కలల బండి..దూరమండీ!
- మెట్రో పాజ్రెక్టుపై నీలినీడలు
- సమావేశాలతో సరిపెడుతున్న పెద్దలు
- అలైన్‌మెంట్ మార్పుపై స్పష్టతనివ్వని సర్కార్
- కష్టమంటున్ననిర్మాణ సంస్థ
- సర్కార్‌కు మళ్లీ లేఖ !
గ్రేటర్ వాసుల కలల బండి మెట్రో రైలు పరుగుకు బ్రేకులు పడనున్నాయి.. అట్టహాసంగా ప్రారంభించిన మెట్రో ప్రాజెక్టు పనులు ముందుకు సాగడంలేదు. 2017 నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వ పెద్దలు, హెచ్‌ఎంఆర్, ఎల్‌అండ్‌టీ అధికారులు చేస్తున్న ప్రకటనలకు భిన్నంగా ఉన్నాయి వాస్తవ పరిస్థితులు. ప్రభుత్వ పెద్దలు సమావేశాలతో సరిపెడుతుండడంతో ప్రాజెక్టు పనులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ప్రాజెక్టు పురోగతి సైతం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. పరిస్థితి ఇలా ఉంటే కష్టమని, ప్రాజెక్టు నిర్మాణంపై పునరాలోచన చేయక తప్పదని నిర్మాణ సంస్థ హెచ్చరిస్తోంది.
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైల్ నిర్మాణపనులు ముందుకు సాగడంలేదు. పనుల్లో ఎదురవుతున్న అడ్డంకులన తక్షణమే తొలగిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, సర్కాన్ పెద్దలు హామీ ఇచ్చారు. ఇటీవల కేంద్ర క్యాబినెట్ అదనపుకార్యదర్శి సమక్షంలో జరిగిన సమావేశంలో వారు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలుకునోచుకోలేదు.
ముఖ్యంగా అసెంబ్లీ, గన్‌పార్క్ ప్రాంతాల్లో మెట్రో అలైన్‌మెంట్ మార్పుపై రెండు నెలలుగా నెలకొన్న సందిగ్ధ త ఇంకా తొలగలేదు. నిర్మాణసంస్థ ఎల్‌అండ్‌టీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. ఇక నాగోల్-శిల్పారామం, ఎల్బీనగర్-మియాపూర్, జేబీ ఎస్-ఫలక్‌నుమా రూట్లలో సుమారు 1700 ఆస్తుల సేకరణ ప్రక్రియకు నేటికీ నోటిఫికేషన్ విడుదల కాలేదు. ఈ అంశంలో అధికారుల హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో మెట్రో పనులు జరిగేందుకు ప్రధాన రహదారులపై రైట్‌ఆఫ్‌వే(రోడ్డు మధ్యలో 8 మీటర్లు) లభ్యంకావడంలేదని నిర్మాణసంస్థ ప్రతినిధులు వాపోతున్నారు.
నాంపల్లి రైల్వేస్టేషన్, బేగంపేట్ గ్రీన్‌ల్యాండ్స్, సికింద్రాబాద్ ఇస్కాన్ దేవాలయం, పంజాగుట్ట, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో ఆస్తులను కోల్పోయే బాధితులకు పరిహారం చెల్లించి ఆయా ఆస్తులను తొలగిస్తేనే పనులు ముందుకు సాగుతాయని నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీస్పష్టం చేస్తోంది. ఆదిశగా కూడా ఎలాంటి ముందడుగు పడకపోవడం గమనార్హం. ఇక ప్రాజెక్టులో భాగంగా ఎర్రమంజిల్, హైటెక్‌సిటీ, రాయదుర్గం, అమీర్‌పేట్ ప్రాంతాల్లో నిర్మాణసంస్థ నిర్మించాలనుకున్న భారీ మెట్రో షాపింగ్ మాల్స్‌కూ జీహెచ్‌ఎంసీ నుంచి రావాల్సిన నిర్మాణ పరమైన అనుమతులూ ఆలస్యమౌతున్నాయి.
ఈ విషయంలో తాజాగా మరోమారు సమావేశం కావాలని జీహెచ్‌ఎంసీ అధికారులు తాజాగా మెలికపెట్టడంతో పరిస్థితి మొదటికొచ్చింది. ఈ పరిస్థితితో ఏంచేయాలో తెలియక ఎల్‌అండ్‌టీ అధికారులు తలలుపట్టుకుంటున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు పనుల కోసం రూ.5 వేల కోట్లకు పైగా పలు జాతీయ బ్యాంకుల నుంచి రుణం సేకరించిన తమ సంస్థ సకాలంలో పనులు పూర్తిచేయని పక్షంలో వడ్డీల భారంతో కుదేలవడం తథ్యమని ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
అలైన్‌మెంట్ మార్పుపైనా వీడని సస్పెన్స్..
అసెంబ్లీ, గన్‌పార్క్ ప్రాంతాల్లో మెట్రో అలైన్‌మెంట్ మార్పుపైనా నిర్మాణ సంస్థకు సర్కారు నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదు. ఇక పాతనగరంలో మెట్రో అలైన్‌మెంట్ మార్చాలని ఎంఐఎం పార్టీ పట్టుబడుతున్న నేపథ్యంలో ఈ విషయంలోనూ సర్కార్ తీసుకునే నిర్ణయం సస్పెన్స్‌గా మారింది.
మరో లేఖకు సన్నద్ధం..?
పరిస్థితులు రోజురోజుకూ ప్రతికూలంగా మారుతుండడంతో వాస్తవ పరిస్థితులపై నిర్మాణసంస్థ ఎల్‌అండ్‌టీ రాష్ట్రసర్కారుకు మరోసారి లేఖ రాసేందుకు సన్నద్ధమౌతున్నట్లు సమాచారం. డిసెంబరులోగా పరిస్థితులు చక్కదిద్దని పక్షంలో పనులు ముందుకు సాగవని, మొత్తం ప్రాజెక్టు నిర్మాణంపై తాము పునరాలోచన చేసుకోక తప్పదని ఈ లేఖలో స్పష్టం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ఇంకా సమయం పడుతుంది
అలైన్‌మెంట్ మార్పుపై తుదినిర్ణయం తీసుకున్నట్లుగా రాష్ట్ర సర్కారు నుంచి ఇప్పటివరకు ఎలాంటి లేఖ ‘ఎల్‌టీహెచ్‌ఎంఆర్‌ఎల్’ సంస్థకు అందలేదు. ఈ అంశంపై స్పష్టత వచ్చేందుకు మరికొంత సమయం పడుతుంది.
- ఎన్వీఎస్‌రెడ్డి, మేనేజింగ్ డెరైక్టర్, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు