లైఓవర్ ఐలాండ్ 16.మొజాంజాహీ మార్కెట్ 17.క్లాక్‌టవర్ బిల్డింగ్ ఐలాండ్ 18. నానల్‌నగర్- టోలిచౌకి ఐలాండ్ 19.లక్డీకపూల్ ఐలాండ్ 20. చాదర్‌ఘాట్ చౌరస్తా 21. నయాపూల్- మదీనా ఐలాండ్ 22.చార్మినార్-మక్కామసీదు ఐలాండ్ 23.సిటీకాలేజ్ ఐలాండ్ 24. దారుల్షిఫా ఐలాండ్ 25.ఓవైసీ హాస్పిటల్ ఐలాండ్ 26. ఆరాంఘర్ ఐలాండ్ 27.ఎంజీరోడ్డు గాంధీ విగ్రహం 28.సికింద్రాబాద్ క్లాక్‌టవర్ 29. సికింద్రాబాద్ స్టేషన్ ఐలాండ్ 30 బేగంపేట విమానాశ్రయం ఐలాండ్ 31. ఎల్బీనగర్ ఐలాండ్ 32. ఉప్పల్ ఐలాండ్ 33. శిల్పారామం- కొత్తగూడ వరకున్న ఐలాండ్లు. వివిధ జేఏసీల ఆధ్వర్యంలో గన్‌పార్క్, గగన్‌విహార్ , నెక్లెస్‌రోడ్,ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో కొవ్వొత్తులు,బైక్‌ర్యాలీలు, జాతీయ జెండా,తెలంగాణా పతాకావిష్కరణలకు సన్నాహాలు చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో సుమారు 200 కూడళ్లలో కనివినీ ఎరగని రీతిలో ఆవిర్భావ వేడుకలను నిర్వహించేందుకు పలు రాజకీయ పార్టీలు,జేఏసీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో తెలంగాణ ఆటాపాటలతో ధూంధాంలు నిర్వహించేందుకు పలువురు టీఆర్ఎస్ నియోజక వర్గాల ఇన్చార్జులు నిర్ణయించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ జూన్ 2వ తేదీ సోమవారం ఉదయం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మధ్యాహ్నం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా హాజరయ్యే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులతోపాటు ప్రతిపక్ష పార్టీల నేతలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నగర పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏర్పాట్లను కమిషనర్ అనురాగ్‌శర్మ స్వయంగా పరిశీలించి కిందిస్థాయి అధికారులకు సూచనలిచ్చారు. వీఐపీలు, వీవీఐపీలు పరేడ్‌గ్రౌండ్స్‌కు ఎలా చేరుకోవాలి, వారి వాహనాల పార్కింగ్, ఇతరుల వాహనాల పార్కిం గ్ ఏర్పాట్లను అడిగి తెలుసుకోవడంతోపాటు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవంతోపాటు తెలంగాణ అవిర్భావ దినోత్సవ కార్యక్రమం వద్ద తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లను ఆయన అధికారులకు వివరించారు. పరేడ్‌గ్రౌండ్స్ లో అనువణువున బాంబు స్క్వాడ్ తనిఖీలు చే సింది. అనుమానిత వ్యక్తుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘాపెట్టేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగర పోలీసుశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రిహార్సల్స్ జరిగాయి. కట్టుదిట్టమైన భద్రత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే కార్యక్రమాలకు నగర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పూర్తిచేశారు. తీసుకున్న భద్రతా చర్యలను నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేందర్‌రెడ్డి అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాలను మళ్లించాలని సూచించారు. భారీ హోర్డింగ్‌లు ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం..ప్రపంచస్థాయి పయనంలో హై దరాబాద్ నగరం’ తదితర నినాదాలతో ఎంపిక చేసిన ప్రాంతా ల్లో 30 భారీ హోర్డింగుల్ని జీహెచ్ఎంసీ తరపున ఏర్పాటు చేయనున్నారు. వీటిపై తెలుగుతల్లి బొమ్మతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటో ఉంటుంది. గన్‌పార్కు, ట్యాంక్‌బండ్, రాజ్‌భవన్, సచివాలయం తదితర ప్రాంతాల్లో ఏడు స్వాగత ద్వారాలు ఏర్పాటు చేయనున్నారు. కేసీఆర్ నివాసం నుంచి గన్‌పార్కు, రాజ్‌భవన్ రోడ్డు నుంచి పరేడ్‌గ్రౌండ్, సచివాలయం నుంచి బేగంపేట ఫ్లైఓవర్ వరకు ఫుట్‌పాత్‌లకు, డివైడర్లకు, సెంట్రల్ మీడియన్లను రంగులతో తీర్చిదిద్దనున్నారు. వేదికల ఏర్పాటు నగరమంతా పండుగ వాతావరణం ప్రతిబింబించేలా ప్రత్యేక ఏర్పాట్లకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. వేదికల ఏర్పాటుకు వీలున్న ప్రదేశాల్లో వేదికలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. విద్యుద్దీపాల అలంకరణలతోపాటు పైన పేర్కొన్న అన్ని ప్రాంతాల్లో పరిసరాల్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయడంతోపాటు డెబ్రిస్ తొలగిస్తున్నట్లు చెప్పారు. కలర్‌ఫుల్ ఫ్లైఓవర్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మధ్యాహ్నం సికింద్రాబాద్ పరేడ్ మైదానలో జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలకు అధికారులు సకల ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ మార్గంలో ఉన్న మూడు ఫ్లైఓవర్లను రంగులమయం చేయనున్నారు. రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. పరేడ్ రహదారి అంతటా భారీ ఫ్లడ్లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మార్గంను ఆనుకొని ప్రభుత్వ కార్యాలయాల భవనాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. సికింద్రాబాద్ క్లాక్‌టవర్ సమీపంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అమరవీరులకు నివాళులర్పించేందుకు అనేకమంది రానుండడంతో విద్యుత్‌దీపాలు, ప్రత్యేక పుష్పాలతో అలంకరణ చేస్తున్నారు.