తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి నగరం ముస్తాబు | They decorated the city of its violence | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి నగరం ముస్తాబు

Published Sat, May 31 2014 4:09 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి నగరం ముస్తాబు - Sakshi

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి నగరం ముస్తాబు

  •      గ్రేటర్ లో సంబురాలకు సకలజనులు సై..
  •      అంబరమంటేలా ఏర్పాట్లు
  •      రేపు అర్ధరాత్రి నుంచే షురూ
  •      జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో వారోత్సవాలు
  •      ఎంపిక చేసిన ప్రాంతాల్లో మూడురోజుల ఉత్సవాలు
  •  తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కల సాకారం అయ్యే సమయం సమీపిస్తోంది. అనేక ఉద్యమాలు, త్యాగాలు, పోరాటాల వల్ల సిద్ధించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని అదిరిపోయేలా చేసుకునేందుకు తెలంగాణ సకలజనులు సన్నద్ధమవుతున్నారు. జూన్ 2న ‘అపాయింటెడ్ డే’ కావడంతో ఆదివారం అర్ధరాత్రి నుంచే  సంబరాలు హోరెత్తనున్నాయి. ఉద్యమవనం ఉస్మానియా మొదలుకొని ప్రతి శాఖ, జేఏసీలు, ప్రజా, కుల, విద్యార్థి, ఉద్యోగ, కార్మిక, కళాకారుల సంఘాల ఆధ్వర్యంలో సంబురాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భారీఎత్తున బాణసంచా కాల్చడంతోపాటు మిఠాయిలు పంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
     
    సాక్షి,సిటీబ్యూరో: జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని భారీ ఏర్పాట్లకు హైదరాబాద్ మహానగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఆదేశాల కనుగుణంగా వారంరోజులపాటు వివిధ ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలతో వారోత్సవాలకు ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ వారోత్సవాలను జూన్ 7 వరకు నిర్వహించనున్నారు.

    ఇందులోభాగంగా జీహెచ్‌ఎంసీ ప్రధానకార్యాలయంతోపాటు ట్యాంక్‌బండ్, గన్‌పార్క్‌లను విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా అలంకరించనున్నారు. విద్యుత్ వెలుగులతో ఆ ప్రాంతాలను శోభాయమానం చేయనున్నారు. ఇవికాక గ్రేటర్ పరిధిలోని 33 ప్రాంతాల్లో జూన్ 1 నుంచి 3వ తేదీవరకు మూడు రోజుల పాటు ప్రత్యేక విద్యుత్‌దీపాలంకరణలు చేయనున్నారు. దిగువ ప్రాంతాలను రంగురంగుల విద్యుల్లతలతో తీర్చిదిద్దనున్నారు.

    1. తెలుగుతల్లి జంక్షన్ 2. అబిడ్స్ జీపీవో ట్రాఫిక్ ఐలాండ్ 3. జగ్జీవన్‌రాం ట్రాఫిక్ ఐలాండ్ 4. నీలం సంజీవరెడ్డి విగ్రహం-ఇందిరాగాంధీ ఐలాండ్ 5. బంజారాహిల్స్ రోడ్డునెం.1-జీవీకే (నాగార్జున సర్కిల్) ఐలాండ్6. సిటీసెంటర్(రోడ్డునెం.10)ఐలాండ్ 7. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి-  ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్ 8.నాంపల్లి స్టేషన్ ఐలాండ్ 9.విద్యానగర్ జంక్షన్-ఓయూ ద్వారం 10. రాజ్‌భవన్‌రోడ్డు ఐలాండ్ 11. సీఎం క్యాంపు కార్యాలయం-యశోద హాస్పిటల్ ఐలాండ్ 12. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు 13. టీఆర్‌ఎస్ కార్యాలయం సమీపంలో ఐలాండ్ 14. సంజీవయ్యపార్కు-ట్యాంక్‌బండ్ వరకు అన్ని ఐలాండ్లు 15.హిమాయత్‌నగర్-నారాయణగూడ ఫ్లైఓవర్ ఐలాండ్ 16.మొజాంజాహీ మార్కెట్ 17.క్లాక్‌టవర్ బిల్డింగ్ ఐలాండ్ 18. నానల్‌నగర్- టోలిచౌకి ఐలాండ్ 19.లక్డీకపూల్ ఐలాండ్ 20. చాదర్‌ఘాట్ చౌరస్తా 21. నయాపూల్- మదీనా ఐలాండ్ 22.చార్మినార్-మక్కామసీదు ఐలాండ్ 23.సిటీకాలేజ్ ఐలాండ్ 24. దారుల్‌షిఫా ఐలాండ్ 25.ఓవైసీ హాస్పిటల్ ఐలాండ్ 26. ఆరాంఘర్ ఐలాండ్ 27.ఎంజీరోడ్డు గాంధీ విగ్రహం 28.సికింద్రాబాద్ క్లాక్‌టవర్ 29. సికింద్రాబాద్ స్టేషన్ ఐలాండ్ 30 బేగంపేట విమానాశ్రయం ఐలాండ్ 31. ఎల్‌బీనగర్ ఐలాండ్ 32. ఉప్పల్ ఐలాండ్ 33.

    శిల్పారామం- కొత్తగూడ వరకున్న ఐలాండ్లు.
    వివిధ జేఏసీల ఆధ్వర్యంలో గన్‌పార్క్, గగన్‌విహార్ , నెక్లెస్‌రోడ్,ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో కొవ్వొత్తులు,బైక్‌ర్యాలీలు, జాతీయ జెండా,తెలంగాణా పతాకావిష్కరణలకు సన్నాహాలు చేస్తున్నారు.  
         
    గ్రేటర్ పరిధిలో సుమారు 200 కూడళ్లలో కనివినీ ఎరగని రీతిలో ఆవిర్భావ వేడుకలను నిర్వహించేందుకు పలు రాజకీయ పార్టీలు,జేఏసీలు ఏర్పాట్లు చేస్తున్నాయి.
         
    పలు ప్రాంతాల్లో తెలంగాణ ఆటాపాటలతో ధూంధాంలు నిర్వహించేందుకు పలువురు టీఆర్‌ఎస్ నియోజక వర్గాల ఇన్‌చార్జులు నిర్ణయించారు.
         
    తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ జూన్ 2వ తేదీ సోమవారం ఉదయం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మధ్యాహ్నం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా హాజరయ్యే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులతోపాటు ప్రతిపక్ష పార్టీల నేతలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నగర పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏర్పాట్లను కమిషనర్ అనురాగ్‌శర్మ స్వయంగా పరిశీలించి కిందిస్థాయి అధికారులకు సూచనలిచ్చారు.
         
    వీఐపీలు, వీవీఐపీలు పరేడ్‌గ్రౌండ్స్‌కు ఎలా చేరుకోవాలి, వారి వాహనాల పార్కింగ్, ఇతరుల వాహనాల పార్కిం గ్ ఏర్పాట్లను అడిగి తెలుసుకోవడంతోపాటు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవంతోపాటు తెలంగాణ అవిర్భావ దినోత్సవ కార్యక్రమం వద్ద తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లను ఆయన అధికారులకు వివరించారు.
         
    పరేడ్‌గ్రౌండ్స్‌ లో అనువణువున బాంబు స్క్వాడ్ తనిఖీలు చే సింది. అనుమానిత వ్యక్తుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘాపెట్టేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు.
         
    ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగర పోలీసుశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రిహార్సల్స్ జరిగాయి.
     
     కట్టుదిట్టమైన భద్రత

     తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే కార్యక్రమాలకు నగర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పూర్తిచేశారు. తీసుకున్న భద్రతా చర్యలను నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేందర్‌రెడ్డి అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాలను మళ్లించాలని సూచించారు.
     
     భారీ హోర్డింగ్‌లు

     ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం..ప్రపంచస్థాయి పయనంలో హై దరాబాద్ నగరం’ తదితర నినాదాలతో ఎంపిక చేసిన ప్రాంతా ల్లో 30  భారీ హోర్డింగుల్ని జీహెచ్‌ఎంసీ తరపున ఏర్పాటు చేయనున్నారు. వీటిపై తెలుగుతల్లి బొమ్మతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటో ఉంటుంది. గన్‌పార్కు, ట్యాంక్‌బండ్, రాజ్‌భవన్, సచివాలయం తదితర ప్రాంతాల్లో ఏడు స్వాగత ద్వారాలు ఏర్పాటు చేయనున్నారు. కేసీఆర్ నివాసం నుంచి గన్‌పార్కు, రాజ్‌భవన్ రోడ్డు నుంచి పరేడ్‌గ్రౌండ్, సచివాలయం నుంచి బేగంపేట ఫ్లైఓవర్ వరకు ఫుట్‌పాత్‌లకు, డివైడర్లకు, సెంట్రల్ మీడియన్లను రంగులతో తీర్చిదిద్దనున్నారు.
     
     వేదికల ఏర్పాటు

     నగరమంతా పండుగ వాతావరణం ప్రతిబింబించేలా ప్రత్యేక ఏర్పాట్లకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది. వేదికల ఏర్పాటుకు వీలున్న ప్రదేశాల్లో వేదికలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. విద్యుద్దీపాల అలంకరణలతోపాటు పైన పేర్కొన్న అన్ని ప్రాంతాల్లో పరిసరాల్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయడంతోపాటు డెబ్రిస్ తొలగిస్తున్నట్లు చెప్పారు.
     
     కలర్‌ఫుల్ ఫ్లైఓవర్లు

     ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మధ్యాహ్నం సికింద్రాబాద్ పరేడ్ మైదానలో జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలకు అధికారులు సకల ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ మార్గంలో ఉన్న మూడు ఫ్లైఓవర్లను రంగులమయం చేయనున్నారు. రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. పరేడ్ రహదారి అంతటా భారీ ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేస్తున్నారు.
     ఈ మార్గంను ఆనుకొని ప్రభుత్వ కార్యాలయాల భవనాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. సికింద్రాబాద్ క్లాక్‌టవర్ సమీపంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అమరవీరులకు నివాళులర్పించేందుకు అనేకమంది రానుండడంతో విద్యుత్‌దీపాలు, ప్రత్యేక పుష్పాలతో అలంకరణ చేస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement